Skip to main content

పచ్చదనం పరిశుభ్రత


నిర్వహణ  ః వీరా గుడిపల్లి
The mathematics teacher and poet


సమన్వయం ః 
శివునూరి లలితా కృష్ణ
అవధానిః
శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః
మెరుగు మధు

*********************

పచ్చదనం పరిశుభ్రత
కవితా గానం జాబితా
*******"******
1.డా.రామక క్రిష్ణ మూర్తి గారు
2.దేశపతి మోహన్ గారు
3.పాల్వంచ హరికిషన్ గారు
4.మహేందర్ జవ్వాజి గారు
5.విజయ దుర్గ గారు
6.ఆకుల మల్లి కార్జున్ గారు
7.పెసరు లింగారెడ్డి గారు
8.వల్లాల విజయ లక్ష్మి గారు
9.వకుళ వాసు గారు
10.పాల్వంచ హరికిషన్ గారు
11కందూరి సుజాత గౌడ్ గారు
12.కాల్వ రాజయ్య గారు
13మర్రి జయశ్రీ గారు
14.సునంద వురిమిళ్ళ
15డా.పాండాల మహేశ్వర్ గారు
16.గుండ్ల రాజు గారు
17.ఇంద్రవత్ రాహుల్ గారు
18.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు
19.వేంకట కృష్ణ ప్రగడ గారు
20.పి.సతీష్ కుమార్ గారు
************
1
రచన:డా.రామక కృష్ణమూర్తి

బోయినపల్లి, సికింద్రాబాద్.

శీర్షిక: ఆకుపచ్చ సంకల్పం

తేది:3-4-2020



"పరోపకారార్థం మిదం శరీరమ్"

అని వృక్షాలు తలెత్తుకొని నిల్చున్నాయి

తరతరాలుగా తరగని సంపదని

మనకు నిర్విరామంగా అందిస్తున్నాయి

కాసింతచోటు,రవ్వంత ఊతం,

పిసరంత ప్రేమ,చాలినంత నీరు కోరుతున్నాయి

స్వార్థం లేని జీవనంతో భువిని

స్వర్గమే చేస్తున్నాయి చెట్లు

బతికినంత కాలం బరువు కాకుండా

కాలం చెల్లినా,బ్రతుకుకు ఊపిరి పోస్తున్నాయి

కన్నతల్లిలా,కల్పవృక్షంలా,కామధేనువులా

మనం కాజేసినా బ్రతికిస్తున్నాయి

ఎడారి కాకుండా,నిలువనీడలై

ధరణిని కాపాడుతున్న పునీతవుతున్నాయి

ఓ మనిషి మేలుకో!చెట్లవిలువ తెలుసుకో!

కాలుష్యపు కోరల నుండి నిను రక్షించే

వృక్షదేవతలను విరివిగా నాటు!

చేసుకోకు నీకు నీవే చేటు!

విలపింపనీయకు నీ తర్వాతి తరాలను

ప్రాణవాయువులనిచ్చి,అండగా నీకుండి

నిన్ను ఎల్లప్పటికీ కాపాడే చెట్లు

తమను కాపాడమంటున్నాయి

అమృతం నీకు ఇస్తామంటున్నాయి

విషమే నీవు చిమ్మినా,నిలువునా చీల్చినా

నీకే నా జీవితం అంకితమంటున్నాయి

షరాబులాగా ఖరీదు కడితే

నిన్ను పునాదుల నుండి పెకిలిస్తే

నీ అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటున్నాయి

మానవతనే కోరుకుంటున్నాయి

కదలిరండి-కదలిరండి

మీరంతా-మీరంతా

నాటుదాము ప్రతి ఇంటా-బయటా

బ్రతుకుదాము-బ్రతకనిద్దాము

వనభారతికి జనహారతినిద్దాము

వృక్షావళికి మనమే అండగా నిలుద్దాము

హరితహారంతో తెలంగాణకు

పచ్చలపతకం చేయిద్దాం

చేయి-చేయి కలుపుదాం

హరిత తెలంగాణ సాధిద్దాం

పచ్చనిచెట్లే ప్రగతిమెట్లు

అవే బంగారుతెలంగాణకు చిరునామాలు

2

మోహన్ శర్మ టీచర్ మెదక్

సాహిత్య ప్రక్రియ: మణిపూసలు 

శీర్షిక :మన శుభ్రత..మనదేశానికిభద్రత 


*మన ఇంటికి పచ్చదనం*

*మన ఒంటికి వెచ్చదనం*

*ఉంటేనే మనమంతా*

*చేస్తాము సుఖ జీవనం* (1)🌳🌲👌👌


*పెరిగే పచ్చని చెట్లు*

*కురిసే వానకు జట్లు*

*ఒకదాని కొకటి తోడై*

*తొలగించును ఇక్కట్లు* (2)🌳🌳🌧️🌧️


*పరిశుభ్రత గల ఇళ్ళు*

*ఆరోగ్యపు లోగిళ్ళు*

*పచ్చదనం తోడైతే*

*తిప్పు కోవు నీ కళ్ళు* (3)🌳🌳🏘️🌳🌳


*తడి చెత్త వేరు చేద్దాం*

*పొడి చెత్త వేరు చేద్దాం*

*చెత్తబుట్టలు వాడుతూ*

*కొత్త రీతి నేరుద్దాం* (4)🚮✔️


*ఆ చెత్తాచెదారం*

*దోమలకిక స్థావరం*

*తొలగించక ఉంచితే*

*తప్పదు నీకిక.. జ్వరం* (5)🦟🦟🤒


*శుద్ధమైన తాగునీరు*

*పరిశుద్ధికి మారుపేరు*

*ఆ నీరు తాగితేనే*

*ఆరోగ్యమే దరిచేరు* (6)🥛🚰


*అవతలికి మలవిసర్జన*

*అసాంఘిక పనికి సూచన*

*అగౌరవానికి ..వ్యాధికి*

*అదే చెడుకు ఆవాహన* (7)✌️👣


*రహదారుల విస్తరణకు*

*చెట్లను మొత్తం నరకకు*

*నీ సుఖప్రయాణానికి*

*వాటిని సమాధి చేయకు* (8)🌳🛣️🌳


*మంచినీరు మేలు చేయు*

*మురికి నీరు కీడు చేయు*

*నదులలో, చెరువులలో*

*చెత్త తీసి బాగు చేయు* (9)🌊🌊


*మనం చేయు పరిశుభ్రత*

*కుటుంబానికది భద్రత*

*పరిసరాల పరిరక్షణ*

*ప్రతి ఒక్కరికి.. బాధ్యత* (10)👨‍👩‍👧‍👧🙌


*పచ్చదనం రక్షిద్దాం*

*పరిశుభ్రత పాటిద్దాం*

*గాంధీ ఆశయమైనా*

*స్వచ్ఛ భారత్ ను..చూద్దాం* (11) 🇮🇳🤓

3. చెత్తబుట్ట(గేయ కవిత ) 

తేది: 03/04/2020


చెత్త బుట్ట చెత్తబుట్ట మూలనుంటవూ.. 

మూలనుంటవూ.. 

చెత్తనంత పొట్టలోన దాచుకుంటవూ.. దాచుకుంటవూ.. 

చెత్తనంతా పొట్టలొనా.. చెత్తనంతా పొట్టలొనా.. 

చెత్తనంతా పొట్టలొనా దాచుకుంటవూ.. దాచుకుంటవూ.. 

చుట్టు పక్కల శుభ్రంగా ఉండాలంటవూ.. శుభ్రంగుండాలంటవూ.. 

బడిలోనా పిల్లలకు దోస్తుగుంటవూ.. మంచి దోస్తుగుంటవూ.. 

బడిలోనా పిల్లలకు.. బడిలోనా పిల్లలకు.. 

బడిలోనా పిల్లలకు దోస్తుగుంటవూ.. మంచి దోస్తుగుంటవూ.. 

కాగితాలు చింపి చెత్త చేసినప్పుడూ.. చేసినప్పుడూ..

పెన్సిళ్ళూ చెక్కి పొట్టు వేసినప్పుడూ.. 

పొట్టు వేసినప్పుడూ.. 

నేనున్నానంటు నువ్వు గుర్తు చేస్తవూ.. గుర్తు చేస్తవూ.. 

తరగతి గది శుభ్రంగా ఉంచమంటవూ.. ఉంచమంటవూ.. 

తరగతి గది శుభ్రంగా.. తరగతి గది శుభ్రంగా.. 

తరగతి గది శుభ్రంగా ఉంచమంటవూ.. ఉంచమంటవూ.. 

మధ్యాహ్న భోజనం తింటున్నప్పుడూ... తింటున్నప్పుడూ.. 

మెతుకులు ఎంగిళ్ళు నీలొ వేయమంటవూ..  వేయమంటవూ.. 

పరిసరాలు పరిశుభ్రంగుంచమంటవూ.. శుభ్రంగుంచమంటవూ.. 

బడినీ  మమ ఇంటిలెక్క చూడాలంటవూ.. ఉంచమంటవూ.. 

బడినీ వన ఇంటిలెక్క.. బడినీఱవన ఇంటిలెక్క.. 

బడినీ మన ఇంటిలెక్క ఉంచమంటవూ.. ఉంచమంటవూ.. 

ఆరోగ్యమే మహా భాగ్యమంటవూ.. మహా భాగ్యమంటవూ.. 

స్వఛ్ఛ భారత్ లొ ముందు ఉండాలంటవూ.. 

ముందు ఉండాలంటవూ.. 

స్వఛ్ఛ తెలంగాణ ఘనత చాటమంటవూ.. 

స్వఛ్ఛ తెలంగాణ ఘనత, స్వఛ్ఛ తెలంగాణ ఘనత..  

స్వఛ్ఛ తెలంగాణ ఘనత చాటమంటవూ... 

       -  పాల్వంచ హరికిషన్, 

           రామన్నపేట 

            9502451780

4

  పచ్చ దనం

పేరు. మహేందర్ జవ్వాజి


చెట్టమ్మ అలసి నీ చెంతచేరి 

ఆదమరిస్తే పూలపాన్పువలె చేరదీసి కన్న తల్లిగా చూసెవూ


నాటి అశోకుని కాలం నుండి నేటి సర్కారు దాక నీచరితెంతో ఘనమాయె నీవె మానవాళికి సకలమాయే


తల్లి నీవు లేకుంటె.సర్వంశూన్యం అదె నీ ఎదుగుదల మాకిచ్చె మోక్షఫలదాయం


ఇంటికో చెట్టు.. మానవ సమాజానికదే తొలి మెట్టు

చేయీచేయి కలుపుదాం మెక్కల పెంచుటలో భాగమౌదాం...

5

విజయ దుర్గ

పచ్చదనం పరిశుభ్రత

కవితా సంఖ్య: 02

తేదీ: 03/04/20


మానవ జీవన సహచర్యంలో

అల్లుకున్న తీగలు

అవిలేని బతుకు బాట

అమాస కొమ్మకు పూల విరుపు....!!


మనః పరిశుభ్రత

దేహాత్మకు తేజస్సును వెలిగించు

అద్భుత ప్రక్రియ

సంసార సరిగమలలో హరిత వర్ణము

అపురూప దృశ్యము....!!


తరువులు మానవుల వరాలు

ప్రాణవాయువుల గనులు

సకాల వర్షాలకు ,ఋతుగమనాలకు

ఆహ్వానాలు....!!


పరిశుభ్రత జీవకోటి ఆరోగ్య

సూత్రం

అదిలేని క్షణం సర్వరోగాల మయం

మనకు మనమే అందుకోవల్సిన

స్వీయచరిత్ర....!!


పచ్చదనం పరిశుభ్రత విరాజిల్లిన

దేశం మేదైనా

ఉన్నత స్థితిలో వెలుగు మహోన్నతమై

ఎవరికి వారు అడుగేసే మౌనయుద్దం....!!


                              వినీల

6

పచ్చదనం పండుగ కొనితెస్తుంది

పరిశుభ్రత జీవితాలకు

ఆయువులందిస్తుంది


కాలుష్యంకబలిస్తున్న వేళ

పచ్చనిప్రకృతి సంజీవనిగాద

వేడిపెరిగి గతులువిషమిస్తున్నవేళ

చెట్టుచేమలె విరుగుడుగాద

ఆరోగ్యాలు ఆనందాలు

అందించే దేవతలు

స్వచ్ఛమైనప్రాణవాయును

మేఘాలను రప్పించి

వర్షాలను కురిపించేటి

కల్పతరువులు

మానవజీవితాలకు మహోన్నత

సందేశమిచ్చేటి గురువులు

కరువుకాటకాలను

రోగాలను కష్టాలనుకన్నీళ్ళను

స్వార్ధాలమైకముకమ్ముకొని

కొనితెచ్చుకున్నదుష్ఫలితాలు

వనసంరక్షణ జనసంరక్షణ

వనదేవతల సేవించే వ్రతం

సర్వమానవాళికి కావాలి

సంక్షేమ సూత్రం


రచన ఆకుల మల్లికార్జున్

 షాద్ నగర్

  7207256204

7

[03/04, 9:28 PM] Pesaru: అంశం:-*పచ్చదనం-పరిశుభ్రత*

శీర్షిక:-*హరిత నానీలు*

1.

చెట్టు తల్లిని

పెంచితే అమృతం

పరిశ్రమలు

పంచేది విషం.!

2.

మురుగు నీరు

నిలువని ప్రాంతం

క్రిమి కీటకాలుండని

స్వర్గ ధామం.!

3.

ఎండిన చెత్తను

వేరు చెయ్యి

తడిసిన చెత్తతో

ఎరువును చెయ్యి.!

4.

ప్లాస్టిక్ సంచులు

పక్కకు పెట్టు..

నేత సంచులు

చేతిన పట్టు.!

5.

ప్లాస్టిక్ భూతం

పట్టుకుందా..

పర్యావరణమంతా

ఇక గోవిందా.!

6.

పత్ర హరితం

ప్రాణ భరితం..

శక్తికి మూలము

విశ్వవ్యాప్తం.!

7.

యువత తలిస్తే

నవ భారతం..

అవుతుంది పచ్చని

వృక్ష భారతం.!

8.

చెట్టూ చేమ

పచ్చగుంటెనే..

చేనూ చెలక

మెత్తవడుతయి.!

9.

ధూమపాన ప్రియుల

శాపం..

చెట్లు లేకపోతే అంతే

యమపాశం.!

10.

చెట్టుకు నాలుగు చుక్కల

నీళ్లు పోస్తే..

నాలుగు కాలాలు

జీవం పోస్తుంది.!

11.

పత్రహరితం పంచు

హరిత హారం..

అదే కదా మనకు

ఆధారం.!

12.

మొక్క నాటడం

గొప్ప కాదు..

చెట్టును చేయడం

తప్పని సరి.!

13.

తరువులకు 

చేసిన చేటు..

మానవులకు

తప్పదు వేటు.!

14.

జీవుల మనుగడే

వైవిధ్యం..

అందుకు అరణ్యమే

శరణ్యం.!

15.

కళ్లకిస్తుంది హరితం

కారుణ్యం.. 

కనుక కాపాడుదాం

అరణ్యం.!

16.

కాలుష్యంతో

కష్టపడితే ఓజోన్.,

సరిపోను

అందదు ఆక్సీజన్.!

     —————

...పెసరు లింగారెడ్డి

8

[04/04, 8:09 PM] విజయ లక్ష్మి యాదాద్రి: అంశం::**పచ్చదనం*

శీర్షిక::*పచ్చనాకుల సాక్షిగా*

----------**********--------------


చిగురాకు మువ్వలా

 మ్రోగితే చైత్రం

పచ్చిదివ్వె చిరునవ్వులు

 రువ్వితే చైతన్యం

 

అవనికి అందం హరితవర్ణం

ప్రకృతికి ప్రాణం పచ్చదనం

పచ్చ*ధనం* అంటేనే పచ్చనాకు తోరణం

వృక్షసేన లేకున్న తప్పదు కాలుష్య0తో రణం


ప్రకృతిమాత మేనికి శోభనిచ్చే

వస్త్రాలు అలంకరణలు అన్నీ

ఆకుపచ్చని అందాల మొక్కలే

సకల జీవాధారాలు తరువులే


పచ్చనాకుల సాక్షిగా

దీక్ష బూనుదాం గట్టిగా

హరితహారాలను తెంచము

ధరణిమాతను దోచుకోము*అని


పచ్చనాకుల సాక్షిగా 

బాస చేద్దాం నిజాయితీగా

ప్రకృతికాంత మోమున

పచ్చబొట్టు చెరపము*అని


పచ్చనాకుల సాక్షిగా

ఒట్టు పెట్టుకుందాం మనస్ఫూర్తిగా

పచ్చదనాన్ని పెంచుతామని

భావితరాలకు భవితనందిస్తామని


పచ్చనాకుల సాక్షిగా

ప్రతిన బూనుదాం ఐక్యంగా

పచ్చనిదివ్వెల రక్షిస్తామని

చల్లగాలుల వెలుగులనందిస్తామని


పచ్చనాకుల సాక్షిగా 

కోరుకుందాం ఎల్లవేళలా

హరితం పెరిగి ప్రళయం తొలగాలని

ప్రకృతి చిరునవ్వులతో మురియాలని


పచ్చనాకుల సాక్షిగా 

కంకణాలు కట్టుకుందాం ప్రియంగా

భూగోళం వెచ్చబడటాన్ని తగ్గిస్తామని

అన్నిజీవుల మనుగడకూ సహకరిస్తామని


పచ్చనాకుల సాక్షిగా

కోరుకుందాం యుగాలకయినా

మనుషులు వసుధ ఒడిలోన ఒదిగి

చల్లగాలుల సుధలాస్వాదిస్తారని


::వల్లాల విజయలక్ష్మి,,సిల్క్ నగర్

ఆలేరు,,యాదాద్రి భువనగిరి జిల్లా

9

శీర్షిక-🍃🌹 హరితహారం 🌹🍃


నా ప్రయాణంలో నెచ్చెలులై రోజూ పలకరించేవి ఆ చెట్టుపూలు... 

అవి నా మనసుకు వరం లాంటి నేస్తాలు... 


నన్ను చూడగానే మొగ్గలుగా వున్నవి అమాంతం...

పువ్వులుగా విరగబూసి నా పెదాలపై చేరి నానవ్వులుగా మారేవి... 


ఏదో కలతతో నా ముఖం ఓరోజెప్పుడైనా కనపడితే అవి నావైపు వంగి ఓదార్పునిచ్చేవి... 


ఏదో తెలియని ఆనందంతో నాముఖారవిందం కనపడితే అవి విప్పారి తమ పరిమళాలతో నన్ను చుట్టేసేవి... 


ఓరోజు... రోజు మాదిరిగా నే వెళ్తున్నా... 

ఆ చెట్టు రోడ్డు వెడల్పులో భాగంగా నేలకొరిగి ఆపూలు దీనంగా చూస్తున్నాయి... 


నాకళ్ళల్లో చెమ్మ చూసి నాతో అన్నవి... 

ఓ నేస్తం... ఇక్కడ వాడినా నీవు తిరుగాడే దారిలో మళ్ళీ చిగురించిన చెట్టుకు విరగబూస్తా అని... 


అప్పుడు మళ్ళీ నీ కళ్ళల్లో మెరిసి నీ నవ్వునై విరగబూసి నీ మదిని నా స్నేహ పరిమళాలతో నింపుతానంటూ కన్నుమూసాయి... 


నే తిరుగాడే దారిలో రోజూ వెతుకుతున్నా...

ఓరోజు నాకళ్ళు మెరిసాయి ఆనందంతో... 

నానేస్తాలు నానవ్వులలో మళ్ళీ విరగబూసాయి... 


హరితహారంలో భాగంగా నాటిన చెట్లతో.... 

మళ్ళీ నాకళ్ళముందుకొచ్చాయి... 

ఇక ఎన్నడూ వీడనని మాస్నేహం సాక్షిగా మాటిచ్చాయి ....


🍀🌹 వకుళవాసు 🌹🍀

10

అంశం: పచ్చదనం  

శీర్షిక: తరువులతో...! 


     తరువులతో....!


ప్రతీ నీటి బొట్టు అవదా అమూల్యం

ప్రాణుల మనుగడకు అది అమృత తుల్యం 

అవని అంతరాళం నీటి జాడ మృగ్యం 

భువని అంతరంగం చేసే ఆహాకారం 

కాలుష్యపు కోరల్లో చిక్కే జీవుల ప్రాణం

మనుజుల చేతలే ధరణికి శిరఃచేదనం 

పుడమి కడుపున నీటీ ఆవిరికీ కారణం 

అటవీ సంపద ధరిత్రి పైన అంతరించడం 

జీవన ఆస్థిగ నీటిని పెంచుకుంటె భవిత ఘనం 

లేదంటే జీవకోటి మనుగడ అతలాకుతలం 

సక్రమంగ జలచక్రం నిలుపుకుంటె కలకాలం 

భూ గర్భం నిండదా జలసిరితో తలాతలం 

చేయాలి దీనికై జనులందరు నిరంతరం 

మొక్కలు నాటే యజ్ఞం.. అదే హరిత హారం!  

అటవీ సంపద పెంపుకు అదే పరిష్కారం !! 

నాకెందుకులే అనుకోకుండా అందరం 

మొక్కలెన్నో నాటి పెంచితెనే ఈ తరం 

తరువులతో నిండి పచ్చగుండదా భావితరం 

తెలంగాణ నేల మురిసి పోదా తరం తరం! 

బంగారు తెలంగాణకదియే ఒక నిదర్శనం!!  


             -- పాల్వంచ హరికిషన్

                 రామన్నపేట

                 9502451780

[04/04, 8:31 PM] Merugu Madhu Sir: పచ్చదనం పరిశుభ్రత 

11

అంశం.. 


మనిషి జననం నుండి మరణం వరకు అవిబాజ్యంగా అల్లుకుపోయిన సత్యం


శ్వాస,జీవనం ,నడక, నడత

నేర్పిన ప్రక్ర్రతి దానిలోని అణువణువుల సమ్మేళనమే 

మానవనాగరికత


పర్యావరణం నేర్పితేనే 

మనిషి మహర్షీ కాగలిగాడు.. 

ఇప్పుడు దానిపై ద్వంసరచనకు 

నాంది పలికి

తన అస్దిత్వానికే ప్రమాదం తెచ్చుకుంటున్నాడు.


పరిశుభ్రత కూడా మానవునికి నేర్పింది ప్రక్ర్రతి యే

అవునన్నా, కాదన్నా 


ప్రక్ర్రతి యే సకల శాస్త్రాలు 

ప్రక్ర్రతి యే సకల విద్య

ప్రక్ర్రతి యే జీవదారం

ప్రక్ర్రతి లో బాగమే మనిషి


మరవకు 

చేరపకు 

సహజీవనమే 

నీకు శరణ్యం

11

 కందూరి సుజాత Poetess: 

🌷 పచ్చదనం -పరిశుబ్రత 🌷

           వచన కవిత 

..............  ...............  ..............

మౌనాక్షర తపోనిధీ,సిరుల కల్పతరువు !

పవన వీచికల నృత్యించు తరులు !

రమణీయ భంగిమల శిల్పతరులు !

మది మీటి వేదన తీర్చు -

మహోన్నత పచ్చలహార ప్రకృతీ/


మహావటవృక్ష దిగ్గజాలు -

వయ్యారి లతలు !

ఫల పళహారములు,పూలహారములూ /

కలప పంద్దిల్లు ,పత్ర పవిత్రములు /

సృష్టి  నవజీవ లొకం ,సుందర వనం /

మాను లేని భువి,ఊహకందని ఉన్మాదం/


విశ్వ జనని  ,విశాల జీవని సంజీవిని /

వాయువును వడకట్టి ,శ్వాసనిలుపు -

సర్వదా ప్రాణదాత /

వృక్షరాజసమా అణువణువు -

పరమౌషధము /

పక్షుల రక్షణ గృహము ,ప్రాణుల తక్షణ -

శీతల గ్రహము /

ముత్యపు చినుకుల మూలాధారము -

మా కల్పతరువు /


పచ్చని కాంతుల ,నిశ్చల స్థితిలో -

అంకుర  స్థాయినే ,సేవా కంకణ దీక్షా /

పత్రం, ఫలం, పుష్పం పవిత్ర దానం /

బెరడు,మోడు కరుణా త్యాగం /

వేరు ,నారు కర్పూర త్యాగం /

మనసున్న పచ్చదనం విసుగెరుగని -

సృష్టి తావి /


నింగి,నేల ,నీరులో స్తావరం /

ప్రళయాలకు ధీటుగా ప్రస్థానం/

దైవశక్తి ప్రదాత ,దేవతా సంభోధిని /

మహ పూజలందుకొను -

మహా మాన్యా పచ్చదన పొదరిల్లు /

చిన్నవిత్తులో మహాశక్తి దాచి -

వంశాభివృద్ధికి సాగనంపు -

సంపూర్ణ సంస్కర్తలూ తరులు/


కర్మాగారపు విషద్రవములను -

జలముల వదలకు /

వడలిన వనముల నిప్పును చేర్చకు/

కణిక రసాయనాలు భువిన పేర్చకు /

ఆవిష్కరించిన విషవాయువులు -

అవనిలో పరచకు /

పచ్చదనం -పరిశుభ్రత -

మానవ మనుగడ మంత్రం/


కందూరి సుజాత గౌడ్ 

రాజంద్రనగర్ ,హైదరబాద్ 

9392162822

12

Kalva Rajaiah: 

శీర్షిక  :పచ్చదనం పరిశుభ్రత 

పచ్చదనం 


    1 ఆటవెలది 

 అడవి నరికినమనకాదెరు బోవును

అటవి జీవులన్ని యాగ

 మవును

మొక్క నాటి నీవు మోదంబుజూపిన 

పచ్చనైన చెట్టు ప్రగతి జూపు

2ఆ: 

చెడ్డ గాలి నంత చేరదీసుకొనియు

ప్రాణ వాయువిచ్చు పచ్చ తరువు

చెట్టు లేక జగతి చెడిపోవుగావున 

మనిషి పెంచవలెను మహిన చెట్టు

3ఆ 

హరితహారమనెడి హర్షించె పథకము 

అవని పైన నెంతొ నవత దెచ్చి 

చెట్టు గొప్పదనము చెప్పెనే విప్పియు 

మొక్కనాటు నీవు ముదము తోడ 


పరిశుభ్రత 🧹

4 ఆ  వే 

చుట్టువున్న చెత్త పట్టి యేర  వలెను 

మురికి గుంటలన్ని మూసివేసి 

ఈగ దోమలన్ని నిడువక జంపుము 

సూక్ష్మ క్రీములన్ని శుద్ధి జేయు 

5

తేటగీతి 

మలవిసర్జన బయట మానవలెను 

కట్ట వలెను మరుగు దొడ్డి కలత లేక 

కాళ్ళు చేతులు సబ్బుతో కడగ వలెను 

పారిశుధ్యము రోగాల పారదోలు 

కాల్వ రాజయ్య

13
మర్రి జయశ్రీ
అంశం.పచ్చదనం పరిశుభ్రత

అభివృద్ధిపేరిట అడవులను అంతం చేసి
నాగరికత పేరిట నాయవంచనతో
పర్యావరణాన్ని కాటేసి
పంచభూతాలను నీ గుప్పిట్లో బంధించినా
మౌనిలా ఉండిపోయింది
అధరించే అమ్మ ప్రకృతి
వాహనాల పొగలతో
పరిశ్రమల,ప్లాస్టిక్ లాంటి
విష రసాయనాలతో
కలుషితమవుతుంటే
నీకు నువ్వే భస్మాసురుడివై
నాశనం అవుతూ
పచ్చదనాన్ని పరిహాసం చేసినా
నీలో మార్పుకై హెచ్చరించినా
డాలర్ల మోజులో
మానవతా విలువలు కోల్పోయిన నీపై
ప్రకృతి చూపించే ప్రకోపం
ఈ వింత వైరసుల రూపం
ఇప్పటికైనా తెలుసుకో
పచ్చని చెట్లు ప్రాణదాతలని
పరోపకారం అందించే త్యాగమూర్తులని
పచ్చని తరువులే నీ
ప్రగతికి వెన్నముకలని
వర్షాలన్ని ఆహ్వానించి
భూగర్భజలాలు పెంచేవని
అందమైన ప్రకృతే అవనికి ఆకృతియని
పరిసరాల పరిశుభ్రతే
నీ నిండైన ఆరోగ్యమని
పచ్చదనం పరిశుభ్రతలే నీ రక్షణ వలయాలని తెలుసుకో
నీ ఆపద నువ్వే కొనితెచ్చుకోకుండా
భావితరలకు భరోసానిస్తూ
పర్యావరణరక్షణకై
పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా
ప్రగతిని సాధించు.
14

పేరు::వురిమళ్ల సునంద, ఖమ్మం
శీర్షిక:: పచ్చదనం -పరిశుభ్రత
------------------------------------
పెదవుల మీద విరిసే చిరునవ్వూ ప్లాస్టిక్కే..
ఇంటినిండా కనిపించే పచ్చదనపు మెరుపులన్నీ
అందమైన అలంకారాలతో
కుండీల్లో వాడిపోని ప్లాస్టిక్ సోయగాలే...
అడుగు బయటపెడితే
ఆయుష్షు పెంచే అమ్మ తరువులు లేని ఎడారుల రహదారులే...
వాహనాల రణగొణ ధ్వని కాలుష్యంతో
వ్యర్థ వాయువులను మోస్తున్న గాలి
ఊపిరి తిత్తుల్లో చేరి చేస్తున్న హానీ..

పచ్చదనం కరువైన బతుకుల్లో..
ప్రాణ హాని కలిగించే రోగాల గండాలు
దడపుట్టిస్తున్నా..
ఇల్లూ వాకిలితో పాటు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే
విజ్ఞత మరిచిన మానవులపై దండెత్తడానికి సిద్ధమైన  రోగ కారకాల వైరస్ లు దాడి..

అందుకే పసిబిడ్డలా  ఇంటికో మొక్కను  పెంచి
పరిసరాల పరిశుభ్రత ధ్యేయంగా
గాంధీజీ మాటలు నిజం చేస్తే
స్వచ్చ్ భారత్ ను కళ్ళు చూస్తాం
పచ్చదనంతో కళకళలాడుతాం

15
*పచ్చదనం పరిశుభ్రత*
***అవనిమురిపెం***
-- --  --   ---   --   --✍️డా.పాండాల.

ఆకురాలువిధము
అదిఏమి? మదినెంచి
చెట్టు నీడకెళ్ళి స్నేహమెంచి!
కాండకొమ్మలన్ని కాంతిగాతిలకిస్తె!
పండుటాకురాలె పరగనేడ్చి!

తరువునుండి విడుతు
తల్లడిల్లుచుతాను
వంకలెన్నొతిర్గి వన్నె తగ్గి!
గళగళగను తాను వలపోసినట్లుగా
ఆర్తి వెల్లబోస్తు అవని రాలె!

చెట్టు తాను జూసి చేవగా భూమిలో
లీనమయ్యె ఋతువు లీల యంటు!
అమ్మనొదలి యాకు అమ్మమ్మలోఒద్గి
భాగ్యమయ్యెబతుకు బాధ్యతనుచు!

చిగురుటాకుసౌరు చిరకాలముండదు
వగరుపొగరు ఎవరి వాసికాదు!
కాలమార్పుతీర్పు కర్తవ్యమునునేర్పు
ఎంతవారికైన విధియురాత!

మంచుబిందువులకు
మౌనంగ తాముర్సి
పూతపూస్తు కాయ పులకరిస్తు!
మనుజశక్తియుక్తి మానుముచ్చెట్లాడ!
హరితహారమునకు అవనిమురిసె!

పచ్చదనము సోకు పరిశుభ్రతేమేలు
సర్వజీవులకును శాంతి గూర్చు!
అవనిజములు పంచు
ఆయురారోగ్యంబు!
విశ్వశ్రేయమనుచు విన్నవింతు!

✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
16
కవితా శీర్షిక: *పచ్చదనం-పరిశుభ్రత*

ఆకాశ హార్మ్యాలను
కాంక్రీటు అరణ్యాలను
దూరాలను కలిపే రహదారులను
నిర్మాణం గావించి
అభివృద్ధియని ఆనందిస్తున్నవ్..

నీటిని, గాలిని,
అగ్గిని, ఆకాశాన్ని,
వసుధను వంచన చేసి
విధ్వంస రచనకు శ్రీకారం చుట్టి
ఆధునిక మానవుడనని
విర్రవీగుతున్నవ్...

ప్రపంచమంతా ఒకటేనని
గ్లోబలైజేషన్ పేరిట
డాలర్ల పంటకోసం
మనుషులనొక్కటి చేసి
సాగుచేస్తున్నవ్

మమతానుబంధాలను తుంచి
మనసులను రసాయనిక ఎరువుల్లో ముంచుతూ
మారీచుని వలె బంగారు లేడి
భ్రమను కలిగించి
జబ్బలు చరుస్తున్నవ్...

ఓ మనీషి
నీవు చేసే వికృత కృత్యాలకు
ప్రకృతి ప్రకోపించింది
పరిశుభ్రత వికటించింది

ఓ మానవా *నవ* నాగరికతకు
నాందీ వాచకంపలికి
పాంచజన్యం పూరించు
సమస్త ప్రాణికోటికి ప్రాణాధారమైన
ప్రకృతితో ఆనందించు
ప్రకృతిలో జీవించు
ప్రతిప్రాణిని ప్రేమించు
అప్పుడే విరగబూస్తుంది
మానవ మనసులలో
*పచ్చదనం - పరిశుభ్రత*

*🌹🌹🌹గుండ్లరాజు🌹🌹🌹*
17*కవిత గానం*
*అంశం*: పచ్చదనం-పరిశుభ్రత
23/04/2020


ఇంట్లో ప్లాస్టిక్ బూతము
బయట పరిశుభ్రత లేదు
ఈ ధరణిలో మొత్తం ప్లాస్టిక్ మాయ జాలం..
ఈ నెలలో గాలి కలుషితం
ఈ నెలలో నీరు కలుషితం
ఈ నెలలో భూమి కలుషితం
ఈ నెలలో కాలుష్యం కలుషితం
మానవులు తినేది రసాయనము కలిసినా ఆహారం..
ఆనాడు మోడీ చెప్పిన మాటలు పాటిస్తే మనకు ఈ గతి వచ్చేది కాదు..
అందరు పరిశుభ్రత పాటించి
మొక్కలు నాటి మన ప్రకృతినీ మనం కాపాడుకుందాం..


*ఇంద్రవత్ రాహుల్*
     *ఇందూర్*   *9848054079*..

18
చైత్ర పౌర్ణమిపోటీ కొరకు కవితా గానం
డా.బల్లూరి ఉమాదేవి
 పచ్చదనం పరిశుభ్రత

ఆ.వె: చెట్లు నాటుచుండ చేదోడు నీకగు
నీరు పోసి పెంచ నీడ నొసగు
పండ్లు పూల తోడ పరిఢవిల్లుచు నుండి
హరిత హారమగును తరుల పూలు

2.ఆ.వె:మొక్క నొకటి నాటు మురిపెముతో పెంచు
నీడ నొసగి నీకు తోడు నగును
మూలమందు నీరు ముదముతో పోయంగ
తలను వంచి యొసగు ఫలము నీకు.

3.ఆ.వె:పచ్చనైన చెట్లు బాటకిరుగడల
             నాటుమయ్య పుత్ర నీటుగాను
             బాటసారులకది బాసటగా నుండి
              హరితమయము లగుచు హర్షమొసగు.

4.ఆ.వె:తరువు నొకటి నాటు తరతరములకును
         బతుకు తెరువు చూపి బాధ తీర్చు
          పచ్చనైన చెట్టు పసిడి కాంతుల తోడ
        పరవశింప జేసి ఫలము లొసగు.


5.ఆ.వె:పచ్చనైన చెట్లు భారతావనికొసగు
             నంతులేని సిరుల ననవరతము
            అగ్రదేశములకు నాదర్శ మగునట్లు
            పెంచవయ్య తరులు ప్రీతి తోడ
19.
వేంకట కృష్ణ ప్రగడ
విశాఖపట్నం
05.04.2020
అంశం : " పచ్చదనం పరిశుభ్రత "

శీర్షిక : మేం కవలలం మేము జంట కవులం

పచ్చదనం పరిశుభ్రత
మేమిద్దరం కవలలం
మేము జంట కవులం

ఈశ్వరుడు ఊపిరి
ఆయువును ఊపిరులుగ నిర్ణయించి
ఆయుర్ధాయం నిర్దేశించేది రుద్రుడు

మరి ఆ ఊపిరులు వచ్చేదెలా ... !
ఆకుల పత్రహరితం
సూర్యరశ్మి సాక్షిగా ఇచ్చే ప్రాణవాయువు
అవే మీ ఊపిరులు

అంటే పచ్చదనమనే
నేనే పరమేశ్వరుడు
అదీ ఈ పచ్చదనం గొప్పతనం

అంతెందుకు
కనులు మెచ్చేది నచ్చేది మురిసేది
శిశిరం చూసి కాదు రుధిరాన్నీ కాదు
వసంతాన్ని చూసి పచ్చదనాన్ని చూసి
ఆ కోకిల కూసేదీ కొత్త చిగురులు చూసే

పచ్చదనం
అంచులు చూసి సంతసించి
మేఘాలు
మబ్బులు మెరుపులతో కలిసి
వర్షపు చినుకులై వానయై వరదయై
పరిసరాల పరిశుభ్రతకు తన వంతుగా

వ్యర్ధాలను సరియైన స్థానం
మురికి కాలువలు మూసే ప్రయత్నం
అదే కదా పరిశుభ్రం
వ్యర్థాలు కదా అంటువ్యాధుల అడ్డా
ఇంకా
వృక్షో రక్షతి రక్షితః రక్షించడమే కాదు
కొత్త మొక్కల్నీ నాటాలి నీరిచ్చి పెంచాలి

పచ్చదనం పండుగ , పరిశుభ్రత బతుకు
పచ్చదనం ఉన్నచోటు పరిశుభ్రతకు కోట
పచ్చదనం పరిశుభ్రత మీ కోసం మేము
మేం కవలలం మేము జంట కవులం ...

                         ... ✍ "కృష్ణ"  కలం
20.

అంశం: పచ్చదనం-పరిశుభ్రత
*************************
పచ్చదనంతో ప్రకృతి పరిఢవిల్లితేనే
పుడమిపై జీవవైవిధ్యం కొనసాగేది
పచ్చదనం-పరిశుభ్రత ఉంటేనే
మానవాళి సుభిక్షంగా ఉండేది

పచ్చదనం కనుమరుగవుతున్నది
పర్యావరణ కాలుష్యముతో,
పెరుగుతున్న జనాభాతో
పచ్చని అడవులు తగ్గి
కర్భన ఉద్గారాలు పెరుగుతున్నవి
వాయు కాలుష్యము వల్ల
ప్రాణవాయువు
ప్రాణం లేని వాయువయి
జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నవి

రేపటి తరం ప్రశ్నిస్తున్నది
పచ్చదనం పరిశుభ్రత లేమివల్ల
వారి భవిష్యత్తు, ఆశలు
శిదిలమవుతున్నాయని
జీవవైవిధ్యం నశిస్తుందని

నేటితరం మనుషులకు
పర్యావరణం గురించి పట్టింపులేదు
స్వార్థ సంకుచిత భావాలతో
కులాల మతాల ప్రాంతాలమద్య
విద్వేషపూరిత వాతావరణంలో
ధనార్జనే ధ్యేయంగా
జీవితాన్ని కొనసాగిస్తున్నారు

ప్రకృతిని పరిరక్షించుకుంటేనే
ప్రాణికోటికి మనుగడ
ప్రకృతి కోపానికి ఆనవాళ్లు
సునామీలు భూకంపాలు
వైరస్ దాడులు
పచ్చదనంతో ప్రాణికోటి
పదికాలాలపాటు జీవించాలంటే మొక్కలు నాటడం,చెట్లను పెంచడం
సామాజిక ఉద్యమంలాసాగాలి
పరిశుభ్రత మన సంస్కృతికావాలి

నేటి మానవాళి గ్రహించాలి
పచ్చనినోట్లు కాదు
పచ్చని చెట్లు ప్రాణికోటికి
ప్రాణవాయువునిస్తాయని
వర్షాలు కురిపించి పండ్లు
ఆహారం ఔషధాలనిస్తాయని
పర్యావరణం సమతుల్యంచేస్తూ
పచ్చదనం-పరిశుభ్రతను
కాపాడుతున్నాయని

పచ్చదనం నిరంతరం
కాపాడుకోవలసిన
మూలధనం అని
పరిశుభ్రత ఉంటేనే
మానవాళికి ఆరోగ్య ప్రదమయిన భవిత అని.

----- పి. సతీశ్ కుమార్


Comments

Post a Comment

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...