నిర్వహణ
వీరా గుడిపల్లి
The mathematics teacher and poet
సమన్వయం
శివునూరి లలితాకృష్ణ
*****************************
కవివరుల జాబితా
******************************
1.నోముల సంజీవరెడ్డి గారు
2.ధనాశి ఉషా రాణి గారు
3.భరద్వాజ గారు
4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.దేవినేని అరవింద రాయుడు గారు
6.ఏ.భూపతి గారు
7 అయిత అనిత గారు
8.సంధ్యా శర్మ గారు
9.డా.సి.హెచ్.ఆంజనేయులు గారు
10.పాల్వంచ హరి కిషన్ గారు
11.స్వర్ణ సమత గారు
12.రాపోలు అరుణ గారు
13.కొలచన విజయ భారతి గారు
14.శ్రీలక్ష్మి గారు
15.మర్రి జయశ్రీ గారు
16.బండి భాను చందర్ గారు
17.సునంద వురిమిళ్ళ గారు
18.సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు
19.యం.టి.స్వర్ణ లత గారు
20. వలిపే సత్య నీలిమ గారు
21.వల్లాల విజయ లక్ష్మి గారు
22.కె.ఇ.నిలమంగై గారు
23. నోముల సంజీవరెడ్డి గారు
24 . పైల పురుషోత్తం రెడ్డి గారు
25.తగిరంచ నరసింహా రెడ్డి గారు
26. రాపోలు అరుణా స్వామి గారు
27. రవికుమార్ కంచి గారు
28.డా.బల్లూరి ఉమాదేవి గారు
29.అపరాజిత రెడ్డి గారు
30.వీరా గుడిపల్లి
31.శివునూరి లలితా కృష్ణ గారు
32.సంజీవ రెడ్డి ఐలేని గారు
33.రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి గారు
34.జల్లిపల్లి బ్రహ్మం గారు
********************
1
[25/09, 8:02 PM] నోములు Sanjeeva Reddy Poet: అంశం : బాలసుబ్రమణ్యం
సంగీత గగనాల పాటల చందురుడు
సుమదుర గాన గంధర్వుడు
వేల వేల పాటల పూదోట మాలి
కోట్లాది జనుల మానస చోరుడు
సంగీత ప్రియుల ఆరాధ్య దేవుడు
స్వర సుర ఝరీ తరంగం
సంగీత కన్యకా సిగలో సుమధుర రాగాల
సిరిమల్లెలను తురిమినవాడు
ఘంటసాల మాస్టారు వేసిన సంగీత
పునాదులపై మధుర మనోహర
సంగీత ప్రపంచాన్ని నిర్మించిన వాడు
తానే పాటై పాటే తానై తరించినవాడు
పాడుతా తీయగా అంటూ ఎందరో నూతన
గాయకులను సృజించినవాడు
ఎందరో నటులకు గాత్ర దానంతో
వారి గొంతుకలో జీవించినవాడు
మర్యాద రామన్న సినిమాతో మొదలెట్టి
అభిమానుల గుండెల్లో మర్యాద గానే
తన మాటల పాటల మధువులొలికించాడు
సంగీతంలో ఎంత శిఖర సమానుడో
సాహిత్యంలోకూడా అంత పట్టున్నవాడు
పాట పాడిన పిదప పాటలోని సాహిత్యం
గురించి బాలు మాటలు తేనెల చినుకులు
భూమ్మీద సంగీతంలోని లోటును పూడ్చి
అందరిని రాగాల ఝడిలో తడిసి ముద్ద
చెయ్యిమని ఆ దేవుడే పంపించాడేమో
ఆపని పూర్తయిందని తనే మళ్లీ తీసుకెళ్లాడేమో
అందుకే బాలుగారు కారణ జన్ములు
ఆయన దివికేగినా భువిలో ఆయన
సృష్టించిన మధుర సంగీత ప్రపంచం
ఈ భూమి ఉన్నంత కాలం
సంగీతం ఉన్నంత కాలం బ్రతికే ఉంటది
ఆయన మరణం భౌతికమే
ఆయన పాట అజరామరం
ఆయన ఆత్మకు శాంతికలగాలని
అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ ......
నోముల సంజీవరెడ్డి .
ECIL , కుషాయిగూడ
2
[25/09, 8:03 PM] Dhanasi Usha Rani Poetess: కవితా గానము
శీర్షిక.జోహార్లయ్యా బాలు
.............
భువిపైకి వచ్చినావయ్యా
అందరి మదిలను ఊయల ఊగించుటకు జోలపాడుతూ సేద తీర్చుటకు
నేడు అమృతము వోలుకు
ఓ స్వరము మూగపోయింది
కోటి వేణువులు మీటినట్టుగా
అద్భుతమైన తియ్యనిగానo
ఇక సెలవుతీసుకున్నదా
ఎన్నో గుండెల్లో నిలిచిన
గానగాంధర్వుడుగా వెలుగొంది
తియ్యని గాణామృతముగా నిలిచినావు
మరువలేదు జగతి నిన్ను నిజముగా
కోటి వెలుగులు నిచ్చునీ మంచితనము నీకు సొంతమయ్యా
ఏ గంధర్వులను ముగ్ద మనోహరoలో మురిపించుటకు
స్వర్గమునకు వెలితివయ్యా
మాకు అమృత గాణామృతమును పంచి మా గుండెల్లో నిలిచినావయ్యా
అందని చందమామవయ్యావు
ఇక ఎన్నడూ వినలేము
నీ కమ్మని కంఠస్వరము నిజముగా
ఏన్నో భాషల్లో ఎన్నో పాటలుతో
చరిత్ర లిఖించినావు బాలుగా
నీ చరిత్ర ఆమోఘము అయ్యా
కన్నీటి వీడ్కోలు మహామనిషి
అందుకో మా కన్నీటి నివాళులు
హామీ పత్రము.ఇది నా స్వంతము అని హామీ ఇస్తున్నాను
ధనాశి ఉషారాణి
చిత్తూరు జిల్లా
3.
[25/09, 8:04 PM] భరద్వాజ గారు: 🙏కవితాగానం🙏
25/09/20
నేటిఅంశం -యస్ .పి బాలు
🍁శీర్షిక-సంగీత లక్ష్మి బావురుమంది 🌹
కనుతెరిస్తే జననం -
కన్నుమూస్తేమరణం -
రెప్పపాటు జీవితం -
అన్నారు వేదాంతులూ -
పూలతోపూజచేసినవాడు అవుతాడు కళాకారుడు
బంగారుపూలతో పూజచేసినోడు అవుతాడు గాయకుడు -
చెప్పి పాటను మనకువదలిపెట్టి తరలివెళ్లిన బాలును చూసి -
సంగీత లక్ష్మి బావురుమంది .... !
పండితారాద్యులవారింటి కోయిల పరలోకం వెళ్ళింది -
చిన్నతనాన నీనోట పలికింది మొదలు -
ఏమి ఈ వింతమొహం అంటూ సినీరంగాన కాలుపెట్టి -
ఎన్నోపాటలతో జనాలను సమ్మోహనులను చేసి -
మాయాదారి కరోనా మృత్యు ఘంటికీలకు బలై పోయినావు -
అన్నవార్తవిని సంగీత లక్ష్మి బావురుమంది -!
అలుపెరుగని నీవు అమరాగానం ఆలపించి -
దేశవిదేశభాషలన్ని అన్నింటినీ సొంతచేసుకుని -
పాటల పందిళ్లువేసి పరవశింపచేసిననువ్వు లేవనే
వార్తవిని సంగీత లక్ష్మి బావురుమంది ...!
మృదంగం మూగబోయింది -
ఫిడేలు పలకనంటుంది -
కీబోర్డు మూతి ముడుచు కూర్చుంది -
తబలాగుండె బద్దలైంది-
తమను శృతిచేసే గాత్రం ఏదని రాదనీ-
పాటలతో పరవశింపచేసి -అ
మాటలతో మురిపించి -
కొత్త గాయకులను చేరదీసి -
పాడాలని ఉంద నివారి చేత అనిపించి-
పాటంటేబాలు బాలుఅంటే పాత అన్నతీరున -
సంగీత జగత్తును చేసి జ్ఞాపకాలువదలిపెట్టి వెళ్లిన
నీవు ఇక రావని లేవని తెలిసిన
వార్తవిని సంగీత లక్ష్మి బావురుమంది ...!
పాటనుశాసించి
పాటనుధ్యానించి -
పాటతోనే జీవించి -
అలసిసొలసిన నిన్నుచూసి -
గానగంధర్వుడవై గగనానికేగిన నీమరణ -
వార్తవిని సంగీత లక్ష్మి బావురుమంది ...!
ఇదినాస్వీయరచన
భరద్వాజరావినూతల🖍️
4
[25/09, 8:08 PM] Dr Pandala Maheshwar PGT Telugu ModelSchool Thurkapally Yadadribhongiri: *** అమరపురి నృత్యాలు ***
✍️డా.పాండాల.
అమరపురినిచేరె అమరేంద్రుపిల్వంగ
గాన మాత్సరమును గాన సభలొ!
తుంబురునితొపోటి తొట్రుపాటులులేక
సరిగమపదనిసలు సాగుఝరుల..!
బాలకుడిగయిలలొ పండితారారాధ్య
వంశచంద్రుడితడు వన్నెలలర!
తెలుగుభాషసౌరు తీయందనముతీపి
గమక శృతుల శయ్య గానమెంచె!
రంభ మేనకలను రమ్యంగ నర్తించె
అడిపాడిసురలుఅందరపుడు!
ముక్కుపైన వేళ్ళు ముద్దుగా చేరంగ
ఎవడు బాలుడంటు?ఎంతొ మురిసె!
నిత్యవేడుకలకు సత్యసాకారంగ
బాలు వచ్చెననుచు వలపులొలికె!
నాట్యకత్తెలంత నవ్యమయూరాల
దివ్యమాయె సభలొ దీప్తి మెరిసె!
ఆత్మ తృప్తి కళలు ఆరాధ్యమౌనెప్డు
ఇహము పరము లోన ఇచ్చదీర్చు
రాగసుధలగొంతు మూగవోదెప్పుడు
గుండె గొంతులోన గుణము నింపు..!
కాలధర్మమందు కాంతిగా మార్పులు
వేళతీరి నాక వెలదిదాటు!
భౌతికాన్ని వదిలె భగవంతులీలది
తాజ మోజులన్ని తరిగి పోవు..!
కోట్లహృదయాల కన్నీళ్ళపాట్లుజూసి
వానదేవుడే చినుకులై తాను కురిసె
గాన గంధర్వుడేడంటు గాలియడిగె
భూమినొదిలెల్లి దివిజేరె బుద్దిగనెను!
పంచభూతాల్ని కదిలించె పాటసారి
సినిమ రంగమే శోకాన చిన్నబోయె
ప్రింటుమీడియా వగచెనే ఫికరుబెట్టె
ఏమి? తోచని ఈ స్థతి ఎందుకనుచు?
✍️డా.పాండాల మహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి.
9912180054.
5
//లోక మో విషాదగీతం//
😢
*
రాత్రివిన్న
జోలపాట తనదైతే మాత్రం
ఇంత
మొద్దునిద్రా
మనసా
త్వరగా లే
గంధర్వులు
పాటనెత్తుకెళ్ళారు
*
ఒక్క
ముఖానికేనా నంటూ
చెవులకూ
గంతలు కట్టేసావు!
విషాద
గీతమొక్కటైనా
వివినిపించి
అరవిందరాయుడు
25 సెప్టెంబరు 2020
6
.....బాలు గారు ప్రణామం..
-------------------------------------
పరిచిన వెన్నెల ,జన జీవన
కోకిల ,రొమాలను
నాట్య మాడించే గాత్ర
గంధర్వుడు.
మనందరి స్వరాల మాల
మృదు బాష ,అజాత శత్రువు
అందరి హృదయం. మన బాలు, ఆగదు ఏ నిముషం నీ
కోసం... అంటూ వెళ్లి పోయాడు...
భక్తి లో రక్తి లో ముక్తి లో
విరహం లో కోపం తాపం లో
వేదన లో ఆ వేదన లో
కొంటె పాటల్లో, అమాయకపు
ఆకతాయి ,పాటల్లో ,చిన్న
పిల్లడిగా, ముదిరిన ముసలి గా
హాస్యం, అట్టహాసం., మోటు
తనం మొరటు తనం ,తాగు
బోతు తులుడు గొంతు..
ఏ నటుడికి తగినట్లు
ఆ గాత్రం. వలపుల,
ఊయల పాటల తో
జన హృదయం లో భగవన్నామ స్మరణ గా శాశ్విత
ముద్ర వేసిన మన బాలు
వీనులున్నం త వరకు
నాయనాలున్న వరకు మనకు కనిపిస్తూనే ఉంటాడు...
బాలు గారు మీకు ప్రణామములు.. ఈ భూమండలం నుండి మీకు
శారీరకంగా శెలవు దొరికింది..
కానీ స్వరములున్నంత వరకు
మీరు మా పక్కనే ఉంటారు..
ఏ. భూపతి ..9989218154
7.
*కవితాగానం*
అంశం: బాలు
శీర్షిక: *నమ్మేదెలా...?*
ఊయలలో చిట్టిపాపకు
నీ జోలపాట విననిదే నిద్రపట్టదే!
ఆదమరిచిన నిద్రించిన మాకు
నీ సుప్రభాతమే మేల్కొలుపుల సరాగమాయే!
అలసిన మనసుకు
సుమధుర నీ స్వరమే ఓదార్పాయే!
నీ పాటల పల్లకిలో విహరించనిదెవరు?
నీ సుభాషితాలలో
ఓలలాడనిదెవరు?
నీ మృదు వ్యాఖ్యానానికి
స్పందించనిదెవరు?
నీ వేవేల పాటలతోటల్లో తుమ్మెదలమైతిమి!
నీ మార్థవగాత్రపు మాధుర్యాన్నే గ్రోలితిమి!
గలగల సెలయేటి సవ్వడిలో నువ్వే
పిల్లగాలి తెమ్మరలో నువ్వే
పచ్చని పొలాల పైరుల్లో నువ్వే
పాడుతా తీయగా హాయిగా అంటూ
ఎటు చూసినా నీ తలపే
ఏ ధ్వని విన్నా నీ నామమే
సెలవంటూ నువ్వెళ్లావని
ఎలా నమ్మేది?
నీవిక కానరావంటే ఎలా నమ్మేది?
నీ పాటకు లేదు మరణం
నీ గానం అజరామరం! బాలు నీ చరిత చిరస్మరణీయం!!
రచన
అయిత అనిత
8.
కవితా గానం. 🎼 *S.P.బాలసుబ్రమణ్యం గారు*🎼
🎤🎤🎼🎼🎼🎼🎤🎤
అలవోకగా పలికే
ఆనంద తుణీరాలు
ఇనవంశ రామునికైనా
ఈశ్వరుని కృపాకటాక్షానికైనా
ఉషఃకిరణ ప్రజ్వలనంలో
ఊహా సౌందర్య పిపాసనంలో
ఋషి వర్యులే....
ఎరుక లేని రాగముందా
ఏలిక కాని స్వర సాగరముందా
ఐహిక తత్వజ్ఞానాన్ని
ఒడి నింపుకున్న కళా ప్రపూర్ణులే...
ఓటమితో వెనుదిరిగే వారి ఆత్మస్థైర్యపు
ఔషదం ఆ గళం... ఆస్వరం
అమృత బిందువోలే తియ్యదనం...
అమ్మ మాటవోలే వెచ్చదనం...
నాన్న పలుకువోలే దగ్గరితనం
కమ్మని ప్రేమ కురిపించే చెలికాడు
ఆ దేవదేవుని హరి కీర్తనలో
ఓలాలాడించే ఔదార్యుడే
అరుణాచలుని ఆత్మగా
భేషజమెరుగని ఆ బాల గోపాలుడే
ఇందుగలడందుగలడని
ఎందెందు వెదికినా పారిజాత పరిమళమే
పాడుతా తీయగాయనే పద కుసుమమే
ఆపాదమస్తకం పరవశించే
సుస్వర గానమే...
చేయందించిన ఆ చరణకమలములకెపుడూ
ప్రణమామ్యుడే
శ్రీమాన్ పండితారాధ్యుల బాల సుబ్రమణ్యుడు
అల వైకుంఠపురపు పిలుపునందుకుని
ఇల విడిచిన... సుమధురం
అమరం... అజరం...
ఆ గాన గాంధర్వం! 🎼🎤🎼. *వై.కె.సంధ్యశర్మ*
8985348424
జగిత్యాల
9.
నీవు లేవు నీ పాట ఉంది
గానం అమరపురి లో ఉన్న గాన వేదికపై గంధర్వ రాగం ఆలపిస్తూ నే ఉంది
కంఠం మధుర దరహాసం నీ పాట
మర్యాద రామన్న లోని తొలి పాట పద్మనాభం సహాయముతో వింత లోకం అనే పాట ఆరంభ గీతమైంది
ఓంకార నాదాలు పలికిన చావు
ప్రణయ రాగాలు ఆలపించారు
భక్తి తత్వానికి సంకేతమైన పాటలెన్నో సహృదయుల గుండెల్లో నీ పాటల జర్నీ జలపాతమై సాగి వచ్చింది
దేశవిదేశాలలో ఆయన పాటల తోటలోకి ఆహ్వానం పలుకుతూ ఉంటారు ఎప్పుడు
అమరపురి లో మయూరి నృత్యాల మధ్య గంధర్వ కాంత ఎందరు
నీ పాటల చెంగు చెంగున గంతులువేస్తూ నే ఉంటారు
వయ్యారమొలికే పోసే మీ గాన రవళి లో తేలిపోతూ ఉంటారు
పండితారాధ్యుల సాంబమూర్తి వారసుని అనిపించుకున్నారు
ఎన్ని పాటలు పాడారు
ఒకటా రెండా 40000
16 భాషల గళం నీది
ఏ భాషలో నీ పాట పాడిన అది మమకారాల తెలుగు రస రాగాల పల్లకిలో నీ పాట ఊరేగుతున్న ది తెలుగు వారి గుండె ఉయ్యాలో
గగనాన నీ పాట శృతిలయలు ఆలపిస్తూ గానమే సోపానము అంటూ
రక్తికి భక్తికి ముక్తికి నీ భక్తి పాటల మాధుర్యం మధురం నీ పాటల ప్రవాహం నిత్యం అజరామరమైన సాగి వస్తూనే ఉంటుంది
తెలుగువారి లోగిలిలో పాడుతా తీయగా మధుర జ్ఞాపకాలు విశ్వమంతా తలచుకుంటూనే ఉంటుంది బాలు స్వరం భౌతికంగా మూగబోయినా చలన చిత్ర ప్రపంచంలో నటీనటుల పెదవుల కదలికల్లో నీవు పాడిన చిరకాలం నిలిచిపోతుంది
నీవు లేవు నీ పాట ఉంది అందరి హృదయాలలో స్థానం సంపాదించుకున్న లక్షల అభిమాన స్థానం నీదే బాలు
మీ చదువు ఇంజనీరింగ్ అయినా
భారతీయ కళ ప్రపంచములోని సొగసులు నీ కంఠంలో వెలిగించావు
నీ పాటల పరిమళం సదా మాకు నిలిచివుండే వాడని పువ్వు
నీ వినయం నా ఒక నవ్వు
తల వంచి నమస్కరించే తీరు అది నీకే చెల్లును బాలు గగనసీమలో విహరిస్తూనే ఉంటావు గానగంధర్వుడి వై సదా నీ గానం మధురమైన జ్ఞాపకమే నీవు లేవు నీ పాట
ఉంది
10
🌱కవితా గానం🌱
అంశం: S P బాలు
శీర్షిక: స్వర వీణ.. బాలు
కన్నీటిలో..
కలువలు పూచేనా..
కాలానికి..
ఋతువులు మారేనా..
గాత్రానికి..
స్వరములు దొరికేనా..
పాటలకూ..
ఊటలు ఊరేనా..
బాలూలా..
గళాలు పుష్పించేనా..
పాడుతా తీయగా అన్న
పాటల పూదోట..
శృతీ లయల గతి
తెలుగు పాట ఖ్యాతి
సప్త స్వరాల బాలు పాట
ఈ దివిలో విరిసిన పారిజాతం
సెలవుంటూ..
స్వర వీణ మీటుటకై
స్వర్గమనే మరో దివికేగింది..
ధృవ తారగ తళుకులీన..
గగన సిగలో నిలిసింది..
( గాన గంధర్వుడు SP బాలసుబ్రహ్మణ్యం గారికి కవితాక్షర పుష్పాంజలి... )
-- పాల్వంచ హరికిషన్
11
[25/09, 8:40 PM] Swarna Samatha Poetess: *కవితా గానం*
*25/092020*
*సుధా రస ఝరి*
ఓ...........
ఏమి వింత మోహమో,
అహో..ఏమి కలవరమో
ఏమి కల కల మో
అనే పాటతో,
గాత్రాన్ని ఆరంభించి,
అలుపెరుగని గానం తో
అందరినీ మంత్ర ముగ్ధులను
చేశారు,
ఆ గాన నిధిని,జ్ఞాన నిధిని
కోల్పోయాము,
40 వేల పాటలు పాడి,
రికార్డ్ బద్దలు కొట్టారు
భువి పై తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించీ
స్వర్గం లో గాన కచేరీ
పెట్టడానికి వెళ్ళారు.
*స్వర్ణ సమత*
12
[25/09, 8:47 PM] Rapolu Aruna Siripuram Poet: ఈ సమయం......
ఓ కళారవి ఆస్తమయం
ఈ తరుణం......
గానగంధర్వుని
మహాభినిష్క్రమణం
దివినుండి భువికి
దిగివచ్చిన పారిజాతమా...
కోట్లాది హృదయాల్ని
గానామృతముతోతడిపి
అనంతలోకాలకు పయనమైన
ప్రియబాంధవా.....
నిరంతరం మా చెవుల్లో
మారుమ్రోగును నీ గాత్రం...
మానవమాత్రుడిగా పుట్టి
దైవాంశ సంభూతుడివై
అమరగానంతో...
తరతరాలుగా నిలిచిపోయే
ఘనకీర్తి నీసొంతం
అందుకోవయ్యా.....
మా అశ్రు నీరాజనం
13
[25/09, 8:54 PM] కొలచన విజయ భారతి Poetess: పాటల ఏలిక
**************
గాన గంధర్వుడా
నీ గాన మాధుర్యంతో ఆ గంధర్వ లోకాన్ని సంగీతఝరిలో ఓలలాడించ
భువిని జనుల దుఃఖసాగరంలో ముంచి తరలిపోయినావా
కోట్లాది ప్రజల గుండెల్లో
నీ గానామృతాన్ని నింపి
మరలిపోయినావు
ఇంకొంత కాలం ప్రత్యక్షముగా
నీ గానామృతంలో ఓలలాడే
అదృష్ట హీనులమైనాము
సరిగమల స్వరాలు
భోరున విలపిస్తున్నాయి
మేళకర్త రాగాలన్నీ మూగ పోయాయి
ఇంద్రాది దేవతలు నీకు
కనకపు సింహాసనం
సమకూర్చియున్నారు
అచ్చర కన్నియలు
పూలమాలలతో నీకు
స్వాగతమీయ వేచియున్నారు
దివిని నారద తుంబురాదులు
వారికి పోటీ అవుదువేమోనని
గుబులు పడుతున్నారు
ఈ కరోనా మహమ్మారి
గుండె ఎంత కర్కసి
నీ స్వర మాధుర్యం
దాని గుండెను కరగించలేకపోయినదా
పాటల ఏలికా
నిన్నెన్నడు మరువలేమిక
మా అందరి హృదయాల నీవు
చిరంజీవివి
నీ స్వరం అమరం
🙏🙏🙏🙏🙏
కొలచన విజయ భారతి
హైదరాబాద్
గాన గంధర్వుడు S.P.బాలసుబ్రహ్మణ్యం గారికి
నివాళులు అర్పిస్తూ😢😢
14
[25/09, 9:03 PM] శ్రీ లక్ష్మి విజయనగరం: కవితా గానం
తేది:24-09-2020
చివుకుల శ్రీలక్ష్మి
*మధురగళానికి*
*మరో సుమం*
ఏ దివిలో విరిసిన
పారిజాతమో అంటూ
నీ మధుర గళంతో
సినీ పరిశ్రమకు వచ్చావు
ముక్కోటి దేవతలను
భక్తిగానంతో అలరించావు
ఆరు ఋతువులూ
అందమైనవే నీ గానంలో
ఏపదాలైనా నటరాజులా
నాట్యమాడుతాయి
సుతిమెత్తని నీ గొంతులో!
పిల్లలు పెద్దలు వృద్ధులు
నాలుగు తరాలవారికి
మంచిమాటలు చెప్పావు
మెప్పించావు
నీకూ మరణం ఉంటుందంటే
నమ్మేదెలా?
బాలూ! నామమే తప్ప
తక్కిన పురస్కారాలన్నీ
తృణప్రాయంగా ఎంచావు
విశ్వమంతటికీ నీ గానామృతము పంచి
కరోనా హాలాహలాన్ని
మీ గళంలో దాచుకుని
మండలం రోజులు
మృత్యువుతో పోరాడి
అలసిన బాలుడా
గాన గంధర్వుడా!
మామదిలో నెలకొన్న నీకు
నివాళులేంటి?
నీవు మాకు అందించిన
మధుర భావాలు
మరల మరల నీతో
పంచుకోవడమే తప్ప
🌹🙏🙏🌹
15
[25/09, 9:04 PM] మర్రి జయశ్రీ: కవితాగానం
మర్రి జయశ్రీ
అంశం.బాలుగారు
శీర్షిక..గాన గంధర్వుడు
సుమధుర గళం
పాటల తోటలో విరిసిన పారిజాత సుమం
సరిగమలతో చెలాగాటమే
నిరంతరం
ఎన్నో వేల పాటల్లో
పల్లవించిన ప్రణవనాదం
ఆ బాల గోపాలన్ని అలరించే గానం
మంత్ర ముగ్దదుల్ని చేసే ఝరి ప్రవాహం
ఒక్కసారిగా మూగ బోయింది
తెలుగు నేల తల్లడిల్లింది
అంతర్యామి అలసితి సొలసితి
ఇక చాలు నాకు ఈ భాగ్యం అని కోరుకున్నాడేమో
దివిలో తన పాటలతో అలరించేందుకే
మనకు సెలవంటూ పయనమయ్యాడు
ఐదు దశాబ్దాలు సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన గాన గంధర్వుడు
గానమే ప్రాణంగా జీవించిన బాలు గారు
మన కళ్ళముందు కదలాడకపోయినా
ప్రతిమదిలో జీవించే ఉంటారు పాటగా
ఏది వెంటరాదని తెలిసే
ఘన కీర్తి మోసుకెళ్ళిన ఘనుడా
అందుకోమా అక్షర నీరాజనం.
16
పేరు : బండి భానుచందర్
శీర్షిక : సంగీత సూర్యుడే అస్తమించెనా
గగనానికి ఉదయం ఒకటే
కెరటానికి సంద్రం ఒకటే
సంగీతానికి నీ స్వరం ఒకటే!.
అంతర్యామి అలసితివి సోలసితివి
ఇంతటితో నీ కథకు ముగింపు పలికితివి!.
అల్లంత దూరాన ఆ తారకనే
నీవు నేల రాల్చితివి !..
మా గుండెలలో ప్రళయం స్రుష్టించితివి!..
ఆకాశం తాకేలా వడగాలై సంగీతం
అందించే ఆహ్వానం నీ స్వరం !.
ఇక వినిపించదంటే గుండెకు భారం!..
ఇక గజ్జ ఘల్లుమనదు
ఇక ఈ గుండెఝల్లుమనదు!.
నీ స్వరాన్ని ఈ లోకం మది మరువదు!..
నిన్ను తలస్తే ఈ శోకం ఆగదు!..
జాబిల్లి కోసం ఆకాశమల్లె వేచినా
నీవు తిరిగిరావని తెలుసు!..
ఎందుకో వినిపించుకోదు నా మనస్సు!..
ఈ పాటలలోకంలో నీ స్వరంతో బ్రతికే ఉన్నావని
మళ్లీ మళ్లీ నీ స్వరాన్వేషణ చేస్తోంది మనస్సు!..
మా ప్రశ్నలు మావే నీవిక బదులివ్వవ్వుగా
నీవిక తిరిగిరావుగా!..
ఎవరేమి అనుకున్నా నీ స్వర సామ్రాజ్యానికి
రాజు నీవే, మంత్రి నీవే, బంటు నీవే!.
ఒకడే ఒక్కడు మొనగాడు
లోకం మెచ్చిన పనివాడు
విధికి తలోంచలేదు ఏనాడు!.
ఒకడివై వచ్చావు, ఒకడివై పోయావు
నడుమ ఈ నాటకం విధిలీల అని నిరూపించావు!..
మాటరాని శోకమిది
మౌనమైన బాధ ఇది
చెప్పలేని వేదన ఇది
చెప్పుకోని వైనమిది
బ్రహ్మరాసిన వ్రాత ఇది !..
17.
*కవితా గానం*
తేదీ::25-09-2020
అంశం:SP బాలు
శీర్షిక:: ఏ దివిలో విరిసిన..
*********************
ఏ దివిలో విరిసిన పారిజాతానివో
భువికి దిగివచ్చి గాన గంధర్వుడవై
మా హృదయాలను గెలుచు కున్నావు!
ఇంకా తెలవారదేమీ
ఈ చీకటి విడిపోదేమనీ
ఘంటసాల గారితో ఆలపించిన
పాటను
మీ కరోనా చీకటి తొలగిపోయి
మాకు పాటల వెలుగు ప్రసాదించాలని
ఆ భగవంతుని వేడుకున్నాం!
పంచిన గానామృతం ఇక చాలు
తన చెంత చేరమని పిలిచాడా
ఆ దైవం!
అశేష అభిమానుల్ని వదిలి వెళ్ళావు!
నీవు లేవని తెలిసి ఆకాశం భోరుమని విలపిస్తోంది!
దశ దిశల ప్రవహించిన నీ గానం
నిరంతరం నిన్ను
మా ముందు సాక్షాత్కరింప జేస్తుంది!
నీవు భౌతికంగా దూరమైనా
మా అంతరంగంలో ఎప్పుడూ చిరంజీవివే...
నభూతో న భవిష్యత్ నీ గానామృతం
కళామతల్లికి
వేన వేల పాటల్ని నైవేద్యంగా సమర్పించి
కైవల్యం పొందిన
శ్రీ పండితారాధ్య బాల సుబ్రహ్మణ్యుడా
సినీ సాహిత్య కళా లోకంలో ఎప్పటికి నిత్య నూతనంగా వెలుగులీనే కీర్తి కిరీటానివి!
పాటల పూదోటలో నీవు ఎప్పటికి వసివాడని గాన సుమానివీ! చిరంజీవివి!
అందుకోవయ్యా
మా అశ్రు నయనాల నివాళి!
18
అంశం..గానగంధర్వుడు
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
వినిపించేస్వరమాధురి హృదయలో
హరివిల్లులా సప్తస్వరాల పలికే సుస్వరాల సరాగాల రాగాల గానాలాపము
పాటలపల్లకిలో విహరిస్తూ గానముతో మనసులను దోచే మధురగాయకుడు
అతని గానము మధురామరం గుండెలను హత్తుకనే సంగీతవిభావరి
పండితారాధ్య సమరములో ఎన్నో వేల పాటలు పాడి అలసిపోయి ప్రయాణము చేసిన దిగ్గజమూర్తి
సంగీతమనే సాగరములో ఓలలాడుతూ అసమానమైన ప్రతిభతో అధ్బతమైనగీతాలను అందించిన సంగీతదిగ్గజము
అభిమానుల గుండెలో స్థిర స్థాయిగా నిలిచిన అభిమానవంతుడు
పాటల రధసారధి గాయనీగాయలకు మార్గదర్శి
గాయకునిగా,స్వరకర్తగా,నిర్మాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అసమాన ప్రతిభాపాటములు చూపిన గానగంధర్వుడతడు
అందరి మదిలో గుండె చప్పడై నిలిచాడు
19
శీర్షిక... బాల సుబ్రహ్మణ్యం
పేరు...యం.టి.స్వర్ణలత
కోట్ల హృదయాలను విషాదంలో ముంచి...
ఓ గొంతు మూగబోయింది నేటి నుంచి
ప్రతి ఇంట్లో ప్రతి నిత్యం ప్రతిధ్వనిస్తూ
ఘన కీర్తిని తన వెంటే మోసుకెళ్తూ
పాటకు ప్రాణం పోస్తూ...
శృతిలయల గతులు మారుస్తూ
ఏక చత్రాధిపత్యంగా చిత్ర పరిశ్రమలో
నలుభై వేల పైచిలుకు పాటలను...
అలవోకగా ఆలపించి
తన గానామృతంలో ఓలలాడించిన
గాన గంధర్వులు...
శ్రీపతి పండితారాధ్యల బాలసుబ్రహ్మణ్యం గారు
తన గాన సుగంధాన్ని దశదిశలా వెదజల్లి
అలసితీ సొలసితీ అంతర్యామీ అంటూ
సేదతీర సురలోక పయనమై
అన్నమయ్య కీర్తనలతో పాటల పల్లవులతో
స్వర్గాన్ని అలరించాలని....
పద్మశ్రీలు పద్మభూషణ్ లు డాక్టరెట్ లను
పక్కన పెట్టి పయనమాయె పరలోకానికి
అయ్యో! నీపాటలేక తెలుగునేల చిన్నబోదా
నీ అభిమానుల గొంతు మూగబోదా అంటే
తరతరాలకు తరగని నా గాననిధి ...
మీ కోసం నిక్షిప్తమేగా అంటూ...
మనిషిని మాత్రమే లేను...
నా మనసునంతా నింపుకున్న పాట మీదేగా
అనుకుంటూ చిరునవ్వుతో తరలిపోయెనేమో
20
*కవితా గానం*
*గానగంధర్వుడు*
మాటలనే పాటలుగా మార్చి
పాటలలోనే మాటలు చేర్చి
తన గళాన్ని విశ్వవ్యాప్తం గావించి
ఎందరోమహానుభావుల సరసన
ఒకరిగా నిలిచి అందరి మనసులను
తన పాటల పూదోటలో
విహరించేలా దోచి
గంధర్వ గాయకుడై గానామృతాన్ని
వీనులవిందుగా వినిపించి
అభినయంతో అందరినీ ఆకట్టుకుని
నవరసాలొలికించే కంఠంతో
సులువుగా ఇమిడిపోయే జ్ఞాని
జన్మతరహా పండితుల వంశోద్ధారకుడై
దైవారాధన చేస్తూ ఉండి
భక్తిరసమైన భావయుక్తి కలవారు
శ్రీపతి పండితారాధ్యుల
బాలసుబ్రహ్మణ్యం గారు
మీరు లేరనే నిజం
జీర్ణించుకోలేని విషయం
గానగంధర్వునికి
ఇవే అక్షర అశ్రునివాళి
వలిపే సత్యనీలిమ
21
శీర్షిక:*గాన *గంధర్వుడు*
--------****************--------
చిత్రమైన గానాద్బుతమా!
నీ స్వరం మాకెప్పుడూ గానామృతమే!
విప్పితే నువ్వు గంధర్వగళం!
వివశులే దానికి ఆబాలగోపాలం!
కూర్చితే మధుర సంగీతదర్శకత్వం
హృదయంగమ నవరసభరితమే!
చేరితే కళలవేధిక పైన నీదు రూపం
హృద్యమే ఆ కార్యక్రమ స్వరూపం
ప్రపంచ రికార్డులవీరుడా!
బహుస్వరాల మాంత్రికుడా!
బహుభాషల కోవిధుడా!
బహుముఖ ప్రజ్ఞాశీలుడా!
అభిరుచి గల సినీ నిర్మాతా!
అలరించగల సరదాల అధినేతా!
వందల అభినయాలకు గాత్రదాతా!
వర్ణించలేని విభిన్న స్వరసుధాకరా!
ఊపిరి తీసుకోకుండా పాడిన గాయకా!
ప్రభుదేవాతో నాట్యమాడిన నాయకా!
పాడే తీయని కొత్తస్వరాల గుర్తించిన
వెండితెర నిండుబంగారుకొండా!
అన్నితరాల గాయకులతో ఆడిపాడిన
అద్భుత అపూర్వ గానగంధర్వుడా!
భారతచిత్రసీమకు నీ స్వరమే వరాలు!
మా మదిలో కలిగించు భావాలు వేలు!
నీ పాటలు వింటూ నీ వయసును
మేము
మరిచాము ఏడుపదుల బాలుడా!
నువ్వూ మరిచావేoటి మా పాటల సూర్యుడా!
ఇది అస్సలు బాగా లేదు!లేనే లేదు.
నీ రాక కొరకు ఎంతగా ఎదురుచూశాo!?
మా ఆశలన్నీ అడియాశలు చేసి
గంధర్వుల లోకానికి పయణమయ్యావా?
ఈ ఆవేదనలోనూ నీ పాటలే మాకు ఓదార్పులు!
:వల్లాల విజయలక్ష్మి**
22
కవితా గానం
అంశం: *గంధర్వుడు*
25/9/2020
(పద్యాల రూపంలో)
ఆ.వె1:పాట పాడగాను పయనించె నీనాడు
బాలు యనెడి మంచి పాటగాడు
గగన వీధినున్న గాన గంధర్వులను
పలుకరించ గాను పృథివి వీడె!
ఆ.వె2:తెలుగు భాష పైన తెగనిమక్కువ చూపి
తేట తెలుగు లోన పాట పాడి
ప్రజల మదిని గెలిచి విజయయాత్రను చేసె
బాలు యేగె దివికి పాట పాడ!
ఆ.వె3:కవుల భావుకతను కమ్మగా వినిపించు
బాలు వంటి వాడు మరలి రాడు
గాన ధారలందు కమ్మగా తేలించె
పాటగాడు నేడు పవ్వళించె!
ఆ.వె4:ధరణిలోని ప్రజల తనువులో శాంతిని
వేల్పు వలెను పంచి వెలుగు నింపె
గాన మాధురంత గంధర్వ రీతిన
రసన పైన నిలిపె రమ్యముగను!
పేరు: కె.ఇ.నిలమంగై
కలం పేరు:నీలా రంగనాధం
ఊరు:నాదర్గుల్,హైదరాబాదు.
23
[26/09, 8:13 PM] నోములు Sanjeeva Reddy Poet: బాలూ ! ఇక సెలవు .
సరసస్వర సుర ఝరీ గమనం బాలూ గానం
మధుర దివ్యామృత పానం బాలూ వ్యాఖ్యానం
గానమే ప్రాణమని ,ప్రాణమే గానమని
రాగోపాసన చేసిన సప్తస్వర మహాముని
పండిత పామర జన మనోరంజకం ఆయన పాట
సరిగమలు పరిమళించిన తోట ఆయన పాట
సప్తస్వర మాయూ రాంగనల సయ్యాట ఆ పాట
వినినంతనే మన తనువులోని ఆణువణువూ
పులకించు అమృత వాహిణి ఆయన పాట
శృతి లయలు ఆయన జననీజనకులు
ఆయన పలుకులు మన వీనుల తేనెల చినుకులు
ఎదఎదనూ మీటిన మధుర స్వర వీణ
ఇక పలుకలేనని మూగవోయింది
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఈ భువిలో
మధుర గీతాల పరిమళాలను వెదజల్లింది
బాలూ వయసు ఏడు పదులు
ఆయన పాట వయసు ఐదు పదులు
ఆయన స్వరం మూఁడు తరాలను మురిపించింది
ఘంటసాల పోతూ పోతూ పాటను
బాలు చేతిలో పెట్టి వెళ్లిపోయాడు
బాలు ఆపాటకు తీయని స్వరాలతో
మధుర బాణీలతో పట్టం కట్టాడు
మరిప్పుడు ఆ పాటను ఎవరి చేతిలో
పెట్టాలో తెలియక కాలానికి వదిలేసి
అనాథను చేసి వెళ్లిపోయాడు బాలు
సరిగమలు గొల్లుమంటున్నవి
రాగాలు రోదిస్తున్నవి
పాట కన్నీరు పెడుతున్నది
బాలూ ఇక లేడని ఇంకెప్పుడూ రాడని
కాని బాలూ మళ్లీ పుడితే ఎంత బావుండు .
బాలూ నువ్వెమో అద్వైత సిద్ధికి
అమరత్వ లబ్ధికి గాణమే సోపానంగా
తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయావు
మధుర స్వర అమర గాయకా
మధువులొలుకు సంగీత సామ్రాజ్య నాయకా
శోకతప్త హృదయాలతో ఇ క శెలవు
ఇకపై నీ పాట రూపంలో మా ఎద యెదలో
ఆచంద్రతారార్కం నిలిచే ఉంటావు .
.......నోముల సంజీవరెడ్డి
కుషాయిగూడ .
24
[26/09, 8:16 PM] Purushottam Reddy Utf Poet: బాలూ మళ్ళీ పుట్టాలి!
~~~~~~~~~~~~
నెల్లూరులో జనించి చెన్నైలో స్థిరపడి!
తన సుస్వరంతో బహు భారతీయభాషల్లో గానాలాపనచేసి!
అందరివాడిగా కొలువైనావయ్యా!
ప్రతి సుప్రభాతవేళ ప్రతిఇంట నీస్వరం!
ఎదజల్లెను సుగంధ పరిమళం!
గానసేద్యంలో తాల్మితో నిరంతర కృషీవలుడవై
పాటల పూదోటలో తావితో గానవిరులు పూయించి
పాటల పల్లవితో ప్రజలను పరవశింపజేసి
అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నావు
గాయకునిగా,నటుడుగా విభిన్న పాత్రలు పోషించి
మా మనసులను పులకింపజేశావు
నీ సుమధుర గళం యముడు ఆస్వాదించాలనికున్నాడేమో?
కరోనా కర్కోటకమై కాటేసి దివికి తీసికొనిపోయి
మా కోట్లకొలది సంగీతప్రియులకు తీరని వ్యథను మిగిల్చాడు
నీవు దీవికెగినది అబద్దం కావాలని నా ఆకాంక్ష
బాలూ!మీరు మానవ రూపేన దైవం
అందుకే అయ్యావు గానగంధర్వం
నీ పార్థివ దేహానికే సెలవు!
నీ స్వరఝరి ఎన్నడూ కోరుకోదు ఇలలో సెలవు!
ఈ తెలుగు నేలపై మళ్ళీ పుట్టి
భావితరాలను ఆనందింపజేయి ప్లీజ్!
బాధాతప్తహృదయంతో
నీ అభిమాని
పైల పురుషోత్తం రెడ్డి
తెలుగు ఉపాధ్యాయులు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -కంచిలి
శ్రీకాకుళం జిల్లా
25
[26/09, 8:18 PM] Tagiran: కవితాగానం
*గానమే-ప్రాణం*
రచన: తగిరంచ నర్సింహారెడ్డి
రు *బా* యి *లు*
🎤 🎧 🎼 🎤
ఆ గొంతుకు తలలూపని మనిషుండడు ఇలలోన
తన పాటే ఆమనిగా మిగిలుంటడు ఇలలోన
సుప్రభాత గీతాలకు దేవుళ్ళే పరవశించె,
పాటలతొ పూదోటై వెలుగుతుంటడు ఇలలోన
🎤🎤🎤🎤🎤🎤
ప్రకృతిలో సోయగమంతా పల్లవిగా మలిచాడు
ప్రపంచాన సౌందర్యాన్ని చరణంగా వలిచాడు
సరిగమలకే సరాగాల సుధలనద్దె ప్రాణంగా;
దైవానికి ఆస్థాన గాయకుడుగా వెళ్ళినాడు
🎧🎧🎧🎧🎧🎧
ఒకటా, రెండా, ఎన్నో భాషలలో మొనగాడై పాడినాడు
ఇంతా , అంతా, ఆకాశమంతా అభిమానమే గెలిచినాడు
అసలా గొంతు అమృతమెంతగ తాగిందో తెలియదు కదా "బాలు"!
వందా, వెయ్యా ? అరలక్ష పాటలకు ప్రాణదీపం నిలిపినాడు
🎼🎼🎼🎼🎼🎼
మాటలలో మధురఫలాలు తీపిరుచులను పంచుతాయి
పాటలలో పూలవనాలు నిరంతరం వికసిస్తాయి
దైవానికైనా మేల్కొలుపు ఆ గొంతులోని పాటే !
ప్రతినిత్యం జీవనగీతమై ఎదలు పరవశిస్తాయి
🎼🎼🎼🎼🎼🎼
చరవాణి సంఖ్య:8897155600.
*ఈ పై పద్యాలు ఈ సమూహం కోసం రాసినవేనని హామీ ఇస్తున్నాను.*
26
[26/09, 9:03 PM] Rapolu Aruna Siripuram Poet: పేరు:రాపోలు అరుణాస్వామి
ఊరు:సిరివురం
చరవాణి:838277215
శీర్షిక:గాన గాంధర్వుడు
వచన కవిత
ఈ సమయం......
ఓ కళారవి ఆస్తమయం
ఈ తరుణం......
ఓ అద్భుత గానగంధర్వుని
మహాస్వరాభినిష్క్రమణం
దివినుండి భువికి
దిగివచ్చిన పారిజాతమై
కోట్లాది హృదయాల్ని
గానామృతముతోతడిపి
అనంతలోకాలకు పయనమైన
ప్రియబాంధవా.....
సంగీత గగనాన జాబిల్లి నీవై
వెన్నెలధారలు కురిపించి
పాట అంటే బాలు
బాలు అంటే పాట
అనిపించిన మహానుభావా....
నాగొంతు శృతిలోన
నాగుండే లయలోనఅంటూ
పల్లవీ చరణాలను
నీభుజస్కంధాల పై
మోసిన కారణ జన్ముడా....
మూసిన నీరెప్పలు
అభిమానుల ఆశలను చీకటిలో కలిపేసాయి
పెగలని ఆ గొంతు చూసి
నింగిలో చుక్కలు సైతం మౌనంగా రోధిస్తున్నాయి
నిరంతరం మా చెవుల్లో
మారుమ్రోగును నీ గాత్రం...
మానవమాత్రుడిగా పుట్టి
దైవాంశ సంభూతుడివై
అమరగానంతో...
తరతరాలుగా నిలిచిపోయే
ఘనకీర్తి నీసొంతం
అందుకోవయ్యా.....
మా అశ్రు నీరాజనం
🙏🙏🙏🙏🙏
ఈ కవిత నాస్వంత రచన
దేనికీ అనువాదం, అనుకరణ కాదని హామీ ఇస్తున్నాను
27
[26/09, 9:03 PM] Kanchi Ravi Kumar Poet Ks44: 26.9.20
_"సంపూర్ణ *బాలు* డా...!"._
నా కవిత్వం-280,
రవికుమార్ కంచి,
ఉపాధ్యాయులు,
9494345594.
__________🎼__________
సంపూర్ణ సంగీత 'బాలు'డా...
తెలుగు భాష కమ్మదనం
పాటల తీయదనం
నీ గొంతు నుండే...
భాష ఉచ్ఛరణ
భావ వ్యక్తీకరణ
నీ గొంతు నుండే.....
తెరపై ఎవరు నటిస్తున్నా
తెరపై పెదవులు కదుపుతున్నా
వారే పాడినారా
వారే పలికినారా
అనేంత మత్తు గమ్మత్తు
నీ గొంతు నుండే....
నీ కీర్తికిరీటంలో పద్మశ్రీ ,
పద్మభూషణాలు
పలు డాక్టరేట్లు
ఎన్నో జాతీయ
అంతర్జాతీయ
బహుమతులు...
అంత ఎదిగినా
అంతే ఒదిగిన
నీ సంపూర్ణత
వినయ శీలత
నీకే సొంతం.....
ప్రాణ స్నేహితుల కోసం
మెట్టులు బెట్టులు వదిలి
స్నేహ హస్తం చాచిన
విశాల మనస్తత్వం
నీకే భూషణం....
నీ తర్వాతి తరాన్ని
నీ తరువాతి గళాలను
వెలికి తీసి, ప్రోత్సహించే 'పాడుతా తీయగా' వేదికపై
నీ అంకితభావం
మెళకువలు నేర్పిన
మూర్తిమత్వం
నీకే సాధ్యం.....
మొత్తంగా...
పాటలతో
పరిపక్వ వ్యక్తిత్వంతో
సమున్నత సంస్కారంతో
నీదో చెరగని చరిత్ర
నీదో అలుపెరుగని యాత్ర
సంపూర్ణ సంగీత బాలుడా..
నీకు అక్షరాంజలి...
నీకు సుస్వరాంజలి.
_*-రవికుమార్ కంచి.*_
---------🌺🎼☘️🙏🏼---------
28
[26/09, 9:09 PM] Balloori Umadevi Poetess: 26/9/20
కవితా గానం
పేరు :డా.బల్లూరి ఉమాదేవి
అంశము: బాలు గారి స్మృతిలో
శీర్షిక: గాన గంధర్వుడు
భాషా భేదాలు ఎరుగని గానగంధర్వుడు
దేశ మాత కన్న ముద్దు బిడ్డ బాలు
తెలుగు పలుకుబడులు తీరుగా తెలిపిన
తెలుగు వారి వెలుగు ఎస్పీ బాలు
పండితారాధ్యుల యింట ప్రభవించి
కన్నవారికి ఉన్న ఊరికే గాక
దశదిశల తన గళము వినిపింప జేసే
శంకరా నాద శరీరా అంటూ శివ స్తోత్రం చేసిన
పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా
అంటూ ఏడుకొండలవాడిని స్తుతించినా
ఆహా ఏమి ఈ వింత మోహం అంటూ
అఖిల జగత్తునే గానమోహ పరవశంలో
ముంచి దివిలో దివిజులకు వినిపింప
తరలినావా గాన గంధర్వా
నీవు లేని సంగీత సామ్రాజ్యాన్ని
ఊహించుకోలేక జాతి విలవిలలాడే
పాడుతా తీయగా అంటూ పాటను
ప్రోత్సహిస్తూ అన్ని భాషలలోనూ
గాయకులను తీర్చిదిద్దిన ఘనుడు నీవే
అనంత లోకాలకు తరలి వెళ్ళిన బాలు
అందుకో మా అశ్రునివాళి
29
[27/09, 8:41 AM] Aparajith: బాలూ !
సుమధుర గాణ గంధర్వుడా
అలనాటి శ్రీ కృష్ణుని వేణుగానం తలపించినట్లు !
నీ గానమాధుర్యం అలలు అలలుగా పొంగి
బాధాతప్త హృదయాలను ఆహ్లాదంలో ముంచి !
కవుల రచనలు నీ గణంలో శోభిల్లి
కోట్లాది జనం హృదయాలను కొల్లగొట్టి !
సోలో పాటలు, జానకి సుశీల తో యుగళ గీతాలు
మనసుదోచే నీ గానం తరంగాలు తరంగాలై !
ముదిమి వయసు నుండి వృద్ధాప్యం దాకా
నీ కంఠం వేయి వీణలు పలికినట్లు !
రాగాలకే రాగానివై ఆనందడోలికల్లో ముంచి !
నీ గాణ మాధుర్యానికి నీకు నీవే సాటివై !
వేల వేల పాటలు అలవోకగా పాడి
సంగీత సంద్రంలో గజ ఈతగాడివై !
పామరులనుండి పండితుల దాకా వేనోళ్ళపొగడగా
కోయిల పాటలు మైమరపించే నీ గానం !
పాటల పల్లకిలో విహరించి
సుమధుర గీతాలాపనలో నీకు సాటి ఎవరయా !
పాటలైనా పద్యాలైనా నీ కంఠంలో శోభిల్లి
ముక్కోటి దేవతలు నిన్ను ఈ తెలుగు భూమిలో పుట్టించిరా !?
వెన్నెల రాత్రుల్లో నీ పాటలు వింటే
మనస్సు మరులు గొల్పే మాధుర్యం !
నీవు ఈ భువిని వదలి వెళ్లినా నీ పాటల సంద్రం మా జీవనయానం లో గింగురు మంటూనే ఉంటుంది
నీ పాట నీ కీర్తి అజరామరం చిరంజీవివయా !
అపరాజిత్
30
[27/09, 8:42 AM] Veera Gudipally: 28
ఇది వీరా గుడిపల్లి కవిత
25092020
బాలూ జాగర్త
*******************
ఈరోజు ఎందుకో
నిద్దర్రావడం లేదు
నీవెల్లి పోయావని కాదు
నీవూ వెళ్లి పోయావని
పాటలదేముంది
జీవితమంతా విన్నా తరగని పాటలు పాడావు
ఇంకేమైనా ఉంటే
యెవరైనా పాడతారు గాని
చేయని స్తుతి లేదు
మోయని దైవం లేడు
యెవరాపలేక పోయారు
పదహారు భాషల్లో పాడినా
అర్థం కాలేదు పట్కపోయినోనికి
పల్లెత్తు మాటెవరిననకుండా సాగినా
వెళ్ళక తప్పలేదు
అక్కడేం చేయాలో
పాటలే పాడాలంటే పరేశానేం లేదు
తిరిగొచ్చినోడు లేడు కదా
మేమొస్తే కనిపిస్తావూ కదా
బాలూ.....
తప్పని దాని గురించి తన్కులాటెందుకని
అన్పిస్తుంది గాని
నిద్రైతే పడ్తలేదు
నీ పాటే దిక్కు ... నీవు లేకపోయినా
మంచోడివి
యాడికి బోయినా బాగుంటావులే
బాలూ జాగర్త
...., *వీరా గుడిపల్లి*
31
స్వరతరంగం
*శ్రీ తుంబుర నారద గానామృతంలో* ఓలలాడించిన
గంధర్వ గళం
*ఏదివిలో విరిసిన పారిజాతమో...అంటూ*
భువిలో స్వర రాగ భావపరిమళాన్ని వెదజల్లిన మార్ధవస్వరం
తరతరాలను తన్మయమొందించిన
స్వర తరంగం
తరలి వస్తుందని...
*అదే నీవు..అదే నేను.. అదే గీతం* పాడుతుందని
*జాబిల్లి కోసం ఆకాశమల్లె*
వేచిన*
సంగీతప్రియులు
కలలోనైనఅనుకోలేదు కదా....
ఈ ఘోరకలిని
*నా ఉచ్వాసం గానమన్నగళం*
*పాటల పల్లకిలో* ఊరేగుతూ....
మళ్ళీ వస్తుందని
సంగీతసామ్రాజ్యానికి *రాజు.. మంత్రి.. బంటు*
తానై* శాసిస్తుందనుకున్నాం
కానీ
ఆ శ్వాస ఆగిపోతుందని
స్వర రాగలయలు గమకాలు సంగతుల సందడికి స్వస్తి
చెప్తుందని అనుకోలేదే...
ఇప్పుడిక
*జీవం పొసే రాగం కోసం* వేచిన వేవేల పల్లవులు మూగ బోయాయి...
*నింగి నీలమంతా* సంద్రమయ్యింది
*నేల కరిగి పోయి* సంద్రమయ్యింది
*నీలాల కళ్ళన్నీ* *సంద్రమయ్యాయి*
*స్వాగతమయ్యా..*
*ఓ యమరాజా*.... అంటూ
మంజునాథునిలో గంధర్వగళం
*ఐక్యమైన వేళ....*
************లలితాకృష్ణ
మంచోడివి
యాడికి బోయినా బాగుంటావులే
బాలూ జాగర్త
...., *వీరా గుడిపల్లి*
32
చిరంజీవి
💐💐💐💐💐
వసంతం చిగురించినా
నీ పాటే
శిశిరం రాల్చినా నీ పాటే
భక్తితో చేతులు జోడించినా
నీ పాటే
ధిక్కారంతో గర్జించినా నీ పాటే
ఆనందంతో చిందులు వేసినా
నీ పాటే
విషాదం హృది నిండినా
నీ పాటే
ఎండ కాసినా
వాన కురిసినా
చలి వణికించినా
ప్రతి సందర్భంలోనూ నీ పాటే
బడిలోనూ గుడిలోనూ
పండుగ పబ్బాలలోనూ
ప్రతీ చోటా నీ పాటే
ఉషోదయాల్లో
నిశీధి రాత్రుల్లో
ప్రతి వేళా నీ పాటే
భౌతికంగా నీవు దూరమైనా
ఓం గానగంధర్వుడా
వినయ సంపన్నుడా
మా ప్రియమైన బాలూ
పాటే శ్వాసగా జీవించిన నీవు
ప్రపంచంలో పాటున్నంతకాలం
పాటను ప్రేమించే హృదయాల్లో
నీవు ఎప్పటికి చిరంజీవివే
నీ పాటను వినడం మానుకోము
నిన్ను ఎన్నటికీ
మరిచిపోము
.. సంజీవరెడ్డి ఐలేని...
9177796464
33
అమరమై నీవు
ఇక మీద పుట్టే ప్రతి పాటా
నీ గొంతు నోచుకోలేక మూగపోదూ!
తన లక్షణాన్ని గుచ్చి చూపించే
నీవులేక అక్షరం చిన్నబోదూ!
నీవు లేవన్న దుఃఖం నుంచి కూడా
పాటై మళ్లీ మళ్లీ పుడుతూనే ఉన్నావు
జీర్ణించుకోలేని నీ మరణాన్ని కూడా
నీ పాటగా నీవే ఓదారుస్తున్నావు
ఆ మరుభూమిలో నీ దేహం
శాశ్వత నిద్రని ఆవాహనం చేసుకొని
సేదతీరుతూ ఉండవచ్చు గాక
మా హృది భూమిలోంచి మాత్రం
ఎన్ని శతాబ్దాలు గడిచినా
నిన్ను ఎవరు వేరు చేయగలరు?
ఇక్కడ మరణం ఓడిపోలేదూ!!
అమరమై అజరామరమై
నీ పాట మిగిలి పోలేదూ!!
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి
34
కవితా గానం
౼౼౼౼౼౼౼౼
గగనానికెగిరిన 'గానం'(ఎస్.పి.బాలు)
-----------------------------
పాట లోని పల్లవి మూగబోయింది
చరణాలు నింగి వైపు కదలిపోయాయి
ఎప్పుడూ లేదేమిటి!
తుమ్మెదలు రొదచేయడంలేదు
పువ్వులు సుగంధాన్ని అపశృతిగా వెదజల్లుతున్నాయి౹
గాలి ఎందుకు మందగమనంతో అడుగులు వేస్తుంది!
ప్రకృతి ఎందుకింత గతి తప్పింది
ఏవో స్వచ్చమైన నవ్వులు ఈలోకం దూరం చేసుకుంది౹
ఏవో సంస్కారమైన పలుకులు ఈ ప్రపంచం జారవిడుచుకుంది
అద్భుతగానం ప్రాణం తోడేసి వెళ్లిపోయింది౹
గానం ప్రతిక్షణం ప్రతిధ్వనిస్తున్నా
రూపం కనిపించక గుండె గాయమై హృదయం అనాహత శబ్దాన్ని పాడుతుంది౹
ఇలా ఇల వెలవెల పోతుంటే
......గగనంలో గలగలలేమిటి
ఇంద్రసభలో పచ్చతోరణాలతో
పండుగలేమిటి
నారద తుంబుర గానసభలు జరిగినచోట
బాలు గాన కచేరేమిటి
స్వర్గంలో స్వర్ణకిరీటంతో బాలుకు దేవతల సత్కారమేమిటి.
మన పిచ్చిగాని
సంగీత స్వరూపానికి మరణమేమిటి!
ఇక్కడ ఆగింది .....అక్కడ మొదలైంది
........ ........ ......
అదిగో
గగనంనుండి. గానగంధర్వుడి గానం వినిపిస్తుంది.....
........
ఎంతో రసికుడు దేవుడు..ఎన్నిపువ్వులెన్ని రంగులెన్నిసొగసులిచ్చాడు..అన్నిటిలొ నిన్నె చూడమన్నాడు....ఎంతో...
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
జల్లిపల్లి బ్రహ్మం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Comments
Post a Comment