Skip to main content

పౌర్ణమి పోటీ అంశం:శివరాత్రి 2023

నిర్వహణ
శివునూరి లలితా కృష్ణ
వీరా గుడిపల్లి
 ******************
1.దోసపాటి గారు
2.గంగాపురం శ్రీనివాస్ గారు
3.వేమూరి సత్యవతి గారు
4.మోహన మణికంఠ ఉరిటి గారు
5.రాజశేఖరుని శివ లక్ష్మి గారు
6..డాక్టర్ బల్లూరి ఉమాదేవి గరు
7.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు
8.గంటి మీనా కుమారి గారు
9.డాక్టర్ కమలా దేవి
10.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు
11.సింహాద్రి వాణి గారు
12.కోరాడ నరసింహారావు గారు
13.తిప్పావఝల నరసింహమూర్తి గారు
14.మద్ది పుల్లారావు గారు
15. పిన్నక నాగేశ్వర రావు గారు 
16.కవిత వెంకటేశ్వర్లు గారు
17.లలితా చండి గారు
18.బొప్పెన వెంకటేష్ గారు 
19.దేవికా రాణి రత్నాకర్ రావు గారు 
20.పొర్ల వేణు గోపాల్ రావు గారు 
21.కొంజేటి రాధిక గారు 
22.గుండ్ల రాజు గారు 
23.గొర్రెపాటి శ్రీను గారు 
*********************************
 1
దోసపాటి వేంకటరామచంద్రరావు

*
కవనజ్యోతి పౌర్ణమ కవితలపోటీ మాఘమాసం
అంశం:శివరాత్రి
శీర్షిక:శివోహం!
శివం!శివోహం!శివశంకరం
మాఘమాసంలోనీ సంబరం
శివనామస్మరణం
ఉపవాసం
జాగరణం
జగమంతా నీకీర్తనం
అదెంతో పర్వదినం
పామరుడినుండి పండితులవరకు నీధ్యానమే
నిరంతర అభిషేకాలు
నమకచమకగమకాలు
రుద్రాభిషేకాలు
గరళకంఠునికి నిరంతర నీరాజనాలు
లింగోద్భవసమయాన జ్వాలాతోరణాలు
ఓం నమఃశివాయనమః స్తోత్రాలు
హరహరమహదేవను ముక్తకంఠాలు
దేశమందున్నశివదేవాలయాలలో భక్తజనసందోహాలు
జన్మానికో శివరాత్రియని జనులంతా పూజలు
శైవక్షేత్రాలంతటా శుభసందేశాలు
ఆదిదేవుని కటాక్షముకై భక్తజనుల ప్రార్ధనలు
పంచాక్షరినామజపతపాలు
పరమపవిత్రపుణ్యదినము
ఆచరించినవారికి ఆనందదాయకం!

ఇది నాస్వీయరచన. ఈసమూహకొరకైరాసినదని
హామి ఇస్తున్నాను.
దోసపాటి వేంకటరామచంద్రరావు
విజయనగరం.

 2
గంగాపురం శ్రీనివాస్ 


కవితా గానం
మాఘ పౌర్ణమి పోటీలకు

అంశం: మహా శివరాత్రి 

ప్రక్రియ: పాట

తేది: 03.02.2023

"అద్వైతం అపురూపం"

పల్లవి:
అద్వైతం అపురూపం ఆదిశంకరం 
అఖిలాండం శివతాండం హరిహరాత్మజం //2//

హేమా శంకరా... హిమగిరి వాసుడా...
గరళా కంఠుడా... గంగాధారుడా...
                  //అద్వైతం//

చరణం: 1
రుద్రాక్షం బీజాక్షం పురందేశ్వరం 
విఠలేశం నిటలాక్షం విశ్వేశ దర్శనం //2// 

ఆది భిక్షుడా... అవ్యక్త రూపుడా...
నాగభూషణా... నంది వాహనా... 
                             //అద్వైతం//

చరణం: 2
త్రినేత్రం త్రిశూలం త్రిపురాంతకేశ్వరం
విలాసం విజేయం విశాలాక్ష దర్శనం //2//

సాధూ శంకరా... సంగమ క్షేత్రుడా...
ప్రమద నాథుడా... ఫాలా నేత్రుడా...
                         //అద్వైతం// 

చరణం: 3
అండాండం బ్రహ్మాండం అద్వైత రూపకం
లయకారం శితికంఠం లలాటలోచనం //2//

తాండవ లోలుడా... దక్షాధ్వంసుడా...
చిదంబరేశ్వరా... శ్రీశైల వాసుడా... 
                        //అద్వైతం//

చరణం: 4
కైలాసం కైవల్యం కపాలధారణం
సర్వజ్ఞం సర్వాత్మం సర్వేశ దర్శనం //2//

జోలేధారుడా... బోలా శంకరా...
పంచాభూతుడా... పంచారాముడా...
                      //అద్వైతం//

3
వేమూరి.సత్యవతి.

శీర్షిక. పంచాక్షరి
సంక్రాంతెళ్ళి, శివరాత్రొచ్చింది!!
ప్రభలు కట్టాలి!! తిరునాళ్ళకెళ్ళాలి!!
పాతాళభోగి పార్ధివ లింగమా? గాల్లో ఊగే వాయులింగమా?
రూపమే లేని చిదంబరమా? ఎర్రటి అగ్ని లింగమా?
ఈశానమో, వామదేవమో, సద్యోజాతమో ఐదు ముఖాలసలర్ధం కావు!
మీనాక్షి మెచ్చిన సుందరేశుడట! అడ్డబొట్లు,పాములు,పులిచర్మాలు పుర్రెలు!
భైరవుడూ,వీరభద్రుడు నంది భద్రతనిచ్చే బంధువులుట!!
ఆదిభిక్షువై అడుక్కుంటున్నా ఐశ్వర్యమిస్తాడుట!!
కంఠంలో గరళం, కంటిలోమంట
అందుకేనా నిత్యం అభిషేకాలు మారేడాకుల మందులు,!!?
బాలునిగాా నీకు తలంటిన బెజ్జమహాదేవి! 
అంతటా నిన్నే దర్శించిన అక్కమహాదేవి,
గొడగూచి,కన్నప్ప,సురులు అసురులు అందిరికీ బంధువ్వే !ఆరాధ్యుడవే!!
కాముని దహించికూడా కామేశ్వరుడవయ్యావు!
ఇంతకీ పెను స్తంభానివా?పొట్టి లింగానివా?
రెండుశక్తుల్నొకటి చేసి అర్ధనారీశ్వరుడవైనావు!!
నీ తత్త్వం నాకేం తెలుస్తుంది!!??
నాకొచ్చిందొకటే పంచాక్షరిజపం!!
ముక్కంటివై మనో నేత్రం తెరిపించు!!
త్రిశూలివై అహాన్నదుపు చేయి!!
కపర్దివై ఆత్మా,శరీరం,మనసుల నొకటి చేయి

4
మోహన మణికంఠ ఉరిటి 

శీర్షిక : శివయ్య

సిగలో చందమామ
తలపై గంగమ్మ
మెడలో నాగేంద్రుడమ్మా
పక్కన పార్వతమ్మ!!

బూడిద ధరించువాడు
జటాధారి వీడు !!
కైలాసంలో ఉంటాడు
త్రినేత్రుడు వీడు!!

భోళాశంకరుడంటా
గరళకంఠుడంటా
తాండవమాడునంటా
త్రిశూలధారియంటా!!

లింగాకారం నీ రూపం
ఆదిభిక్షువు అవతారం
నందిపై లోకసంచారం
పులిచర్మమే ఆహార్యం!!

ఆడ మగ సమానమని చెప్పిన 
ఓ అర్ధనారీశ్వరుడా..
నీ ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటా,
మరి ప్రపంచ శాంతి కోసం
ఇకనైనా ఆజ్ఞాపించవా ఓ ఈశ్వరా!!
నీ మూడో కంటిని తెరిచి
ఈలోకపు చెడుని 
భస్మము చేయరా విశ్వేశ్వరా!!
 5
రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి
*
 కవిత గానం
 అంశం శివరాత్రి

 శీర్షిక: ఓంకార నాదాన్నై..

 మహోత్తుంగ గంగా ప్రవాహమై
 నాలో భక్తి రంగాలు
 ఉవ్వెత్తున లేస్తాయి ఈ పర్వదినాన

 నిలువెల్లా ఓంకార నాదాన్నై
 నీ ముందు మోకరిల్లుతాను
 రుణ బంధాల విముక్తి కోసం
 రుణపాశాల తీర్పు కోసం
 నువ్వు విప్పనిగుట్టును
 వెతుక్కుంటూ..
 జనన మరణాల జీవననాదాన్ని
 పిచ్చిగా ఆలపిస్తూనే ఉంటాను..

 నేను అడగని వరమే జన్మం
 నేను ఎరుగని గమ్యం మరణం
 మధ్యలో ఆట నీది వేట నీది
 అంతరార్థం అర్థం అవ్వక
 పాకులాడే వెర్రి నాది..

 ఆది అంతం లేని ఆటకు
 సూత్రధారిది మౌనముద్ర
 గెలుపు అలుపుల మలుపు తెలిసిన
 జంగమయ్యది యోగ నిద్ర

 జన్మంతా జాగారమై
 కరిగిన కన్నీరే అభిషేకమై
 జగమెరిగిన స్వామికి
 ధాత్రినై శివరాత్రినై
 అర్థిస్తున్నాను శంకరా..
 మాయా మొహాల ముసుగు తీసి
 అభయమిస్తావా
 నిను చేరే వరమిస్తావా..
6
డా బల్లూరి ఉమాదేవి 
*
పరమేశ వృత్తము
సనజభగగ 1_10యతి
1గరళమ్మునుగళ మందు గంగను నెత్తిన్
ధరియించుచుసతతంబుధారుణిలోనన్
చరణాంబుజములుకొల్వచల్లనిచూపున్
స్థిరతమ్ముగనిడరమ్ము శ్రీ పరమేశా

2.గిరిరాజసుతనుకోరి కేలును పట్టె
న్నురగాభరణుడుకట్టెనొప్పుగతాళిన్
సురలెల్లరచటమెచ్చసూక్తపురీతిన్
శిరమందుశశినిదాల్చి శ్రీపరమేశా

3.మదనారివి గద స్వామి మా కనయంబున్
సదయుండగుచునుసంతసమ్మిడవేగన్
ముదమున్నొ సగగరార ముప్పుర నాశా
మదనాంతక హర కావుమా పరమేశా

4శరణాగతుడవునీవె శంకర రారా 
 కరుణామయుడవు నీవె కావగ రారా
  పరమేశ్వర శివ శంభుపార్వతి నాథా
యురగాభరణుడవీవెవోపరమేశా.

5.శివనామమునిటనేను చిత్తము నందున్
పవలున్ నిశియునుతల్చి ప్రార్థనచేతున్
భవబంధములనువేగబాపుముశంభో
శివశంకర భవ నాశ శ్రీపరమేశా

6.భువినేలెడుపరమేశ పూనిక తోడన్. భవబం ధనము లవేగబాపగ రారా. స్తవనమ్మొనరగచేసినచాలునుశర్వా 
 శివముల్ కలుగు నటండ్రు శ్రీపరమేశా  

పద్యములు

7
అంశం: శివరాత్రి 
శీర్షిక...‌‌ సమస్త జనులకు శుభరాత్రి 
కవితలు అందాల్సిన తేదీ 04/02/2023

**********************************************

మహాశివరాత్రి
ఆదిమధ్యాంతరహితుడు, ఆ మహాదేవుడు 
అగ్ని స్తంభమై నిలిచి పద్మనాభ,పద్మజులకే
పరీక్ష పెట్టి అంతుచిక్కని వాడు ఆ పరమేశ్వరుండు !!

ఆరుద్రలో రుద్రుడై అవతరించిన శంకరుడు ...
అవనిలో లింగమై దర్శనమిచ్చిన శివుడు 
ఆదిపరాశక్తి అమ్మ ఆత్మలో నెలవైన ఆదిదేవుడు !!

 మింగమెతుకు లేక గతుకగంజి లేక బతుకుబండను
దండచేసి, మహాదేవుని మెడనవేసి దరువులేసే
ధన్యజీవులు, డప్పుకొట్టి మురిసిపోయే చిన్ని ప్రాణులు 
మహాశివరాత్రి పర్వదినం పాప విమోచనమే నంటు!!.

ఊరు వాడా ఉర్విని ఏకం చేస్తు ఉపవాసం , జాగరణతో
జంగమయ్యకు గిరిజతో పరిణయ మాడించిన మంచి మనసున్న మారాజులు *ఆదిమధ్యాంత* మిహిరులు*
ఆధ్యాత్మిక అమృతవాహినిలో మునకేసిన మునులు!!

శివరాత్రి !
ఛిద్రమైన జీవితాలు చితికి చిక్కకుండా... పాకలో
పగలును పంచు చిరుదివ్వై వెలుగులు పోసే శివరాత్రి !
ఊట చలమలా పండిత పామరజనముల పాలిట జీవనమాధుర్యం అందించే*సమస్త జనులకు శుభరాత్రి*

శివరాత్రి...!
కాయకష్టం చేసే కర్మజీవులు తమ ఘర్మజలంతో
అభిషేకించి మనసు కుసుమాలతో అర్చన చేసి
ఆబాల గోపాలం సదాశివుని సన్నుతి జేయుచు...
భక్తి పారవశ్యంతో ముక్తిని ప్రసాదించమని వేడుకోలు...ఈ వేడుకల శివరాత్రినాటి జాగారాలు 
 
కలిమిలేములు కష్టసుఖాలు కాలనాగులై కాటేస్తున్నా
కలవరమింతైనా కనపడదే !? 
కలహంసల్లా మానస సరోవరాన ఈదులాటలో జలజల నవ్వులే... జలజము నూదుతు జగమే ఊయల ఊపగ

స్వీయ రచన:: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు

: 8
గంటి మీనా కుమారి గారు 
  అంశం :శివరాత్రి 
 శీర్షిక :"శివరాత్రి మహిమ "
   ప్రక్రియ : ద్విపద (పద్యము )
_______________________________________
   సాగరమదనమ్ము సాగించు వేళ
చకచక ద్రిప్పేయచలమును వారు
హయ్యంటు వచ్చిన హాలాహలాన్ని 
రయముగ మ్రింగియు రక్షించితివిగ
బ్రహ్మవిష్ణువుల వైరము తొలగించ
బ్రహ్మాన్డమంతయు ప్రజ్వరిల్లితివి 
ఉద్భవించె హరుడు ఉవ్వెత్తునన్ను
లింగరూపమ్మునలీలలు జూప 
ఆదిమధ్యాంతుండౌ యమరలింగేశు
పదిలంగ మదిలోనిపరమేశునిలిపి 
పార్వతీదేవియు పరమేశు గొలిచి
  సర్వ మంగళ యాయె సాంబుని బొంది  
మృగ సత్య నిష్ఠకు మురిసేనుబోయ 
ఉపద్రష్ట నీవంటు వదిలివేయ 
శివరాత్రిజాగరణ సేసెను గాన 
సశరీరమునతడు స్వర్గమొందేను 
మృగ సత్య నిష్ఠకు మెచ్చిన శివుడు  
మృగశిర నక్షత్ర మండలమ్మొసగె  
శివరాత్రిజాగరణం శివనామ స్మరణ  
జీవుల ముక్తి నిచ్చెడి ఫలమ్ము 
జయ జయ శంకర జయము నీకంటు
దయ జూపుమంటూనుజన్మంతకొలువ
అర్చింతుమయ్య శంకర పత్రి దెచ్చి  
మర్చిపోవద్దయ్య మమ్మెప్డు నీవు
___________________________________ _____
 హామీ పత్రం :ఈ పద్య కవిత నా స్వంత రచనని ,దేనికీ అనువాదం ,అనుకరణకాదని హామీ ఇస్తిన్నాను  
______________________________________
9
కవనజ్యోతి మాఘమాస నగదు బహుమతి పౌర్ణమి పోటీకి నాకవిత
అంశం : శివరాత్రి
శీర్షిక : మహాశివరాత్రి
పురాణప్రసిద్ధము
ప్రతిమాసమున కృష్ణ చతుర్దశినాడు వచ్చునది మాస శివరాత్రి
మాఘమాస బహుళ చతుర్దశి నాడువచ్చునదిమహాశివరాత్రి
శివునకుఅత్యంతప్రీతికరమైన రోజు
హిందువుల పర్వదినము
చంద్రుడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైన రోజు
శివపార్వతుల కళ్యాణము జరిగిన రోజు
లింగోద్భవము జరిగిన రోజు
అదే మహాశివరాత్రి 
శివుడు తాండవము చేసిన రాత్రియట
జ్యోతిర్లింగాలుగ వెలసి
ద్వాదశ జ్యోతిర్లింగాలుగ 
ప్రసిద్ధుడైనాడు శివుడు
అభిషేక ప్రియుడు శివుడు
ఉపవాసము , జాగరణలు, అభిషేకాలు, అర్చనలు శివలీలా కథల పారాయణాల
తో కొలుస్తారు శివుని ఆరోజు
అత్యంత ఆధ్యాత్మిక శక్తికల రోజు
మహామృత్యుంజయ స్తోత్ర శక్తి
ఇనుమడించురోజు
మహాశివరాత్రి
శివుడు,శంకరుడు,రుద్రుడు, లయకారుడు ,మల్లికార్జునుడు,మంగళస్వరూపుడు అన్నీ
ఆశివుడే
సకలశ్రేయోభిదాత,ఆశ్రిత వత్సలుడు
సులభప్రసన్నుడు,భోళాశంకరుడు,పంచభూతాధిపతి
పంచకృత్యపరాయణుడు
ఆదియోగి, ఆదిగురువు తానే
నాట్యస్వరూపుడు,నటరాజమూర్తి,పన్నగభూషణుడు
పార్వతీప్రియుడు,పినాకపాణి
ఆపరమశివుడే
సూర్యచంద్రులేతననేత్రములు
అర్థనారీశ్వరుడు,
గంగాధరుడు చంద్రమౌళి అయిన ఆపరమశివుని అవతరణమే 
ఆదిఅంతాలు తెలియని 
ఆఅద్భుత లింగోద్భవమే
మహాపర్వదనము అదే మహాశివరాత్రి .

పేరు : డా.కమలాదేవి
ఊరు : న్యూఢిల్లీ
చరవాణి : 9871096566

హామీ : పైకవిత నాస్వంతం.
10
కవితా గానం (సీజన్-3) మాఘమాస పోటీకి
తేది:-04-02-23
పేరు:-
అయ్యలసోమయాజుల ప్రసాద్
ఊరు:- విశాఖపట్నం..
అంశం:- శివరాత్రి
శీర్షిక:-
కైవల్యానికి సోపానం
..................................
క్షీరసాగరమథనంలో
ఉద్భవించిన గరాళాన్ని 
లోకకల్యాణం కొరకు కంఠంలో ఉంచుకున్న శివుని ఆరాధన అత్యంత శుభకరం...!

తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి
ఉపవాసం ఉండి
భక్తి శ్రద్ధలతో రుద్రసూక్తంతో
నమక, చమక పారాయణ చేస్తు నారికేళ జలంతో
నమః సంభవేచ మయోభవేచ
నమఃశంకరాయచ మయస్కరాయచ
నమఃశివాయచ శివతరాయచ అంటు చేసే
శివాభిషేకం శుభప్రదం...!

శివుడు కోరిన కోర్కెలు తీర్చే సంపత్కారకుడు
భోళా శంకరుడు
ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్ర పఠనం
మోక్షప్రదాయకం..!

శివరాత్రి నాడు చేసే జాగరణ అత్యంత పవిత్రం
శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు శివుడు భక్తవత్సలుడు .
మార్కెన్దేయునికి చిరంజీవిత్వాన్ని ప్రసాదించిన ప్రాణప్రదాత.!

మాఘ బహుళ చతుర్దశి 
నాడు చేసే లింగార్చన బిల్వార్చన పాపాలను తొలగించి జన్మరాహిత్యం చేకూర్చునని శివమహాపురాణం తెలియచేస్తుంది
కావున శివరాత్రి నాడు చేసే
ఆరాధన కైవల్యానికి సోపానమే.......!!
...................................ఇది నా స్వీయరచన
పౌర్ణమి పోటీకి మాత్రమే వ్రాసినది.
అయ్యలసోమయాజుల ప్రసాద్
విశాఖపట్నం.
.............................
11
కవితా గానం ( సీజన్--3 )
మాఘమాసం పౌర్ణమి కవితల పోటీకి
అంశం:-- శివరాత్రి
శీర్షిక:-- శివరాత్రి
రచన:-- సింహాద్రి వాణి
ప్రక్రియ:-- పద్య కవిత్వం
ఊరు:-- విజయవాడ
చరవాణి:--7569820872

1) ఉ.మా. బాధలు తీరగన్ భువిని బాగుగ కొల్వుడు నీశ్వరున్ సదా
సాధన మాతడే బ్రతుకు సాగగ ముందుకు మంచి దారిలో
క్రోధము మోహమున్ విడిచి కోరి భజించిన పార్వతీ సతీ
నాధుడె రక్తినిచ్చు మరి నాతడె ముక్తి నొసంగు చోద్యమై.

2) సీ. మాధవుండును, బ్రహ్మ మహపోరు సల్పగా 
శివుడు యుద్ధమునాపె చేరి నడుమ
‌శివరాత్రి దినమున శివుడుద్భవించెను
నడిరేయి‌ వేళలో నవ్యముగను
ఆది యంతము‌ లేక యగ్ర పూజలనందు
లింగ రూపములోన జంగమయ్య
పీఠమప్పుడు‌ నంబ కాటపట్టుగ మార
పానవట్టము విష్ణు పావనుండు

తే.గీ. యాత్ర లెన్నియో జేసిన యట్టి ఫలము
శివుని పూజింప శివరాత్రి చెంద నగును
ధాత్రి పార్వతియును కడు దయను జూప
నదియె మాత్రయౌ భక్తుల కవని లోన

3) ఆ.వె. భక్తులుపవశించి భక్తితో మెలగుచూ
రాత్రి జాగరణము రక్తి తోడ
శివుని నామ జపము చేయుచూ గడపంగ
పాపములను బాపు పావనుండు

4) కం. హరణము జేయును కలతలు
శరణము వేడగ నిరతము శైలజనాధున్
కరుణను నభయము నొసగుచు
మొరవిని కాపాడు నెపుడు మోదము తోడన్.
12
కవితాగానం అంశం :- శివరాత్రి 
    కోరాడ నరసింహా రావు !
          * లయకరుడు *
             **********
 నాగ భూషణుడు, నంది వాహ నుడు పార్వతీమానోహరుడు !
 గంగాధరుడు, త్రిసూలపాణి 
జటాధరుడు, చర్మాంబరుడు !!

ఈనటేసు డెప్పుడూ...
     ధ్యానముద్ర యోగీశ్వరుడే!
గరళకంఠుడీ చంద్రమౌళి... 
     సకలప్రాణుల లయకరుడే!!

 నేనుగొప్పంటే-నేనుగొప్పనుచు 
 వాదులాడిరా తండ్రీ,కొడుకులు
తగవుతేల్చమని,కైలాసముజేరి త్రినేత్రుండు ఆ శివుని కోరగా... 
      నాలింగ రూపమున కాద్యం 
.తములు తెలుసుకుని మును ముందుగ ఎవరు వత్తురో వారే 
గొప్పని శివుడు చెప్పెను... !

ఆది,అంతములేనిస్వరూపము 
ఉద్భవించె నా లింగ రూపము !
 బ్రహ్మ, విష్ణులు తప్పు తెలుసు 
కుని అర్చించిరి..... 
                ఆ శివలింగమును !! 
 
దేవదానవులు అమృతమును కోరి...సాగరమధనముగావించి
నపుడు, ఉద్భవించిన హాలా హలమును,శివుడుగరళమున
నుంచె, ప్రపంచమును రక్షింప,
గరళప్రభావముచే...మూర్ఛిల్లిన శివుని ఉపశమింప జేయ గా పూజలు,అర్చనలు,అభిషేము ల తెల్లవారులూ నిరీక్షింప !
ఆ పవిత్ర రాత్రియే శివరాత్రి 
                    అయ్యె... !!  

దయాసాగరుడీబోళాశంకరుడు
 కుల, మత బేధముచూడక... 
     తర, తమ బేధమునెంచక...
అన్నిప్రాణులను సమానముగ తనలో కలుపుకును మహా ప్రళయ కారకు డీ....రుద్రుడు! 
         శివరాత్రి జాగరణ చేసిన 
 హరోంహర హర హర హరహర శంభో శంకర మహాదేవ యని 
 శివుని స్తుతించిన... 
         సకలపాపములుహరించి
మోక్షము నొసగెడి మహిమాన్వి తుడా శంకరుడు 🙏💐🙏7
          ***************
13
కవన జ్యోతి పౌర్ణమి కవితలు

అంశం: శివరాత్రి .శీర్షిక: కైలాసానికి సుపథం.
భగవంతుని నైవేద్యాన్ని దొంగిలించిన పాపికి లభిస్తుందా శివసాయుజ్యం?/
సర్వ భ్రష్టుడైన తాగుబోతుకు సాధ్యమా కైలాస ప్రాప్తి?
మహాశివరాత్రి రోజున యాదృచ్ఛికంగా నైనా చేసే పుణ్యకార్యాలవల్ల సాధ్యం ఏదైనా.
సకల దుర్గుణ సంపన్నుడు గుణనిధి.
అన్నం దొరక్క శివరాత్రి రోజున చేస్తాడు ఉపవాసం.
నైవేద్యాన్ని దొంగిలించను చేస్తాడు జాగారం.
ఆలయంలో అంగవస్త్రం చించి వెలిగిస్తాడు దీపం.
ఆ వెలుగులో చేసుకుంటాడు శివదర్శనం.
ఈ పుణ్యకార్యాలవల్ల పొందుతాడు శివసాయుజ్యం
శివరాత్రి మహాత్మ్యము లో సుకుమారుడు సర్వ అవలక్షణాలకు ప్రతిరూపం.
శివరాత్రి రోజున తాగి చేసుకుంటాడు శివదర్శనం. దర్శనఫలంతో లభిస్తుంది కైలాస ప్రాప్తి
మహిమాన్వితమైన శివుని రేయి శివరాత్రి.
మహాశివుడు లింగాకృతిలో ఉద్భవించిన పర్వదినం
ఆది దంపతుల వివాహమైన పుణ్యరాత్రి.
శివుడు శత్రువులను జయించిన అద్భుత రేయి.
నిశ్చలత్వానికి ప్రతీక.
మానవజన్మ త్యాగమయం కావాలనేదే శివరాత్రి స్ఫూర్తి.
జన్మకో శివరాత్రి కైనా చేపడతాం ఉపవాసదీక్ష.
లింగోద్భవ కాలంలో చేద్దాం శివపూజ
పొందుదాం సంవత్సర కాల నిత్య శివారాధన ఫలం

తిప్పావఝల నరసింహమూర్తి
బుచ్చిరెడ్డి పాలెం.నెల్లూరుజిల్ల
14
మద్ది.పుల్లారావు

1)
తే.గీ

శంకరుడు లింగ రూపాన జనుల కొరకు
యుద్భవించిన కాలమె యుర్విలోన
జరుపుదురు శివరాత్రిగ జగతి జనులు
సర్వ లోకాలకానాడు పర్వ దినమె!

2)
ఆ.వె

గంగను తలదాల్చు జంగమ దేవర
లీలలెన్నొ జూపు లింగరూప
అంగరంగ వైభవమ్ముల కొలిచెద
సంగమేశ నీకు శరణు శరణు!

3) 
ఆ.వె.

భవహరుని గొలిచిన బాధలన్నితొలగు
శివశివ యని వేడు చిత్తమందు
శర్వుడభయ మీయ సత్ఫలితాలొచ్చు
హరుని వేడు మాత్మ యందు నెపుడు

 4)

తే.గీ.

వేడిన వరములిచ్చెడి విశ్వరూప
పార్వతీశుడవై మాకు బ్రతుకు నిమ్ము
అర్ధనారీశ్వరుని గొల్చుమవనిలోన
లోకనాధుడు బాపును శోకములను

5)
తే.గీ.

కొలువుమీశ్వరుడినెపుడు కొరత లేక
తలచు మహదేవు మహిమలు దనివిదీర
మదిన శంకరు నామము మధుర ఫలము
పూజ చేయుము హరునికి పుష్పములతొ

6)

తే.గీ.
 శివుని యాజ్ఞతో నెగదులు చీమ లైన
శరణనిన వారికెప్పుడు జయములిచ్చు
మోహ బందాలు వీడిన మోక్షమిచ్చు
గరళకంఠుని మహిమలు ఘనము గాదె

************
ఇది నా స్వీయ రచన
15
కవితా గానం(సీజన్3). 4--2--2023.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము :-- శివరాత్రి.

ప్రేమ, శక్తి, ఏకత్వాల రూపం శివరాత్రి
శివ, శక్తుల కలయికల రాత్రి
శుభప్రదమైన రాత్రి
మహా శివుడు మాత పార్వతిని వివాహం
చేసుకున్న రోజని పురాణాల కథనం
పరమ శివుడు పురుషుడై 
పార్వతి ప్రకృతియై 
చైతన్యం, శక్తుల కలయిక
సృష్టిని ప్రోత్సహించిన రాత్రి
తిమిరమును,అజ్ఞానాన్ని పారద్రోలు
పండుగకు గుర్తు
శివరాత్రికి ఉపవాసం చేసి,శివుని ప్రార్ధిస్తే 
శుభం కలుగుతుందనే నమ్మకం
దేవాలయాలలో ప్రత్యేక పూజలు
శివునికి ప్రీతిని కలిగించే
జలాభిషేకాలు, రుద్రాభిషేకాలు
కోర్కెలు తీర్చమని అభ్యర్ధనలు 
రాత్రంతా జాగరణ చేస్తే
పుణ్యం లభిస్తుందనే నమ్మకం!!
**************************************
16
కవితా గానము
తేదీ::4.1.23..శనివారం
అంశం:: శివరాత్రి
పేరు:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625
శీర్షిక:: శివరాత్రి శివుడు

శివుడు త్రినేత్రుడు
త్రిలోక పూజ్యుడు
భక్త సులభుడు
సతికి ప్రాణ వల్లభుడు
మల్లికార్జున మహానుభావా
కొండను నీవు దిగిరావా
మనుషుల మాయలు చూడవా
నీ పేరు చెప్పుకుని చేసే మోసాలు కనవా
వారిని మార్చగా రావా
సాంకేతిక సాయంతో మోసం
చేస్తున్నారు అమాయకులను
టెక్నాలజీతో దుర్బుద్ధి ఉపాయాలతో అందలము
ఏక్కుతున్నారు
సులభ సంపాదనకు అలవాటు 
పడ్డారు
ప్రక్కవాడు నాశనమైన 
ఫర్వాలేదు నేను బాగు0టే చాలు అనుకుంటారు
స్వార్థములో మునిగిపోయినారు
స్వలాభానికే మొగ్గుచూపుతారు
జాలి దయ కరుణను మరచారు
మానవత్వానికి మంగళము
పాడినారు
హద్దులు గీసుకొని బుద్దులు
చెడగొట్టుకున్నారు
అందరితో కలవడము మానుకున్నారు
బావిలో కప్పలా బ్రతుకుతున్నారు
దేవా ఇలాంటి వారిని మార్చగా రావా
భువిని దివిగా చేయరావా!!
          ఈ కవిత నా స్వీయ రచన అని హామీ
17
[05/02, 4:30 am] Lalita Sister: కవితాగానం
పౌర్ణమి కవితల పోటిల కోసం రాసినది
 *శీర్షిక -- ప్రణయ యానం* 
 *రచన----లలితా చండీ*

 పరమ శివునికి ఏం తెలుసు?
శివరాత్రి నాడు శివ శివా అంటూ
చేసే అభిషేకాలు తప్ప
భగీరధుని తపసుకు మెచ్చి తరలివచ్చే నన్ను 
జటాజూటమున బంధించి విడిచిన  
 ఆ మహాదేవునికి ఏమి తెలుసు ?
నా అంతరంగ అలజడులు 
సుళ్లు తిరుగుతున్న మమకారపు 
ఝరుల ఒరవడులు
అనంత కాలంగా హిమ శిఖారాగ్రముల నుంచి ప్రవాహమై పారుతూ. ముళ్ళబాటలను సహిస్తూ, కఠిన శిలల ఒరిపిడిలకు తట్టుకుంటూ, కారడివి ఒంపులలో రాకాసి తరులను సైతం తడిపేస్తూ లోయలలో పడి కోనల గుండా
పుడమిపై నీపాదాలన తాకుతూ నిత్యం అభిషేకిస్తూ చేసే మౌన ప్రవాహ స్తుతి,

మూడు కాలాల మురిపాలకై
ఆరువర్ణాల ఋతువుల కోకలను చుట్టుకొని రేయింబగళ్లు హరితాన్నీ హత్తుకొని అలరించే ప్రకృతిలో మమేకమై కనిపించని తోడై అంతటా ప్రవహిస్తూ ప్రక్షాళనం చేస్తున్నా....
పాప పరిహారం అంటూ, పుష్కరాలంటూ,
పడిపడి మునకలు వేస్తూ  
జీవ నదులను సైతం కలుషితం చేసే 
మూఢలకు ఏమితెలుసు 
 నా అంతరంగ మధనం 

జన జీవన క్రాంతిలో ఓ భాగమై
సంస్కతికి మూలమై, సంప్రదాయలకు నెలవై 
జీవ చైతన్యానికి నాదమై
జల యోగమై సాగే
నా మౌన రాగ ప్రయాణం
ఎవరికైనా తెలుసా?

 👆 నా స్వీయ రచన
  లలితా చండీ 
హైదరాబాదు 
 9885552922
18
[05/02, 4:31 am] Lalita Sister: కవిత శీర్షిక: జగన్నాథ జననం జయం జయం


అందమైన అసత్యాన్ని వడపోసి
చేదైన నిజానికై నిర్మలంగా నిలిచిన
మనసుదీపం మంగళకరమవుతుంటే,,
మది మది అంతా శివరాత్రే 

లోలోని కలుషితాలను కడిగి
అంతఃకరణాన్ని శుద్ధిచేసి
మది కార్తీకపున్నమి కళలా వెలుగువేళ,,
రేయి రేయంతా శివరాత్రే 

మదమాత్సర్యాల మరుగును ప్రక్షాళించి,
సహృదయత సమూలంగా అద్దగా
నిలువెల్లా నిర్మలత్వమే అలుముకుంటే,,
అణువు అణువంత శివరాత్రే...!

అరిషడ్వర్గాలు నాశమై
నిర్వికారుడై నడయాడినపుడు
మనిషి మనిషంతా 
సత్యం! శివం!! సుందరం..!!

లోలోన సుగుణాల వికసిత వింజామరులైతే 
సంపూర్ణ
జగత్ అంతా జటాజూటుని జననమే
19
శీర్షిక: శివ శివ యన నేల!?
రచన: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి.
అంశం: శివరాత్రి.
--------------_------------------_-----

పిలిస్తే పలుకుతాడు అమాయకులకు ఆప్తుడు
భక్తజన రంజకుడు బోళా శంకరుడు
సిరిసంపదల వ్యామోహం లేని వాడు.. పీడిత జన ప్రతినిధిగ వెలిబూది పూసుకుంటాడు
భిక్షా పాత్ర చేపడతాడు. విష సర్పాలను చేరదీస్తాడు....
గరళాన్నైనా కంఠంలో దాచుకుంటాడు.
సృష్టి కి జ్ఞాన నేత్రం ఉండాలంటాడు త్రినేత్రుడు
ఆకాశ గంగ ఉరవడిని తగ్గించి నెత్తిపై ఉంచుకొని ప్రజా శ్రేయస్సు కై భూమిపై ప్రవహింప చేస్తాడు..
దాంపత్యానికి స్త్రీ పురుషులు ఇరువురు సమాన భాగస్వాములన్న అర్ధనారీశ్వరుడు
అందని ఆ స్వర్గంలో కాక హిమ పర్వత సానువుల్లో కొలువుంటాడు
ప్రకృతి ప్రేమికుడు లలిత కళాపోషకుడు పేదల పక్షపాతి
స్త్రీ జనోధ్ధరణసామ్రాట్టు
అభ్యుదయవాది., నిస్వార్థపరుడు నిరాడంబర దేవుడు సర్వజ్ఞుడు...

మహిమాన్వితుడు... లయకారకుడు మహాదేవదేవుడు.
20
[05/02, 4:33 am] Lalita Sister: *కవితాగానం..పౌర్ణమి కవితల పోటీలకు*
తేదీ: *04-02-2023-శనివారం*
అంశము: *శివరాత్రి*
*********************
పేరు: *పొర్ల వేణుగోపాల రావు*
ఊరు: *ఎల్లారెడ్డిపేట, రాజన్నసిరిసిల్ల*
శీర్షిక: *భక్తవశంకర..నమోనమో!*
ప్రక్రియ: *పద్యము*
*********************

*(1)*
*మాఘమాసమందు మహిమాన్వితపు రోజు!*
*శంకరునిది నేడు జన్మదినము!*
*ఆది,మధ్య,యంతమనిలేనివానికి*
*అఖిలలోకములవి! హారతిచ్చె!*

*(2)*

*గౌరితోడ కలిసి కైలాసమందున*
*నటనజేతువీవు! నయన త్రయుడ!*
*నీదు కరుణగోరి నేను జాగరణము*
*చేయవచ్చె నేడు శివుని రాత్రి!*

*(3)*

*అర్చనంబుజేతు నభిషేకములుజేతు*
*నుపవసింతునయ్య నొక్కదినము!*
*రెప్పవాల్చకుండ లింగోద్భవముజూడ*
*నేను వేచియుంటి! నిజము దేవ!*

*(4)*

*జగతియందు నీవు జంగమ దేవరా!*
*పాపహరణ జేయు! భక్త పాల!*
*అమిత భక్తిని సిరి, హస్తికాళములను*
*బ్రోచినట్టి దేవ! గాచుము నను!*

*(5)*

*నీదునామములను నిత్యము భజియింతు*
*నాదు పాపములను నయము జేయ*
*చనితి గుడికి నేడు! జన్మకో శివరాత్రి!*
*కరుణజూపుమయ్య! గరళకంఠ!*
*********************
హామీపత్రము: *స్వీయరచన*
21
కవితా గానం పోటీకి...
9493273114
పేరు కొంజేటి రాధిక
ఊరు రాయదుర్గం
అంశం... శివ రాత్రి

లోక శ్రేయస్సే అభిమతంగా...
 లోక కళ్యాణార్థం హలహలాన్ని తన గళంలో దాచిన గరళ కంఠుడు ఆవిర్భవించిన లింగోద్భవమైన మాఘ కృష్ణ చతుర్దశే శివరాత్రి.. శివుడికి ప్రీతికరమైన రోజు..
 తనలో లయం చేసుకొని అన్నింటిని వ్యక్తం చేసుకునే లింగాకారంలో సర్వాంతర్యామి భక్తులను అనుగ్రహించిన రోజు... అభిషేక ప్రియుడై నిశ్చలమైన భక్తికి అనన్యమైన కోరికల వర్షం కురిపిస్తూ,
 భక్తులను అనుగ్రహిస్తూ భక్తుల హృదయాలలో కొలువైన మహాకాళేశ్వరుడు ఎన్నెన్నో మహిమలతో తనుల భక్తులను అనుగ్రహించే ఆదిదేవుడు...
బిల్వదనానికి పరవశం అయిపోతూ...
 సృష్టి స్థితి లయలను తన కన్న సన్నలలో ఉంచుకుని లోక కంటకులను తన కంటి చూపుతో శిరచ్చేదన గావిస్తూ...
 భక్తులను తన కంటిపాపలుగా చూసుకుని కనికరించే శివుడు జన్మదినమే శివరాత్రి...
బోలా శంకరుని భక్తి ప్రభత్తులతో దర్శించుకుని సేవించుకుందాం.
22
కవితాగానం 
అంశం :మహా శివరాత్రి

సీసపద్యము..

*ఆది దంపతులుగా నవతరించి దివిని*
  *శివరాత్రి పర్వమున్ భువికి నిచ్చె*
*ఆదిభిక్షుకుడుగా హాలా హలము మ్రింగి*
  *నిఖిల లోకములెల్ల నియతి జేసె*
*కైలాస గిరులందు కళ్యాణ రూపాన*
  *భక్తులన్ కరుణించి ముక్తినిచ్చె*
*పచ్చి యేనికతోలు భస్మంబుధరియించి*
  *కార్య సాధకులకున్ కలిమి నిచ్చె*

ఆట వెలది,

*శి* వ శివ హరహరుడ భవ బంధముల బాపు
*వ* రద పోష రక్ష! పాప నాశ!
*రా* జమౌళి! గిరిజ! రాజీవ నేత్రుడా!
*త్రి* తయ కంటి! హరుడ! దీన బంధు!!


కందపద్యములు,

దండమయా పరమేశ్వర
దండమయా మంజునాథ దండము హరుడా
దండమయా గౌరీ పతి
దండమయా నీలకంఠ దండము శివుడా!!

గరళము మింగిన హరుడవు
వరములు భక్తుల కొసగెడి వరదుడనీవే
కరమున శంఖము గొని మా
భరములు తొలగించు పరమ పావన దేవా!!

శిరమున చల్లని చంద్రుని
గరళము కంఠమున దాల్చె ఘనముగశివుడున్
కరమున శూలము ధరించి
నురమున రుద్రాక్షమాల నుంచెను భవుడున్!!

ఆటవెలది,
చిత్త శుద్ధి కలిగి శివపూజ చేసిన
పాప పంకిలములు పారిపోవు
భవుని నామ స్మరణ భక్తితో చేసిన
పరమ శుభములన్ని దరికి చేరు!!

*గుండ్లరాజు*
23
"కవితా గానం " (సీజన్ 3) కోసం ప్రత్యేకంగా రాసిన కవిత !

"మహా శివరాత్రి.."


మహా శివరాత్రి..
ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు అరుదెంచె పండుగ !
మహా శివరాత్రి..
ఈ రోజే లయకారుడైన విశ్వనాథుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో చెప్పబడింది ! 
జ్యోతి స్వరూపుడై న శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం మహాశివరాత్రి పుణ్య సమయం !
మహాశివుడిని బిల్వపత్రాలతో పూజించి..
పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ ..
ఉపవాసం ఉండి..
జాగరణ చేస్తే ..
పరమేశ్వరుడి అనుగ్రహం తో
సిరిసంపదలు సకల సౌఖ్యాలు సమకూరుతాయి !
పార్వతీదేవి సర్వేశ్వరునికి శివరాత్రి నాడు కళ్యాణం జరుపుతారు ..!
నాటి ఆదిదంపతుల కళ్యాణ వైభవాన్ని కనులారా వీక్షిస్తే..
మానవ జన్మ ధన్యమవుతుంది !
సదాశివుడి కరుణాకటాక్షాలతో హృదయమంతా 
ఆనందపారవశ్వమవుతుంటే..
శివనామ సంకీర్తన మే జగతిని నడిపే దివ్య మంత్రమని
చైతన్యవంతమైన మహిమాన్వితమని అర్థమవ్వగా ..
శివయ్య సన్నిదే సర్వస్వమని మనస్సు తెలుసుకుంటుంది!
భక్తి పరమాత్ముని చేరే సన్మార్గమని
అదే మానవజన్మ ని సార్థకం చేసే విధానమని గ్రహింపుకు వస్తుంది !   

                                              రచన : గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...