సమూహ నిర్వహణ ః
వీరా గుడిపల్లి ః the mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు
****************************
కవితాగానం సమూహంలో
పద్యానువాదం లభించిన కవిమిత్రుల జాబితా
21--40
*21.శ్రీ దండమూడి శ్రీచరణ్ గారు*
14.04.2020
*22.వకుళవాసు గారు*
15.04.2020
*23.మేడిశ్రీ గారు*
16.04.2020
*24.తేజస్విని గారు*
17.04.2020
*25.తగిరంచనరసింహారెడ్డి గారు*
18.04.2020
*26.స్వర్ణ సమతగారు*
19.04.2020
*27.వురిమళ్ళ. సునంద గారు*
20.04.2020
*28.తేజస్విని గారు*
21.04.2020
*29.డాక్టర్. దీపక్ న్యాతి గారు*
22.04.2020
*30.మర్రి జయశ్రీ గారు*
23.04.2020
*31.డాక్టర్. పాండాలమహేశ్వర్ గారు*
24.04.2020
*32.డేవిడ్ గారు*
25.04.2020
*33.ఇంద్రవత్ రాహుల్ గారు*
28.04.2020
*34.కిషోర్కుమార్ గారు*
29.04.2020
*35.రమాదేవికులకర్ణిగారు *
01.05.2020
36.సంధ్యా శర్మ గారు
05.05.2020
37.అంబటి నారాయణ రావు గారు
06.05.2020
38.వల్లాల విజయ లక్ష్మి గారు
07.05.2020
39.నరేశ్ చారి గారు
09.05.2020
40.శివలక్ష్మీ రాజశేఖరుని గారు
10.05.2020
41.శ్రీ విట్టుబాబు గారు
12.05.2020
42. శ్రీ నరేశ్ గారు
13.05.2020
43.శ్రీ వరయూరు జానకి రాం గారు
14.05.2020
44. కాల్వ రాజయ్య గారు
15.05.2020
45.గుండ్ల రాజు గారు
16.05.2020
46.వేంకట కృష్ణ ప్రగడ గారు
20.05.2020
47.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
21.05.2020
48. సర్ఫరాజ్ అన్వర్ గారు
22.05.2020
49.ఇంద్రవత్ రాహుల్ గారు
26.05.2020
50.దేశపతి మోహన్ శర్మ గారు
51
అద్దంకి లక్ష్మయ్య గారికి
12/06/2020
52
దండమూడి శ్రీ చరణ్ గారు
13/06/2020
53
రవి కుమార్ కంచి గారు
28.06.2020
**********************---
*14.04.2020*
*దండమూడి శ్రీచరణ్*
*గారి కవిత*
*బింబ ప్రతిబింబాలు!*
----------------------------------
ఆకాశం వుందే,
అది సముద్రంలోకి తన ముఖాన్ని చూసుకొని అలలుగా నవ్వింది!
ఆమె కనులలో నా మనసు తడిచింది!
నేను నన్ను నేను నాలోని నన్నును చూసుకున్నాను!
నేను అనంతంగా నాకు అగుపించాను!
అందులో ఏ నేను నేను?
ఆమెను అడిగి చెపుతాను!
కన్ను తాను చూచిన వైశ్వాన్ని తనలో దాచుకుంటుంది!
కన్ను తనను తాను లోలోతులలో చూచుకొంటుంది!!
అప్పుడు హఠాత్తుగా ఆత్మజ్ఞానం కలుగుతుంది!
ఆ కంట కన్నీరు కన్ను యొక్క నీరా?
కాదు కదా!
అది మనసు దుఃఖంలో
పొరలినప్పుడు
పారిన ఏరు!
ఆమె కన్ను నా కంట్లోకి చూస్తుంది,
తాను చూచింది నా మనసు!
నా మనసు ఆమె మనసుతో అంటోంది,
నే మనసిచ్చాను గనక,
నీలోని మనసు నాది,
నాలోని మనసు నీది!
ఇలా బింబ ప్రతిబింబాలు పరస్పరంగా అనంతాలు!
ఇంతకూ ఈ అక్షరాలు నేను రాసినవా?
నీవు చూసినవా!
ఈ అక్షరాలలో నా అశ్రువులున్నవి!
నీవు అక్షరాలు చదివితే సరిపోదు,
నా అంతరాత్మను వెతకాలి!
అపుడు నీ కంటిలో నా అశ్రువులుంటవి!
నీ అశ్రువులలో నా అక్షరాలుంటవి!!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కం:
ఆకాశమ్మొకటున్నది
లోకాన తనముఖమబ్ధిలోచూచుకొనన్
రేకెత్తుగర్వమునతో
ప్రాకటముగ అలలుగాను పకపకనవ్వెన్
తే.గీ
ఆమె కనులలో నామది ఆహ తడిచి
నేను నాలోని నన్నును నేనునేనె
చూచు కొన్నాను నేనంతశోభతోడ
నాకు నేనగుపించితి నవ్యగతిని
అందులో నేను ఏనేను ఆమెనడగి
వివరమిత్తు కన్ తాచూచు విశ్వమెల్ల
దాచుకొనుచుంది తనలోన తానుతాను
కన్ను లోలోతు లోతులో కనుచునుంది
అప్పుడు హఠాత్తు గా ఆత్మదై దనర్చు
జ్ఞాన మెంతయో కలుగు అజ్ఞానము విడు
కనగ ఆకంట కన్నీరు కంటినీర
కాదు మనసు దుఃఖముఁబొర్లి వేదనపడ
పారుసెలయేరు కన్ను ఆపడతిదింక
చూచు చున్నది నాకంటి సోగలోకి
తాను చూచింది నామదిన్ తనరిలెస్స
నామనసు ఆమె మనసుతో నీమముగను
అనుచునున్నది నేను నామనసునిచ్చు
కారణాన నీమది నీదికాదు నాది
కాదు నామది నాదిది నీది నీది
బింబ ప్రతిబింబములు గాను పెనగుకొనియె
ఇవి యనంతాలు ఓకాంత యెంచగాను
ఇంతకీయక్షరమ్ములనేను వ్రాసి
నాన చూచినావా నీవు కానగాను
ఇట్టి అక్షరాలశ్రులు యెంచ నావి
కలవు నీవక్షరమ్ములు కాంచి చదువ
అకట సరిపోవు నాయంతరాత్మ వెదకు
అపుడు నీకంటనాయశ్రులమరియుండు
అరయ నీయశ్రు లందున అమరియుండు
అక్షరమ్ములు నావియై అక్షరముగ
15.04.2020
వకుళవాసుగారికవిత
సింహం హృదయం
ఖాకి బట్టలమాటున ఉప్పొంగే మానవత్వాన్ని చేతిలోని లాఠీలోకి ఒంపి
నా సమాజాన్ని ఆరోగ్యంగా చూడాలనే తపన వున్న కరోనాంతకున్ని....
నాకై చూపులతోరణాలు కట్టి ఎదవాకిట రెప్పలతలుపులు తెరిచి వీక్షించే
ఇల్లాలికి గుప్పెడు నవ్వులను దోసిట్లో పోయాలనివున్నా ...
ఆప్యాయతకు ఆనకట్ట వేసి గుండెతలపులను మూసి నడిరోడ్డుపై
ఎండకు కములుతూ గుండె తడిని ఇంకింపచేసుకున్న కర్కషుడిని....
రేయిని తడుముతూ నిదురమ్మ నేనొస్తానంటూ కండ్లపై వాలి ముండ్లలా గుచ్చుతుంటె
చీకటి దుప్పటి కప్పుకొని రొడ్డుపక్కన అనాధగా గడియసేపు నిదురించే వేళ
ఒంటిని నిషాచరులకు అప్పగించిన నిర్ధయున్ని....
ఎప్పుడో డ్యూటి అయిపోయినంక నాకై ఎదురుచూసే నాఇంటితలుపు ముట్టడానికి కూడా నేనిప్పుడనర్హున్ని....
ఇంట్లో అడుగుపెట్టగానే అల్లుకునే పేగుబంధాలను కట్టడిచేస్తూ
ఉబికి వస్తున్న అనురాగాన్ని నీళ్ళధారలలో ఒలికించి ఒంటిని సబ్బుతో రుద్దీరుద్దీ కడిగినా
ఆప్యాయతకు అనుమానపు దడికట్టి వేరుపడేసుకున్న కర్కషుడినే....
చెలి అనురాగపు సానిటైజర్లను చేతులకు పులుముకొని
అనుబంధపు పసుపుదారాన్ని మాస్కులకు ముడుగులుగా వేసుకొని
కనపడని కరోనొరాకాసితో యుధ్ధంచేయ నడిరోడ్డుపై నిలబడిన నాలుగోసింహాన్ని....
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కం:
ఖాకీ బట్టలమాటున
పాకంబుప్పొంగు మానవత్వము చేతన్
వీకన్ గలలాఠి పనిపి
జోక సమాజంబు రుజల చోద్యము వాపన్
ఈ కాలకరోన యముడ
నాకై సతిచూపు తోరణాలను కట్టన్
నాకపుటెదవాకిటను త
దేకపు రెప్పలతలుపులు తెరచి నిరీక్షన్
తే.వీ
గలుగు ఇల్లాలికేమివ్వగలుగ లేక
గుప్పెడు నవుల దోసిట్ల గ్రుమ్మరించ
వలెను అనుకొన్న కానట్టి వాని నేను
కనగ ఆప్యాయతకు ఆనకట్టవేసి
గుండె తలపులన్ మూయుచు నుండి యిపుడు
నేను నడిరోడ్డుపై యింక నిలిచి త్వరగ
ఎండకు కుములుచును లెస్స గుండె తడిని
ఇంక చేసిన కర్కషుండే యనంగ
రేయిని తడిమి నిదురమ్మ ఓయి నేను
వచ్చెదను అంటు కండ్లపై వ్రాలి ముండ్ల
వలెను గ్రుచ్చుచునుండగా కలగి కలగి
చీకటను దుప్పటిని కప్పి చేవ తోడ
రోడు ప్రక్క అనాథగా వేడుకేమి
గడియ సేపిక నిదురించు కఠినవేళ
ఒంటిని నిషాచరులకు నేనొప్పచెప్పు
నిర్దయుని ఎప్పుడోడ్యూటి నే అయి చన
నాకయి ఎదురు చూచెడు నాదు ఇంటి
తలుపు ముట్టుటకైనను తలపనేన
నర్హుడను ఇపుడింటిలోననడుగిడగ
అల్లుకొను ప్రేగుబంధాలనకట వేగ
కట్టడిని చేసి ఆపయి కట్టలుదెగి
ఉబికి వచ్చెడు అనురాగమున్నతముగ
నీళ్ల ధారలనొలకించి నల్ల మేను
సబ్బుతోరుద్ది రుద్దియున్ జక్కఁగడగి
మనిన అప్యాయతకు అను మానపు దడి
కట్టి వేరుపడేసుకున్నట్టి కర్క
షుడిని చెలి అనురాగపు విడువనివగు
సానిటైజర్లనే చేతులానపులమి
తాకు అనుబంధపు పసుపుదారములను
మాస్కులకు ముడులుగవేసి మనుచు వేగ
నిక్కి కనపడని కరోనరక్కసిఁగని
యుద్ధమును చేయ నడిరోడ్డునుద్దవడిని
నిలుచు నాలవసింగంబు నేనునగుదు
16.04.2020
మేడిశ్రీ
......దొంగాట......
మనుషుల్లో దొంగాట
అదీ నేర్చిందట
మాయదారి రోగానికి
మనిషి గూడే నచ్చిందట..
కలుపుగోలు తనం
మరీ మెచ్చిందట
చేయి చేయి కలిపినంతనే
లోపలికి జొచ్చిందట..
ఎన్కటి
పట్టు విడుపు మంత్రం లెక్క
సమ దూరం పాటిస్తే
కుదురుతుంది దానికి తిక్క..
సుడగాలోలే
ఇక్కడే తిరుగుతుంది
వయో బేధం లేకుండా
మడత పెడుతుంది...
ఎవరెస్టెక్కిన మనిషి
అహంకారానికి చెంపపెట్టు.
దైవత్వం నింపుకున్న
వైద్యులే మానవతకు మెట్టు..
కోట్లకు పడగెత్తినా
కొరివి పెట్టే వారు లేక అనాథలై పోయారు...
బంధువులెందరున్నా
కడ చూపుకైనా రాలేరు..
ఉపద్రవాలు కూడా
ధరణికి ఉపశమనం కాబోలు...
పంకిలమైన నదులు స్వచ్ఛంగా
ప్రవహిస్తున్నాయి..
పాడు గాలి పీల్చే చెట్లు
పచ్చగా వికసిస్తున్నాయి...
మోయలేని కాలుష్యాన్ని
ధరణి కొంతైనా దించుకుంది..
జీవ రాశి బతికేందుకు
ఎంతో కొంత ఊపిరి పీల్చుకుంది...
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
నరులనదినేర్చె దొంగాట నవ్య గతిని
మనిషి గూడునచ్చె కరోన మాయదారి
రోగమునకు ;మెచ్చెడునంటరో మనుజుల
కలుపుగోలుతనము చేయి కలిపి చేయి
తోడ నుండినంతన చాలు తుష్టి యనుచు
నర శరీరము లోనికి అరుగునంట
వెనుకటిది పట్టువిడుపు మంత్ర నయమదియె
లెక్క ఒండొండుదూరంబు తక్కకుండ
ఉంటె తిక్కకుదురు దాని కంట లెస్స
ఇచటె సుడిగాలివలె తిరుగుచు జనాల
లో వయోభేదమేలేక రూఢిగాను
మడత పెడుచుంది నిశ్శబ్దమారియగుచు
ఘనుడు ఎవరెస్టునెక్కిన మనిషి లోన
పట్టు గర్వంబునకు చెంప పెట్టు అగుచు
పరగ దైవత్వమదినిండు వైద్యులిపుడె
మానవతకు మెట్టులగుచు మనుపుచుండ్రి
కోట్లకు పడగలెత్తిన కొరవిపెట్టు
వారు లేక యనాథలై నారు చూడ
బంధువులు ఎందరుండిన వారుతాము
రారు కడచూపుకైననీ వ్రాతయేమి
ఈ యుపద్రవాలు ధరణికింక కనగ
ఉపశమనమౌను కాబోలు ఉన్నతముగ
పంకిల నదులు స్వచ్ఛమై పారసాగె
పాడు గాలినిపీల్చెడి పాదపములు
పచ్చగా వికసించగ బట్టెనిట్టె
మోయలేని కాలుష్యము పుడమి కొంత
యైన దించు కొనుచు నుంది దివ్యముగను
జీవరాశి బ్రతుక గాను శీఘ్రమిపుడు
ఎంతొ కొంతొ ఊపిరిపీల్చు సంతసమున
17.04.2020
తేజస్వినిగారి కవిత
అంశం:కోవిడ్ భయం
తినాలన్న భయం
తాగాలన్న భయం
వెళ్లాలన్న భయం
ఉండాలన్న భయం
అంత కోవిడ్ మయం
అతిధి లాగే వచ్చింది
అందరిని కబలిస్తుంది
కనికరమే లేదు దానికి
కణ రూపంలో చేరుతుంది
ఇంటిల్లి పాదికి చుట్టుతుంది
ఇదే నా భయం
స్వీయ నియంత్రణ దీనికి నిర్ములనం
నిరంతరం లాక్ డౌన్ మా ఆయుధం
ఇదే మా ధైర్యం
కనిపించని శత్రువుపై విజయం.
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
కం:
తిన త్రాగ బైటకేగగ
అనయము ఇంట్లోనుమనుటమన్నను భయమౌ
వినగా కనగా యంతట
జనులు దలంతురు కరోన జపమిప్పుడొకో
ఆ.వె
అతిథి లాగ వచ్చి అందరిన్ కబలించు
చుండె కనికరంబు ఉండకుండ
కనగలేక నెవరు కణరూపమున మేని
చేరుచుండి చాల శీఘ్రముగను
చుట్టుచుంది తాను ఇట్టె ఇంటిని యెల్ల
వారి నంటువారి వారు ముట్ట
కున్న తుంపరలను ఎన్నొ విడిచినంత
వాటి ద్వార చేరబట్టె నిట్టె
వేగ దీనినాప స్వీయనియంత్రణ
లాకుడౌను లివియె లోకమందు
ఆయుధమ్ములగును అని ధైర్యమును పొంది
సూక్ష్మశత్రుజయము సొరిది గొనమె
18.04.2020
తగిరంచ నర్సింహారెడ్డిగారి
కవిత
*PUBG భూతం*
ఆకలి ధ్యాస అసలే లేదు
నిదురన్న ఊసే లేదు
అరచేతిలో మొలిచిన
సరికొత్త వైకుంఠరూప నరకకూపం..
అనునిత్యం దానికే అంకితమై
లోకాన్నే మరిచిపోతూ
తాను మాత్రం మురిసిపోతూ
అందరిలో ఒంటిరినిచేసే
సరికొత్త అంటురోగం ..
PUBG భూతంలో చిక్కుకుని
ఎవరూ ఎవరికి పట్టని తీరై
పచ్చటిజనారణ్యంలో ఎడారిమొక్కగా...
పిచ్చిలోకానికి చక్కని చిరునామాగా
తమ మైకంలో తామై... అనాధగా...
యువతరం .. నవతరం..
కండ్లల్ల గుడ్లు పొడుచుకుని వచ్చి
స్క్రీన్ పై చక్కర్లు కొడుతూ
కంటికిచిక్కని ఆ మనిషిబొమ్మని
దేవులాడి మరీ సంపుతున్నయ్..
కంటి ముందున్న తోటివానిమీద
సూపు ఏ మాత్రం ఆనదు...
వాడెవడో.. పరాయోడో..
పరిచయం లేనోడో అన్నట్టు
అంతుపట్టని మాయరోగం..
అవతలనుండి కానరానివాడెవడో
తెరపై ఆటబొమ్మలకోసం
ఆగమాగమై అరుస్తుంటే
ఇవతలినుండి వీడేమో
తన పాణాలమీదికచ్చిందన్నట్టు
లబోదిబోమంటూ ఒర్రుతుంటే
గర్జించి ఉరిమినట్టే ..
ఒక్కోసారి పిడుగుపడినట్టే ..
పక్కనున్నోళ్లకు పిచ్చిలేపినట్టే..!!
అదే
పక్కోడు ప్రేమగా పలకరించినా
బుక్కెడు తినుమని సక్కగ పిలిచినా
పగదారోలే కయ్యుమంటూ కసురుకునుడే . .
మెడనరాలు మెలిపెట్టి
వెన్నుపూసనడివెట్టి
పెయ్యంతా పుండుపుండు జేస్తున్నా
ఏదో మంత్రం చేసినట్టు ..
మందో మాకువెట్టినట్టు..
PUBG లనే మొఖం వెట్టవట్టిరి..
పాణాలను నిండా ముంచే
పాపకారి PUBG ని బొందవెడుదాం..!
పచ్చటి అనురాగాన్ని పంచుకుంటూ
పదిమందిల కలిసి జీవిద్దాం బిడ్డా..!!
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
ఉ:
ఆకలి ధ్యాసలేదు నిదురన్నది లేదరచేతి మొల్చు నా
ప్రాకటనూత్న మౌనరక భావము క్రొత్త వికుంఠమైచనన్
భీకర మైన దానిగని నిక్కము దానికినంకితమ్మునై
లోకము ఉండగా అదియె లోకము గీకమదేమిటంచు తా
నీకడ నేమనన్ మురసి పృథ్విని యంతట సంచరించుచున్
జోకని పీయుబీజి యది చోద్య కరాలపు నృత్యమాడుచున్
తే.గీ
అందరిని ఒంటి జేసెడు నంటురోగ
మయ్యె నీభూతమునజిక్కి కుయ్యొ అనుచు
ఎవరు ఎవరికి పట్టక యేమనందు
పచ్చని జనాటవినెడారి పాదపముగ
పిచ్చి లోకమునకు తాను వేగ వేగ
చక్కని చిరునామ అయెను నిక్కలేక
తమ మయికములన తమకు తామె తామ
నాథలై దిక్కుదోచక నాడునాడు
ఈయువతరము నవతరమిట్టులాయె
కండ్ల గ్రుడ్లు పొడచుకొని కడక వచ్చి
స్క్రీను పైచక్కరుల్ కొట్టి చెప్పగాను
కంటికి కనగ రాగతాముంటునున్న
మనిషి బొమ్మని వెదకి హామడయ చేయు
కంటి ముందున్న వానిపై కంటిచూపు
యెంతమాత్రము ఆనదు ఏమిటౌర
వాడెవడొ పరాయి అనగ పరిచయమిక
లేని వాడన చేసెను తాను అకట
అంతు పట్టని మాయరోగంబునేడు
అవతలనెవడొ కానరానాతడింక
తెరపయిన ఆటబొమ్మలు పరగబొంద
ఆగమాగమై వేగమై అరచుచుండ
ఇవతలను ఇత డేమియో ఇప్పుడిద్ది
వచ్చె ప్రాణాలమీదికి వచ్చెనంచు
ఓ లబోదిబో మంటుతానో సరగున
మొత్తుకొనుచుండనబ్బబ్బొ పోల్చనదియె
అకట గర్జించి ఉరిమినట్లగుచు నుండె
పిడుగు పడినట్టులొకసారి పిచ్చిలేపు
ప్రక్కునున్నట్టి వారికి వాడదేమొ
ప్రేమగా పలకరించిన ప్రీతి బుక్కె
డన్నము తినుమనుచు పిల్చు నంతలోనె
కనగ పగదారి వాడని కయ్యుమనుచు
కసురుకొనుచుండ మెడనరాల్ వెసవెసవెస
అన్న మెలిపెట్టినట్లయ్యె వెన్నుపూస
వేగ వడిబెట్టి పిసకగ పెయ్యియంత
పుండు పుండుగ చేసినట్లుండి ఎదియొ
మంత్రమెవడొ చేసెనుతాను మందుమాకు
పెట్టినట్లుగ పీయుబీజిట్టె ముఖము
పెట్టవట్టిరి ప్రాణాలనిట్టెనిండ
ముంచె పాపిష్టి దీనిని బొందవెట్టి
పచ్చటి అనురాగమ్మును పంచుకుంటు
బిడ్డ పదిమందిలకలసి ప్రేమమీర
బ్రతుకు బండిని లాగుదామతుల రీతి
19.04.2020
స్వర్ణసమతగారు
జ్యోత్స్న
పున్నమి చంద్రుని వెన్నెల కాంతి
మధికి చేకూర్చే మోదము
ఎద గీతికయై సుధలు పంచ
ప్రేయసి ప్రియుల హృదిలో నిల్వగ
పసి పాప కనులలో వెలుగులు నింపే
ము దుసలి మోమున పడచు అందము
చకోర మునకు ఆహారము
చక్షువు లకు చమత్కారము జాబిల్లి వెదజల్లే కౌముది
వెండివలే మేరియగ
పిండార బోసిన పండువెన్నెల దోచెను కన్నియల,కలువల
మైత్రి.
20.04.2020
వురిమళ్ల సునందగారి కవిత
అంశం:: ఉపవాస దీక్ష
::::::::::::::::::::::::::::::::::
దేహాలు చెప్పిన మాట వినకున్నా
మనసులు మాత్రం నిష్ఠ తో
ఉపవాసం చేస్తున్నాయిప్పుడు..
ఇంద్రియాల నిగ్రహమే
ఆగ్రహాలను అంతం చేస్తుందని
మనసంతా సమతా భావనలే
సమైక్యతా రాగాలాపనలవుతాయనీ
గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్కులు
అక్షర సత్యాలై ప్రకాశిస్తున్నవి..
భగవన్నామ స్మరణతో
సాన్నిధ్యంలో
మననలను మనం తరచి చూసుకునే
మహా భాగ్యమే ఉపవాసం..
అందరం ఆ దీక్ష చేపడదాం
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
దేహములు సెప్పు మాటలనోహొ వినక
మనసులుపవాసమును జేసి మనును నిష్ఠ
నింద్రియాల నిగ్రహమది యిప్పుడింక
ఆగ్రహాలను చేయును నంతమనుచు
మనసునన్ సమతాభావ మధురిమలయి
ఆ సమైక్యత రాగములాలపించి
మించునని గాంధి చెప్పనుదంచితమయి
నేడు అక్షర సత్యముల్ వేడుకనగు
సుభగవన్నామ స్మరణతో చొక్కి స్వామి
సన్నిధానాన మనలను సన్నుతముగ
మనమె తరచి చూచుకొనెడు ఘన సుదినము
నౌ మహాభాగ్యముపవాసమౌను దాని
నందరము దీక్షగాచేయ నౌనుమేలు
21.04.2020
తేజస్వినిగారి కవిత
చరవాణి మహిమ
ప్రక్రియ:వచన కవిత
చేతిలోని మాయాజాలం
కనిపించే అద్భుత రూపం
ప్రాణం లేని వస్తువు అయిన
కృత్రిమ ప్రాణం పోసుకొని
ఛార్జింగ్ తో శ్వాస అందుకొని
అన్నం లేకపోయిన పర్వాలేదు
అంతర్జాలం ఉంటే సరి
మనం ఎలా చేస్తే అలా మనతో ఒదిగే అరచేతిలో పట్టే చిన్ని నేస్తం
మనం ఎంత చూసిన అలుపురాదు
మనకు సోలుపు వచ్చిన
దానికి ఏమి కాదు
నెట్ ఉంటే సాలు నట్టింట్లో మనతో ఆడుతుంది
విజ్ఞానమే పెంచుతూ
వినోదాన్ని అందిస్తూ
అందరిని ఆనంద డోలికల్లో ఊగిస్తుంది
ఇదే చరవాణి మహిమ
మన కరవాలంలో ఇమిడి
మనల్ని ఇబ్బడిముబ్బడి చేస్తుంది
ప్రస్తుతం ఇదేగా మన సమయానికి చేదోడు
కానీ భవిష్యత్తులో చేస్తుంది కాబోలు కీడు
అందుకే తక్కువగా వాడండి
ఇంట్లో మన వాళ్ళతో సమయాన్ని పంచుకోండి.....
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
చేతిలోనిమాయాజాలమౌతిరమ్ము
కనగ నౌయద్భుతపు రూప మనగ వచ్చు
ప్రాణమేలేని వస్తువే యైనఁగాని
కృత్రిమమగు ప్రాణము గల్గి యేమనందు
శ్వాస ఛార్జింగుతోడుతన్ జక్కగమను
అన్నమేల నంతర్జాలమున్నచాలు
మనమెటుల సేయ ఒదగును మనలఁగూడి
చెప్ప నరచేతిలోపట్టె చిన్ననేస్త
మదియె యెంతసేపును జూడ నలుపురాదు
మనకు సొలపగు దానికి కనగ రాదు
నెట్టు ఉండిన నట్టింట నెలగుమనల
పెంచు విజ్ఞానము వినోదమంచితమిడు
ఔర ఆనంద డోలికలందరినిక
ఊచు నిదెచరవాణి యమ్మో యనంగ
ఇట్లు మనకరవాలమందిమిడి యుండి
మనలనిబ్బడిముబ్బడి ననగఁజేసి
ఘనత సమయంబు చేదోడుకనగ నిపుడు
కాని భావిలో కీడును కలుగఁజేయ
గలదు కావున తక్కవగాను వాడ
మేలు చేయు ఇంట్లోవారి చాలఁగూడి
సమయమిక పంచుకొనగను జయము నయము
22.04.2020
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
శీర్షిక : జనన మరణాలు
అణువణువుల సమ్మేళనము
తనంత విశిష్ట విశ్వము
జీవాణువు ఉనికి ప్రస్థానము
వైవిధ్య జీవ గమనము
జనన మరణాలు లోకకళ్యాణం
ప్రతిగడియ నూతనత్వము సంతరింకో
తహతహలాడును జీవకణాలు
ఆ మార్పునాకాంక్షించే జననము
ఆ నూతనత్వ మనుగడకే పాతుకు కోత
అదే మరణము జీవకణ స్థానభ్రంశము
జనన మరణాల మధ్య కాలమే జీవనం
జీవి తృప్తికై తాపత్రయమే స్వార్దం
ఆస్వార్దమే భౌతికకాయ సుఖాభిలాష
అదే జీవి కామ కార్య కర్తవ్యము
ఆది జీవకణ సంకల్పాన్ని
నెరవేర్చుటకే
స్త్రీ మరియు పురుష జంట లింగాల రసవత్తర సుఖమయ శృంగార కేళి
పునఃరోత్పత్తికై పవిత్ర యజ్ఞం
ఆ సుకార్యం కోసమే కళ్యాణం
అదే లోకకళ్యాణం అదే పరమార్థం
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
తే.గీ.
అణువణువులసమ్మేళనమై యనంత
విశ్వమయ్యెను అదియె చిద్విలసముగను
చేరి జీవాణువులునెల్ల జీవులాయె
కనగ వైవిధ్య జీవనగమనమందు
జనన మరణాల సొగసైన చక్రమయ్యె
అగుచు లోకకళ్యాణంబునంది యిచ్చు
ప్రతి గడియ నూతనత్వప్రస్తుతమనంగ
సంతరించగ తహతహ సల్పుచుండు
జీవకణములు చెన్నొంది శేముషిగను
అట్టి మార్పును భువిజనులందగాను
నూతనత్వపు పాతుకు కోతగా మ
రణము జీవకణపుస్థాణభ్రంశ ఫలము
జనన మరణాలమధ్యలో కనగనైన
కాలమే జీవనము జీవిలీల తృప్తి
పడగ తాపత్రయమదియె స్వార్థమగుచు
అదియె భౌతికసుఖవాంచ యౌనునిజము
అదియె జీవి కామపుకార్య మౌను గనగ
జీవకణపు సంకల్పము చెన్ను మీర
తీర్చ సాగగ మగ ఆడ తెల్పరెండు
లింగములఁగూర్చి శృంగారలీల తోడ
నౌర రసవత్తర సుఖమయంబు జేసె
ఆహ ఘనపునరోత్పత్తి కైపవిత్ర
యజ్ఞమును జేయు లోక కళ్యాణమనగ
అవని పరమార్థమై వెల్గు నద్భుతముగ
23.04.2020
మర్రి జయశ్రీ గారు
పుస్తక నేస్తం
సిరాతో భద్రపరచిన మస్తిష్కం
చైతన్యశీలిలా ఆలోచింపజేస్తూ
జ్యోతిలా వెలుగునిస్తూ
మనోమాలిన్యాన్ని తొలగిస్తూ
నిపుణతను కలిగిస్తూ
అభివృద్ధికి ఆసరా నిస్తూ
మేలునందిస్తుంది
విభిన్న సంస్కృతుల వారధిలా
విలువైన రచయిత జీవనాడిలా
విజ్ఞాననిధిని
భావితరాలకు అందిస్తూ
మంచి సలహాలనందిస్తూ
మహత్తరమైన శక్తిలా
ఒక్కసారి ముద్రిస్తే చాలు
ప్రజల సొమ్ముగా నిలుస్తుంది
పుస్తక నేస్తం.
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఈసిరాతో భద్రపరచి వాసికెక్కు
నట్టి మస్తిష్కమగు చుండి ఉట్టిపడెడు
నిత్యచైతన్య శీలియై నిష్ఠ తోడ
యోచనలు చేయు చుండుచు జ్యోతి యౌచు
వెలుగు చున్ మనో మాలిన్యమిల తొలంగ
చేయుచున్ నిపుణతనిడి శ్రేష్ఠ వృద్ధి
నిడగ నాసరాయై మేలునిడుచు భిన్న
సంస్కృతీవారధిగ పని సల్పుచుండి
చెప్ప విలువగు రచయిత జీవనాడి
గాను భావితరాల విజ్ఞాననిధిని
అందజేయుచు సలహాలు నందజేసి
ఒకమహత్తర శక్తియై ఒక్కమారు
పరగ ముద్రించగా నౌచు ప్రజలసొమ్ము
పుడమి నెల్లరి నేస్తమ్ము పుస్తకమ్ము
24.04.2020
డా.పాండాలమహేశ్వర్ గారు
**మానవత్వం***
కొరోనా వైరస్ వ్యాప్తి లో
భూగోళం కుతకుతలాడుతుంది..!
అజ్ఞాతంగ లోకాన్నేలుతుంది
చైనాదేశపు వైరస్ గుట్టులో!
అభివృద్ధి దేశాల మారణాయుధాలన్ని
చీపురు పుల్లకుకూడా లోకువైనవి
ఉపయోగం లేదిప్పుడు!
మాస్కులు,పరిశుభ్రత,సానిటైజరులు
మానవులకు రక్షణకవచాలిపుడు...!
దీనులపై దయచూపని అగ్రరాజ్యాలు
నిత్యం మార్కెట్ల లాభాలు తప్ప
మానవత్వం గురించి ఏనాడూ ఆలోచించలే!
ప్రజల ప్రాణాలు బలిపెడుతున్న వైరస్
అగ్రరాజ్య ఆధిపత్యాన్ని వదులుకోలేని
మూర్ఖుల పాపఫలితమేమో!ఇది..
అహంకారం అలంకారం ఆర్బాటాలే గొప్పకదా మీకు!
పారసిటామాల్ కే తహతహలాడే
అభివృద్ది దేశాలగతి ఈనాడు ఇంతేనా అనే దయనీయ స్థితిలో?
పేదరికంతో పెద్దరికం లేకున్నా
శతకోట్ల హైందవజాతి చూపేదే
అసలైన మానవత్వం...!
ఆకలితో ఉన్న అతిథికి ఉన్నదాంట్లో సగంబెట్టి సంతృప్తి చెందే సనాతన సమన్వయ సమున్నత సంస్కార ధర్మాచారణమే మా పరిమళ తత్వం...!
కలనైనా హితం కోరే కర్మయోగులం
హృదిలో నాగరికంగా
నెమరేస్తామెపుడు మనోనేత్రంగా....!
విశ్వమానవశ్రేయమే
త్రికరణ శుద్దిగా,త్రికాలాలలో ,
అనాదిగా ఆధునికంగా,
స్నేహ వాత్సల్యాల తీపిజ్ఞాపకమే కదా మా నవనవోన్మేషణం..!
నడత భవిత పవిత్రాలోచనల పరిమళత భావానురక్తుల ఆచరణశీలత
అనుభూతులానందాల ఆతృత
దండలో దారంలా విరుల కూర్పులే వినయవిజ్ఞతల వివేచనశీలమే భారతీయ మానవతత్వం..!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఈ కరోన వైరసిపుడు ఇట్లు వ్యాప్తి చెంద భూ
లోకమింత కుతకుతకుత రోజురోజు ఉడుకగా
ఏక ఛత్రమంది కానకింక యేలుచుండుచున్
లోకమంత మ్రింగుచుండె నోరు లేని భూతమై
ఆకృతి యిది చైన యందు ఔరదాల్చి భూమిపై
ఈకడయని ఆకడయని యేలచెప్ప బాపురే
తాకి దీని మట్టుబెట్ట తాము ఒక్క ఆయుధం
బేకలుగక వృద్ధిచెందు ఇన్ని దేశదేశమల్
లోకు వయ్యె ఆయుధాలు నూనమౌచు చీపురున్
నీకు నాకు శుభ్రతల్ వినిష్ఠ దాల్చు మాస్కులున్
రాక ఇంటనుండుటొకటె రక్షణమిడు కవచమౌ
లోకమందు దీనులపయి రూఢి జాలిలేకయే
నాకమనుచు మార్కెటుగను నాడునేడు మార్చి యిం
దాక తెచ్చి జనులు నిష్ఠతాము వీడజేయగా
ఈకలియుగ మగ్రరాజ్యమే వినీతి వీడగా
నే కబలము జేయుదనుచు నేడు రెచ్చుచుండె ఏ
మో కనంగ భారతీయ పుణ్యభావయోగమే
ఆకలమయి జీవరాశులందు ప్రేమఁజూపెగా
శ్రీకరమగు భోజనంబు స్నేహమందు స్వచ్ఛతల్
ప్రాకటమగు నడత భవిత రమ్యమైన యోచనల్
జోకగాను వ్యాప్తమైన చోద్యమేమి కాదులే
లోకమునిటు వంటివింకలుప్తములగు వైరసుల్
రాకలనిడు మానవతయె రమ్యభారతీయులే
స్వీకరించ లోకమంత స్వీకరించ శుభమునౌ
25.04.2020
కరుణా హస్తాలు
:కడియం డేవిడ్ గారు
లాఠీ పట్టిన చేయి
కరుణామయియై
కన్నీరు తుడుస్తుంది.
పట్టెడు అన్నం పెట్టి
పరామర్శిస్తుంది.
నేరాన్ని ఓర్వం
కడిగి పడేస్తాం
ఆపదలో ఆపన్న హస్తం
అభయ హస్తం అందిస్తాం.
అరాచకాలు అన్యాయాలు
కనిపిస్తే కాల్చేస్తాం.
మానవత్వాన్ని నిలబెడతాం.
మానవ సేవలో ముందుంటాం
మంచి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం.
ప్రాణాలు నిలబెడతాం.
మా వస్త్రాలు కాఖీ గానీ !
మా హృదయం నవనీతం.
వృత్తికి నిబద్ధులం
మానవత్వానికే ప్రతీకలం.
పోలీసన్నా !సలామన్నా
అంటున్నారు ప్రజలు.
దండాలయ్యా పోలీసన్నా
అంటున్నారు జనులు.
నీ పిల్ల జెల్లా సల్లంగుండ
అంటున్నారు సర్వజనం.
మా సేవల మెచ్చి
మా పై పదాలు కట్టి
కైతలు కట్టి
పాటలు పద్యాలు
పాడుతున్నారు.
తృప్తైతుంది.
కడుపు నిండినట్టుగుంది.
జీవితం సార్థకం అయింది.
సర్వే జనా సుఖినోభవంతు.
అందరూ సల్లంగ ఉండాలి అని
మా పోలీసుల కోరిక.
మీరంతా ఇంటి దగ్గర కుదురుగా
ఉండాలని మా కోరిక.
కరోనా మన దరికి రాదిక.
జై పోలీస్ !
జైజై పోలీస్!!
జై జవాన్.!
వందేమాతరం.
జైహింద్.
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
సీ:
లాఠి పట్టినచేయి రమణతో కరుణతో
కన్నీరు తుడుచు నీకాలమందు
పట్టెడన్నముపెట్టి వర పరామర్శను
చేయుచుండెను పూలు పూయుచుండి
నేరంబునోర్వము నెఱి ఆపదయైన
ఆపన్నహస్తంబు అందనిడమె
అన్యాయములు లెస్స ఆ యరాచకములన్
కనిన కాల్చుచునుండ గలిగిమేము
మానవత్వంబును మహిలోననిల్పుచు
మానవసేవలో మనుచునుండి
మంచికై ప్రాణాలు మరియర్పణంబిడి
ప్రాణదీపము నిల్పబట్టినాము
నవనీత హృదయంబు నష్టంబు గానట్టి
వృత్తి నిబద్ధత చిత్తమలరు
వస్త్రాలు ఖాకియై వరలిన కాని మా
మనసు తెల్లని వస్త్రమనగమనును
తే.గీ
అందుకే ప్రజలందరు అనుచునుండ్రు
అన్న పోలీసన్న సలాము అరయనీదు
ఆలి పిల్లలు సల్లంగనలరుగాక
మాదు సేవలు కొనియాడి మాపయినను
పాటలన్ పద్యగేయాలు పాడుచుండ్రు
కాని మాకోరికొకటుంది కాదనకుడు
కడుపు నిండును మీప్రేమ పడినమాకు
ఈకరోనపై యుద్ధంబునిట్లుసేయ
లాకుడౌనును పాటించి రక్షను గొన
ఇంటి నుండుడి బైటికి యేలరాగ
వచ్చి ఈప్రమాదపు వలబడుట యేల
సర్వజనులిల సుఖముగా సాగుగాక
యనుచు కోరెడు మామాటనాదరించి
మనుచు మీరన్న స్తుతులివి మానితమగు
మేము మీమాటలను కల్పి మించియనమె
కం:
జైజై పోలీస్ జైజై
జైజైజైజై జవాను జైజై జైజై
జైజై జైహిందు విలస
జైజై ఓ భరతమాత జైజై జైజై
28.04.2020
ఇంద్రవత్ రాహుల్
*అంశం*: రాజ్ ఘాట్
బాపూజీ ఆశయం
ఆ మహాత్ముడి పవిత్రమైన చోటు
సత్యం, అహింసను జయించిన మహా వీరుడు
ఢిల్లీలోని తన రాజ్ ఘాట్
స్మారక స్థలం
మన జాతిపిత బాపూజీ
ఇక లేరు
ప్రజల గుండెలో రాయి పడ్డది
ప్రతి ఏటా వస్తూనే ఉన్నది మనకు
స్వాతంత్ర దినం కానీ
ఏమి సాధిస్తున్నాం ఆలోచించాలి
క్షణం క్షణం గాంధీ మాట
ఘడ్సే తూటా..
అక్రమాల బాట
నిలవాలి నిలవాలి గాంధీజీ ఆశయం
రాజ్ ఘాట్కు శాంతిని అందించాలి..
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఆమహాత్ముని ఆశయంబన్న యెన్న
సత్యము నహింస వీటిచే సాటిలేని
వీరుడై జయించె బ్రిటీషు వితత శక్తి
ఢిల్లిలో నను రాజ్ఘాటు లీలగాను
తనదు స్మారకపు సమాధి తాను నుండె
అతను స్వాతంత్రమందించి నందువల్ల
సరిగ ప్రతి వత్సరమ్మున పరగవచ్చు
చుండు స్వాతంత్ర్య దినము మహోన్నతముగ
కాని సాధించినది యేమొ కనగవలెను
క్షణము క్షణము గాంధీమాట గాడ్సె దైన
తూట అక్రమాలకు బాట తుష్టినేది
గెలుచుచుండెనొ ఒకమారు తలచవలెను
నిలుప వలెగాంధి ఆశయంబలుపు లేక
రాజు ఘాటుకు శాంతి విరాజతనిడ
29.04. 2020
కిషోర్ కుమార్ గారు
లాక్డౌన్ కట్టడి సమయాన
కవులకు వరం కవితాగానం
కాలు బయటపెట్టకుండా కట్టడి చేసింది
మనసు వ్యాకులచెందకుండా స్వాంతన
చేకూర్చింది
సాహిత్య లోకాన ఒంఠరి కావంటూ తోడునీడై నిలచింది
గొప్ గొప్ప స్నేహ హస్తాలు అందుకునేలా
చేసింది
నిత్యనూతనమై కవితా తేజస్సుతో ప్రకాశిస్తూ
కవులకు ప్రాణమై అమృత సమానమైంది
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కవితా గానమిదయ్యెగా వరము లాక్డౌనైన కాలంబులో
కవులున్ బైటికి కాలుబెట్టక యిదే కైతల్ వెసన్ వ్రాయగా
చవితో దూరము నెట్టె వ్యాకులతనే స్వాంతమ్ముకే స్వాంతమే
రవలించెన్ మరి బాపె ఒంటరియనన్ రాకుండ చేసెన్ గదా
కవులన్ పెద్దల కల్పి స్నేహలతలన్ గల్పించె యల్పత్వమే
స్తవనీయంబు కరోనవీడ సలిపెన్ ధన్యప్రకాశమ్మిదే
కవిలోకంబునగల్గె పారె యలుగుల్గా జోరుగా కైతలే
**
05.05.2020
వై.కె.సంధ్యశర్మ
*శీర్షిక: *వెన్నెముకలవుదాం!*
దేశపు వెన్నెముక విరుగుతున్న చప్పుడు
రాశులు రాశులుగా దేహాలు రాలుతున్న చప్పుడు
వలసల వలువలు కప్పుకున్న రహదారుల్లో
వేకువనే చితి చీకట్లు ముసురుకుంటున్న కాలమిది
ఉదయిస్తూనే వేల సూర్యుల అస్తమిస్తున్న దృశ్యమది
సంధ్యలన్నీ రాలి సింధూరం పులుముకుని
ఎర్రబారిన ఆకాశమది
నిర్వేదం నిండిన కళ్ళలో
ఓ మిణుగురు వెలుగు
చీకటిని తరిమే ఆపన్న హస్తం కోసం
అడుగడుగునా మానవత్వ మడిని తట్టి లేపుతోంది
ఆందోళన అణువణువై అంబరాన్ని తాకుతుంటే
ఖాకీలు భద్రతా వలయంలో గూళ్ళను చిక్కబట్టుకుని
ఎర్రని ఎండకు కమిలిపోతోంది
కుండపోతగా కన్నీళ్ళ జడివానలో తడిసిన
ఒక్కొక్క మొలకకు తెల్లకోటు జవాను ఊపిరిపోస్తోంది
బతుకు పందెంలో ముందుండాలని
బానిసలైపోయాం...
పచ్చని చెట్టుకింద ఎండు గడ్డి పూసై వాడిపోయాం
ఇప్పుడు అన్నీ జ్ఞాపకాలే
మానం... ప్రాణం....
మాత్రమే ముఖ్యమైపోయింది
తలుపు తెరవగూడదు...
అరచేయి చాచగూడదు...
జరభద్రమై దాక్కుందాం...
కనపడని రక్కసికి కాలమైపోక
నీ గాలిని నువ్వే పీల్చుకో...
నీ ఆయువుకు నువ్వే శ్రీరామ రక్షగా దీవించుకో...
మన దేశ వెన్నముకలై నిటారుగా నిలబడదాం!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
సీ:
వలసల వలువలు విలసమై ధరియించి
రహదారి వేకువన్ లలినివీడి
చితిచీకటులు క్రమ్మి మతిచెర్చుకాలమై
ఉదయించి వేరవుల్ యోగ్యతవిడి
అస్తమౌ దృశ్యాలు నంతట కలుగగా
సంధ్యలన్నియు రాలి సరగుననిక
సింధూరమును దాల్చి చెప్పనాకాశంబు
ఎర్రబారగజేసె యేమనందు
గీ:
కనుల నిర్వేదమదినిండె కాని ఎదియొ
యోమిణుగురుల వెలుగులు నుదయమయ్యె
చీకటిని తర్ము నాపన్న ప్రాకటమగు
హస్తమేదొ అడుగడుగు నందునిపుడు
మానవత్వపు తడినిచ్చి మనుచుచుండె
మనసులోన నాందోళన కనగనెందు
పెరిగె బైటకు వెడలుట బందుగాగ
భద్రతావలయంబున బరగ గూడు
కట్టి ఎర్రని ఎండకు ఖాకులిపుడు
కుమిలి పోయిన జనులకు మమతపంచు
కుండపోతల కన్నీళ్లు కురియు జడిని
మొలక యొక్కక్కటిక మున్గిపోక తాము
తెల్లకోట్ల జవానులు నుల్లమలర
పోయు చున్నారలూపిరి పొలపుమీర
పచ్చని తరువు క్రిందట పరగగడ్డి
పూవుగా వాడిపోయిన మోదమిపుడు
పూర్వమగు జ్ఞాపకంబులు పూయమదిని
జ్ఞాపకాల దొంతరలందు గడపవలెను
తలుపు తెరవగరాదింక తలచి ప్రేమ
చేయి చేతిలో పెట్టగ చేయరాదు
భద్రముగ దాచుకొనవలె బైటకింక
రాక కనబడని కరోన రాక్షసికిక
కాలమైపోక పీల్చునీ గాలినింట
నీకు శ్రీరామరక్షగా నీదు ఆయు
వింక చేకొని సాగుమా వంకలేక
దేశమునకు వెన్నుముకగ దీప్తిగొనగ
వెలిగు నీవె నిటారుగా వితతదీక్ష
06.05.2020
అంబటినారాయణ రావు గారు
ఏదో లేదని
తపన చెందుచున్నాం
ఉన్నది సరిపోదని
మదన పడుచున్నాం
లేనిది కావాలని
తెలియకుండానే రావాలని
తెలిసేలోపు పొందాలని
పొందింది
జీవితాంతం ఉండాలని
పుట్టుకతొనే
లక్షాదికారి కావాలని
చూస్తు చూస్తూనే
కోటీశ్వరలం కావాలని
కలలు కంటుంటారు
కాలం వెంట పరుగులు
తీస్తుంటారు
కాలం నవ్యత్వానికి
దారి చూపుతుంది
అనుభవాల సారాన్ని
పంచుతుంది
మనిషి పుట్టుక
లోతైన సారాంశం
ఇదే మానవ నైజం
సరీగా అర్థం చేసుకుంటే
తన మీదతనకే నమ్మకం లేదు
ఏదో లేదని వ్యర్థంగ
భావించుకుంటారు
సరీగా అర్థం కాకపోతే
జీవితం వ్యర్థ మవుతుంది
చక్కని మాటను దాటేస్తాం
విలువైన దానిని వదిలేస్తాం
మంచి ఆత్మీయతను తోసేస్తాం
సరైన దారిని విడిచి పెడుతం
కలతలు తీర్చేకాలం రావాలి
బతుకును నడిపించే
భరోసా కావాలి
దుఃఖాన్ని పోగొట్టే
దోస్తు కావాలి
కష్టాని తొలిగించే
ఇష్టం కావాలి
వ్యర్థ ప్రయాసాల పరుగులో
ఎక్కడో ఏదో పట్టు జారిపోతం
ఎవరి ఆత్మశక్తిని వారే
జాగృతం చేసు కోవాలి
ప్రతి ఒక్కరిలో విశాలమైన
ధృక్పథం ఉంటుంది
ఎవరికి వారు పరివర్తన
చెందాలి ఎడారిలో నిలబడి
నీటి చలిమే కావాలంటే ఎట్లా
అందని దానికి అర్రులు చాస్తాం
అనుక్షణం అదే
ఆలోచనలో పడి పోతాం
అశాంతి మనసుతో
బతుకుతున్నాం
నిజమైన ప్రశాంతతను
వదిలేస్తున్నాం
ప్రతి ఒక్కరు తెలుసుకొని
నడుచు కొనే మార్గాన్ని
కోల్పోతున్నాం..!!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఏదొ లేదని తపననీవేల చెంది
ఉన్నదిసరిపోదని బాధనన్నపడుట
నీవు నేనందరముకూడ నిరతమిటుల
లేనిదానికి నారాట మూని యూని
తెలియకుండనె సంపదల్ గలుగగాను
గలుగు సంపదల్ బ్రతుకంత నిలువగాను
పుట్ట గానె కోట్లెన్నొయొ ముట్టవలెను
ఇటుల కలలెన్నొ కంటుండి పృథ్వి పైని
యేల కాలము వెంబడి ఎపుడు పరుగు
దీయుచుండుచు నవ్యత్వ తీరమునకు
దారిచూపుచు కాలంబు దానినుండి
అనుభవాల సారంబును అదియె పంచు
మనిషి పుట్టుక లోతైన మర్మమిదియె
ఇదియె మానవనైజము ఇదిసరిగను
అర్థమును చేసికొనకుండ వ్యాకులపడు
మనిషి తనమీద విశ్వాసమును కలుగక
లేని దేదొ భావించుచు కానకుండ
నిజమునీరీతి వర్తించి నెగడుచుండు
అర్థమిది గాగ బ్రతుకది వ్యర్థమగును
చక్కని పలుకు దాటేసి నిక్కమైన
విలువ గలదాని వదలుచు వేగిరముగ
మంచి ఆత్మీయతను ద్రోసి మనుచునుండి
వేగ సరియగు దానిని విడిచి పెడుచు
ఎపుడు కల్లోలమగు దారినిటులపోవ
నిపుడు నదిమాన్చి బ్రతుకునకెంతగానొ
ఒక భరోసను నిడుమార్గ మొకటి యంద
యిచ్చి దుఃఖము దొలగించు హితుడు వలయు
కష్టమును తొల్చు నదిగొప్ప ఇష్టమింక
మనకు కావలె కావాలె ఘనతరముగ
వ్యర్థమగు ప్రయాసంబుల పరుగునందు
ఎక్కడోపట్టు జారుచు నిక్కలేక
పోవుచుండుట కనిపెట్టి పొలుపుమీర
ఎవరి ఆత్మశక్తిని వారె భువిని జాగృ
తంబు చేకొని సాగిన ధన్యత యగు
ఎంచ ప్రతినరుడు విశాలదృక్పథమ్ము
కలిగియుండును సహజంబుగాను లోన
స్వీయ పరివర్తనము తాము చెందవలెను
ఓయెడారిలో నిలబడి యోహొ యోహొ
నీటి చెలిమకు ఆశించనేల మరియు
అందనిదగు ద్రాక్షకర్రు లకటచాచు
టేల ఎప్పుడా యోచనలేల యవియె
ఇటులనేల యశాంతిలోనింక కూల
నిజ ప్రశాంతత వదలుచు నేల బ్రతుక
నరులు ప్రతివారు మార్గంబు నరసి కొనుచు
నడుచు నిజమార్గ మెరుగుటే విడువకుండ
యోగ్యమగు దానికోల్పవనుచితమొక్కొ
38.
07.05.2020
:; వల్లాల విజయలక్ష్మి
శీర్షిక:**పరిమళం***
----------*********---------
ఆలోచనా బీజాలను
పత్ర క్షేత్రాల్లోన కలమను
చిన్నిహలం సాయంతో వేయటం
కవితాలతలను పెంచటం
కవనవిరుల సుమింప చేయటం
'భావఫలాల'ను పండించటం
ఆ సుమధుర *పరిమళాల* ఆస్వాదనం
కొందరు అక్షరాస్యుల అదృష్టం
అంతరంగపు స్పందనను
మాటల్లో వ్యక్తపరిచే కన్న
అందంగా అక్షరీకరించుటే మిన్న
అర్థవంత పదనిధులే కోట్ల కన్న మిన్న
అనుక్షణం ఎదలో మెదిలేస్పందన
అద్భుతమైన అక్షరాలైన వేళ
పర్వదినమే భావకవి హృదయానికి
అక్షరాలు నేర్పటమూ సార్థకమే జీవితానికి
మన అంతరంగాన మానవత్వం
మన పదాల్లో నూతనత్వం ఉన్న
నిలుచును కదా మన అక్షరాలు
పరిమళభరిత పారిజాతసుమాలై
శాశ్వత పరిమళం విద్యాసుమాలది
పేదల తొలితరం పిల్లలు దిద్దేఅక్షరాలు
వాళ్ళజీవితాల్లో శిలాక్షరాలై నిలుచు
అక్షయపాత్రలై తర్వాతి తరాల కాచు
నేనుసైతం విద్యాగoధాలు అద్దుతున్నా
విద్యాదాతనై మనస్ఫూర్తిగ మురుస్తున్న
చదువులమ్మ తల్లిఒడిలో జీవిస్తున్నా
పిల్లలతో చేరి అనంతంగ హశిస్తున్నా
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
మొనసి యాలోచనాబీజ ములను వేయ
విలస మనమను క్షేత్రాన కలమనియెడి
చిన్ని హలము సహాయాన చివురు పెట్టి
కవితలను లతలు మొలచు కనగ బాగ
కవన సుమములను సుమింప గాను జేసి
భావ ఫలముల పండించి చేవతోడ
ఆసుమధుర పరిమళాలనాగ కుండ
చెలగి ఆస్వాదనము జేయ చెప్పగాను
అక్షరాస్యులది అదృష్టమౌను ఎంతొ
అంతరంగపు స్పందన నద్భుతముగ
మాటలన్ వ్యక్త పరచెడి మాటకన్న
అక్షరీకరించుటమిన్న అందముగను
అర్థవంతపు పదనిధులరయ కోట్ల
కన్న మిన్నయెయయి తాము కూడునెపుడు
ఎదననుక్షణస్పందనల్ మెదలి అద్భు
తమగు అక్షరాలగువేళ తప్పకుండ
పర్వదినము భావకవికి పరగ హృదయ
మునకు నక్షరాల్ నేర్పుటమనగ సార్థ
కంబు జీవితమునకు లోకంబు నందు
మానవత్వ మంతరమున మనుచు నదియె
పదములన్ నూతనత్వంబు పరగమనిన
అక్షరాలవి పరిమళ మౌచు పారి
జాత సుమములై వాసించు శాశ్వతముగ
పేదల తొలితరముపిల్లలాదరముగ
దిద్దునక్షరాల్ శాశ్వతముద్దవడిని
పరగ విద్యాసుమంబుల పరిమళంబు
లివియె వారి బ్రతుకులందునెంచగాను
ఆ శిలాక్షరాలైనిల్చు నారయగను
తగిన యక్షయ పాత్రలై తరతరముల
కాచు తర్వాత తరముల కాంచగాను
అరయ విద్యాసుగంధాలనద్దుచున్న
నేను సైతము మురియుచు మానితముగ
అద్భుతముగ విద్యాదాతనౌచునుంటి
చదువులమ్మ తల్లి యొడిలో చక్కగాను
జీవనము చేయుచుంటిని చేరునట్టి
పిల్లలనుకూడి యెంతయో యుల్లమలర
39
09.05.2020
*నరేష్ చారి గారు*
గెలుపెవరిదో...!
**************
కత్తులులేవు
బాంబులులేవు
రక్తపాతమసలే లేదు
కానీ
ప్రపంచయుద్ధం మాత్రం
ముమ్మరంగా జరుగుతోంది
శవాలకుప్పలు
ఎవరెస్టులౌతున్నాయ్
కనీ వినీయెరుగని వింతయుద్ధమిది
చరిత్రలో
ఏ రాజూ చేయలేదు
భవిష్యత్తులో
ఏ పాలకుడూ చేయలేడు
ప్రపంచమంతా ఒకవైపు
కరోనా ఒకవైపు
శత్రువు ఒక్కరే
కంటికి కనిపించదు
కానీ
కళ్ళముందే తిరుగుతుంది
ప్రతిమనిషినీ
అణుబాంబుగా మార్చగలదు
కరోనా కనికట్టు నేర్చిందేమెా !
యుద్ధం ముగియాలంటే
శాంతి ఒప్పందం జరిగేది
కానీ
ఈ యుద్ధమే
శాంతియుతంగా జరుగుతోంది
కాలం మారింది
ఈ శాంతియుత యుద్ధాన్ని
కలసికట్టుగా కాదు
విడిగావుంటేనే
గెలవగలమని రూఢీఅయ్యింది
యుద్ధానికి
రెండుకారణాలు
ఒకటి అస్థిత్వం కొరకు
రెండు ఆధిపత్యం కొరకు
ఇప్పుడు
జరుగుతున్న యుద్ధంలో
అస్థిత్వం కొరకు మనిషి
ఆధిపత్యం కొరకు కరోనా
అహర్నిశలూ పోరాడుతున్నారు
ఈ శాంతియుత యుద్ధంలో గెలుపెవరిదో మరి !
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
లేవు కత్తులు బాంబులు లేనె లేవు
రక్తపాతము లేదు నేరకముగాను
అరయగ ప్రపంచయుద్ధంబు జరుగుచుంది
వడకనెవరెస్టునెత్తు శవాలకుప్పు
లన్నిదేశాల నిండునీ యవనినంత
చరిత కనని వినని దైన సంగరంబు
వింత యేరాజు చేయడు పృథ్వి భావి
లోన నొకవైపు ధరణియే తానునుండ
ఈకరోన యింకొకవైపునెంచ చిన్న
శత్రువొక్కరె సూక్ష్మమై జనుచు మనుచు
కండ్లముందరే తిరుగుచు కానబడక
ప్రతిమనుజునణుబాంబుగా రాణ మార్చు
తెలియనొకని నుండి యొకనికలయకుండ
వేలమందిలో వ్యాపించు వేగిరముగ
శాంతి యొప్పందమదిమున్ను జరిగి భువిని
ముగియు యుద్ధంబు కాని యపూర్వముగను
శాంతిగా యుద్ధమీవేళ సల్పుచుండె
నరులు కలిసికట్టుగ చేయ నరయగాక
ఎవరికినివారు విడిగతామే మనంగ
యొంటరిగనున్న ముగియునీయుద్ధమిపుడు
ఆధిపత్యంబుకు కరోన యవని యందు
నరుడు అస్థిత్యమును నిల్పనరయనిట్లు
జరుగు యుద్ధంబున నహర్నిశమములిట్లు
నుభయపక్షాలు పోరాడుచుండ నేటి
శాంతియుత యుద్ధమందున శాశ్వతమగు
గెలుపు నెవరిదో కాంచగవలెను ముందు
40
10.05.2020
*శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుగారు*
శీర్షిక: అమ్మగా నీ కొత్తజన్మ
నీ రక్తమాంసాల ముద్దగా
ఆ చీకటి గదిలో నేను ఉన్నప్పుడు
కలలన్నీ కొంగున కట్టి
ఎదురు చూస్తివే నా రాక కోసం
సడలుతున్న ఆహార్యం
సహకరించని ఆరోగ్యం
లెక్కచేయని నీ మాతృత్వంలో
అందమైన ఊహలు ఎన్నో నా కోసం
పురిటి నొప్పుల పునర్జన్మ లో
అమ్మగా నీ కొత్తజన్మ
నిద్రలేని నీ రాత్రులకు
విసుగురాని నీ సేవలకు
ఏ రుణం కారణమో అమ్మా !!
నా తొలి అడుగుల్లో అడుగైనావు
నా చిరు పలుకుల్లో పలుకైనావు
ఆటల్లో, అల్లరిలో, చదువులో,
ఎదిగే ప్రతి మలుపులో
సాధించే ప్రతి గెలుపులో
వెనకున్న హస్తానివి నీవు
నా ప్రియనేస్తానివి నీవు!!
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి అమ్మకు
*అవధాని శ్రీఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
నీరక్తమాంసాల నిండైన ముద్ద
గా చీకటి గదిని అలమటించంగ
కలలన్ని కొంగున కట్టుకొంచింక
నారాకకై వేచు నాతల్లి నీవె
సడలు ఆహార్యంబు సహకరించనిది
ఆరోగ్యమును గల్గి అన్నింటి నీవు
లెక్కచేయవు గాదె ప్రేమతో నెపుడు
మాతృత్వ బంధాన మహిలోన చూడ
అందమౌ యూహలు ఆహ నా కొరకు
పురటి నొప్పులనుచు పోపునర్జన్మ
పొంది నన్ కనెదవీ భూమిపై తల్లి
నిద్రలేనటువంటి నీరాత్రులకును
విసుగు రానటువంటి వితతంబులైన
నీసేవకు ఋణము నేనెట్టులిత్తు
నాతొలి యడుగులోనన్ అడుగువయి
నాచిరు పలుకులందనగ పలుకయి
ఆటలో చదువులో అల్లరిలోన
ఎదుగు ప్రతిమలుపు నేమనన్ వచ్చు
సాధించు ప్రతిగెల్పు సర్వమ్ము నీవె
వెనుకున్న హస్తంబువేనీవు తల్లి
నాప్రియ నేస్తంబనంగను నీవె
41
12.05. 2020 *విట్టుబాబు గారి కవిత*
*తలకెక్కింది గర్వం*
తలకెక్కింది గర్వం!
నేనే కదా శరీరాన్ని ఆడించేదీ అని
నేను లేకపోతే శరీరానికి చేతనమేదీ అని
జ్ఞానేంద్రియాలన్నీ నాలోనే అనీ
కానీ
చల్లని స్పర్శను మరచిపోయింది
తనకి చేతనత్వాన్ని ప్రసాదించే
గుండెకాయ ఎక్కడుందో మరచిపోయింది
బాహువు కత్తితో వేటు వేస్తే
తను తెగి పడుతుందని మరచిపోయింది
ఉదరం అజీర్తి బాట పట్టిందంటే
నొప్పి తనకెక్కుతుందని మరచిపోయింది
కాళ్ళు లేకపోతే గుడి దాకా
చేరలేననీ మరచిపోయింది
చేతులు లేకపోతే
తను కొలిచే దైవానికి
రూపం లేదనీ మరచిపోయింది
తలకెక్కింది గర్వం!!
శరీరంలో ఏదీ అప్రధానమైనది కాదనీ
ప్రతీభాగం అప్పుడప్పుడూ
అనారోగ్యంతో గుర్తు చేస్తూ ఉంటుంది
వివేకంతో సరైన వైద్యం చేసిందా సరే!!
లేకపోతే చివరికి
మ....ర......ణ... మే
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారి పద్యానువాదం*
మంజరీద్విపద
తలకెక్కె గర్వంబు తలచి దేహంబు
నేనె యాడించెద నిక్కంబటంచు (1)
నేది చైతన్యంబదేది నేలేక
యీశరీరమునకునింకయేడుంది(2)
జ్ఞానేంద్రియంబులు నాలోనివనుచు
కాని చల్లని స్పర్శ కడకింక మరచి (3)
చేతనత్వము నిచ్చి శీఘ్రంబు తనకు
కూర్మితో పనిచేయు గుండెకాయ యది (4)
ఎక్కడున్నదొ మర్చెనేమని చెపుదు
వేగ కత్తియె చేతి వేటువేయంగ(5)
తనుతెగిపడునను తగమర్చిపోయె
ఉదరమజీర్తియై యుండినన్ జాలు (6)
మరినొప్పి తనకెక్క మరచి పోయెనుగ
కాళ్ళు లేకను గుడి కాడికి చేర (7)
లేనని మరిచెనులే యేమనందు
చేతులు లేకున్న శ్రీహరిన్ గొలువ (8)
రూపంబు లేదనన్ రూఢిగన్ మరచె
తలకెక్కె గర్వంబు తలప శరీర(9)
మప్రధానమదేది యవనికాదనుచు
ప్రతిభాగమప్డప్డు రయము గుర్తిట్లు (10)
చేయు రోగంబులు చేరంగమీరి
సరియైన వైద్యంబు చాలవివేక (11)
మంది చేసెనసరి యాకాలుపురియె
మరణశాసనమయి మరిచేర్చుకాన (12)
జగతి బ్రద్క వలెను జాగ్రత్త తోడ...
జీవ!నీయంగముల్ చెదరగనీక (13)
42
13.05.202
*నరేష్ గారు*
మా బడి
********
కిరీటాలు లేని దేవుళ్లు
గురువులు -
పరిమళం వెదజల్లే పువ్వులు
విద్యార్థులు -
చమురులేని దీపం
జ్ఞానం-
మెుత్తంగా మా బడి
ఇలాతలంలో వెలసిన
అపురూపమైన గుడి
ఊరిచివర వెలసినందుకేమెా !
మాకది ఉద్యానవనమైంది
బడంటే బడికాదు
మేలిమి రత్నాలనందించిన
జ్ఞాన సముద్రం
బలమైన పిల్లర్లు
తెల్లని సున్నం
గంభీరమైన రూపం
సింహపు దర్జా
రాచఠీవి
మెుత్తంగా అదొక
ఇంద్రుని ఐరావతం
వానాకాలం వచ్చిందంటే
ఆకాశమంత గొడుగయ్యేది
వర్షాకాలంతో
ఎడతెగని అనుబంధం దానిది
అందుకేనేమెా!
తనబాధను చెప్పుకుంటూ
కన్నీరు కార్చేది
తన హృదయంలో
ఎన్ని మేకులు దింపినా
బాధనోర్చుకుందే కాని
బయటెవ్వరికీ చెప్పుకోలేదు
మమ్మల్ని బయటకూ తరమలేదు
అదేకదా! తల్లిప్రేమంటే
తల్లి ఒడిలోకంటే
తన ఒడిలోనే మా జ్ఞాపకాలన్నీ
దెబ్బలాడుకున్నా
గురువుల చేతిలో
బెత్తం దెబ్బలు తిన్నా
అల్లరి చేష్టలతో
వెర్రెత్తించినా
అప్పటికవి మాకు చేదుజ్ఞాపకాలే
కానీ
ఇప్పుడవి మాకు మధుర జ్ఞాపకాలు
మరచిపోని జ్ఞాపకాలు
మళ్ళీ మళ్ళీరుచి చూడాలనిపించే
మాధుర్యపు గుళికలు
తన విశాల బాహువులతో
అక్కున చేర్చుకుని
బాల్యజీవితానికి
బంగారు వేదికనందించిన బడి
మా అల్లరి భరించి భరించి
ఆరుగాలం
మా హృదయ క్షేత్రంలో
జ్ఞానబీజాలు నాటీ నాటీ
అలసి సొలసి
భూమాత ఒడిలో
శాశ్వత నిద్రకుపక్రమించింది
మళ్ళీ తన ఒడిలో
ఒక్కసారి ఒదిగిపోవాలనున్నా
అది మాకు
నిజంకాని స్వప్నంగానే మిగిలింది
*అవధాని శ్రీఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
మకుటాలు లేనట్టి మాధవుల్ గురులు
పరిమలంబును చల్లు వారు విద్యార్థి
గణములు దీపమౌ జ్ఞానంబు చమురు
లేనట్టిది బడియె ప్రేమలగుడియె
ఊరు చివర వెల్గు నుద్యానవనమది
జ్ఞానరత్నాలిడు జ్ఞానవారాశి
బలమైన పిల్లర్లు బాగుగా గల్గి
సున్నంబు ఠీవిలో చూడనైరావత
మదియోచు దోచు మహాద్భుతంబౌచు
ఆకాశము గొడుగు నౌవానకాల
మదిరాగ వర్షానుబంధంబు చాల
గల్గి కార్చునెపుడు కన్నీరు కాని
తనహృదయంబున తనరి మేకులను
దింపినన్ బాధలతెంపరలోర్చి
బయటకు చెప్పక బయటకు మమ్ము
తరమలేదదికాదె తల్లిదౌ ప్రేమ
తల్లి యొడికినన్న తనయొడిలోనె
మాజ్ఞాపకాలన్ని మనుచుండె ఘనము
దెబ్బలాడుకొనిన దెబ్బలన్ తిన్న
గురువులబెత్తాల కొంటె చేష్టలను
చేదు జ్ఞాపకములు చెప్పగానపుడు
మధురమౌ జ్ఞాపకాల్ మరియిప్పుడవియె
మరల మరలరుచి మంతమౌనట్టి
మధురంపు గుళికలౌ మాకెప్పుడవియె
తనవిశాలపు నొడి తాచేర్చుకొనుచు
బంగారు వేదికన్ బాల్యాన యిచ్చె
మాయల్లరి భరించి మాహృదయంబు
నవ్యమౌ క్షేత్రాన జ్ఞాన బీజాలు
నాటి నాటి యలసి నాటంగలేక
భూమాత యొడియందు మూర్ఛిల్లి నేడు
శాశ్వత నిద్రకున్ జారిపోయెనుగ
ఒకసారి తనయొడినొదిగి పోవలెను
అనియున్న మనసులో నరయంగనదియె
నిజము కానిదియైన నిద్రగానదిమాకు
మిగిలిపోయెను నేడు మేలిమిన్ బంచి
43.
14.05.2020
*వరయూరు జానకిరామ్*
కవితాగానం
అంశం: హే రామ్
శీర్షిక: వర్తమాన పరిస్థితి...
పిల్లాపాపలను
సంకనేసుకొని
కిలోమీటర్లకొద్దీ
నడకదారుల సొంతూళ్లకెళ్తున్న
వలసకూలీల
బ్రతుకు చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
మిద్దెలు మేడలు
కార్లు షికార్లు
మందీ మార్బలం
హంగూ ఆర్భాటం
అధికారం దర్పం
అన్నీ ఉండి
కరోనాతో చనిపోతే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రేమ అనురాగం
ఆప్యాయత అనుబంధం
మమత కరుణ
అన్నిటినీ ఎడబాపిన
కరోనాను చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ఒక చిన్న వైరస్
ప్రపంచాన్ని అతలాకుతలం
చేసి లక్షల్లో ప్రాణాలు
హరిస్తుంటే
లోకం చేష్టలుడిగిన
వైనం చూస్తుంటే
ఎవరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రపంచ శాంతిసౌభాగ్యాలు
సదా పరిఢవిల్లునట్లు
లోకాన్ని అమృతతుల్యం
చేయుటకు రావాని
ఎవ్వరికైనా అనాలనిపిస్తుంది
'ఓ రామా' అని...
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
పిల్ల పాపలతోనడ్చి వేగిరముగ
వలసకూలీలు ఊర్లకు బాటపట్టి
హీన మగుస్థితి నుండగా నెవరికైన
యెంచి హేరామనంగ నన్పించుచుంది
మిద్దె మేడలు సేవకుల్ మించునట్టి
హంగు ఆర్భాటమధికారమంది కూడ
ఈక రోనతో చనిపోతె యెవరికైన
నెంచి శ్రీరామనంగనన్పించుచుంది
ప్రేమమనురాగ మన్నిటిన్ వేగమాన్పి
మమత కరుణలనెడబాపి మహినినిండు
నీకరోణను చూడగానెవరికైన
యెంచి శ్రీరామనంగనన్పించుచుంది
ఒక్క చిన్న వైరసు ఇది యుర్వినంత
చేసి యతలాకుతలమును చెప్పలక్ష
లాది ప్రాణములన్ దీయ యవనియంత
చేష్టలుడిగి చూచుచు నుండ చివరి కేమి
టంచు యిదిర హేరామ నీవెంచి యింక
యీప్రపంచపు శాంతికై పృథ్వినిపుడు
నమృత తుల్యము చేయగా నవతరించి
రమ్ము వేగమ్ముగాను శ్రీరామయంచు
నెవరి కైనననవలె ననిపించుచుంది
44
15.05.2020
*కాల్వరాజయ్య గారు*
కవితా శీర్షిక:పాపికొండలు
కవిత పాఠం:
.అమ్మా !గోదారమ్మ
ఏమిటమ్మా నీ పరీక్ష
ఏపాపము చేసినవారైనా నీ కడుపులో మునిగితే పాపాలు పోతాయంటారు.
ఏపాపం తెలియని వారిని ఇలా ముంచావేంటమ్మా !
గంపెడు ఆనందముతో నీవద్దకచ్చి,
పడవనెక్కి ఆటలాడుతూ కేరింతలు కొడుతూ పరవశించి పోతున్న సమయాన
పడవను ముంచి వారి పాపాలను నీవంట గట్టుకున్నావు.
తప్పెవరిదో తెలియదు
నావ నడిపే నావికుడిదా?
ఆనందంలో మునిగి ఆదమరిచిన పర్యాటకులదా?
లెక్కకు మించి ఎక్కించు కున్న యజమానిదా?
ప్రవాహ మెక్కువున్నా నడుపుమని అనుమతిచ్చిన ప్రభుత్వానిదా?
తప్పెవరిదో తెలియదు కాని
తనువు చలించినది అమాయకులే !
నీకిది ఇది తగదుమ్మా!
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారి పద్యానువాదం*
.
అమ్మ గోదావరమ్మ యేమమ్మనీప
రీక్ష యిదియేమి పాపాలు లెక్క లేక
చేసి నీకడ్డులోమున్గ శీర్ణమగును
ఎట్టి పాపాలు చేయని యీజనాళి
ముంచి వేసితి విదియేమి పూర్ణముదము
తో పడవలెక్కి పరవశమాపలేక
నున్న కేరింతలను కొడుచున్న జనుల
హతుల జేసి పాపాలను అంటగట్టు
కున్న వేతప్పరయ పొట్టకూటికొరకు
నావ నడిపెడు ఆనాటి నావికుడిద
ఆదమరచి ఆనందాబ్ది నరయమునుగు
నాటి పర్యాటకులదా? యనంతలాభ
మాశతో లెక్కకున్ మించి యట్టిజనుల
తానె ఎక్కించుకొను యజమానిదా?ప్ర
వాహమెక్కువ గల్గిన నాహనడుపు
మన్ ప్రభుత్వముదా?యంచు మాకు తెలియ
దద్ది కాని తనువులను త్యాగమకట
చేసినది యమాయకులమ్మ చెప్పగాను
తల్లి గోదావరీ యిది తగదునీకు
45
16.05.2020
*గుండ్లరాజు గారు*
*చోదకశక్తి గురువు*
మాటలతో మంత్రోపదేశం చేసి
తామసిని తరిమేసి
కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే
కదన పిపాసి *గురువు*
ఆయుధం పట్టకుండా
ఆత్మ బలము నందించి
అమ్ములపొదిలోకి అస్త్రాలనిచ్చే
అమృత హస్తమే *గురువు*
శిలలను శిల్పాలుగా
తీర్చిదిద్ది, ఆద్యంతం
వరాలనిచ్చే దేవతలుగా మలచే
అజ్ఞాత శిల్ప చక్రవర్తియే *గురువు*
గాలిపటములా దిశాంచలములందు
స్థాణువులా తిరుగుచున్న
వారికి ఆధార భూతమై
గమనాన్ని నిర్దేశించి,
గమ్య స్థానానికి చేర్చే
చోదక శక్తియే *గురువు*
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
మాటలతో చేసి మంత్రోపదేశ
మరయ తామసితర్మి యవనియందెపుడు 1)
తనశిష్యవరుల కర్తవ్యోన్ముఖులఁజేయు
కదనపిపాసి లోకంబునన్ గురుడు 2)
ఆయుధమును పట్టకాత్మబలంబు
నందించు నస్త్రాలు నమ్ములపొదికి 3)
అమృత హస్తముతాను నరయంగ గురుడు
శిలల శిల్పాలుగా చెక్కి వరాలు4)
నిచ్చు దేవతలుగా నిలలోన మార్చు
అజ్ఞాతమైనట్టి అద్భుతమైన 5)
చక్కనైచను శిల్పచక్రవర్తియగు
గాలిపటాలుగా గతిదప్పి యెపుడు 6)
దిశలభాగాలలో తిరుగుచునున్న
స్థాణువులైన శిష్యసమూహముగని 7)
ఆధారభూతమై అవ్వారికెపుడు
గమనము చూపించి గమ్యంపు స్థలికి 8)
చేర్చు చోదకశక్తి చెప్పతాన్ గురువు
వరమౌను శిష్యులు వర్థిల్ల జగతి
46
20.05.2020
*వెంకటకృష్ణ ప్రగడ గారి కవిత*
అంశం : అంకురం
ప్రేమ అంకురం
ప్రేమ అంకురం
మనసున
పుడుతుంది
హృదయ జలం
మనసు మట్టిని
తడుపుతుంది
సడిసేయక అది
మది పులకింపజేస్తుంది
తొలకరి మొలకై
పలకరింపచేస్తుంది
మొలిచే ఆ మొలకకు
గుండె ఊపిరవుతుంది
అలా ప్రేమ అంకురం
చిగురించి మొక్కై
ఓ అంకుడు వృక్షమై
వచ్చే పెంపుడు
ప్రేమ విత్తనాలను
తన వంకే చేర్చుకొంటుంది ...
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారిపద్యానువాదం*
మంజరీద్విపద
మదిని ప్రేమాంకురమదిపుట్టి మనగ
హృదయజలమదియె యేపారి యెపుడు
మనసు మట్టిని తడ్పి మనుచుండు
చూడ
మది పులకింపగ మరి సవ్వడింత
సేయకుండగజేసి శ్రేష్ఠంబుగాను
తొలకరి మొలకగా తుష్టితో పులక
రింపగ జేయంగ నీసృష్టియందు
మొలచునా మొలకకు మొనసి యీగుండె
ఊపిరియగుచుంది ఊహింపనెపుడు
ప్రేమాంకురంబిట్లు వేగంబుగాను
చిగురుంచి యాపైన వృక్షంబునౌచు
వచ్చు పెంపుడువైన వౌప్రేమవిత్త
నాలను తనకవంక నవ్యంపురీతి
చేర్చుకొనుచునుండి చెప్పగా గొప్ప
47.
21.05.2020
పొదుపు
డా.పాండాల
మనుషుల జీవనవిధానం
పలు రకాలు...!
బట్ట పొట్ట తక్లీబ్ లేకుండా జీవించడం
అవసరాలను అనుభవిస్తూ సంతృప్తిగా
సకల సౌకర్యాల విలాసమయ
కాలగమనంలో
సంపాదనంతా దాచుకోవాలని
పైసకో ముడెయ్యాలని
మున్ముందు గౌరవం పెంచుతుందనీ భావనే పిసినారితనం !
అదే అలవాటయితే
అవసరమా!ఆనందమా! మనిషిని ఆలోచనలో పడేసి
బరువువైపుతక్కెడ ముళ్ళు జూపినట్లు
మనసు పొదుపు వైపు మల్లుతుంది..
ఒకటొకటివంద వందవంద వేయి వేయివేయి లక్ష లక్షకూడబెడితే
మీ జీవితాన్ని రంగుల మయం చేస్తానని లక్ష్మీ దేవి కలలో దర్శనమిచ్చి చెప్పిందంట
లోకమంతా! గబ్బుగాడని! పిసినారని!
కమ్మనివంటలు కడుపుతినని కలిమెందుకని?...
ఇలాంటి కంపు మాటల్ని
ఇంపుగా ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తే అయిపోలే...!!.
జల్సాలు అప్పులు లేని
కుటుంబ భవిష్యత్తుకు
పునాది పొదుపు
రోజు సంపాదనలో ...ఓ పదో ! పరకో ! వెనకేసే అలవాటే మనిషికి గ్రహపాటును శుద్దిచేసేది...
సంతృప్తే అత్యుత్తమ సంపదగా బ్రతికే వాడే నేర్పరి!
అదుపు-పొదుపు ఆనందం ఆహ్లదం
లేనిజీవితాలు...
తాడు బొంగరం లాంటివి
బ్రతుకంటే...ఓ పఖ్ఖా ప్లొను...
క్రమం రీతి రివాజు
శిక్షణ రక్షణ భక్షణలన్నీ
పొదుపు విలువ తెలిసినోళ్ళకే వర్తిస్తాయి....!
పొదుపు డబ్బు కేనా కాదు
మాటా వ్యవహారం ఆహార్యం లో కూడా మితం ప్రధానం....!?
ప్రకృతి సంపద పట్లా
జీవ జంతువుల పట్ల
ప్రేమను పాటిస్తే
చిరకాలం సుఖంకరం !
*అవధాని శ్రీ ఐతగోనివేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
సంపాదనము చేయు సంపదనంత
తినవలసినయంత తినకుండతాను
కలిమికలిగిగూడ కడుపేదగాను
తాబ్రత్క పిసినారితనమౌను నదియె
జల్సాలు సేయుచు జనమంత పొంగ
ఆడంబరాలకై అప్పులు సేసి
మనుట దుబారయౌ మరినష్టమౌను
ఖర్చులన్ బెట్టుచు కలిమిని బట్టి
ఉన్నసంపాదనమూహింపకొంత
పొదుపు చేసినవాడు పుడమిలోతాను
ఆదర్శవంతుడౌ నతడు మర్యాద
తప్పకపొందును తథ్యమ్ము సుమ్మి
తక్కెడ ముళ్ళది తప్పక బరువు
వైపు సూపెడిరీతి బాగుగా మనసు
పొదుపు వైపుకుసూప పుడమి యాతనిని
కమ్మని వంటలు కడుపారతినని
కలిమి యెందుకు నంచు కడుహీనముగను
వందలాపైవేలు పైలక్షకోట్లు
కూడబెట్టిన నీకు కూరిమి పేర్మి
దర్శనమిచ్చెద ధన్యాత్మభక్త
అనుచు లక్షీదేవి ఆరయయనెను
ఇటువంటి కంపైన ఇంపైన మాట
లెన్నొ యనినగాని యేమి యవన్ని
యొకచెవి వినుచు నింకొకచెవితోడ
వదలు నైజముతోడ వర్థిల్లమేలు
పిసినారి తనమది పృథ్విలో పొదుపు
వేరౌనునివిరెండు విశదంబు గాను
ఆనందమాహ్లాదమదుపు నాపొదపు
జీవితంబునకిచ్చు శేముషినిచ్చు
బ్రతుకంటె యోపక్క ప్లానుతోనుండు
పొదుపు విలువ తెల్యభువిధన్యమౌను
ధనమునకు కాదు ధరలోన మాట
ఆహార్య వ్వవహారమన్నిటన్ పొదుపు
ప్రకృతిదౌ సంపద పట్లనీపొదుపు
ప్రేమను చూపించ వృక్ష జంతువులు
చిరకాల సుఖముతో చిగురింపజేయు
భూమిపై నీబ్రత్కు పొమ్మురా నరుడ
48
22.05.2020
*సర్ఫరాజ్ అన్వర్ గారు*
జీవ వైవిధ్యం..
భూమిపై ఉన్న వివిధ జీవుల మధ్యభేదం,
భిన్న వైరుధ్యాలు, సామీప్యాలు కల్గిన
వేర్వేరు జీవుల సమాహారం జీవ వైవిధ్యం
వైవిధ్యమే ప్రత్యేకత, అదియే సృష్టి లక్షణం
సృష్టిలో గల జీవరాశులలో ఏది ఎక్కువ,
తక్కువ కాదు అన్ని సమానమే
జీవులన్నియు పర్సపరాధారితాలు
*జీవ వైవిధ్యచక్రం ఓ వసంత ఋతువు*
ఆధిపత్యపు పోరే వినాశనానికి హేతువు..
మనజీవనశైలితో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగోళం వేడెక్కి
ప్రకృతి సమతుల్యత దెబ్బ తిని అనర్థాలకు దారితీసి జీవవైవిధ్యం దెబ్బతింటుంది
ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి
ఆదివాసులు, వనజీవులు ఉన్నచోట జీవవైవిధ్యం వర్ధిల్లుతుంటే
నాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో దాని
ఉనికి ప్రశ్నార్థకమౌతుంది..
జీవవైవిధ్యంతోనే ఈ పుడమికి
ప్రత్యేకత, మానవజీవితానికి సార్థకత
వైవిధ్యవైభవం *గతకాలపు*
*స్మృతిచిహ్నంగా* మిగలరాదు
అది కేవలం అక్షరాలలో, పుస్తకాల్లో
నిక్షిప్తమై ఉండరాదు
*వైవిధ్యబాంధవ్యంలేని బతుకు దైన్యమే*
దాని మహిత గుర్తించకపోతే మిగిలేది *జీవ వైధవ్యమే..*
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
భూమిపైనున్న వివిధ జీవులఁగనంగ
సామ్యవైరుధ్యములు చూడ చాలగలుగు
వేరు వేరు జీవులు మన పృథ్వినిదియె
జీవవైవిధ్యమగునిది శ్రేష్ఠవిధము
సృష్టి లక్షణమిది దీనినెపుడు మనుప
సృష్టి వికసించు లేక నశించు నరుడు
ఒకటి యెక్కువ తక్కువ యుండదేది
దేని ప్రత్యేకతనది యెంతేని కల్గు
నిక పరస్పరాధారితాలు కనగాను
అన్ని జీవులు నేగొప్ప యంచు నెంచు
నాధిపత్యపు పోరు మహావినాశ
హేతు వౌనిది తలదాల్చనీతి కాదు
జీవవైవిధ్య చక్రంబు చెప్పగాను
ఓవసంత ఋతువు మహితోత్సవంబు
నరుల జీవనశైలితో నాశనమయి
భూమి వేడెక్కి కాలుష్యపూర్ణమగుచు
ప్రకృతి సమతుల్యత చెడి యపాయమగుచు
జీవవైవిధ్య మెంతయో శీర్ణమౌచు
ఎన్నొ జీవజాతులు నశియించిపోవు
చుండె నిరతంబు యిదిచాల గుండె కోత
ఆది వాసీలు వనజీవులరయ గల్గు
స్థలిని జీవవైవిధ్యంబు చక్కనుండ
నాగరిక నరులున్నట్టి నవ్యపురుల
జీవవైవిధ్య మెంతయో చితుకు చుండు
నిదియె యొకమారు యోచించి యిప్పుడైన
జీవవైవిధ్యమును గావ శ్రేష్టత యగు
జగతి గతకాలపు స్మృతిగ మిగులరాదు
అక్షరములలో పుస్తకాలందునిదియె
చెప్పబడకుండ నిరతంబు చెలగవలెను
ఇలను వైవిధ్యబాంధవ్యమేమిలేని
బ్రతుకు దైన్యమౌ కావున లక్షణముగ
దాని మహితను గుర్తించలేనియెడల
జీవ వైధవ్యమే దక్కు సృష్టి కింక
49.
23.05.2020
*దేశపతి మోహన్ శర్మ గారు*
సమ్మోహనం
ఎన్నడూ లేనిది ...ఎదలో
ఏదో తెలియని గిలిగింత
నా మనసంతా ..తీయని
ఆశలకై ..ఉరకలతో ..తుళ్ళింత
మూగవోయిన నా హృదయ వీణను ..
ఎవరో సున్నితంగా మీటినట్టు ...
ఆనందనాదమై పలుకుతున్నట్లుంది
మోడు వారిన వనములో ..
ఎదురుచూసిన వెదురులా నేను ..నీవుతాకితే,
వేణువునై నీఊపిరితో ఊదినట్లు మౌనమైన
నా గొంతులో రాగాలు పాడుతున్నట్లుంది
ఏకాంత మెరిగిన నా మదిలో ..
ఏ కాంత కోసమో అన్నట్లు ..
భావాల మడిలో ప్రేమ బీజాలు పడి..
కవితలు మొలకలుగా ఎదుగుతున్నప్పుడు నేను సాహిత్యపు సేద్యం
చేస్తున్నట్లుంది
ఏనాడు పులకించని వీనులకు ..
వినిపించిన నీ కాలి అందెల సవ్వడులే
సమ్మోహన గానాలై..తన్మయత్వం నాలో
కలిగిస్తున్నట్లు ఉంది
అది నీ వల్లేనేమో? ..నాపై కురువ బోయే
నీ ప్రేమజల్లేనేమో?
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
మంజరీద్విపద
ఎన్నడు లేనిది యెదలోననెదియొ
తెలియని గిలిగింత తెల్లంబుగాను
నామనసంతట నానావిధాల
తీయని యాశలు తీవ్రంబుగాను
ఉరకలు తుళ్ళింతలుద్ధృతమగును
ఎవరొ సున్నితముగ హృదయంపు వీణ
మూగ వోయినదాని మొనసి మీటిరన
ఆనందనాదమై అలరుచు పలుకు
మ్రోడు వారు వనములో వేచి చూచు
వెదురులా నేను నీవింక తాకంగ
వేణువునై నేను వేగంబు నీదు
ఊప్రితో నూదినట్లుండు మౌనంబు
నౌ నాదు గొంతులో నరయ రాగాలు
పాడుచున్నట్లుండు ప్రతిదినమందు ఏకాంతమెంతయొ యెరుగు నామనసు
ఏకాంతకోసమో యింక యన్నట్లు
భావాల మడిలోన పడి ప్రేమభీజ
ములు కవితలుగాను మొలకలు నౌచు
ఎదుగు చున్నప్పుడునేను సాహిత్యపు
సేద్యము చాలగ చేసినట్లుంది
ఏనాడయిన పులకించని వీను
లకు వినిపించిన లలితంబు నీదు
కాలి యందెలదైన కమ్రరావంబు
సమ్మోహనంబునై చాలగ దోచి
తన్మ యత్వమునాకు తగకలిగించు
నది నీవలెను నేమొ నాపై కురువగ
బోవు నీ ప్రేమ సంపూరంబునేమొ
50
26.05.2020
*దేశపతి మోహన్ శర్మ గారు*
సమ్మోహనం
ఎన్నడూ లేనిది ...ఎదలో
ఏదో తెలియని గిలిగింత
నా మనసంతా ..తీయని
ఆశలకై ..ఉరకలతో ..తుళ్ళింత
మూగవోయిన నా హృదయ వీణను ..
ఎవరో సున్నితంగా మీటినట్టు ...
ఆనందనాదమై పలుకుతున్నట్లుంది
మోడు వారిన వనములో ..
ఎదురుచూసిన వెదురులా నేను ..నీవుతాకితే,
వేణువునై నీఊపిరితో ఊదినట్లు మౌనమైన
నా గొంతులో రాగాలు పాడుతున్నట్లుంది
ఏకాంత మెరిగిన నా మదిలో ..
ఏ కాంత కోసమో అన్నట్లు ..
భావాల మడిలో ప్రేమ బీజాలు పడి..
కవితలు మొలకలుగా ఎదుగుతున్నప్పుడు నేను సాహిత్యపు సేద్యం
చేస్తున్నట్లుంది
ఏనాడు పులకించని వీనులకు ..
వినిపించిన నీ కాలి అందెల సవ్వడులే
సమ్మోహన గానాలై..తన్మయత్వం నాలో
కలిగిస్తున్నట్లు ఉంది
అది నీ వల్లేనేమో? ..నాపై కురువ బోయే
నీ ప్రేమజల్లేనేమో?
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
మంజరీద్విపద
ఎన్నడు లేనిది యెదలోననెదియొ
తెలియని గిలిగింత తెల్లంబుగాను
నామనసంతట నానావిధాల
తీయని యాశలు తీవ్రంబుగాను
ఉరకలు తుళ్ళింతలుద్ధృతమగును
ఎవరొ సున్నితముగ హృదయంపు వీణ
మూగ వోయినదాని మొనసి మీటిరన
ఆనందనాదమై అలరుచు పలుకు
మ్రోడు వారు వనములో వేచి చూచు
వెదురులా నేను నీవింక తాకంగ
వేణువునై నేను వేగంబు నీదు
ఊప్రితో నూదినట్లుండు మౌనంబు
నౌ నాదు గొంతులో నరయ రాగాలు
పాడుచున్నట్లుండు ప్రతిదినమందు ఏకాంతమెంతయొ యెరుగు నామనసు
ఏకాంతకోసమో యింక యన్నట్లు
భావాల మడిలోన పడి ప్రేమభీజ
ములు కవితలుగాను మొలకలు నౌచు
ఎదుగు చున్నప్పుడునేను సాహిత్యపు
సేద్యము చాలగ చేసినట్లుంది
ఏనాడయిన పులకించని వీను
లకు వినిపించిన లలితంబు నీదు
కాలి యందెలదైన కమ్రరావంబు
సమ్మోహనంబునై చాలగ దోచి
తన్మ యత్వమునాకు తగకలిగించు
నది నీవలెను నేమొ నాపై కురువగ
బోవు నీ ప్రేమ సంపూరంబునేమొ
51
12/06/2020
12.06.2020
*అద్దంకి లక్ష్మయ్య గారి* *కవిత*
*పరిమళం*
ధనం ఉంటే ఏం లాభం
దాన గుణం ఉండాలి
జ్ఞానం ఉంటే ఏం లాభం
పది మందికి పంచాలి
అధికారం ఉంటే ఏం లాభం
అందరిని కాపాడాలి
పూజలు చేస్తే ఏం లాభం
పవిత్ర భావాలు ఉండాలి
బజార్లు తిరిగితే ఏమి లాభం
భద్రత కలిగివుండాలి
పరిపాలన చేస్తే ఏం లాభం
ప్రజల మేలు చూడాలి
సంతాన ఉంటే ఏం లాభం
చక్కగా పోషించాలి
చినుకు పడితే ఏం లాభం
రైతు వినియోగించుకోవాలి
ఉద్యోగం చేస్తే ఏం లాభం
బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి
దేశంలో పుడితే ఏం లాభం
ప్రగతి కోసం పాటుపడాలి
పదవి ఉంటే ఏం లాభం
పాలన ఆదర్శంగా ఉండాలి
మనిషిగా పుడితే ఏం లాభం
మానవత్వం ఉండాలి
పువ్వు వికసిస్తే ఏం లాభం
పరిమళం వెదజల్లాలి
నీతులు చెబితే ఏం లాభం
నియమాలు పాటించాలి
కరోనాతో కట్టుబాట్లు పెడితే ఏం లాభం
కఠినంగా పాటించాలి
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి*
*పద్యానువాదం*
దానగుణములేక ధనమెంతగల్గిన
జ్ఞానమెంత గల్గగా ధరిత్రి
పంచకున్న నింత పదిమందికెప్పుడు
అందరిని మహత్వమైనరీతి1)
కావకున్నను అధికారమున్నఫలమె
పూజచేయనేల పుణ్యభావ
నంబు లేక; తిర్గినన్ ఫలంబె బజారు
భద్రతింతలేక ప్రజలమేలు2)
పట్టకుండనింత పరిపాలనముచేయ
లాభమేమిగల్గు లావుగాను
పదవిగల్గనిటులె పాలనమాదర్శ
మౌచునుండకుండ నవనియందు 3)
దేశమందు పుట్టితేమి లాభంబగు
ప్రగతి కొరకు పాటుపడక యున్న
మనిషిగాను పుట్టి మానవత్వములేక
మనిన లాభమేమొ కనగనటులె 4)
పరిమళంబు లేక ప్రసవంబు వికసించ
నీతులేల నియమనిష్ఠలేక
సంతతున్ననేమి చక్కగాపోషించ
కుండగాను లోపముండగాను 5)
చినుకు పడిననేమి వినియోగమున రైతు
పెట్టకున్న మేలుముట్టకున్న
బాధ్యతలను బాగ పాటింపకుద్యోగ
మున్ననేమి లేకయున్ననేమి 6)
రోజు రోజునకు కరోనతో లెస్సగా
కట్టుబాట్లు పెట్టి కఠినముగను
ఫలితమేమియుండు పాటింపకున్నను
కాన చిత్తశుద్ధి కలుగు నరుడ
52
13.06.2020
దండమూడి శ్రీచరణ్ గారు
*ఓ కవితై తరించేందుకు....!*
-----------------------------------------
నాకోసం ఓ వసంతం
అన్వేషిస్తోంది!
నా కొరకై ఓ ప్రసూనం
పరిమళిస్తోంది!
నా అక్షరానికై ఓ గీతం
తపిస్తోంది!
ఎన్ని వనాల్ని గమించి
వచ్చాను,
ఎన్ని గాయాల్ని సహించి
వచ్చాను
ఈ ఒంటరితనం
నాకోసం
ఓ యుగళాన్ని ఆశిస్తోంది!
నా పాదముద్రలు
ఈ ఇసుక తీరాల్లో.....!
నా పదధూళి
ఈ ఎడారుల్లో........!
నా పయనం
ఓ మజిలీకై నిరీక్షిస్తోంది!
ఈ క్షణాలున్నవి
నన్ను పరీక్షించేందుకు,
ఈ కొవ్వొత్తులున్నవి
నా రాత్రిని దహించేందుకు!
నా కలం ఓ అశ్రువు
అక్షరమయ్యేందుకు సహకరిస్తోంది!
నా ప్రాణం
ఓ కవితై తరించేందుకు జ్వలిస్తోంది!!
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
నాకోసమొక వసంతము
నాకొనినద యనెడురీతినన్వేషించున్
నాకొరకొక్క ప్రసూనం
బేకన నిరతంబు పరిమళించుచునుండున్
నాయక్షరమయి గీతమి
దే యనవరతంబుగ తపియించుచునుండున్
వేయి వనాలు గమించితి
వేయగు గాయాల్ సహించి విచ్చేసితినే
ఈ యొంటరితనమిదినా
కోయుగళమ్మును నపేక్షమో చేయంగన్
నాయీపదముద్రలిచట
యీయిసుక సుతీరమందునేముద్రలగున్
నాయీ పదధూళి గనగ
యీయెడ పడియెను నెడారి నీనాపయనం
బేయో మజిలీకికనను
హాయిగ కొనిపోవగాను నాక్రోశించున్
ఈక్షణాలుండు నన్ను పరీక్షసేయ
రాత్రిని దహించు క్రొవత్తులరయ నుండె
నాకలంబొక యశ్రువు వీకనింక
అక్షరమగుటకు సహాయమంది యిచ్చి
నాదు ప్రాణంబొక కవితనై ధరిత్రి
నెంచి తరియించగాను జ్వలించుచుంది
53
28.06.2020.
రవికుమార్ కంచి గారి కవిత
ఆటవికం
-------------
శాంతి వచనాలు పలుకుతున్నాం
ప్రపంచ శాంతి బహుమానాలు పొందుతున్నాం.....
సామరస్యాలు వదిలి చర్చలు మాని కయ్యానికి కాలు దువ్వుతున్నాం.....
****
లక్ష్మి కాలు పెడితే మంచిదన్నాం
మహిళ ఇంటింటా వెలసిన దైవమన్నాం
దేశదేశాల కానరాని దైవం
నలిపేయడమే తప్ప
కాపాడలేని దైన్యం
ఆడపిల్లంటేనే బరువనే కలికాల వైనం
****
ఎన్నో మానవ వనరులు
మరెన్నో విలువల హక్కుల నిలబెట్టే సంస్థలు
కులమత హింసలు జాతి విధ్వంసాలు విద్వేషాలు అణచివేతలు
కోకొల్లలు
****
నాగరిక సమాజమా
అనాగరికం వదలని ఆటవిక సమూహమా
ఎటు నీ పయనం
ఏది నీ పరిణామం
ఎక్కడ నీ పరిణితి....??
అవధాని శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారి పద్యానువాదం
శాంతి వచనములను సంతసంబున పల్కి
పరగ పొందుచును ప్రపంచశాంతి
బహుమతులనుపొంది బాపురే
సామరస్యము విడి చర్చలువిడి
కయ్యమునకు కాలు వియ్యమంచును దువ్వు
చున్నవారముర్వి మన్ననవిడి
లలన కాలుపెట్ట లక్ష్మికాలు మహిళ
ఇంటి దేవతయని యెంతొ చెప్పి
దేశదేశములను మోస వేషాలతో
నలిపి వేయుచుండి యలుపులేక
కావలేని దైన్య కలికాలమిప్పుడు
ఆడ పిల్ల భారమాయెనకట
కం:
ఎన్నోమానవ వనరులు
ఎన్నోసంస్థలు విలువలనిట రక్షింపన్
అన్నాకులమతహింసలు
ఎన్నగ రానట్టిహింసలివి ఆపవుగా
తే.గీ
నాగరిక సమాజమ నీయనాగరికము
వదలనిమహాటవిక సమూహదరహాస
మా యెటుపయనమగునీది అరయనేది
నీదు పరణామ పరిణితి ఏది యేది
వీరా గుడిపల్లి ః the mathematics teacher and poet
సమన్వయం ః శివునూరి లలితా కృష్ణ
అవధాని ః శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
సహకారం ః మెరుగు మధు
****************************
కవితాగానం సమూహంలో
పద్యానువాదం లభించిన కవిమిత్రుల జాబితా
21--40
*21.శ్రీ దండమూడి శ్రీచరణ్ గారు*
14.04.2020
*22.వకుళవాసు గారు*
15.04.2020
*23.మేడిశ్రీ గారు*
16.04.2020
*24.తేజస్విని గారు*
17.04.2020
*25.తగిరంచనరసింహారెడ్డి గారు*
18.04.2020
*26.స్వర్ణ సమతగారు*
19.04.2020
*27.వురిమళ్ళ. సునంద గారు*
20.04.2020
*28.తేజస్విని గారు*
21.04.2020
*29.డాక్టర్. దీపక్ న్యాతి గారు*
22.04.2020
*30.మర్రి జయశ్రీ గారు*
23.04.2020
*31.డాక్టర్. పాండాలమహేశ్వర్ గారు*
24.04.2020
*32.డేవిడ్ గారు*
25.04.2020
*33.ఇంద్రవత్ రాహుల్ గారు*
28.04.2020
*34.కిషోర్కుమార్ గారు*
29.04.2020
*35.రమాదేవికులకర్ణిగారు *
01.05.2020
36.సంధ్యా శర్మ గారు
05.05.2020
37.అంబటి నారాయణ రావు గారు
06.05.2020
38.వల్లాల విజయ లక్ష్మి గారు
07.05.2020
39.నరేశ్ చారి గారు
09.05.2020
40.శివలక్ష్మీ రాజశేఖరుని గారు
10.05.2020
41.శ్రీ విట్టుబాబు గారు
12.05.2020
42. శ్రీ నరేశ్ గారు
13.05.2020
43.శ్రీ వరయూరు జానకి రాం గారు
14.05.2020
44. కాల్వ రాజయ్య గారు
15.05.2020
45.గుండ్ల రాజు గారు
16.05.2020
46.వేంకట కృష్ణ ప్రగడ గారు
20.05.2020
47.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
21.05.2020
48. సర్ఫరాజ్ అన్వర్ గారు
22.05.2020
49.ఇంద్రవత్ రాహుల్ గారు
26.05.2020
50.దేశపతి మోహన్ శర్మ గారు
51
అద్దంకి లక్ష్మయ్య గారికి
12/06/2020
52
దండమూడి శ్రీ చరణ్ గారు
13/06/2020
53
రవి కుమార్ కంచి గారు
28.06.2020
**********************---
*14.04.2020*
*దండమూడి శ్రీచరణ్*
*గారి కవిత*
*బింబ ప్రతిబింబాలు!*
----------------------------------
ఆకాశం వుందే,
అది సముద్రంలోకి తన ముఖాన్ని చూసుకొని అలలుగా నవ్వింది!
ఆమె కనులలో నా మనసు తడిచింది!
నేను నన్ను నేను నాలోని నన్నును చూసుకున్నాను!
నేను అనంతంగా నాకు అగుపించాను!
అందులో ఏ నేను నేను?
ఆమెను అడిగి చెపుతాను!
కన్ను తాను చూచిన వైశ్వాన్ని తనలో దాచుకుంటుంది!
కన్ను తనను తాను లోలోతులలో చూచుకొంటుంది!!
అప్పుడు హఠాత్తుగా ఆత్మజ్ఞానం కలుగుతుంది!
ఆ కంట కన్నీరు కన్ను యొక్క నీరా?
కాదు కదా!
అది మనసు దుఃఖంలో
పొరలినప్పుడు
పారిన ఏరు!
ఆమె కన్ను నా కంట్లోకి చూస్తుంది,
తాను చూచింది నా మనసు!
నా మనసు ఆమె మనసుతో అంటోంది,
నే మనసిచ్చాను గనక,
నీలోని మనసు నాది,
నాలోని మనసు నీది!
ఇలా బింబ ప్రతిబింబాలు పరస్పరంగా అనంతాలు!
ఇంతకూ ఈ అక్షరాలు నేను రాసినవా?
నీవు చూసినవా!
ఈ అక్షరాలలో నా అశ్రువులున్నవి!
నీవు అక్షరాలు చదివితే సరిపోదు,
నా అంతరాత్మను వెతకాలి!
అపుడు నీ కంటిలో నా అశ్రువులుంటవి!
నీ అశ్రువులలో నా అక్షరాలుంటవి!!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కం:
ఆకాశమ్మొకటున్నది
లోకాన తనముఖమబ్ధిలోచూచుకొనన్
రేకెత్తుగర్వమునతో
ప్రాకటముగ అలలుగాను పకపకనవ్వెన్
తే.గీ
ఆమె కనులలో నామది ఆహ తడిచి
నేను నాలోని నన్నును నేనునేనె
చూచు కొన్నాను నేనంతశోభతోడ
నాకు నేనగుపించితి నవ్యగతిని
అందులో నేను ఏనేను ఆమెనడగి
వివరమిత్తు కన్ తాచూచు విశ్వమెల్ల
దాచుకొనుచుంది తనలోన తానుతాను
కన్ను లోలోతు లోతులో కనుచునుంది
అప్పుడు హఠాత్తు గా ఆత్మదై దనర్చు
జ్ఞాన మెంతయో కలుగు అజ్ఞానము విడు
కనగ ఆకంట కన్నీరు కంటినీర
కాదు మనసు దుఃఖముఁబొర్లి వేదనపడ
పారుసెలయేరు కన్ను ఆపడతిదింక
చూచు చున్నది నాకంటి సోగలోకి
తాను చూచింది నామదిన్ తనరిలెస్స
నామనసు ఆమె మనసుతో నీమముగను
అనుచునున్నది నేను నామనసునిచ్చు
కారణాన నీమది నీదికాదు నాది
కాదు నామది నాదిది నీది నీది
బింబ ప్రతిబింబములు గాను పెనగుకొనియె
ఇవి యనంతాలు ఓకాంత యెంచగాను
ఇంతకీయక్షరమ్ములనేను వ్రాసి
నాన చూచినావా నీవు కానగాను
ఇట్టి అక్షరాలశ్రులు యెంచ నావి
కలవు నీవక్షరమ్ములు కాంచి చదువ
అకట సరిపోవు నాయంతరాత్మ వెదకు
అపుడు నీకంటనాయశ్రులమరియుండు
అరయ నీయశ్రు లందున అమరియుండు
అక్షరమ్ములు నావియై అక్షరముగ
15.04.2020
వకుళవాసుగారికవిత
సింహం హృదయం
ఖాకి బట్టలమాటున ఉప్పొంగే మానవత్వాన్ని చేతిలోని లాఠీలోకి ఒంపి
నా సమాజాన్ని ఆరోగ్యంగా చూడాలనే తపన వున్న కరోనాంతకున్ని....
నాకై చూపులతోరణాలు కట్టి ఎదవాకిట రెప్పలతలుపులు తెరిచి వీక్షించే
ఇల్లాలికి గుప్పెడు నవ్వులను దోసిట్లో పోయాలనివున్నా ...
ఆప్యాయతకు ఆనకట్ట వేసి గుండెతలపులను మూసి నడిరోడ్డుపై
ఎండకు కములుతూ గుండె తడిని ఇంకింపచేసుకున్న కర్కషుడిని....
రేయిని తడుముతూ నిదురమ్మ నేనొస్తానంటూ కండ్లపై వాలి ముండ్లలా గుచ్చుతుంటె
చీకటి దుప్పటి కప్పుకొని రొడ్డుపక్కన అనాధగా గడియసేపు నిదురించే వేళ
ఒంటిని నిషాచరులకు అప్పగించిన నిర్ధయున్ని....
ఎప్పుడో డ్యూటి అయిపోయినంక నాకై ఎదురుచూసే నాఇంటితలుపు ముట్టడానికి కూడా నేనిప్పుడనర్హున్ని....
ఇంట్లో అడుగుపెట్టగానే అల్లుకునే పేగుబంధాలను కట్టడిచేస్తూ
ఉబికి వస్తున్న అనురాగాన్ని నీళ్ళధారలలో ఒలికించి ఒంటిని సబ్బుతో రుద్దీరుద్దీ కడిగినా
ఆప్యాయతకు అనుమానపు దడికట్టి వేరుపడేసుకున్న కర్కషుడినే....
చెలి అనురాగపు సానిటైజర్లను చేతులకు పులుముకొని
అనుబంధపు పసుపుదారాన్ని మాస్కులకు ముడుగులుగా వేసుకొని
కనపడని కరోనొరాకాసితో యుధ్ధంచేయ నడిరోడ్డుపై నిలబడిన నాలుగోసింహాన్ని....
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కం:
ఖాకీ బట్టలమాటున
పాకంబుప్పొంగు మానవత్వము చేతన్
వీకన్ గలలాఠి పనిపి
జోక సమాజంబు రుజల చోద్యము వాపన్
ఈ కాలకరోన యముడ
నాకై సతిచూపు తోరణాలను కట్టన్
నాకపుటెదవాకిటను త
దేకపు రెప్పలతలుపులు తెరచి నిరీక్షన్
తే.వీ
గలుగు ఇల్లాలికేమివ్వగలుగ లేక
గుప్పెడు నవుల దోసిట్ల గ్రుమ్మరించ
వలెను అనుకొన్న కానట్టి వాని నేను
కనగ ఆప్యాయతకు ఆనకట్టవేసి
గుండె తలపులన్ మూయుచు నుండి యిపుడు
నేను నడిరోడ్డుపై యింక నిలిచి త్వరగ
ఎండకు కుములుచును లెస్స గుండె తడిని
ఇంక చేసిన కర్కషుండే యనంగ
రేయిని తడిమి నిదురమ్మ ఓయి నేను
వచ్చెదను అంటు కండ్లపై వ్రాలి ముండ్ల
వలెను గ్రుచ్చుచునుండగా కలగి కలగి
చీకటను దుప్పటిని కప్పి చేవ తోడ
రోడు ప్రక్క అనాథగా వేడుకేమి
గడియ సేపిక నిదురించు కఠినవేళ
ఒంటిని నిషాచరులకు నేనొప్పచెప్పు
నిర్దయుని ఎప్పుడోడ్యూటి నే అయి చన
నాకయి ఎదురు చూచెడు నాదు ఇంటి
తలుపు ముట్టుటకైనను తలపనేన
నర్హుడను ఇపుడింటిలోననడుగిడగ
అల్లుకొను ప్రేగుబంధాలనకట వేగ
కట్టడిని చేసి ఆపయి కట్టలుదెగి
ఉబికి వచ్చెడు అనురాగమున్నతముగ
నీళ్ల ధారలనొలకించి నల్ల మేను
సబ్బుతోరుద్ది రుద్దియున్ జక్కఁగడగి
మనిన అప్యాయతకు అను మానపు దడి
కట్టి వేరుపడేసుకున్నట్టి కర్క
షుడిని చెలి అనురాగపు విడువనివగు
సానిటైజర్లనే చేతులానపులమి
తాకు అనుబంధపు పసుపుదారములను
మాస్కులకు ముడులుగవేసి మనుచు వేగ
నిక్కి కనపడని కరోనరక్కసిఁగని
యుద్ధమును చేయ నడిరోడ్డునుద్దవడిని
నిలుచు నాలవసింగంబు నేనునగుదు
16.04.2020
మేడిశ్రీ
......దొంగాట......
మనుషుల్లో దొంగాట
అదీ నేర్చిందట
మాయదారి రోగానికి
మనిషి గూడే నచ్చిందట..
కలుపుగోలు తనం
మరీ మెచ్చిందట
చేయి చేయి కలిపినంతనే
లోపలికి జొచ్చిందట..
ఎన్కటి
పట్టు విడుపు మంత్రం లెక్క
సమ దూరం పాటిస్తే
కుదురుతుంది దానికి తిక్క..
సుడగాలోలే
ఇక్కడే తిరుగుతుంది
వయో బేధం లేకుండా
మడత పెడుతుంది...
ఎవరెస్టెక్కిన మనిషి
అహంకారానికి చెంపపెట్టు.
దైవత్వం నింపుకున్న
వైద్యులే మానవతకు మెట్టు..
కోట్లకు పడగెత్తినా
కొరివి పెట్టే వారు లేక అనాథలై పోయారు...
బంధువులెందరున్నా
కడ చూపుకైనా రాలేరు..
ఉపద్రవాలు కూడా
ధరణికి ఉపశమనం కాబోలు...
పంకిలమైన నదులు స్వచ్ఛంగా
ప్రవహిస్తున్నాయి..
పాడు గాలి పీల్చే చెట్లు
పచ్చగా వికసిస్తున్నాయి...
మోయలేని కాలుష్యాన్ని
ధరణి కొంతైనా దించుకుంది..
జీవ రాశి బతికేందుకు
ఎంతో కొంత ఊపిరి పీల్చుకుంది...
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
నరులనదినేర్చె దొంగాట నవ్య గతిని
మనిషి గూడునచ్చె కరోన మాయదారి
రోగమునకు ;మెచ్చెడునంటరో మనుజుల
కలుపుగోలుతనము చేయి కలిపి చేయి
తోడ నుండినంతన చాలు తుష్టి యనుచు
నర శరీరము లోనికి అరుగునంట
వెనుకటిది పట్టువిడుపు మంత్ర నయమదియె
లెక్క ఒండొండుదూరంబు తక్కకుండ
ఉంటె తిక్కకుదురు దాని కంట లెస్స
ఇచటె సుడిగాలివలె తిరుగుచు జనాల
లో వయోభేదమేలేక రూఢిగాను
మడత పెడుచుంది నిశ్శబ్దమారియగుచు
ఘనుడు ఎవరెస్టునెక్కిన మనిషి లోన
పట్టు గర్వంబునకు చెంప పెట్టు అగుచు
పరగ దైవత్వమదినిండు వైద్యులిపుడె
మానవతకు మెట్టులగుచు మనుపుచుండ్రి
కోట్లకు పడగలెత్తిన కొరవిపెట్టు
వారు లేక యనాథలై నారు చూడ
బంధువులు ఎందరుండిన వారుతాము
రారు కడచూపుకైననీ వ్రాతయేమి
ఈ యుపద్రవాలు ధరణికింక కనగ
ఉపశమనమౌను కాబోలు ఉన్నతముగ
పంకిల నదులు స్వచ్ఛమై పారసాగె
పాడు గాలినిపీల్చెడి పాదపములు
పచ్చగా వికసించగ బట్టెనిట్టె
మోయలేని కాలుష్యము పుడమి కొంత
యైన దించు కొనుచు నుంది దివ్యముగను
జీవరాశి బ్రతుక గాను శీఘ్రమిపుడు
ఎంతొ కొంతొ ఊపిరిపీల్చు సంతసమున
17.04.2020
తేజస్వినిగారి కవిత
అంశం:కోవిడ్ భయం
తినాలన్న భయం
తాగాలన్న భయం
వెళ్లాలన్న భయం
ఉండాలన్న భయం
అంత కోవిడ్ మయం
అతిధి లాగే వచ్చింది
అందరిని కబలిస్తుంది
కనికరమే లేదు దానికి
కణ రూపంలో చేరుతుంది
ఇంటిల్లి పాదికి చుట్టుతుంది
ఇదే నా భయం
స్వీయ నియంత్రణ దీనికి నిర్ములనం
నిరంతరం లాక్ డౌన్ మా ఆయుధం
ఇదే మా ధైర్యం
కనిపించని శత్రువుపై విజయం.
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
కం:
తిన త్రాగ బైటకేగగ
అనయము ఇంట్లోనుమనుటమన్నను భయమౌ
వినగా కనగా యంతట
జనులు దలంతురు కరోన జపమిప్పుడొకో
ఆ.వె
అతిథి లాగ వచ్చి అందరిన్ కబలించు
చుండె కనికరంబు ఉండకుండ
కనగలేక నెవరు కణరూపమున మేని
చేరుచుండి చాల శీఘ్రముగను
చుట్టుచుంది తాను ఇట్టె ఇంటిని యెల్ల
వారి నంటువారి వారు ముట్ట
కున్న తుంపరలను ఎన్నొ విడిచినంత
వాటి ద్వార చేరబట్టె నిట్టె
వేగ దీనినాప స్వీయనియంత్రణ
లాకుడౌను లివియె లోకమందు
ఆయుధమ్ములగును అని ధైర్యమును పొంది
సూక్ష్మశత్రుజయము సొరిది గొనమె
18.04.2020
తగిరంచ నర్సింహారెడ్డిగారి
కవిత
*PUBG భూతం*
ఆకలి ధ్యాస అసలే లేదు
నిదురన్న ఊసే లేదు
అరచేతిలో మొలిచిన
సరికొత్త వైకుంఠరూప నరకకూపం..
అనునిత్యం దానికే అంకితమై
లోకాన్నే మరిచిపోతూ
తాను మాత్రం మురిసిపోతూ
అందరిలో ఒంటిరినిచేసే
సరికొత్త అంటురోగం ..
PUBG భూతంలో చిక్కుకుని
ఎవరూ ఎవరికి పట్టని తీరై
పచ్చటిజనారణ్యంలో ఎడారిమొక్కగా...
పిచ్చిలోకానికి చక్కని చిరునామాగా
తమ మైకంలో తామై... అనాధగా...
యువతరం .. నవతరం..
కండ్లల్ల గుడ్లు పొడుచుకుని వచ్చి
స్క్రీన్ పై చక్కర్లు కొడుతూ
కంటికిచిక్కని ఆ మనిషిబొమ్మని
దేవులాడి మరీ సంపుతున్నయ్..
కంటి ముందున్న తోటివానిమీద
సూపు ఏ మాత్రం ఆనదు...
వాడెవడో.. పరాయోడో..
పరిచయం లేనోడో అన్నట్టు
అంతుపట్టని మాయరోగం..
అవతలనుండి కానరానివాడెవడో
తెరపై ఆటబొమ్మలకోసం
ఆగమాగమై అరుస్తుంటే
ఇవతలినుండి వీడేమో
తన పాణాలమీదికచ్చిందన్నట్టు
లబోదిబోమంటూ ఒర్రుతుంటే
గర్జించి ఉరిమినట్టే ..
ఒక్కోసారి పిడుగుపడినట్టే ..
పక్కనున్నోళ్లకు పిచ్చిలేపినట్టే..!!
అదే
పక్కోడు ప్రేమగా పలకరించినా
బుక్కెడు తినుమని సక్కగ పిలిచినా
పగదారోలే కయ్యుమంటూ కసురుకునుడే . .
మెడనరాలు మెలిపెట్టి
వెన్నుపూసనడివెట్టి
పెయ్యంతా పుండుపుండు జేస్తున్నా
ఏదో మంత్రం చేసినట్టు ..
మందో మాకువెట్టినట్టు..
PUBG లనే మొఖం వెట్టవట్టిరి..
పాణాలను నిండా ముంచే
పాపకారి PUBG ని బొందవెడుదాం..!
పచ్చటి అనురాగాన్ని పంచుకుంటూ
పదిమందిల కలిసి జీవిద్దాం బిడ్డా..!!
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
ఉ:
ఆకలి ధ్యాసలేదు నిదురన్నది లేదరచేతి మొల్చు నా
ప్రాకటనూత్న మౌనరక భావము క్రొత్త వికుంఠమైచనన్
భీకర మైన దానిగని నిక్కము దానికినంకితమ్మునై
లోకము ఉండగా అదియె లోకము గీకమదేమిటంచు తా
నీకడ నేమనన్ మురసి పృథ్విని యంతట సంచరించుచున్
జోకని పీయుబీజి యది చోద్య కరాలపు నృత్యమాడుచున్
తే.గీ
అందరిని ఒంటి జేసెడు నంటురోగ
మయ్యె నీభూతమునజిక్కి కుయ్యొ అనుచు
ఎవరు ఎవరికి పట్టక యేమనందు
పచ్చని జనాటవినెడారి పాదపముగ
పిచ్చి లోకమునకు తాను వేగ వేగ
చక్కని చిరునామ అయెను నిక్కలేక
తమ మయికములన తమకు తామె తామ
నాథలై దిక్కుదోచక నాడునాడు
ఈయువతరము నవతరమిట్టులాయె
కండ్ల గ్రుడ్లు పొడచుకొని కడక వచ్చి
స్క్రీను పైచక్కరుల్ కొట్టి చెప్పగాను
కంటికి కనగ రాగతాముంటునున్న
మనిషి బొమ్మని వెదకి హామడయ చేయు
కంటి ముందున్న వానిపై కంటిచూపు
యెంతమాత్రము ఆనదు ఏమిటౌర
వాడెవడొ పరాయి అనగ పరిచయమిక
లేని వాడన చేసెను తాను అకట
అంతు పట్టని మాయరోగంబునేడు
అవతలనెవడొ కానరానాతడింక
తెరపయిన ఆటబొమ్మలు పరగబొంద
ఆగమాగమై వేగమై అరచుచుండ
ఇవతలను ఇత డేమియో ఇప్పుడిద్ది
వచ్చె ప్రాణాలమీదికి వచ్చెనంచు
ఓ లబోదిబో మంటుతానో సరగున
మొత్తుకొనుచుండనబ్బబ్బొ పోల్చనదియె
అకట గర్జించి ఉరిమినట్లగుచు నుండె
పిడుగు పడినట్టులొకసారి పిచ్చిలేపు
ప్రక్కునున్నట్టి వారికి వాడదేమొ
ప్రేమగా పలకరించిన ప్రీతి బుక్కె
డన్నము తినుమనుచు పిల్చు నంతలోనె
కనగ పగదారి వాడని కయ్యుమనుచు
కసురుకొనుచుండ మెడనరాల్ వెసవెసవెస
అన్న మెలిపెట్టినట్లయ్యె వెన్నుపూస
వేగ వడిబెట్టి పిసకగ పెయ్యియంత
పుండు పుండుగ చేసినట్లుండి ఎదియొ
మంత్రమెవడొ చేసెనుతాను మందుమాకు
పెట్టినట్లుగ పీయుబీజిట్టె ముఖము
పెట్టవట్టిరి ప్రాణాలనిట్టెనిండ
ముంచె పాపిష్టి దీనిని బొందవెట్టి
పచ్చటి అనురాగమ్మును పంచుకుంటు
బిడ్డ పదిమందిలకలసి ప్రేమమీర
బ్రతుకు బండిని లాగుదామతుల రీతి
19.04.2020
స్వర్ణసమతగారు
జ్యోత్స్న
పున్నమి చంద్రుని వెన్నెల కాంతి
మధికి చేకూర్చే మోదము
ఎద గీతికయై సుధలు పంచ
ప్రేయసి ప్రియుల హృదిలో నిల్వగ
పసి పాప కనులలో వెలుగులు నింపే
ము దుసలి మోమున పడచు అందము
చకోర మునకు ఆహారము
చక్షువు లకు చమత్కారము జాబిల్లి వెదజల్లే కౌముది
వెండివలే మేరియగ
పిండార బోసిన పండువెన్నెల దోచెను కన్నియల,కలువల
మైత్రి.
20.04.2020
వురిమళ్ల సునందగారి కవిత
అంశం:: ఉపవాస దీక్ష
::::::::::::::::::::::::::::::::::
దేహాలు చెప్పిన మాట వినకున్నా
మనసులు మాత్రం నిష్ఠ తో
ఉపవాసం చేస్తున్నాయిప్పుడు..
ఇంద్రియాల నిగ్రహమే
ఆగ్రహాలను అంతం చేస్తుందని
మనసంతా సమతా భావనలే
సమైక్యతా రాగాలాపనలవుతాయనీ
గాంధీ మహాత్ముడు చెప్పిన వాక్కులు
అక్షర సత్యాలై ప్రకాశిస్తున్నవి..
భగవన్నామ స్మరణతో
సాన్నిధ్యంలో
మననలను మనం తరచి చూసుకునే
మహా భాగ్యమే ఉపవాసం..
అందరం ఆ దీక్ష చేపడదాం
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
దేహములు సెప్పు మాటలనోహొ వినక
మనసులుపవాసమును జేసి మనును నిష్ఠ
నింద్రియాల నిగ్రహమది యిప్పుడింక
ఆగ్రహాలను చేయును నంతమనుచు
మనసునన్ సమతాభావ మధురిమలయి
ఆ సమైక్యత రాగములాలపించి
మించునని గాంధి చెప్పనుదంచితమయి
నేడు అక్షర సత్యముల్ వేడుకనగు
సుభగవన్నామ స్మరణతో చొక్కి స్వామి
సన్నిధానాన మనలను సన్నుతముగ
మనమె తరచి చూచుకొనెడు ఘన సుదినము
నౌ మహాభాగ్యముపవాసమౌను దాని
నందరము దీక్షగాచేయ నౌనుమేలు
21.04.2020
తేజస్వినిగారి కవిత
చరవాణి మహిమ
ప్రక్రియ:వచన కవిత
చేతిలోని మాయాజాలం
కనిపించే అద్భుత రూపం
ప్రాణం లేని వస్తువు అయిన
కృత్రిమ ప్రాణం పోసుకొని
ఛార్జింగ్ తో శ్వాస అందుకొని
అన్నం లేకపోయిన పర్వాలేదు
అంతర్జాలం ఉంటే సరి
మనం ఎలా చేస్తే అలా మనతో ఒదిగే అరచేతిలో పట్టే చిన్ని నేస్తం
మనం ఎంత చూసిన అలుపురాదు
మనకు సోలుపు వచ్చిన
దానికి ఏమి కాదు
నెట్ ఉంటే సాలు నట్టింట్లో మనతో ఆడుతుంది
విజ్ఞానమే పెంచుతూ
వినోదాన్ని అందిస్తూ
అందరిని ఆనంద డోలికల్లో ఊగిస్తుంది
ఇదే చరవాణి మహిమ
మన కరవాలంలో ఇమిడి
మనల్ని ఇబ్బడిముబ్బడి చేస్తుంది
ప్రస్తుతం ఇదేగా మన సమయానికి చేదోడు
కానీ భవిష్యత్తులో చేస్తుంది కాబోలు కీడు
అందుకే తక్కువగా వాడండి
ఇంట్లో మన వాళ్ళతో సమయాన్ని పంచుకోండి.....
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
చేతిలోనిమాయాజాలమౌతిరమ్ము
కనగ నౌయద్భుతపు రూప మనగ వచ్చు
ప్రాణమేలేని వస్తువే యైనఁగాని
కృత్రిమమగు ప్రాణము గల్గి యేమనందు
శ్వాస ఛార్జింగుతోడుతన్ జక్కగమను
అన్నమేల నంతర్జాలమున్నచాలు
మనమెటుల సేయ ఒదగును మనలఁగూడి
చెప్ప నరచేతిలోపట్టె చిన్ననేస్త
మదియె యెంతసేపును జూడ నలుపురాదు
మనకు సొలపగు దానికి కనగ రాదు
నెట్టు ఉండిన నట్టింట నెలగుమనల
పెంచు విజ్ఞానము వినోదమంచితమిడు
ఔర ఆనంద డోలికలందరినిక
ఊచు నిదెచరవాణి యమ్మో యనంగ
ఇట్లు మనకరవాలమందిమిడి యుండి
మనలనిబ్బడిముబ్బడి ననగఁజేసి
ఘనత సమయంబు చేదోడుకనగ నిపుడు
కాని భావిలో కీడును కలుగఁజేయ
గలదు కావున తక్కవగాను వాడ
మేలు చేయు ఇంట్లోవారి చాలఁగూడి
సమయమిక పంచుకొనగను జయము నయము
22.04.2020
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
శీర్షిక : జనన మరణాలు
అణువణువుల సమ్మేళనము
తనంత విశిష్ట విశ్వము
జీవాణువు ఉనికి ప్రస్థానము
వైవిధ్య జీవ గమనము
జనన మరణాలు లోకకళ్యాణం
ప్రతిగడియ నూతనత్వము సంతరింకో
తహతహలాడును జీవకణాలు
ఆ మార్పునాకాంక్షించే జననము
ఆ నూతనత్వ మనుగడకే పాతుకు కోత
అదే మరణము జీవకణ స్థానభ్రంశము
జనన మరణాల మధ్య కాలమే జీవనం
జీవి తృప్తికై తాపత్రయమే స్వార్దం
ఆస్వార్దమే భౌతికకాయ సుఖాభిలాష
అదే జీవి కామ కార్య కర్తవ్యము
ఆది జీవకణ సంకల్పాన్ని
నెరవేర్చుటకే
స్త్రీ మరియు పురుష జంట లింగాల రసవత్తర సుఖమయ శృంగార కేళి
పునఃరోత్పత్తికై పవిత్ర యజ్ఞం
ఆ సుకార్యం కోసమే కళ్యాణం
అదే లోకకళ్యాణం అదే పరమార్థం
అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం
తే.గీ.
అణువణువులసమ్మేళనమై యనంత
విశ్వమయ్యెను అదియె చిద్విలసముగను
చేరి జీవాణువులునెల్ల జీవులాయె
కనగ వైవిధ్య జీవనగమనమందు
జనన మరణాల సొగసైన చక్రమయ్యె
అగుచు లోకకళ్యాణంబునంది యిచ్చు
ప్రతి గడియ నూతనత్వప్రస్తుతమనంగ
సంతరించగ తహతహ సల్పుచుండు
జీవకణములు చెన్నొంది శేముషిగను
అట్టి మార్పును భువిజనులందగాను
నూతనత్వపు పాతుకు కోతగా మ
రణము జీవకణపుస్థాణభ్రంశ ఫలము
జనన మరణాలమధ్యలో కనగనైన
కాలమే జీవనము జీవిలీల తృప్తి
పడగ తాపత్రయమదియె స్వార్థమగుచు
అదియె భౌతికసుఖవాంచ యౌనునిజము
అదియె జీవి కామపుకార్య మౌను గనగ
జీవకణపు సంకల్పము చెన్ను మీర
తీర్చ సాగగ మగ ఆడ తెల్పరెండు
లింగములఁగూర్చి శృంగారలీల తోడ
నౌర రసవత్తర సుఖమయంబు జేసె
ఆహ ఘనపునరోత్పత్తి కైపవిత్ర
యజ్ఞమును జేయు లోక కళ్యాణమనగ
అవని పరమార్థమై వెల్గు నద్భుతముగ
23.04.2020
మర్రి జయశ్రీ గారు
పుస్తక నేస్తం
సిరాతో భద్రపరచిన మస్తిష్కం
చైతన్యశీలిలా ఆలోచింపజేస్తూ
జ్యోతిలా వెలుగునిస్తూ
మనోమాలిన్యాన్ని తొలగిస్తూ
నిపుణతను కలిగిస్తూ
అభివృద్ధికి ఆసరా నిస్తూ
మేలునందిస్తుంది
విభిన్న సంస్కృతుల వారధిలా
విలువైన రచయిత జీవనాడిలా
విజ్ఞాననిధిని
భావితరాలకు అందిస్తూ
మంచి సలహాలనందిస్తూ
మహత్తరమైన శక్తిలా
ఒక్కసారి ముద్రిస్తే చాలు
ప్రజల సొమ్ముగా నిలుస్తుంది
పుస్తక నేస్తం.
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఈసిరాతో భద్రపరచి వాసికెక్కు
నట్టి మస్తిష్కమగు చుండి ఉట్టిపడెడు
నిత్యచైతన్య శీలియై నిష్ఠ తోడ
యోచనలు చేయు చుండుచు జ్యోతి యౌచు
వెలుగు చున్ మనో మాలిన్యమిల తొలంగ
చేయుచున్ నిపుణతనిడి శ్రేష్ఠ వృద్ధి
నిడగ నాసరాయై మేలునిడుచు భిన్న
సంస్కృతీవారధిగ పని సల్పుచుండి
చెప్ప విలువగు రచయిత జీవనాడి
గాను భావితరాల విజ్ఞాననిధిని
అందజేయుచు సలహాలు నందజేసి
ఒకమహత్తర శక్తియై ఒక్కమారు
పరగ ముద్రించగా నౌచు ప్రజలసొమ్ము
పుడమి నెల్లరి నేస్తమ్ము పుస్తకమ్ము
24.04.2020
డా.పాండాలమహేశ్వర్ గారు
**మానవత్వం***
కొరోనా వైరస్ వ్యాప్తి లో
భూగోళం కుతకుతలాడుతుంది..!
అజ్ఞాతంగ లోకాన్నేలుతుంది
చైనాదేశపు వైరస్ గుట్టులో!
అభివృద్ధి దేశాల మారణాయుధాలన్ని
చీపురు పుల్లకుకూడా లోకువైనవి
ఉపయోగం లేదిప్పుడు!
మాస్కులు,పరిశుభ్రత,సానిటైజరులు
మానవులకు రక్షణకవచాలిపుడు...!
దీనులపై దయచూపని అగ్రరాజ్యాలు
నిత్యం మార్కెట్ల లాభాలు తప్ప
మానవత్వం గురించి ఏనాడూ ఆలోచించలే!
ప్రజల ప్రాణాలు బలిపెడుతున్న వైరస్
అగ్రరాజ్య ఆధిపత్యాన్ని వదులుకోలేని
మూర్ఖుల పాపఫలితమేమో!ఇది..
అహంకారం అలంకారం ఆర్బాటాలే గొప్పకదా మీకు!
పారసిటామాల్ కే తహతహలాడే
అభివృద్ది దేశాలగతి ఈనాడు ఇంతేనా అనే దయనీయ స్థితిలో?
పేదరికంతో పెద్దరికం లేకున్నా
శతకోట్ల హైందవజాతి చూపేదే
అసలైన మానవత్వం...!
ఆకలితో ఉన్న అతిథికి ఉన్నదాంట్లో సగంబెట్టి సంతృప్తి చెందే సనాతన సమన్వయ సమున్నత సంస్కార ధర్మాచారణమే మా పరిమళ తత్వం...!
కలనైనా హితం కోరే కర్మయోగులం
హృదిలో నాగరికంగా
నెమరేస్తామెపుడు మనోనేత్రంగా....!
విశ్వమానవశ్రేయమే
త్రికరణ శుద్దిగా,త్రికాలాలలో ,
అనాదిగా ఆధునికంగా,
స్నేహ వాత్సల్యాల తీపిజ్ఞాపకమే కదా మా నవనవోన్మేషణం..!
నడత భవిత పవిత్రాలోచనల పరిమళత భావానురక్తుల ఆచరణశీలత
అనుభూతులానందాల ఆతృత
దండలో దారంలా విరుల కూర్పులే వినయవిజ్ఞతల వివేచనశీలమే భారతీయ మానవతత్వం..!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఈ కరోన వైరసిపుడు ఇట్లు వ్యాప్తి చెంద భూ
లోకమింత కుతకుతకుత రోజురోజు ఉడుకగా
ఏక ఛత్రమంది కానకింక యేలుచుండుచున్
లోకమంత మ్రింగుచుండె నోరు లేని భూతమై
ఆకృతి యిది చైన యందు ఔరదాల్చి భూమిపై
ఈకడయని ఆకడయని యేలచెప్ప బాపురే
తాకి దీని మట్టుబెట్ట తాము ఒక్క ఆయుధం
బేకలుగక వృద్ధిచెందు ఇన్ని దేశదేశమల్
లోకు వయ్యె ఆయుధాలు నూనమౌచు చీపురున్
నీకు నాకు శుభ్రతల్ వినిష్ఠ దాల్చు మాస్కులున్
రాక ఇంటనుండుటొకటె రక్షణమిడు కవచమౌ
లోకమందు దీనులపయి రూఢి జాలిలేకయే
నాకమనుచు మార్కెటుగను నాడునేడు మార్చి యిం
దాక తెచ్చి జనులు నిష్ఠతాము వీడజేయగా
ఈకలియుగ మగ్రరాజ్యమే వినీతి వీడగా
నే కబలము జేయుదనుచు నేడు రెచ్చుచుండె ఏ
మో కనంగ భారతీయ పుణ్యభావయోగమే
ఆకలమయి జీవరాశులందు ప్రేమఁజూపెగా
శ్రీకరమగు భోజనంబు స్నేహమందు స్వచ్ఛతల్
ప్రాకటమగు నడత భవిత రమ్యమైన యోచనల్
జోకగాను వ్యాప్తమైన చోద్యమేమి కాదులే
లోకమునిటు వంటివింకలుప్తములగు వైరసుల్
రాకలనిడు మానవతయె రమ్యభారతీయులే
స్వీకరించ లోకమంత స్వీకరించ శుభమునౌ
25.04.2020
కరుణా హస్తాలు
:కడియం డేవిడ్ గారు
లాఠీ పట్టిన చేయి
కరుణామయియై
కన్నీరు తుడుస్తుంది.
పట్టెడు అన్నం పెట్టి
పరామర్శిస్తుంది.
నేరాన్ని ఓర్వం
కడిగి పడేస్తాం
ఆపదలో ఆపన్న హస్తం
అభయ హస్తం అందిస్తాం.
అరాచకాలు అన్యాయాలు
కనిపిస్తే కాల్చేస్తాం.
మానవత్వాన్ని నిలబెడతాం.
మానవ సేవలో ముందుంటాం
మంచి కోసం ప్రాణాలైనా అర్పిస్తాం.
ప్రాణాలు నిలబెడతాం.
మా వస్త్రాలు కాఖీ గానీ !
మా హృదయం నవనీతం.
వృత్తికి నిబద్ధులం
మానవత్వానికే ప్రతీకలం.
పోలీసన్నా !సలామన్నా
అంటున్నారు ప్రజలు.
దండాలయ్యా పోలీసన్నా
అంటున్నారు జనులు.
నీ పిల్ల జెల్లా సల్లంగుండ
అంటున్నారు సర్వజనం.
మా సేవల మెచ్చి
మా పై పదాలు కట్టి
కైతలు కట్టి
పాటలు పద్యాలు
పాడుతున్నారు.
తృప్తైతుంది.
కడుపు నిండినట్టుగుంది.
జీవితం సార్థకం అయింది.
సర్వే జనా సుఖినోభవంతు.
అందరూ సల్లంగ ఉండాలి అని
మా పోలీసుల కోరిక.
మీరంతా ఇంటి దగ్గర కుదురుగా
ఉండాలని మా కోరిక.
కరోనా మన దరికి రాదిక.
జై పోలీస్ !
జైజై పోలీస్!!
జై జవాన్.!
వందేమాతరం.
జైహింద్.
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
సీ:
లాఠి పట్టినచేయి రమణతో కరుణతో
కన్నీరు తుడుచు నీకాలమందు
పట్టెడన్నముపెట్టి వర పరామర్శను
చేయుచుండెను పూలు పూయుచుండి
నేరంబునోర్వము నెఱి ఆపదయైన
ఆపన్నహస్తంబు అందనిడమె
అన్యాయములు లెస్స ఆ యరాచకములన్
కనిన కాల్చుచునుండ గలిగిమేము
మానవత్వంబును మహిలోననిల్పుచు
మానవసేవలో మనుచునుండి
మంచికై ప్రాణాలు మరియర్పణంబిడి
ప్రాణదీపము నిల్పబట్టినాము
నవనీత హృదయంబు నష్టంబు గానట్టి
వృత్తి నిబద్ధత చిత్తమలరు
వస్త్రాలు ఖాకియై వరలిన కాని మా
మనసు తెల్లని వస్త్రమనగమనును
తే.గీ
అందుకే ప్రజలందరు అనుచునుండ్రు
అన్న పోలీసన్న సలాము అరయనీదు
ఆలి పిల్లలు సల్లంగనలరుగాక
మాదు సేవలు కొనియాడి మాపయినను
పాటలన్ పద్యగేయాలు పాడుచుండ్రు
కాని మాకోరికొకటుంది కాదనకుడు
కడుపు నిండును మీప్రేమ పడినమాకు
ఈకరోనపై యుద్ధంబునిట్లుసేయ
లాకుడౌనును పాటించి రక్షను గొన
ఇంటి నుండుడి బైటికి యేలరాగ
వచ్చి ఈప్రమాదపు వలబడుట యేల
సర్వజనులిల సుఖముగా సాగుగాక
యనుచు కోరెడు మామాటనాదరించి
మనుచు మీరన్న స్తుతులివి మానితమగు
మేము మీమాటలను కల్పి మించియనమె
కం:
జైజై పోలీస్ జైజై
జైజైజైజై జవాను జైజై జైజై
జైజై జైహిందు విలస
జైజై ఓ భరతమాత జైజై జైజై
28.04.2020
ఇంద్రవత్ రాహుల్
*అంశం*: రాజ్ ఘాట్
బాపూజీ ఆశయం
ఆ మహాత్ముడి పవిత్రమైన చోటు
సత్యం, అహింసను జయించిన మహా వీరుడు
ఢిల్లీలోని తన రాజ్ ఘాట్
స్మారక స్థలం
మన జాతిపిత బాపూజీ
ఇక లేరు
ప్రజల గుండెలో రాయి పడ్డది
ప్రతి ఏటా వస్తూనే ఉన్నది మనకు
స్వాతంత్ర దినం కానీ
ఏమి సాధిస్తున్నాం ఆలోచించాలి
క్షణం క్షణం గాంధీ మాట
ఘడ్సే తూటా..
అక్రమాల బాట
నిలవాలి నిలవాలి గాంధీజీ ఆశయం
రాజ్ ఘాట్కు శాంతిని అందించాలి..
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఆమహాత్ముని ఆశయంబన్న యెన్న
సత్యము నహింస వీటిచే సాటిలేని
వీరుడై జయించె బ్రిటీషు వితత శక్తి
ఢిల్లిలో నను రాజ్ఘాటు లీలగాను
తనదు స్మారకపు సమాధి తాను నుండె
అతను స్వాతంత్రమందించి నందువల్ల
సరిగ ప్రతి వత్సరమ్మున పరగవచ్చు
చుండు స్వాతంత్ర్య దినము మహోన్నతముగ
కాని సాధించినది యేమొ కనగవలెను
క్షణము క్షణము గాంధీమాట గాడ్సె దైన
తూట అక్రమాలకు బాట తుష్టినేది
గెలుచుచుండెనొ ఒకమారు తలచవలెను
నిలుప వలెగాంధి ఆశయంబలుపు లేక
రాజు ఘాటుకు శాంతి విరాజతనిడ
29.04. 2020
కిషోర్ కుమార్ గారు
లాక్డౌన్ కట్టడి సమయాన
కవులకు వరం కవితాగానం
కాలు బయటపెట్టకుండా కట్టడి చేసింది
మనసు వ్యాకులచెందకుండా స్వాంతన
చేకూర్చింది
సాహిత్య లోకాన ఒంఠరి కావంటూ తోడునీడై నిలచింది
గొప్ గొప్ప స్నేహ హస్తాలు అందుకునేలా
చేసింది
నిత్యనూతనమై కవితా తేజస్సుతో ప్రకాశిస్తూ
కవులకు ప్రాణమై అమృత సమానమైంది
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
కవితా గానమిదయ్యెగా వరము లాక్డౌనైన కాలంబులో
కవులున్ బైటికి కాలుబెట్టక యిదే కైతల్ వెసన్ వ్రాయగా
చవితో దూరము నెట్టె వ్యాకులతనే స్వాంతమ్ముకే స్వాంతమే
రవలించెన్ మరి బాపె ఒంటరియనన్ రాకుండ చేసెన్ గదా
కవులన్ పెద్దల కల్పి స్నేహలతలన్ గల్పించె యల్పత్వమే
స్తవనీయంబు కరోనవీడ సలిపెన్ ధన్యప్రకాశమ్మిదే
కవిలోకంబునగల్గె పారె యలుగుల్గా జోరుగా కైతలే
**
05.05.2020
వై.కె.సంధ్యశర్మ
*శీర్షిక: *వెన్నెముకలవుదాం!*
దేశపు వెన్నెముక విరుగుతున్న చప్పుడు
రాశులు రాశులుగా దేహాలు రాలుతున్న చప్పుడు
వలసల వలువలు కప్పుకున్న రహదారుల్లో
వేకువనే చితి చీకట్లు ముసురుకుంటున్న కాలమిది
ఉదయిస్తూనే వేల సూర్యుల అస్తమిస్తున్న దృశ్యమది
సంధ్యలన్నీ రాలి సింధూరం పులుముకుని
ఎర్రబారిన ఆకాశమది
నిర్వేదం నిండిన కళ్ళలో
ఓ మిణుగురు వెలుగు
చీకటిని తరిమే ఆపన్న హస్తం కోసం
అడుగడుగునా మానవత్వ మడిని తట్టి లేపుతోంది
ఆందోళన అణువణువై అంబరాన్ని తాకుతుంటే
ఖాకీలు భద్రతా వలయంలో గూళ్ళను చిక్కబట్టుకుని
ఎర్రని ఎండకు కమిలిపోతోంది
కుండపోతగా కన్నీళ్ళ జడివానలో తడిసిన
ఒక్కొక్క మొలకకు తెల్లకోటు జవాను ఊపిరిపోస్తోంది
బతుకు పందెంలో ముందుండాలని
బానిసలైపోయాం...
పచ్చని చెట్టుకింద ఎండు గడ్డి పూసై వాడిపోయాం
ఇప్పుడు అన్నీ జ్ఞాపకాలే
మానం... ప్రాణం....
మాత్రమే ముఖ్యమైపోయింది
తలుపు తెరవగూడదు...
అరచేయి చాచగూడదు...
జరభద్రమై దాక్కుందాం...
కనపడని రక్కసికి కాలమైపోక
నీ గాలిని నువ్వే పీల్చుకో...
నీ ఆయువుకు నువ్వే శ్రీరామ రక్షగా దీవించుకో...
మన దేశ వెన్నముకలై నిటారుగా నిలబడదాం!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
సీ:
వలసల వలువలు విలసమై ధరియించి
రహదారి వేకువన్ లలినివీడి
చితిచీకటులు క్రమ్మి మతిచెర్చుకాలమై
ఉదయించి వేరవుల్ యోగ్యతవిడి
అస్తమౌ దృశ్యాలు నంతట కలుగగా
సంధ్యలన్నియు రాలి సరగుననిక
సింధూరమును దాల్చి చెప్పనాకాశంబు
ఎర్రబారగజేసె యేమనందు
గీ:
కనుల నిర్వేదమదినిండె కాని ఎదియొ
యోమిణుగురుల వెలుగులు నుదయమయ్యె
చీకటిని తర్ము నాపన్న ప్రాకటమగు
హస్తమేదొ అడుగడుగు నందునిపుడు
మానవత్వపు తడినిచ్చి మనుచుచుండె
మనసులోన నాందోళన కనగనెందు
పెరిగె బైటకు వెడలుట బందుగాగ
భద్రతావలయంబున బరగ గూడు
కట్టి ఎర్రని ఎండకు ఖాకులిపుడు
కుమిలి పోయిన జనులకు మమతపంచు
కుండపోతల కన్నీళ్లు కురియు జడిని
మొలక యొక్కక్కటిక మున్గిపోక తాము
తెల్లకోట్ల జవానులు నుల్లమలర
పోయు చున్నారలూపిరి పొలపుమీర
పచ్చని తరువు క్రిందట పరగగడ్డి
పూవుగా వాడిపోయిన మోదమిపుడు
పూర్వమగు జ్ఞాపకంబులు పూయమదిని
జ్ఞాపకాల దొంతరలందు గడపవలెను
తలుపు తెరవగరాదింక తలచి ప్రేమ
చేయి చేతిలో పెట్టగ చేయరాదు
భద్రముగ దాచుకొనవలె బైటకింక
రాక కనబడని కరోన రాక్షసికిక
కాలమైపోక పీల్చునీ గాలినింట
నీకు శ్రీరామరక్షగా నీదు ఆయు
వింక చేకొని సాగుమా వంకలేక
దేశమునకు వెన్నుముకగ దీప్తిగొనగ
వెలిగు నీవె నిటారుగా వితతదీక్ష
06.05.2020
అంబటినారాయణ రావు గారు
ఏదో లేదని
తపన చెందుచున్నాం
ఉన్నది సరిపోదని
మదన పడుచున్నాం
లేనిది కావాలని
తెలియకుండానే రావాలని
తెలిసేలోపు పొందాలని
పొందింది
జీవితాంతం ఉండాలని
పుట్టుకతొనే
లక్షాదికారి కావాలని
చూస్తు చూస్తూనే
కోటీశ్వరలం కావాలని
కలలు కంటుంటారు
కాలం వెంట పరుగులు
తీస్తుంటారు
కాలం నవ్యత్వానికి
దారి చూపుతుంది
అనుభవాల సారాన్ని
పంచుతుంది
మనిషి పుట్టుక
లోతైన సారాంశం
ఇదే మానవ నైజం
సరీగా అర్థం చేసుకుంటే
తన మీదతనకే నమ్మకం లేదు
ఏదో లేదని వ్యర్థంగ
భావించుకుంటారు
సరీగా అర్థం కాకపోతే
జీవితం వ్యర్థ మవుతుంది
చక్కని మాటను దాటేస్తాం
విలువైన దానిని వదిలేస్తాం
మంచి ఆత్మీయతను తోసేస్తాం
సరైన దారిని విడిచి పెడుతం
కలతలు తీర్చేకాలం రావాలి
బతుకును నడిపించే
భరోసా కావాలి
దుఃఖాన్ని పోగొట్టే
దోస్తు కావాలి
కష్టాని తొలిగించే
ఇష్టం కావాలి
వ్యర్థ ప్రయాసాల పరుగులో
ఎక్కడో ఏదో పట్టు జారిపోతం
ఎవరి ఆత్మశక్తిని వారే
జాగృతం చేసు కోవాలి
ప్రతి ఒక్కరిలో విశాలమైన
ధృక్పథం ఉంటుంది
ఎవరికి వారు పరివర్తన
చెందాలి ఎడారిలో నిలబడి
నీటి చలిమే కావాలంటే ఎట్లా
అందని దానికి అర్రులు చాస్తాం
అనుక్షణం అదే
ఆలోచనలో పడి పోతాం
అశాంతి మనసుతో
బతుకుతున్నాం
నిజమైన ప్రశాంతతను
వదిలేస్తున్నాం
ప్రతి ఒక్కరు తెలుసుకొని
నడుచు కొనే మార్గాన్ని
కోల్పోతున్నాం..!!
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
ఏదొ లేదని తపననీవేల చెంది
ఉన్నదిసరిపోదని బాధనన్నపడుట
నీవు నేనందరముకూడ నిరతమిటుల
లేనిదానికి నారాట మూని యూని
తెలియకుండనె సంపదల్ గలుగగాను
గలుగు సంపదల్ బ్రతుకంత నిలువగాను
పుట్ట గానె కోట్లెన్నొయొ ముట్టవలెను
ఇటుల కలలెన్నొ కంటుండి పృథ్వి పైని
యేల కాలము వెంబడి ఎపుడు పరుగు
దీయుచుండుచు నవ్యత్వ తీరమునకు
దారిచూపుచు కాలంబు దానినుండి
అనుభవాల సారంబును అదియె పంచు
మనిషి పుట్టుక లోతైన మర్మమిదియె
ఇదియె మానవనైజము ఇదిసరిగను
అర్థమును చేసికొనకుండ వ్యాకులపడు
మనిషి తనమీద విశ్వాసమును కలుగక
లేని దేదొ భావించుచు కానకుండ
నిజమునీరీతి వర్తించి నెగడుచుండు
అర్థమిది గాగ బ్రతుకది వ్యర్థమగును
చక్కని పలుకు దాటేసి నిక్కమైన
విలువ గలదాని వదలుచు వేగిరముగ
మంచి ఆత్మీయతను ద్రోసి మనుచునుండి
వేగ సరియగు దానిని విడిచి పెడుచు
ఎపుడు కల్లోలమగు దారినిటులపోవ
నిపుడు నదిమాన్చి బ్రతుకునకెంతగానొ
ఒక భరోసను నిడుమార్గ మొకటి యంద
యిచ్చి దుఃఖము దొలగించు హితుడు వలయు
కష్టమును తొల్చు నదిగొప్ప ఇష్టమింక
మనకు కావలె కావాలె ఘనతరముగ
వ్యర్థమగు ప్రయాసంబుల పరుగునందు
ఎక్కడోపట్టు జారుచు నిక్కలేక
పోవుచుండుట కనిపెట్టి పొలుపుమీర
ఎవరి ఆత్మశక్తిని వారె భువిని జాగృ
తంబు చేకొని సాగిన ధన్యత యగు
ఎంచ ప్రతినరుడు విశాలదృక్పథమ్ము
కలిగియుండును సహజంబుగాను లోన
స్వీయ పరివర్తనము తాము చెందవలెను
ఓయెడారిలో నిలబడి యోహొ యోహొ
నీటి చెలిమకు ఆశించనేల మరియు
అందనిదగు ద్రాక్షకర్రు లకటచాచు
టేల ఎప్పుడా యోచనలేల యవియె
ఇటులనేల యశాంతిలోనింక కూల
నిజ ప్రశాంతత వదలుచు నేల బ్రతుక
నరులు ప్రతివారు మార్గంబు నరసి కొనుచు
నడుచు నిజమార్గ మెరుగుటే విడువకుండ
యోగ్యమగు దానికోల్పవనుచితమొక్కొ
38.
07.05.2020
:; వల్లాల విజయలక్ష్మి
శీర్షిక:**పరిమళం***
----------*********---------
ఆలోచనా బీజాలను
పత్ర క్షేత్రాల్లోన కలమను
చిన్నిహలం సాయంతో వేయటం
కవితాలతలను పెంచటం
కవనవిరుల సుమింప చేయటం
'భావఫలాల'ను పండించటం
ఆ సుమధుర *పరిమళాల* ఆస్వాదనం
కొందరు అక్షరాస్యుల అదృష్టం
అంతరంగపు స్పందనను
మాటల్లో వ్యక్తపరిచే కన్న
అందంగా అక్షరీకరించుటే మిన్న
అర్థవంత పదనిధులే కోట్ల కన్న మిన్న
అనుక్షణం ఎదలో మెదిలేస్పందన
అద్భుతమైన అక్షరాలైన వేళ
పర్వదినమే భావకవి హృదయానికి
అక్షరాలు నేర్పటమూ సార్థకమే జీవితానికి
మన అంతరంగాన మానవత్వం
మన పదాల్లో నూతనత్వం ఉన్న
నిలుచును కదా మన అక్షరాలు
పరిమళభరిత పారిజాతసుమాలై
శాశ్వత పరిమళం విద్యాసుమాలది
పేదల తొలితరం పిల్లలు దిద్దేఅక్షరాలు
వాళ్ళజీవితాల్లో శిలాక్షరాలై నిలుచు
అక్షయపాత్రలై తర్వాతి తరాల కాచు
నేనుసైతం విద్యాగoధాలు అద్దుతున్నా
విద్యాదాతనై మనస్ఫూర్తిగ మురుస్తున్న
చదువులమ్మ తల్లిఒడిలో జీవిస్తున్నా
పిల్లలతో చేరి అనంతంగ హశిస్తున్నా
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
మొనసి యాలోచనాబీజ ములను వేయ
విలస మనమను క్షేత్రాన కలమనియెడి
చిన్ని హలము సహాయాన చివురు పెట్టి
కవితలను లతలు మొలచు కనగ బాగ
కవన సుమములను సుమింప గాను జేసి
భావ ఫలముల పండించి చేవతోడ
ఆసుమధుర పరిమళాలనాగ కుండ
చెలగి ఆస్వాదనము జేయ చెప్పగాను
అక్షరాస్యులది అదృష్టమౌను ఎంతొ
అంతరంగపు స్పందన నద్భుతముగ
మాటలన్ వ్యక్త పరచెడి మాటకన్న
అక్షరీకరించుటమిన్న అందముగను
అర్థవంతపు పదనిధులరయ కోట్ల
కన్న మిన్నయెయయి తాము కూడునెపుడు
ఎదననుక్షణస్పందనల్ మెదలి అద్భు
తమగు అక్షరాలగువేళ తప్పకుండ
పర్వదినము భావకవికి పరగ హృదయ
మునకు నక్షరాల్ నేర్పుటమనగ సార్థ
కంబు జీవితమునకు లోకంబు నందు
మానవత్వ మంతరమున మనుచు నదియె
పదములన్ నూతనత్వంబు పరగమనిన
అక్షరాలవి పరిమళ మౌచు పారి
జాత సుమములై వాసించు శాశ్వతముగ
పేదల తొలితరముపిల్లలాదరముగ
దిద్దునక్షరాల్ శాశ్వతముద్దవడిని
పరగ విద్యాసుమంబుల పరిమళంబు
లివియె వారి బ్రతుకులందునెంచగాను
ఆ శిలాక్షరాలైనిల్చు నారయగను
తగిన యక్షయ పాత్రలై తరతరముల
కాచు తర్వాత తరముల కాంచగాను
అరయ విద్యాసుగంధాలనద్దుచున్న
నేను సైతము మురియుచు మానితముగ
అద్భుతముగ విద్యాదాతనౌచునుంటి
చదువులమ్మ తల్లి యొడిలో చక్కగాను
జీవనము చేయుచుంటిని చేరునట్టి
పిల్లలనుకూడి యెంతయో యుల్లమలర
39
09.05.2020
*నరేష్ చారి గారు*
గెలుపెవరిదో...!
**************
కత్తులులేవు
బాంబులులేవు
రక్తపాతమసలే లేదు
కానీ
ప్రపంచయుద్ధం మాత్రం
ముమ్మరంగా జరుగుతోంది
శవాలకుప్పలు
ఎవరెస్టులౌతున్నాయ్
కనీ వినీయెరుగని వింతయుద్ధమిది
చరిత్రలో
ఏ రాజూ చేయలేదు
భవిష్యత్తులో
ఏ పాలకుడూ చేయలేడు
ప్రపంచమంతా ఒకవైపు
కరోనా ఒకవైపు
శత్రువు ఒక్కరే
కంటికి కనిపించదు
కానీ
కళ్ళముందే తిరుగుతుంది
ప్రతిమనిషినీ
అణుబాంబుగా మార్చగలదు
కరోనా కనికట్టు నేర్చిందేమెా !
యుద్ధం ముగియాలంటే
శాంతి ఒప్పందం జరిగేది
కానీ
ఈ యుద్ధమే
శాంతియుతంగా జరుగుతోంది
కాలం మారింది
ఈ శాంతియుత యుద్ధాన్ని
కలసికట్టుగా కాదు
విడిగావుంటేనే
గెలవగలమని రూఢీఅయ్యింది
యుద్ధానికి
రెండుకారణాలు
ఒకటి అస్థిత్వం కొరకు
రెండు ఆధిపత్యం కొరకు
ఇప్పుడు
జరుగుతున్న యుద్ధంలో
అస్థిత్వం కొరకు మనిషి
ఆధిపత్యం కొరకు కరోనా
అహర్నిశలూ పోరాడుతున్నారు
ఈ శాంతియుత యుద్ధంలో గెలుపెవరిదో మరి !
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
లేవు కత్తులు బాంబులు లేనె లేవు
రక్తపాతము లేదు నేరకముగాను
అరయగ ప్రపంచయుద్ధంబు జరుగుచుంది
వడకనెవరెస్టునెత్తు శవాలకుప్పు
లన్నిదేశాల నిండునీ యవనినంత
చరిత కనని వినని దైన సంగరంబు
వింత యేరాజు చేయడు పృథ్వి భావి
లోన నొకవైపు ధరణియే తానునుండ
ఈకరోన యింకొకవైపునెంచ చిన్న
శత్రువొక్కరె సూక్ష్మమై జనుచు మనుచు
కండ్లముందరే తిరుగుచు కానబడక
ప్రతిమనుజునణుబాంబుగా రాణ మార్చు
తెలియనొకని నుండి యొకనికలయకుండ
వేలమందిలో వ్యాపించు వేగిరముగ
శాంతి యొప్పందమదిమున్ను జరిగి భువిని
ముగియు యుద్ధంబు కాని యపూర్వముగను
శాంతిగా యుద్ధమీవేళ సల్పుచుండె
నరులు కలిసికట్టుగ చేయ నరయగాక
ఎవరికినివారు విడిగతామే మనంగ
యొంటరిగనున్న ముగియునీయుద్ధమిపుడు
ఆధిపత్యంబుకు కరోన యవని యందు
నరుడు అస్థిత్యమును నిల్పనరయనిట్లు
జరుగు యుద్ధంబున నహర్నిశమములిట్లు
నుభయపక్షాలు పోరాడుచుండ నేటి
శాంతియుత యుద్ధమందున శాశ్వతమగు
గెలుపు నెవరిదో కాంచగవలెను ముందు
40
10.05.2020
*శ్రీ శివ లక్ష్మీ రాజశేఖరుగారు*
శీర్షిక: అమ్మగా నీ కొత్తజన్మ
నీ రక్తమాంసాల ముద్దగా
ఆ చీకటి గదిలో నేను ఉన్నప్పుడు
కలలన్నీ కొంగున కట్టి
ఎదురు చూస్తివే నా రాక కోసం
సడలుతున్న ఆహార్యం
సహకరించని ఆరోగ్యం
లెక్కచేయని నీ మాతృత్వంలో
అందమైన ఊహలు ఎన్నో నా కోసం
పురిటి నొప్పుల పునర్జన్మ లో
అమ్మగా నీ కొత్తజన్మ
నిద్రలేని నీ రాత్రులకు
విసుగురాని నీ సేవలకు
ఏ రుణం కారణమో అమ్మా !!
నా తొలి అడుగుల్లో అడుగైనావు
నా చిరు పలుకుల్లో పలుకైనావు
ఆటల్లో, అల్లరిలో, చదువులో,
ఎదిగే ప్రతి మలుపులో
సాధించే ప్రతి గెలుపులో
వెనకున్న హస్తానివి నీవు
నా ప్రియనేస్తానివి నీవు!!
మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో ప్రతి అమ్మకు
*అవధాని శ్రీఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
నీరక్తమాంసాల నిండైన ముద్ద
గా చీకటి గదిని అలమటించంగ
కలలన్ని కొంగున కట్టుకొంచింక
నారాకకై వేచు నాతల్లి నీవె
సడలు ఆహార్యంబు సహకరించనిది
ఆరోగ్యమును గల్గి అన్నింటి నీవు
లెక్కచేయవు గాదె ప్రేమతో నెపుడు
మాతృత్వ బంధాన మహిలోన చూడ
అందమౌ యూహలు ఆహ నా కొరకు
పురటి నొప్పులనుచు పోపునర్జన్మ
పొంది నన్ కనెదవీ భూమిపై తల్లి
నిద్రలేనటువంటి నీరాత్రులకును
విసుగు రానటువంటి వితతంబులైన
నీసేవకు ఋణము నేనెట్టులిత్తు
నాతొలి యడుగులోనన్ అడుగువయి
నాచిరు పలుకులందనగ పలుకయి
ఆటలో చదువులో అల్లరిలోన
ఎదుగు ప్రతిమలుపు నేమనన్ వచ్చు
సాధించు ప్రతిగెల్పు సర్వమ్ము నీవె
వెనుకున్న హస్తంబువేనీవు తల్లి
నాప్రియ నేస్తంబనంగను నీవె
41
12.05. 2020 *విట్టుబాబు గారి కవిత*
*తలకెక్కింది గర్వం*
తలకెక్కింది గర్వం!
నేనే కదా శరీరాన్ని ఆడించేదీ అని
నేను లేకపోతే శరీరానికి చేతనమేదీ అని
జ్ఞానేంద్రియాలన్నీ నాలోనే అనీ
కానీ
చల్లని స్పర్శను మరచిపోయింది
తనకి చేతనత్వాన్ని ప్రసాదించే
గుండెకాయ ఎక్కడుందో మరచిపోయింది
బాహువు కత్తితో వేటు వేస్తే
తను తెగి పడుతుందని మరచిపోయింది
ఉదరం అజీర్తి బాట పట్టిందంటే
నొప్పి తనకెక్కుతుందని మరచిపోయింది
కాళ్ళు లేకపోతే గుడి దాకా
చేరలేననీ మరచిపోయింది
చేతులు లేకపోతే
తను కొలిచే దైవానికి
రూపం లేదనీ మరచిపోయింది
తలకెక్కింది గర్వం!!
శరీరంలో ఏదీ అప్రధానమైనది కాదనీ
ప్రతీభాగం అప్పుడప్పుడూ
అనారోగ్యంతో గుర్తు చేస్తూ ఉంటుంది
వివేకంతో సరైన వైద్యం చేసిందా సరే!!
లేకపోతే చివరికి
మ....ర......ణ... మే
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారి పద్యానువాదం*
మంజరీద్విపద
తలకెక్కె గర్వంబు తలచి దేహంబు
నేనె యాడించెద నిక్కంబటంచు (1)
నేది చైతన్యంబదేది నేలేక
యీశరీరమునకునింకయేడుంది(2)
జ్ఞానేంద్రియంబులు నాలోనివనుచు
కాని చల్లని స్పర్శ కడకింక మరచి (3)
చేతనత్వము నిచ్చి శీఘ్రంబు తనకు
కూర్మితో పనిచేయు గుండెకాయ యది (4)
ఎక్కడున్నదొ మర్చెనేమని చెపుదు
వేగ కత్తియె చేతి వేటువేయంగ(5)
తనుతెగిపడునను తగమర్చిపోయె
ఉదరమజీర్తియై యుండినన్ జాలు (6)
మరినొప్పి తనకెక్క మరచి పోయెనుగ
కాళ్ళు లేకను గుడి కాడికి చేర (7)
లేనని మరిచెనులే యేమనందు
చేతులు లేకున్న శ్రీహరిన్ గొలువ (8)
రూపంబు లేదనన్ రూఢిగన్ మరచె
తలకెక్కె గర్వంబు తలప శరీర(9)
మప్రధానమదేది యవనికాదనుచు
ప్రతిభాగమప్డప్డు రయము గుర్తిట్లు (10)
చేయు రోగంబులు చేరంగమీరి
సరియైన వైద్యంబు చాలవివేక (11)
మంది చేసెనసరి యాకాలుపురియె
మరణశాసనమయి మరిచేర్చుకాన (12)
జగతి బ్రద్క వలెను జాగ్రత్త తోడ...
జీవ!నీయంగముల్ చెదరగనీక (13)
42
13.05.202
*నరేష్ గారు*
మా బడి
********
కిరీటాలు లేని దేవుళ్లు
గురువులు -
పరిమళం వెదజల్లే పువ్వులు
విద్యార్థులు -
చమురులేని దీపం
జ్ఞానం-
మెుత్తంగా మా బడి
ఇలాతలంలో వెలసిన
అపురూపమైన గుడి
ఊరిచివర వెలసినందుకేమెా !
మాకది ఉద్యానవనమైంది
బడంటే బడికాదు
మేలిమి రత్నాలనందించిన
జ్ఞాన సముద్రం
బలమైన పిల్లర్లు
తెల్లని సున్నం
గంభీరమైన రూపం
సింహపు దర్జా
రాచఠీవి
మెుత్తంగా అదొక
ఇంద్రుని ఐరావతం
వానాకాలం వచ్చిందంటే
ఆకాశమంత గొడుగయ్యేది
వర్షాకాలంతో
ఎడతెగని అనుబంధం దానిది
అందుకేనేమెా!
తనబాధను చెప్పుకుంటూ
కన్నీరు కార్చేది
తన హృదయంలో
ఎన్ని మేకులు దింపినా
బాధనోర్చుకుందే కాని
బయటెవ్వరికీ చెప్పుకోలేదు
మమ్మల్ని బయటకూ తరమలేదు
అదేకదా! తల్లిప్రేమంటే
తల్లి ఒడిలోకంటే
తన ఒడిలోనే మా జ్ఞాపకాలన్నీ
దెబ్బలాడుకున్నా
గురువుల చేతిలో
బెత్తం దెబ్బలు తిన్నా
అల్లరి చేష్టలతో
వెర్రెత్తించినా
అప్పటికవి మాకు చేదుజ్ఞాపకాలే
కానీ
ఇప్పుడవి మాకు మధుర జ్ఞాపకాలు
మరచిపోని జ్ఞాపకాలు
మళ్ళీ మళ్ళీరుచి చూడాలనిపించే
మాధుర్యపు గుళికలు
తన విశాల బాహువులతో
అక్కున చేర్చుకుని
బాల్యజీవితానికి
బంగారు వేదికనందించిన బడి
మా అల్లరి భరించి భరించి
ఆరుగాలం
మా హృదయ క్షేత్రంలో
జ్ఞానబీజాలు నాటీ నాటీ
అలసి సొలసి
భూమాత ఒడిలో
శాశ్వత నిద్రకుపక్రమించింది
మళ్ళీ తన ఒడిలో
ఒక్కసారి ఒదిగిపోవాలనున్నా
అది మాకు
నిజంకాని స్వప్నంగానే మిగిలింది
*అవధాని శ్రీఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
మకుటాలు లేనట్టి మాధవుల్ గురులు
పరిమలంబును చల్లు వారు విద్యార్థి
గణములు దీపమౌ జ్ఞానంబు చమురు
లేనట్టిది బడియె ప్రేమలగుడియె
ఊరు చివర వెల్గు నుద్యానవనమది
జ్ఞానరత్నాలిడు జ్ఞానవారాశి
బలమైన పిల్లర్లు బాగుగా గల్గి
సున్నంబు ఠీవిలో చూడనైరావత
మదియోచు దోచు మహాద్భుతంబౌచు
ఆకాశము గొడుగు నౌవానకాల
మదిరాగ వర్షానుబంధంబు చాల
గల్గి కార్చునెపుడు కన్నీరు కాని
తనహృదయంబున తనరి మేకులను
దింపినన్ బాధలతెంపరలోర్చి
బయటకు చెప్పక బయటకు మమ్ము
తరమలేదదికాదె తల్లిదౌ ప్రేమ
తల్లి యొడికినన్న తనయొడిలోనె
మాజ్ఞాపకాలన్ని మనుచుండె ఘనము
దెబ్బలాడుకొనిన దెబ్బలన్ తిన్న
గురువులబెత్తాల కొంటె చేష్టలను
చేదు జ్ఞాపకములు చెప్పగానపుడు
మధురమౌ జ్ఞాపకాల్ మరియిప్పుడవియె
మరల మరలరుచి మంతమౌనట్టి
మధురంపు గుళికలౌ మాకెప్పుడవియె
తనవిశాలపు నొడి తాచేర్చుకొనుచు
బంగారు వేదికన్ బాల్యాన యిచ్చె
మాయల్లరి భరించి మాహృదయంబు
నవ్యమౌ క్షేత్రాన జ్ఞాన బీజాలు
నాటి నాటి యలసి నాటంగలేక
భూమాత యొడియందు మూర్ఛిల్లి నేడు
శాశ్వత నిద్రకున్ జారిపోయెనుగ
ఒకసారి తనయొడినొదిగి పోవలెను
అనియున్న మనసులో నరయంగనదియె
నిజము కానిదియైన నిద్రగానదిమాకు
మిగిలిపోయెను నేడు మేలిమిన్ బంచి
43.
14.05.2020
*వరయూరు జానకిరామ్*
కవితాగానం
అంశం: హే రామ్
శీర్షిక: వర్తమాన పరిస్థితి...
పిల్లాపాపలను
సంకనేసుకొని
కిలోమీటర్లకొద్దీ
నడకదారుల సొంతూళ్లకెళ్తున్న
వలసకూలీల
బ్రతుకు చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
మిద్దెలు మేడలు
కార్లు షికార్లు
మందీ మార్బలం
హంగూ ఆర్భాటం
అధికారం దర్పం
అన్నీ ఉండి
కరోనాతో చనిపోతే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రేమ అనురాగం
ఆప్యాయత అనుబంధం
మమత కరుణ
అన్నిటినీ ఎడబాపిన
కరోనాను చూస్తే
ఎవ్వరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ఒక చిన్న వైరస్
ప్రపంచాన్ని అతలాకుతలం
చేసి లక్షల్లో ప్రాణాలు
హరిస్తుంటే
లోకం చేష్టలుడిగిన
వైనం చూస్తుంటే
ఎవరికైనా అనిపిస్తుంది
'హే రామ్' అని...
ప్రపంచ శాంతిసౌభాగ్యాలు
సదా పరిఢవిల్లునట్లు
లోకాన్ని అమృతతుల్యం
చేయుటకు రావాని
ఎవ్వరికైనా అనాలనిపిస్తుంది
'ఓ రామా' అని...
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
పిల్ల పాపలతోనడ్చి వేగిరముగ
వలసకూలీలు ఊర్లకు బాటపట్టి
హీన మగుస్థితి నుండగా నెవరికైన
యెంచి హేరామనంగ నన్పించుచుంది
మిద్దె మేడలు సేవకుల్ మించునట్టి
హంగు ఆర్భాటమధికారమంది కూడ
ఈక రోనతో చనిపోతె యెవరికైన
నెంచి శ్రీరామనంగనన్పించుచుంది
ప్రేమమనురాగ మన్నిటిన్ వేగమాన్పి
మమత కరుణలనెడబాపి మహినినిండు
నీకరోణను చూడగానెవరికైన
యెంచి శ్రీరామనంగనన్పించుచుంది
ఒక్క చిన్న వైరసు ఇది యుర్వినంత
చేసి యతలాకుతలమును చెప్పలక్ష
లాది ప్రాణములన్ దీయ యవనియంత
చేష్టలుడిగి చూచుచు నుండ చివరి కేమి
టంచు యిదిర హేరామ నీవెంచి యింక
యీప్రపంచపు శాంతికై పృథ్వినిపుడు
నమృత తుల్యము చేయగా నవతరించి
రమ్ము వేగమ్ముగాను శ్రీరామయంచు
నెవరి కైనననవలె ననిపించుచుంది
44
15.05.2020
*కాల్వరాజయ్య గారు*
కవితా శీర్షిక:పాపికొండలు
కవిత పాఠం:
.అమ్మా !గోదారమ్మ
ఏమిటమ్మా నీ పరీక్ష
ఏపాపము చేసినవారైనా నీ కడుపులో మునిగితే పాపాలు పోతాయంటారు.
ఏపాపం తెలియని వారిని ఇలా ముంచావేంటమ్మా !
గంపెడు ఆనందముతో నీవద్దకచ్చి,
పడవనెక్కి ఆటలాడుతూ కేరింతలు కొడుతూ పరవశించి పోతున్న సమయాన
పడవను ముంచి వారి పాపాలను నీవంట గట్టుకున్నావు.
తప్పెవరిదో తెలియదు
నావ నడిపే నావికుడిదా?
ఆనందంలో మునిగి ఆదమరిచిన పర్యాటకులదా?
లెక్కకు మించి ఎక్కించు కున్న యజమానిదా?
ప్రవాహ మెక్కువున్నా నడుపుమని అనుమతిచ్చిన ప్రభుత్వానిదా?
తప్పెవరిదో తెలియదు కాని
తనువు చలించినది అమాయకులే !
నీకిది ఇది తగదుమ్మా!
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారి పద్యానువాదం*
.
అమ్మ గోదావరమ్మ యేమమ్మనీప
రీక్ష యిదియేమి పాపాలు లెక్క లేక
చేసి నీకడ్డులోమున్గ శీర్ణమగును
ఎట్టి పాపాలు చేయని యీజనాళి
ముంచి వేసితి విదియేమి పూర్ణముదము
తో పడవలెక్కి పరవశమాపలేక
నున్న కేరింతలను కొడుచున్న జనుల
హతుల జేసి పాపాలను అంటగట్టు
కున్న వేతప్పరయ పొట్టకూటికొరకు
నావ నడిపెడు ఆనాటి నావికుడిద
ఆదమరచి ఆనందాబ్ది నరయమునుగు
నాటి పర్యాటకులదా? యనంతలాభ
మాశతో లెక్కకున్ మించి యట్టిజనుల
తానె ఎక్కించుకొను యజమానిదా?ప్ర
వాహమెక్కువ గల్గిన నాహనడుపు
మన్ ప్రభుత్వముదా?యంచు మాకు తెలియ
దద్ది కాని తనువులను త్యాగమకట
చేసినది యమాయకులమ్మ చెప్పగాను
తల్లి గోదావరీ యిది తగదునీకు
45
16.05.2020
*గుండ్లరాజు గారు*
*చోదకశక్తి గురువు*
మాటలతో మంత్రోపదేశం చేసి
తామసిని తరిమేసి
కర్తవ్యోన్ముఖుణ్ణి చేసే
కదన పిపాసి *గురువు*
ఆయుధం పట్టకుండా
ఆత్మ బలము నందించి
అమ్ములపొదిలోకి అస్త్రాలనిచ్చే
అమృత హస్తమే *గురువు*
శిలలను శిల్పాలుగా
తీర్చిదిద్ది, ఆద్యంతం
వరాలనిచ్చే దేవతలుగా మలచే
అజ్ఞాత శిల్ప చక్రవర్తియే *గురువు*
గాలిపటములా దిశాంచలములందు
స్థాణువులా తిరుగుచున్న
వారికి ఆధార భూతమై
గమనాన్ని నిర్దేశించి,
గమ్య స్థానానికి చేర్చే
చోదక శక్తియే *గురువు*
*అవధాని శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారి పద్యానువాదం*
మాటలతో చేసి మంత్రోపదేశ
మరయ తామసితర్మి యవనియందెపుడు 1)
తనశిష్యవరుల కర్తవ్యోన్ముఖులఁజేయు
కదనపిపాసి లోకంబునన్ గురుడు 2)
ఆయుధమును పట్టకాత్మబలంబు
నందించు నస్త్రాలు నమ్ములపొదికి 3)
అమృత హస్తముతాను నరయంగ గురుడు
శిలల శిల్పాలుగా చెక్కి వరాలు4)
నిచ్చు దేవతలుగా నిలలోన మార్చు
అజ్ఞాతమైనట్టి అద్భుతమైన 5)
చక్కనైచను శిల్పచక్రవర్తియగు
గాలిపటాలుగా గతిదప్పి యెపుడు 6)
దిశలభాగాలలో తిరుగుచునున్న
స్థాణువులైన శిష్యసమూహముగని 7)
ఆధారభూతమై అవ్వారికెపుడు
గమనము చూపించి గమ్యంపు స్థలికి 8)
చేర్చు చోదకశక్తి చెప్పతాన్ గురువు
వరమౌను శిష్యులు వర్థిల్ల జగతి
46
20.05.2020
*వెంకటకృష్ణ ప్రగడ గారి కవిత*
అంశం : అంకురం
ప్రేమ అంకురం
ప్రేమ అంకురం
మనసున
పుడుతుంది
హృదయ జలం
మనసు మట్టిని
తడుపుతుంది
సడిసేయక అది
మది పులకింపజేస్తుంది
తొలకరి మొలకై
పలకరింపచేస్తుంది
మొలిచే ఆ మొలకకు
గుండె ఊపిరవుతుంది
అలా ప్రేమ అంకురం
చిగురించి మొక్కై
ఓ అంకుడు వృక్షమై
వచ్చే పెంపుడు
ప్రేమ విత్తనాలను
తన వంకే చేర్చుకొంటుంది ...
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లుగారిపద్యానువాదం*
మంజరీద్విపద
మదిని ప్రేమాంకురమదిపుట్టి మనగ
హృదయజలమదియె యేపారి యెపుడు
మనసు మట్టిని తడ్పి మనుచుండు
చూడ
మది పులకింపగ మరి సవ్వడింత
సేయకుండగజేసి శ్రేష్ఠంబుగాను
తొలకరి మొలకగా తుష్టితో పులక
రింపగ జేయంగ నీసృష్టియందు
మొలచునా మొలకకు మొనసి యీగుండె
ఊపిరియగుచుంది ఊహింపనెపుడు
ప్రేమాంకురంబిట్లు వేగంబుగాను
చిగురుంచి యాపైన వృక్షంబునౌచు
వచ్చు పెంపుడువైన వౌప్రేమవిత్త
నాలను తనకవంక నవ్యంపురీతి
చేర్చుకొనుచునుండి చెప్పగా గొప్ప
47.
21.05.2020
పొదుపు
డా.పాండాల
మనుషుల జీవనవిధానం
పలు రకాలు...!
బట్ట పొట్ట తక్లీబ్ లేకుండా జీవించడం
అవసరాలను అనుభవిస్తూ సంతృప్తిగా
సకల సౌకర్యాల విలాసమయ
కాలగమనంలో
సంపాదనంతా దాచుకోవాలని
పైసకో ముడెయ్యాలని
మున్ముందు గౌరవం పెంచుతుందనీ భావనే పిసినారితనం !
అదే అలవాటయితే
అవసరమా!ఆనందమా! మనిషిని ఆలోచనలో పడేసి
బరువువైపుతక్కెడ ముళ్ళు జూపినట్లు
మనసు పొదుపు వైపు మల్లుతుంది..
ఒకటొకటివంద వందవంద వేయి వేయివేయి లక్ష లక్షకూడబెడితే
మీ జీవితాన్ని రంగుల మయం చేస్తానని లక్ష్మీ దేవి కలలో దర్శనమిచ్చి చెప్పిందంట
లోకమంతా! గబ్బుగాడని! పిసినారని!
కమ్మనివంటలు కడుపుతినని కలిమెందుకని?...
ఇలాంటి కంపు మాటల్ని
ఇంపుగా ఓ చెవితో విని మరో చెవితో వదిలేస్తే అయిపోలే...!!.
జల్సాలు అప్పులు లేని
కుటుంబ భవిష్యత్తుకు
పునాది పొదుపు
రోజు సంపాదనలో ...ఓ పదో ! పరకో ! వెనకేసే అలవాటే మనిషికి గ్రహపాటును శుద్దిచేసేది...
సంతృప్తే అత్యుత్తమ సంపదగా బ్రతికే వాడే నేర్పరి!
అదుపు-పొదుపు ఆనందం ఆహ్లదం
లేనిజీవితాలు...
తాడు బొంగరం లాంటివి
బ్రతుకంటే...ఓ పఖ్ఖా ప్లొను...
క్రమం రీతి రివాజు
శిక్షణ రక్షణ భక్షణలన్నీ
పొదుపు విలువ తెలిసినోళ్ళకే వర్తిస్తాయి....!
పొదుపు డబ్బు కేనా కాదు
మాటా వ్యవహారం ఆహార్యం లో కూడా మితం ప్రధానం....!?
ప్రకృతి సంపద పట్లా
జీవ జంతువుల పట్ల
ప్రేమను పాటిస్తే
చిరకాలం సుఖంకరం !
*అవధాని శ్రీ ఐతగోనివేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం*
మంజరీద్విపద
సంపాదనము చేయు సంపదనంత
తినవలసినయంత తినకుండతాను
కలిమికలిగిగూడ కడుపేదగాను
తాబ్రత్క పిసినారితనమౌను నదియె
జల్సాలు సేయుచు జనమంత పొంగ
ఆడంబరాలకై అప్పులు సేసి
మనుట దుబారయౌ మరినష్టమౌను
ఖర్చులన్ బెట్టుచు కలిమిని బట్టి
ఉన్నసంపాదనమూహింపకొంత
పొదుపు చేసినవాడు పుడమిలోతాను
ఆదర్శవంతుడౌ నతడు మర్యాద
తప్పకపొందును తథ్యమ్ము సుమ్మి
తక్కెడ ముళ్ళది తప్పక బరువు
వైపు సూపెడిరీతి బాగుగా మనసు
పొదుపు వైపుకుసూప పుడమి యాతనిని
కమ్మని వంటలు కడుపారతినని
కలిమి యెందుకు నంచు కడుహీనముగను
వందలాపైవేలు పైలక్షకోట్లు
కూడబెట్టిన నీకు కూరిమి పేర్మి
దర్శనమిచ్చెద ధన్యాత్మభక్త
అనుచు లక్షీదేవి ఆరయయనెను
ఇటువంటి కంపైన ఇంపైన మాట
లెన్నొ యనినగాని యేమి యవన్ని
యొకచెవి వినుచు నింకొకచెవితోడ
వదలు నైజముతోడ వర్థిల్లమేలు
పిసినారి తనమది పృథ్విలో పొదుపు
వేరౌనునివిరెండు విశదంబు గాను
ఆనందమాహ్లాదమదుపు నాపొదపు
జీవితంబునకిచ్చు శేముషినిచ్చు
బ్రతుకంటె యోపక్క ప్లానుతోనుండు
పొదుపు విలువ తెల్యభువిధన్యమౌను
ధనమునకు కాదు ధరలోన మాట
ఆహార్య వ్వవహారమన్నిటన్ పొదుపు
ప్రకృతిదౌ సంపద పట్లనీపొదుపు
ప్రేమను చూపించ వృక్ష జంతువులు
చిరకాల సుఖముతో చిగురింపజేయు
భూమిపై నీబ్రత్కు పొమ్మురా నరుడ
48
22.05.2020
*సర్ఫరాజ్ అన్వర్ గారు*
జీవ వైవిధ్యం..
భూమిపై ఉన్న వివిధ జీవుల మధ్యభేదం,
భిన్న వైరుధ్యాలు, సామీప్యాలు కల్గిన
వేర్వేరు జీవుల సమాహారం జీవ వైవిధ్యం
వైవిధ్యమే ప్రత్యేకత, అదియే సృష్టి లక్షణం
సృష్టిలో గల జీవరాశులలో ఏది ఎక్కువ,
తక్కువ కాదు అన్ని సమానమే
జీవులన్నియు పర్సపరాధారితాలు
*జీవ వైవిధ్యచక్రం ఓ వసంత ఋతువు*
ఆధిపత్యపు పోరే వినాశనానికి హేతువు..
మనజీవనశైలితో పర్యావరణ కాలుష్యంతో పాటు భూగోళం వేడెక్కి
ప్రకృతి సమతుల్యత దెబ్బ తిని అనర్థాలకు దారితీసి జీవవైవిధ్యం దెబ్బతింటుంది
ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి
ఆదివాసులు, వనజీవులు ఉన్నచోట జీవవైవిధ్యం వర్ధిల్లుతుంటే
నాగరికత పరిఢవిల్లిన ప్రాంతాల్లో దాని
ఉనికి ప్రశ్నార్థకమౌతుంది..
జీవవైవిధ్యంతోనే ఈ పుడమికి
ప్రత్యేకత, మానవజీవితానికి సార్థకత
వైవిధ్యవైభవం *గతకాలపు*
*స్మృతిచిహ్నంగా* మిగలరాదు
అది కేవలం అక్షరాలలో, పుస్తకాల్లో
నిక్షిప్తమై ఉండరాదు
*వైవిధ్యబాంధవ్యంలేని బతుకు దైన్యమే*
దాని మహిత గుర్తించకపోతే మిగిలేది *జీవ వైధవ్యమే..*
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
భూమిపైనున్న వివిధ జీవులఁగనంగ
సామ్యవైరుధ్యములు చూడ చాలగలుగు
వేరు వేరు జీవులు మన పృథ్వినిదియె
జీవవైవిధ్యమగునిది శ్రేష్ఠవిధము
సృష్టి లక్షణమిది దీనినెపుడు మనుప
సృష్టి వికసించు లేక నశించు నరుడు
ఒకటి యెక్కువ తక్కువ యుండదేది
దేని ప్రత్యేకతనది యెంతేని కల్గు
నిక పరస్పరాధారితాలు కనగాను
అన్ని జీవులు నేగొప్ప యంచు నెంచు
నాధిపత్యపు పోరు మహావినాశ
హేతు వౌనిది తలదాల్చనీతి కాదు
జీవవైవిధ్య చక్రంబు చెప్పగాను
ఓవసంత ఋతువు మహితోత్సవంబు
నరుల జీవనశైలితో నాశనమయి
భూమి వేడెక్కి కాలుష్యపూర్ణమగుచు
ప్రకృతి సమతుల్యత చెడి యపాయమగుచు
జీవవైవిధ్య మెంతయో శీర్ణమౌచు
ఎన్నొ జీవజాతులు నశియించిపోవు
చుండె నిరతంబు యిదిచాల గుండె కోత
ఆది వాసీలు వనజీవులరయ గల్గు
స్థలిని జీవవైవిధ్యంబు చక్కనుండ
నాగరిక నరులున్నట్టి నవ్యపురుల
జీవవైవిధ్య మెంతయో చితుకు చుండు
నిదియె యొకమారు యోచించి యిప్పుడైన
జీవవైవిధ్యమును గావ శ్రేష్టత యగు
జగతి గతకాలపు స్మృతిగ మిగులరాదు
అక్షరములలో పుస్తకాలందునిదియె
చెప్పబడకుండ నిరతంబు చెలగవలెను
ఇలను వైవిధ్యబాంధవ్యమేమిలేని
బ్రతుకు దైన్యమౌ కావున లక్షణముగ
దాని మహితను గుర్తించలేనియెడల
జీవ వైధవ్యమే దక్కు సృష్టి కింక
49.
23.05.2020
*దేశపతి మోహన్ శర్మ గారు*
సమ్మోహనం
ఎన్నడూ లేనిది ...ఎదలో
ఏదో తెలియని గిలిగింత
నా మనసంతా ..తీయని
ఆశలకై ..ఉరకలతో ..తుళ్ళింత
మూగవోయిన నా హృదయ వీణను ..
ఎవరో సున్నితంగా మీటినట్టు ...
ఆనందనాదమై పలుకుతున్నట్లుంది
మోడు వారిన వనములో ..
ఎదురుచూసిన వెదురులా నేను ..నీవుతాకితే,
వేణువునై నీఊపిరితో ఊదినట్లు మౌనమైన
నా గొంతులో రాగాలు పాడుతున్నట్లుంది
ఏకాంత మెరిగిన నా మదిలో ..
ఏ కాంత కోసమో అన్నట్లు ..
భావాల మడిలో ప్రేమ బీజాలు పడి..
కవితలు మొలకలుగా ఎదుగుతున్నప్పుడు నేను సాహిత్యపు సేద్యం
చేస్తున్నట్లుంది
ఏనాడు పులకించని వీనులకు ..
వినిపించిన నీ కాలి అందెల సవ్వడులే
సమ్మోహన గానాలై..తన్మయత్వం నాలో
కలిగిస్తున్నట్లు ఉంది
అది నీ వల్లేనేమో? ..నాపై కురువ బోయే
నీ ప్రేమజల్లేనేమో?
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
మంజరీద్విపద
ఎన్నడు లేనిది యెదలోననెదియొ
తెలియని గిలిగింత తెల్లంబుగాను
నామనసంతట నానావిధాల
తీయని యాశలు తీవ్రంబుగాను
ఉరకలు తుళ్ళింతలుద్ధృతమగును
ఎవరొ సున్నితముగ హృదయంపు వీణ
మూగ వోయినదాని మొనసి మీటిరన
ఆనందనాదమై అలరుచు పలుకు
మ్రోడు వారు వనములో వేచి చూచు
వెదురులా నేను నీవింక తాకంగ
వేణువునై నేను వేగంబు నీదు
ఊప్రితో నూదినట్లుండు మౌనంబు
నౌ నాదు గొంతులో నరయ రాగాలు
పాడుచున్నట్లుండు ప్రతిదినమందు ఏకాంతమెంతయొ యెరుగు నామనసు
ఏకాంతకోసమో యింక యన్నట్లు
భావాల మడిలోన పడి ప్రేమభీజ
ములు కవితలుగాను మొలకలు నౌచు
ఎదుగు చున్నప్పుడునేను సాహిత్యపు
సేద్యము చాలగ చేసినట్లుంది
ఏనాడయిన పులకించని వీను
లకు వినిపించిన లలితంబు నీదు
కాలి యందెలదైన కమ్రరావంబు
సమ్మోహనంబునై చాలగ దోచి
తన్మ యత్వమునాకు తగకలిగించు
నది నీవలెను నేమొ నాపై కురువగ
బోవు నీ ప్రేమ సంపూరంబునేమొ
50
26.05.2020
*దేశపతి మోహన్ శర్మ గారు*
సమ్మోహనం
ఎన్నడూ లేనిది ...ఎదలో
ఏదో తెలియని గిలిగింత
నా మనసంతా ..తీయని
ఆశలకై ..ఉరకలతో ..తుళ్ళింత
మూగవోయిన నా హృదయ వీణను ..
ఎవరో సున్నితంగా మీటినట్టు ...
ఆనందనాదమై పలుకుతున్నట్లుంది
మోడు వారిన వనములో ..
ఎదురుచూసిన వెదురులా నేను ..నీవుతాకితే,
వేణువునై నీఊపిరితో ఊదినట్లు మౌనమైన
నా గొంతులో రాగాలు పాడుతున్నట్లుంది
ఏకాంత మెరిగిన నా మదిలో ..
ఏ కాంత కోసమో అన్నట్లు ..
భావాల మడిలో ప్రేమ బీజాలు పడి..
కవితలు మొలకలుగా ఎదుగుతున్నప్పుడు నేను సాహిత్యపు సేద్యం
చేస్తున్నట్లుంది
ఏనాడు పులకించని వీనులకు ..
వినిపించిన నీ కాలి అందెల సవ్వడులే
సమ్మోహన గానాలై..తన్మయత్వం నాలో
కలిగిస్తున్నట్లు ఉంది
అది నీ వల్లేనేమో? ..నాపై కురువ బోయే
నీ ప్రేమజల్లేనేమో?
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
మంజరీద్విపద
ఎన్నడు లేనిది యెదలోననెదియొ
తెలియని గిలిగింత తెల్లంబుగాను
నామనసంతట నానావిధాల
తీయని యాశలు తీవ్రంబుగాను
ఉరకలు తుళ్ళింతలుద్ధృతమగును
ఎవరొ సున్నితముగ హృదయంపు వీణ
మూగ వోయినదాని మొనసి మీటిరన
ఆనందనాదమై అలరుచు పలుకు
మ్రోడు వారు వనములో వేచి చూచు
వెదురులా నేను నీవింక తాకంగ
వేణువునై నేను వేగంబు నీదు
ఊప్రితో నూదినట్లుండు మౌనంబు
నౌ నాదు గొంతులో నరయ రాగాలు
పాడుచున్నట్లుండు ప్రతిదినమందు ఏకాంతమెంతయొ యెరుగు నామనసు
ఏకాంతకోసమో యింక యన్నట్లు
భావాల మడిలోన పడి ప్రేమభీజ
ములు కవితలుగాను మొలకలు నౌచు
ఎదుగు చున్నప్పుడునేను సాహిత్యపు
సేద్యము చాలగ చేసినట్లుంది
ఏనాడయిన పులకించని వీను
లకు వినిపించిన లలితంబు నీదు
కాలి యందెలదైన కమ్రరావంబు
సమ్మోహనంబునై చాలగ దోచి
తన్మ యత్వమునాకు తగకలిగించు
నది నీవలెను నేమొ నాపై కురువగ
బోవు నీ ప్రేమ సంపూరంబునేమొ
51
12/06/2020
12.06.2020
*అద్దంకి లక్ష్మయ్య గారి* *కవిత*
*పరిమళం*
ధనం ఉంటే ఏం లాభం
దాన గుణం ఉండాలి
జ్ఞానం ఉంటే ఏం లాభం
పది మందికి పంచాలి
అధికారం ఉంటే ఏం లాభం
అందరిని కాపాడాలి
పూజలు చేస్తే ఏం లాభం
పవిత్ర భావాలు ఉండాలి
బజార్లు తిరిగితే ఏమి లాభం
భద్రత కలిగివుండాలి
పరిపాలన చేస్తే ఏం లాభం
ప్రజల మేలు చూడాలి
సంతాన ఉంటే ఏం లాభం
చక్కగా పోషించాలి
చినుకు పడితే ఏం లాభం
రైతు వినియోగించుకోవాలి
ఉద్యోగం చేస్తే ఏం లాభం
బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి
దేశంలో పుడితే ఏం లాభం
ప్రగతి కోసం పాటుపడాలి
పదవి ఉంటే ఏం లాభం
పాలన ఆదర్శంగా ఉండాలి
మనిషిగా పుడితే ఏం లాభం
మానవత్వం ఉండాలి
పువ్వు వికసిస్తే ఏం లాభం
పరిమళం వెదజల్లాలి
నీతులు చెబితే ఏం లాభం
నియమాలు పాటించాలి
కరోనాతో కట్టుబాట్లు పెడితే ఏం లాభం
కఠినంగా పాటించాలి
*అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి*
*పద్యానువాదం*
దానగుణములేక ధనమెంతగల్గిన
జ్ఞానమెంత గల్గగా ధరిత్రి
పంచకున్న నింత పదిమందికెప్పుడు
అందరిని మహత్వమైనరీతి1)
కావకున్నను అధికారమున్నఫలమె
పూజచేయనేల పుణ్యభావ
నంబు లేక; తిర్గినన్ ఫలంబె బజారు
భద్రతింతలేక ప్రజలమేలు2)
పట్టకుండనింత పరిపాలనముచేయ
లాభమేమిగల్గు లావుగాను
పదవిగల్గనిటులె పాలనమాదర్శ
మౌచునుండకుండ నవనియందు 3)
దేశమందు పుట్టితేమి లాభంబగు
ప్రగతి కొరకు పాటుపడక యున్న
మనిషిగాను పుట్టి మానవత్వములేక
మనిన లాభమేమొ కనగనటులె 4)
పరిమళంబు లేక ప్రసవంబు వికసించ
నీతులేల నియమనిష్ఠలేక
సంతతున్ననేమి చక్కగాపోషించ
కుండగాను లోపముండగాను 5)
చినుకు పడిననేమి వినియోగమున రైతు
పెట్టకున్న మేలుముట్టకున్న
బాధ్యతలను బాగ పాటింపకుద్యోగ
మున్ననేమి లేకయున్ననేమి 6)
రోజు రోజునకు కరోనతో లెస్సగా
కట్టుబాట్లు పెట్టి కఠినముగను
ఫలితమేమియుండు పాటింపకున్నను
కాన చిత్తశుద్ధి కలుగు నరుడ
52
13.06.2020
దండమూడి శ్రీచరణ్ గారు
*ఓ కవితై తరించేందుకు....!*
-----------------------------------------
నాకోసం ఓ వసంతం
అన్వేషిస్తోంది!
నా కొరకై ఓ ప్రసూనం
పరిమళిస్తోంది!
నా అక్షరానికై ఓ గీతం
తపిస్తోంది!
ఎన్ని వనాల్ని గమించి
వచ్చాను,
ఎన్ని గాయాల్ని సహించి
వచ్చాను
ఈ ఒంటరితనం
నాకోసం
ఓ యుగళాన్ని ఆశిస్తోంది!
నా పాదముద్రలు
ఈ ఇసుక తీరాల్లో.....!
నా పదధూళి
ఈ ఎడారుల్లో........!
నా పయనం
ఓ మజిలీకై నిరీక్షిస్తోంది!
ఈ క్షణాలున్నవి
నన్ను పరీక్షించేందుకు,
ఈ కొవ్వొత్తులున్నవి
నా రాత్రిని దహించేందుకు!
నా కలం ఓ అశ్రువు
అక్షరమయ్యేందుకు సహకరిస్తోంది!
నా ప్రాణం
ఓ కవితై తరించేందుకు జ్వలిస్తోంది!!
అవధాని శ్రీ ఐతగోని వేంకేటేశ్వర్లు గారి పద్యానువాదం
నాకోసమొక వసంతము
నాకొనినద యనెడురీతినన్వేషించున్
నాకొరకొక్క ప్రసూనం
బేకన నిరతంబు పరిమళించుచునుండున్
నాయక్షరమయి గీతమి
దే యనవరతంబుగ తపియించుచునుండున్
వేయి వనాలు గమించితి
వేయగు గాయాల్ సహించి విచ్చేసితినే
ఈ యొంటరితనమిదినా
కోయుగళమ్మును నపేక్షమో చేయంగన్
నాయీపదముద్రలిచట
యీయిసుక సుతీరమందునేముద్రలగున్
నాయీ పదధూళి గనగ
యీయెడ పడియెను నెడారి నీనాపయనం
బేయో మజిలీకికనను
హాయిగ కొనిపోవగాను నాక్రోశించున్
ఈక్షణాలుండు నన్ను పరీక్షసేయ
రాత్రిని దహించు క్రొవత్తులరయ నుండె
నాకలంబొక యశ్రువు వీకనింక
అక్షరమగుటకు సహాయమంది యిచ్చి
నాదు ప్రాణంబొక కవితనై ధరిత్రి
నెంచి తరియించగాను జ్వలించుచుంది
53
28.06.2020.
రవికుమార్ కంచి గారి కవిత
ఆటవికం
-------------
శాంతి వచనాలు పలుకుతున్నాం
ప్రపంచ శాంతి బహుమానాలు పొందుతున్నాం.....
సామరస్యాలు వదిలి చర్చలు మాని కయ్యానికి కాలు దువ్వుతున్నాం.....
****
లక్ష్మి కాలు పెడితే మంచిదన్నాం
మహిళ ఇంటింటా వెలసిన దైవమన్నాం
దేశదేశాల కానరాని దైవం
నలిపేయడమే తప్ప
కాపాడలేని దైన్యం
ఆడపిల్లంటేనే బరువనే కలికాల వైనం
****
ఎన్నో మానవ వనరులు
మరెన్నో విలువల హక్కుల నిలబెట్టే సంస్థలు
కులమత హింసలు జాతి విధ్వంసాలు విద్వేషాలు అణచివేతలు
కోకొల్లలు
****
నాగరిక సమాజమా
అనాగరికం వదలని ఆటవిక సమూహమా
ఎటు నీ పయనం
ఏది నీ పరిణామం
ఎక్కడ నీ పరిణితి....??
అవధాని శ్రీ ఐతగోని వేంకటేశ్వర్లు గారి పద్యానువాదం
శాంతి వచనములను సంతసంబున పల్కి
పరగ పొందుచును ప్రపంచశాంతి
బహుమతులనుపొంది బాపురే
సామరస్యము విడి చర్చలువిడి
కయ్యమునకు కాలు వియ్యమంచును దువ్వు
చున్నవారముర్వి మన్ననవిడి
లలన కాలుపెట్ట లక్ష్మికాలు మహిళ
ఇంటి దేవతయని యెంతొ చెప్పి
దేశదేశములను మోస వేషాలతో
నలిపి వేయుచుండి యలుపులేక
కావలేని దైన్య కలికాలమిప్పుడు
ఆడ పిల్ల భారమాయెనకట
కం:
ఎన్నోమానవ వనరులు
ఎన్నోసంస్థలు విలువలనిట రక్షింపన్
అన్నాకులమతహింసలు
ఎన్నగ రానట్టిహింసలివి ఆపవుగా
తే.గీ
నాగరిక సమాజమ నీయనాగరికము
వదలనిమహాటవిక సమూహదరహాస
మా యెటుపయనమగునీది అరయనేది
నీదు పరణామ పరిణితి ఏది యేది
Comments
Post a Comment