Skip to main content

కార్తీక పౌర్ణమి 2022


నిర్వహణ 

శివునూరి లలితాకృష్ణ

 వీరా గుడిపల్లి

అంశం: ఆకాశ దీపం

న్యాయ నిర్ణేత మరియు సమీక్షకులు

శివునూరి సావిత్రి గారు 

*********************

కవి వరుల జాబితా 

 1.కోరాడ నరసింహారావు గారు 

2.అపరాజిత రెడ్డి గారు 

3.డా.బల్లూరి ఉమాదేవి గారు 

4.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 

5.దోసపాటి వెంకట రామ చంద్ర రావు గారు 

6.తాతపూడి సోమ శేఖర శర్మ గారు

7.కొమురవెల్లి అంజయ్య గారు

8.సింహాద్రి వాణి గారు

9.లలితా చండీ గారు

10.గంటి మీనా కుమారి గారు 

11.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 

12.బొప్పెన వెంకటేశ్ గారు

13.వాణి సరోజిని లక్కరాజు గారు 

14.మేకల రామస్వామి గారు 

15.డా.దీపక్ న్యాతి గారు 

16.డా.వేమూరి సత్యవతి గారు 

17.గొర్రెపాటి శ్రీ ను గారు 

18.వేదాంతం సురేష్ బాబు గారు 

19.డా.దారల విజయ కుమారి గారు

20. రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు

21.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 

22.పిన్నక నాగేశ్వరరావు గారు 

23.వురిమళ్ళ సునంద గారు 

24.గజవెళ్ళి శ్రీనివాసా చారి గారు 

25.మొహమ్మద్ అఫ్సర్ వలీషా గారు 

26.కవిత వెంకటేశ్వర్లు గారు

27.కాసుల ధీరాజ శర్మ గారు 

28.మన్నె లలిత గారు

************************

1

. ****************

హరి - హర ప్రీతిపాత్ర మీ... 

.... కార్తీకమాసం... !

 సకల ఐస్వర్య ప్రదాయకం... 

   ఆకాశ దీప దర్శనం.. !!

ఈ కార్తీకంలో,ఏకాదశ, ద్వాదశ 

పూర్ణిమ తిథులలో... ఆకాశ దీప దర్శనం విశేష ఫల ప్రదం !!


  ఆలయాలలో స్తంభము పైన, 

నివాస గృహములపై పొడవైన కర్రలకు,అమర్చిన.. ఆకాశ దీప మును... దామోదరాయ,అనం 

తాయ అంటూ ఆకేశవుడ్ని స్మ రిస్తూ చేసిన ఒక భక్త్యంజలి...!

సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది... ! 

  భక్తి, శ్రద్దలతో..., అదిఎక్కడి నీరైనా... స్నానమాచరించు సమయమున గంగా, గోదావరీ 

సింధు, కృష్ణ, కావేరీ పుణ్య తీర్ధస్నానఫలం సంప్రాప్తయామి

అని మది న దలచిన చాలు.. 

జన్మ - జన్మల పాపములు తొల గిపోయి... విశేష పుణ్యము... 

సంప్రాప్తిoచును... !!

  దీప దర్శనం పాప నాశనం !

ఆరోగ్య,ఐశ్వర్య...జ్ఞాన,మోక్ష ప్రదాయకం.... !!

ఆకాశ దీపమన...ఆత్మజ్యోతి !

ఆకాశమున గల ఆ పరమాత్మ అఖండజ్యోతిని దర్శించుటయే 

  ఆకాశ దీప దర్శనం... జన్మ - జన్మాoతర పాప ప్రక్షాళితం !

    అనంత శుభదాయకం !!

       *****************

[ 2.

దీపంజ్యోతి పరబ్రహ్మ,,,,,,,,,!

కార్తీకపౌర్ణమి పండు వెన్నెలలో 

ఆకాశంలో మరుగైన నక్షత్రాలు 

గృహిణులు వెలిగించిన దీపాలుగా భువిపై తళుక్కుమంటున్నాయి 

ఆ దీపశిఖలలో దివ్యాంగణలు మహిళలు!

ఆత్మ జ్యోతిలా వెలుగుతూ 

నిరాశ నీడలా మిగలాలి!

పౌర్ణమి రాత్రి కార్తీకదీపంలో 

శివ శివ మూర్తిని ఆరాధిస్తూ కొందరు

ఆ నారాయణుడు శ్రీరాముడిని కొలుస్తూ కొందరు 

హృదయాన్ని లయంచేసి ఆ దైవం ఎదుట దీపం వెలిగిస్తే 

ఆ పరమేశ్వరుడు అద్భుత కాంతుల శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తాడు!

జీవనయాత్రలో వెండి వెన్నెలలు పూచినట్లు కార్తీకపౌర్ణమి 

భక్తులు భక్తి శ్రద్దలతో దీపారాధన చేస్తే జీవనజ్యోతి కాంతులమయం!

ఇంటి ముందు దీపాల వరుస స్వచ్చమైన 

సుఖసంసార సాగర సరిగమలందించే పౌర్ణమి!

జ్యోతిలో మనస్సును హృదయాన్ని లీనం చేసి 

ఆ పరమాత్మలో ధ్యానవుంచి దీపారాధన చేస్తే 

ఈశ్వర కటాక్షంతో అజ్ఞాన చీకట్లు తొలగిపోతాయి!

అలాగే బాధాతప్త హృదయాల విషాదాలు మటుమాయం 

ఒక్క దీపంతో శతకోటి దీపాలు వెలిగించినట్లు 

నీలోని జ్ఞాన తృష్ణ అచంచల భక్తిభావం 

పంచినాకొద్ది పెరుగుతుంది!

దీపం కళ్ళల్లోకి వెలుగులు చిందించి 

సమస్త భగవంతుని సృష్టిని దర్షించేట్లు చేస్తుంది!



హామీపత్రం: ఈ కవిత పౌర్ణమి పోటీ కొరకు రాసిన స్వీయ రచన అని నా హామీ

: 3.

***********

ఆకాశదీపం


హరిహరులకు ప్రీతిపాత్రం కార్తీక మాసం

  ఆధ్యాత్మికతను మనలో పెంచుతూ

ముక్తి మార్గం వైపు నడిపించే మాసం

ఇంటి ముంగిట వేలాడే ఆకాశదీపం

 సకల శుభప్రదం సుమనోహరం


తెల్లవారకముందే వెలిగించేది ఉదయదీపం

చీకట్లు ముసరేముందు వెలిగించేది ఆకాశదీపం

అజ్ఞానాంధకారాన్ని పోగొడుతు మానవాళికి

 విజ్ఞానం పంచే దీపకాంతులు


శివ కేశవులకు ఆలయాలలో మాస పర్యంతం

  కార్తీక పూజలు జరపడం తరతరాల ఆచారం

 కార్తీకంలో ఉసిరి చెట్టు క్రింద చేసే వన భోజనం   

 మనసమైక్యతను ప్రతిబింబించే శుభ చిహ్నం


సర్వాంతర్యామి అయిన శ్రీహరి

క్షీరాబ్ధిలో గాడ నిద్రనుండి లేచే మాసం

కార్తీక దామోదరు నారాధించే మాసం

వెన్నెల విరజిమ్మె శరత్కాలం


తులసి కళ్యాణం కార్తీక పౌర్ణమి

పర్వాలను సంబరంగా జరిపుకొనే మాసం

ఆకాశ దీపాలతో వెలుగులు పంచుతూ 

ఇంటింట ఆనందాన్ని పంచే ఆశాదీపం


ముముక్షువులకు నాకపుదారి చూపేదీపం

అజ్ఞానపు చీకట్లనుదూరంగా పారద్రోలి

విజ్ఞానపు జ్యోతుల నందచేసే లక్ష్మి రూపం

ఇంటింటా కాంతులీనుతూ వెలిగే ఆకాశదీపం.

: 4

*అంశం :ఆకాశదీపం*

 ***************


పెంజీకటి కావల పరుండి లోకాలను పాలించే

జనార్ధనా

నీవు వెలిగించిన దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ

సకల లోకాల చీకట్లను ఊడ్చేసే అఖండ దీపాలు గగనాన 


కోవెల ధ్వజస్తంభం పైన వెలిగించిన దీపకాంతుల

వెలుగువై అభ్యున్నతి పొందలేని చెట్లు, వాటిని ఆశ్రయించిన సమస్త ప్రాణులపై ప్రసరించి కరుణతో

జీవన్ముక్తి కలిగించు పరంధామా !! ఓ దీపమా!!


అనూచానంగా అల్పమైన అజ్ఞానాన్ని అంతం చేసి

అనల్పమైన విజ్ఞాన జ్యోతి ప్రజ్వలన చేసి జ్ఞానం ప్రబోధించెడి గురు పరంపర ఒక ఆకాశదీపం


మహిళలు మక్కువతొ జలాశయాల వద్ద వెలిగించిన కార్తీక పౌర్ణమి ప్రమిదల కాంతి సమస్త జలచరాలకు 

స్వర్గ ప్రాప్తి కలుగించే మహేశ్వరుని మానసము


అనాధలను అన్నార్తుల ఆదుకొని, అనురాగం ఆప్యాయత పంచి ఆనందం పొందు మనిషి మానవత్వపు వెలుగులీనే అమోఘమైన ఆకాశదీపం


మూఢనమ్మకాలకు బందీలై తమకు తామే బలౌతున్న

మూఢుల సంస్కరించి సంస్కారం సుసంపన్నం చేసే

సంస్కర్తలు,సమాజానికి వెలుగు నింపే ఆకాశదీపాలు


కార్తీక మాస దీపోత్సవం కారుచీకట్లను కాలరాసి

కష్టజీవులను సైతం కరుణించి ప్రసరించి కైవల్య మొసగెడి దివ్య మంగళ ప్రభల కాంతుల కాలమిదే


విష్ణు మహేశ్వరులకు ఇష్టమైన కార్తిక మాసం 

పితృదేవతలకు మోక్షమార్గం చూపించు ఆకాశదీపం

ప్రజలలో ఆధ్యాత్మిక చింతన పెంపు చేయుట కోసం

సత్కర్మలను చేయించి సంభావించు ఆకాశదీపం

[ 5.

*

కవితాగానం

శుభకృత్ నామసంవత్సర కార్తీకపౌర్ణమి నగదుపురస్కారాల కవితలపోటి కొరకు.

అంశం:ఆకాశదీపం

శీర్షిక:కోటికాంతులదీపోత్సవం

కృత్తికానక్షత్రసంచారములొ చంద్రుని ప్రవేశం

కార్తీకపౌర్ణమి పరమపవిత్ర సందేశం

ఆకాశదీపోత్సవం సకలసౌభాగ్యప్రదం

కోటికాంతులదీపోత్సవం కనులకు పర్వం

శివకేశవులకు ప్రీతిపాత్రం

దీపారాధనం పరమమోక్షదాయకం

పున్నమిచంద్రుని వెలుగుజిలుగులు

కార్తీకదిపోత్సవకాంతుల సమాహారం

సకలజనులకు ఆనందదాయకం

ప్రాతఃకాలనదీస్నానాల సంబరం

శివకేశవాలయాలలో భక్తిపారవశ్యం

శివపంచాక్షరి నామస్మరణం

విష్ణుసహస్రనామపారాయణం

పరమపుణ్యదాయకం

సంవత్సరమంతటికికల్పిన జ్యోతిప్రజ్వలనం

అకాదీపజ్వాలాతోరణం

అఖండదీపోత్సవం

కోటిజన్మలపుణ్యఫలం

తామసిక మానసిక శారీరిక ఆరోగ్యదాయకం

ఆకాశదీపోత్సవం హర్షాతిరేకం

దీపదానం పరమపవిత్రం

కార్తీకమాసపౌర్ణమి నాటి దీపోత్సవం

పరమముక్తిప్రదాయకం.

ఇది నాస్వీయరచన.

[

6


శశికృత్తికల కలయిక ప్రాత:కాలనదీస్నానాలు 

దీపజ్యోతులకళకళలు ఆధ్యాత్మిక పరంపరలు 

విష్ణుశివఆరాధనలతో ఆత్మసంతృప్తిమయము 

యమద్వితీయ భగినీ హస్తభోజన ఆనందము 

నాగులచవితి నాగారాధనతో ఆరోగ్య ప్రదము 

కార్తీక దీపారాధన మోక్ష కటాక్షాలకు మార్గము 


కార్తీకస్నానాలు దీపాలు నదీజల ప్రవాహ గమనం

కార్తీకపౌర్ణమి ఉపవాసము జ్వాలా తోరణ దర్శనం 

పూర్ణిమలో చేసే దానాలు సకల పాపాల దోషహరం 

పున్నమిచంద్రునివెలుగు మనసోల్లాసమైనఆనందం 

కార్తీకశోభ,శశికాంతులవెన్నెల హృదయానికిఆనందం 

ముత్తయిదువులకు పుణ్యస్త్రీలకు పున్నమి ఉపవాసం

వారిపిల్లలు చలువగా ఆయుష్షుతో ఉండుటకు మార్గం

తులసి చెట్టు చుట్టూ దీపాలతో అలంకరణ సోయగం 

సంతృప్తితో ఆనందకరంగా నిండుగా చంద్రుని దర్శనం 

మడితడులనిష్ఠలతోచేసే చలిమిడిఒక్కటియే ప్రసాదం 


కార్తీకదీపారాధన నిత్యదీపప్రాముఖ్యం

మన మదిలోన పుణ్య ప్రద ప్రభంజనం 

నిత్యoధ్వజస్తంభంపై ఆకాశదీపదర్శనం

ఆకాశానికినిచ్చెన మెట్లకువేసేఆగమనం         

ఉసిరిచెట్టు చుట్టూ పెట్టే దీపాల మయం       

అందరికి ముచ్చటైనజ్యోతిశోభలమయం 

క్షీరాబ్దిద్వాదశికి తులసివననిండుశోభితం 

నిండు జ్యోతులతో దీపాల కాంతిమయం 


కార్తీకమాసమే హరిహర భక్తులసందోహమే

నిత్యం కార్తీక దీపాలత సందోహమయంతో 

వెలుగుజిలుగులతో కాంతిరేఖలమయంతో 

మన జీవితం ఆనందమే..పుణ్య ఫలప్రదమే....

[: 7.

అందరిదీపం


దాని కలల ప్రపంచం సూర్యుడు

చీకటి గుండెల్లో గునపాలు దించేందుకు

కళ్ళల్లో వత్తులేసుకుని ఎదురు చూడదు

నుదుటిపై వత్తులతో తెరుస్తుంది మూడో కన్ను

చుట్టూరా వెలుతురు పంచుతూనే

తన కింద చీకటిని తొలగించలేని ఆశక్తతతకు కుములుతూ


నట్టింట్లో తిష్ట వేస్తే దీపం ఇల్లంతా వెలుగు

కొంత వాకిట్లోకి దూరి పసిగడుతుంది రాకపోకలను

ఇంటి నుంచి బడికి, గుడికి బయల్దేరిన దీపం

గుంపులో గోవిందా కాదు, గుంపు అందరి కళ్ల వెలుగు

అమ్మ వెలిగించిన దీపానికి అమ్మతనం పూనినట్లుంది

దీపాన్ని ఆకాశంలో నిలిపితే ఆకాశాన్ని ఏలదు

దాని చూపంతా భూమ్మీది జీవుల పైనే

ఆలోచనల కంటిన అశుద్ధాన్ని కడిగేయడం పని


కార్తీక మాసం పవిత్రతకు వన్నెలద్దుతూ

జ్యోతుల పారాయణం చేస్తారు మహిళలు

అమ్మలగన్న అమ్మల మహిమాన్వితాన్ని చాటుతూ


చీకట్లో చుక్కలు, వెన్నెల చంద్రుడు ఆకాశ దీపాలే

అవనితో స్నేహ పుష్పాలు

కారు చీకట్లో బాట చూపేది ..కందిలలైనా, మిణుగురులైనా

దేహ దేశాన్ని కాపాడే సైనికులే


కరెంటు కళ్ళు తెరువకముందు

గుడి ఆవరణలో దీప స్తంభాలు 

రాత్రివేళ గూర్కాలా, పోలీస్ పహారాలా

ఇంట్లోనైనా ,వీధిలోనైనా, విపణి లోనైనా

ఆకాశ ఆశాజ్యోతులే మానవ మనుగడకు ఆధారం

...................................................

[: 8.

సీ. కార్తీక మాసాన‌ కనువిందు చేయుచు

దీప కాంతులు నిండు దివ్యముగను

శివ పార్వతుల కొల్చి చిత్త శుద్ధిగ వేడ

వరములన్ కురిపించు కొరత‌ లేక

పసుపు కుంకుమ‌ లిచ్చి పచ్చగా‌ బ్రతుకిచ్చి

పిల్ల పాపల గాచు చల్లగాను

శివ శివా యని వేడ చేసిన పాపముల్

మొత్తంగ మాయమౌ మొదలు లేక


తే.గీ. మాసముల యందు గొప్పదౌ మహిమ కలది

ప్రీతి తోడ హరిహరులన్ ప్రేమ మీర

కోరి కొల్చిన భక్తుల కోర్కె తీర్చి

శుభము సౌఖ్యము లిచ్చును నభము తాక


2) సీ. దైవ సన్నిధి యందు ధ్వజపు స్తంభము పైన

ఆకాశ దీపమ్ము యద్భుతముగ

దేదీప్య మానమై దివ్యతేజములొల్క

భక్తితో దర్శించు భక్తులకును

దేవతల్ కురిపించు దీవెనల్ మెండుగా

ఆశీర్వదించుచూ నభయ మొసగి

దీపమ్ము వెలిగించ తిమిరమ్ము తొలగంగ

విజ్ఞాన వీచికల్ వెల్లువెత్తు


ఆ.వె. జ్వాలతోరణమును జనులు దూరి వెడల

దురితములును వీడి దూరమగును

దీప దానమిడగ దేవుని సన్నిధి

కార్తికమున, మిగుల కలుగు శుభము


హామీ:--ఈ పద్యాలు నా స్వీయ రచన

[: 9.

*అంశం* .....*ఆకాశ దీపం* 


సందెవేళ ఏటి అలల ఆటలలో

 వలపు రాగాలు పాడే

 పిల్ల తెమ్మరలు 

 

రజనీ కాంత విప్పుకు న్న 

కురులను ముడివేస్తూ వెన్నెలమ్మ 


విసిరే‍ వలపుపరదాలలో  

తొంగి చూస్తున్న తారల 

 తళుకు బెళుకులతో 

 తబ్బిబ్బయ్యి  

  

 అతివల భక్తి పారవశ్యాలతో

 వెలిగే దీపాలు

 ఆకశ దీపాలతో అలరారిన అవని

ఒకింత ఎరుపెక్కిన శరత్ చంద్రుడు


తెల్లవార్లు వెలిగి ఆకాశ దీపమై

వెలిగిన వెన్నెలమ్మ

కురిపించిన శరత్ జోత్స్న నవ్వులు


మంచు పొగలను 

మటు మాయం చేస్తే


ప్రకృతి పరవశించి 

భూపాల రాగం మీటుతోంది  


పశ్చిమానికి పరిగెట్టే కలవలరేడు

శరత్ జోత్స్న ను వెంటేసుకొని


అరుణం పులుముకుంటూ భానుడు

చీకటి వలయం చేధిస్తూ శుభోదయమంటూ

[: 10.

గంటి మీనా కుమారి గారు


అంశం :ఆకాశ దీపం 

శీర్షిక : "సుందర దీపం "

_____________________

ఆశల అవనికి వేకువ ఈ దీపం 

శూన్యమైన ఆకాశాన సుందర దీపం 

జగతి జనులు వెలిగించని దీపం  

ధరన దైవమై భాసించెడి దీపం 

ఆరోగ్యప్రదాతగా శోభిల్లెడి దీపం 

అవని అంతటా ప్రసరించిన దీపం 

ఆహారప్రసాదాన్ని అందించిన దీపం 

ఆలోచనలను రేకెత్తించిన దీపం 

రుగ్మతలను రూపుమాపెడి దీపం 

రోజూ మనకు దర్శనమిచ్చెడి దీపం 

రోచస్సుతో ధ్వాoతాన్నిధ్వంసం చేసెడి దీపం 

రశ్మితోవరంగా వర్షాన్నందించిన దీపం 

కోటికాంతి ప్రభల దివ్య తేజోమయ దీపం 

సుర ముని జనులు సేవించెడి దీపం 

అదే అదే సూర్య బింబ దీపం 

అదే అదే ఆకాశ దీపం

[: 11

శీర్షిక:- దీపం జ్యోతి పరం బ్రహ్మ

శివకేశవులకబేధం లేదని చెప్పే కార్తీక మాసం

హిందుసంప్రదాయమున పరమపవిత్రం

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే

శివస్యహృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివః

సాయం సమయంలో దేవాలయమున

ధ్వజస్తంభంమున గోమాత నేతితో వెలిగించే దీపము

అనన్య మోక్ష ప్రదాయకం

ఆకాశదీపదర్శనం పునర్జన్మ రహితం

అరుణాచల గిరి లో జ్వాలతోరణ దర్శనం

శాంతి సౌభాగ్యానికి ప్రతీక

శ్రీశైలంలో శివపార్వతుల ఊరేగింపు జ్వాలా తోరణ

ఆకాశ దీప దర్శనం జన్మరాహిత్యం

కార్తీకపౌర్ణమి రోజున ఉపవాస దీక్షలు చేసి

దేవాలయ ప్రాంగణ ఆకాశదీపం దర్శనం

కేదారేశ్వర వ్రతం, ఉసిరికాయలో దీపప్రజ్వలన

కార్తీక దామోదర స్వరూప శివార్చన

విప్రమోత్తమునికి దీపదానం మోక్షప్రదం

దీపం జ్యోతి పరంబ్రహ్మయే జీవన్ముక్తి సోపానం.!!

 12.

కవితా శీర్షిక: శశి జాడలు

అల్లంత దూరంలో హర్మ్యాల అంతలో

ఎదిగి ఒదిగిన వెలుగుల చుక్క కోసం

చీకటి అంటిన జీవితాలు

కష్టాలు కలతల నుంచి కదలాడుతుంటే

దీపాలు లేని ఇళ్ల దీనతలో

ఊర్థ్వముఖంగా ఊపిరి

దీపంలా మెలగాలని ఊసుపోతాయి


అమావాస్యతో సావాసం

సాగించలేక ప్రాణం పలుకుల్లా ఉడికిపోతుంది

వెంట వస్తున్న ఈదురు గాలిని

ఈడ్చుకొని నిలబడే దేహాలే

రేపటి ఆశా దీపాలవుతాయి

చీకటి రాజ్యాన్ని దేదీప్యమానం చేస్తాయి


ఏ గాలివేటుకో తూరుపు ముఖం పట్టకుండా

వెలుగులు పంచే ప్రేమ ఆరని దోసిలి పట్టాలి


అందనంత దూరంలో ఉన్న

ఆకాశ దీపపు వెలుతురు

అవని అంతా కురవాలి

మట్టి శ్వాసలు మణి కాంతులై మెరవాలి

అందరి జీవితాలు తారల్లే విరియాలి


నిశి నీడలు కరిగిపోయే

శశి జాడలు వెలుగులీనాలి

[: 13

సీ.పద్యం. అధ్భుత కార్తికం బరుదెంచె కృత్తికన్

దీప కాంతిమెరయ దిశల నెల్ల

శివకేశ వులగూర్మి సేవింప లభ్యమౌ

పుణ్యలో కంబుల పూర్వ గతులు

సోమవా రములందు సోమేశ్వరు నిగొల్చి

యభిషేక యుపవాస మాచరించి

దీప దా నాదులన్ దీక్ష తో జేయంగ

బాయుపా పములెల్ల భవుని కృపను.


తే.గీ.

ఉదయ కిరణంబు లుర్విని గదియ మునుపె

స్నాన మొనరించి శంభుని స్మరణ జేసి

బిల్వ పత్రములర్పించి భోల నాధు

మధుర ఫలముల నొసగంగ మాన్య మౌగ.


తే.గీ.మాలిక.

వెలుగు జూపంగ పితృదేవతలకు నింగి

ఆకశంబున వెలిగెడు నమర జ్యోతి

భవుడు హరియను భేదాల బాపు విధము

వత్తి యందున నిరువురు వరలు చుండి

ధ్వజ స్ధంభము పైనుండి దైవ దీప్తి

దిశెల జేర్తురు నింగిన దివ్య రీతి


ఉ..మా.


కార్తిక మాసమం తయును గాదిలి శంభుని బూజసే యగన్

యార్తిని దీర్చి కష్టముల నంతము సేయు భవుండనంగ నీ

మూర్తి ని మానసం బునను మోదము తోడుత నిల్పిని న్నునే

స్పూర్తి తొ గొల్చుచుంటినిల శోకము బాపుమ మల్లికార్జు నా


పై పద్యము లు నా స్వీయ రచన లు.

[: 14.

అక్షర దీపం

**********

కాలక్రమంలో 

వర్ణమాల దీపాలు

భాషోత్పత్తి కాగడాలను

బహువిధాలుగా వెలిగిస్తే


అక్షరం వేదమంత్రమై

పదము ప్రబంధమై

వాక్యము శాసనమై

విశేష ప్రాచుర్యాన్ని

విభిన్న రీతుల ప్రాశస్త్యాన్ని

సంతరించుకొని

సస్యశ్యామల క్షేత్రాలై

నిరంతరము అక్షరహాలిక

సేద్యమై విరాజిల్లుతుంది


నదులే లేకుంటే

జీవుల మనుగడ ఊహించనట్లు

సాహిత్యమే లేకుంటే

భావామృత భాండము 

చిలకరించబడనట్లు


సుఖ దుఃఖాలలో

చీకటి వెలుగులలో

ఉత్తాన పతనాలలో

ఉత్ప్రేరక గుళికలై

రసస్పోరక పదగుంభనమై

ఆశల పల్లకీలై

ఆశయాల చైతన్య రథాలై

జీవన సమరంలో 

ద్వేషభావనల రెక్కలు తెగేసి

ప్రేమైక సమజీవన

సాంగత్య సంతృప్తులను

సాక్షాత్కరిస్తుంది


నిత్యము ప్రయోగాల

బాటలో పయనించి

సంస్క్రతి సాంప్రదాయాలకు

నూతన జవసత్వాలను నింపి

వినూత్న యోచనములతో

విఙ్నాన భాండాగారంమై

ఒప్పారుతున్న అక్షర దీపమా

నమోస్తుతే

*******

[15

అంశం : ఆకాశదీపం


శీర్షిక : విధ్యుక్త ధర్మం


జీవనాధారమై జీవితాల నిలుపునది దీపం

జీవకోటి మనుగడ మూలదైవం ఆకాశ దీపం

నిత్యం నిండు కుండలా మండే అగ్ని గోళం

అలవక జీవినాదుకునే జీవాక్షయ స్తూపం

రగులుతున్న నిస్వార్థ పరోపకార మండలం

దహించుకుపోతున్న ధరిణి దివిటీ అండం

వెలుగుతూ వెలుగులు పంచే ఆకాశదీపం

భగ భగమంటూ భవితను పెంచే భాండారం

ఉష్ణకాంతిని వెదజల్లే ఉష్ణడు లోక జ్యోతిర్మయం

ప్రాతఃకాలాన బ్రహ్మస్వరూపుడు భాస్కరుడు

మధ్యాహ్నమున శివస్వరూపుడు శీరుడు

సాయంకాలమున విష్ణుస్వరూపుడు విశ్వకర్ముడు

రాత్రికాలాన చంద్రస్వరూప కారకుడు చక్రబంధుడు

నవగ్రహ దిశానిర్ధేకత్వ తత్వవేత్త నాభి పాత్రుడు 

ఆకాశదీపాల సౌరకుటుంబాన అలరారుతున్న సూర్యుడు

ఆదర్శంగా ఎంచి మనిషైన ప్రతివాడు మాధవుడై

సమాజానికి భవితజూపే ఆకాశదీపం కావాలి


హామీపత్రం

"విధ్యుక్త ధర్మం" శీర్షికతో ఈ పోటీ కోసం రాసిన నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.

[ 1️⃣6️⃣


      శీర్షిక-ఆకాశదీపం


    పున్నమిరోజు కృత్తికా నక్షత్రం తో కార్తీకమైంది!!

కృత్తికలంటే ఆరుముఖాలపాపనికి పాలిచ్చినతల్లులు!!

రుద్రపుత్రునికి ప్రీతిగా,హరిహర సేవగానే కార్తీకదీపాలు!!

అగ్నికి నిర్మలమూ,నిష్కల్మషమూ పవిత్రమనే విశేషణాలెన్నో!!

ఇంటిలో దీపారాధన,కోవెలలో ప్రమిదలతో

ఉదయవేళ, సంధ్యవేళ, స్నానాలు,ఆరాధనలు 

ఉపవాసాలు,పురాణశ్రవణాలు కార్తీకపు ప్రత్యేకతలు!

చుట్టూ శరచ్చంద్ర చంద్రికా ధవళిమలు!

తలపుల్లో రాసలీలల రమణీయదృశ్యాలు!!

ఉత్సాహపు కార్తీక వన-భోజనాలు!

చీకటిలో దారి చూపే వెలుగుదారిలా..

ఊరు-ఉనికిని చూపే కాంతిమార్గంలా

వర్షాకాలపుకీడుచేసే కీటకాలకోసమో

గుడి స్తంభంపై ఆరోగ్యగుళికలా ఆకాశదీపం!!

మనఃకారకుడైన అందాల చందమామకా?

దేవతలో,సిద్ధులో సాధ్యులకో నీరాజనమా?

నింగికెక్కిన మహాపురుషులైన చుక్కలకా?

కార్తీకపు కృత్తికలకా?భక్తీ,ముక్తీ శక్తీకావాలనా?

ఆకాశదీపపు అంతరార్ధాలెన్నో??!

అగ్నికీ,ఆకాశానికీ, చంద్రునికీ ..దేవతలకీ,

జనావళికి మార్గదర్శకంగా భక్తిగా ముక్తికోరి

వెలిగిద్దాం ఆకాశదీపం ఆనందంహద్దుగా!!



ఈరచన నాస్వంత రచన అని హామీ ఇస్తూ..

[: 17.

అంశం :ఆకాశ దీపం


శీర్షిక : "ఆకాశ దీపం ఆవశ్యకత"


దీపం వెలుగును పంచుతుంది !


చీకటి వంటి అజ్ఞానాన్ని తరిమే వెలుగుల హారమే దీపం ..


కార్తీక మాసం దీపోత్సవం సకల ఆనందాలకు కారణం !


శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం !


కార్తీక మాసం లో అకాశ దీపం ధ్వజస్తంభం పై భాగానికి చేర్చి..


శివకేశవులను ఆహ్వానించడం హిందూ సంస్కృతిలో భాగం !


ఆకాశమార్గం లో పయనిస్తున్న పితృదేవతలకి సైతం


దారి చూపే దిక్సూచిలా ఆకాశ దీపం పని చేస్తుందని జనుల నమ్మకం !


ఆకాశ దీపాన్ని వెలిగించి..దర్శిస్తే ..


ఆ ప్రాంతానికి యముడు రాకుండా వెనుదిరిగి వెళతాడని ..వేదం చెబుతుంది !

: 18.

అంశం:- ఆకాశదీపం

***********************

ఆకాశ మార్గంలో ప్రయాణం చేసే

పితృ దేవతలకు మార్గం సుగమం చేసే

మార్గదర్శిని ఆకాశదీపం

తులారాశిలో సూర్యుడు నిలిచిన

శుభ ఘడియలలో కార్తీకమ్మున

సంధ్య వేళలో సాయంత్రమ్మున

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా

వెలిగించే చిరుకాంతుల దీపం

తొలగించును మనసులలో తాపం

మనిషి లోని అజ్ఞానం బాపి

మనసులోన ఆలోచన రేపి

జ్ఞాన ప్రకాశపు మార్గము జూపి

నైరాశ్యపు చీకటులను బాపి

పెనుచీకటిలో వెలుగులు నింపి

దీపకరాగపు శ్రుతులను పంచి

బ్రతుకున కెంజాయలు విరియించి

నల్లని చీకటి నీడలు బాపి

క్రుంగిన మనసుకు ఊరట నింపి

పీడిత ధరణికి పీడను బాపి

తాడిత ప్రజలకు భయమును బాపి

జగతికి జవసత్వమ్ముల పంచు

దినమణి యగు రవి వెలుగులు పంచు

నిశిలో శశి కౌముది వెదజల్లు

అమృత మయమై ఇల విల‌సిల్లు

చుక్కల చక్కని దివ్వెల వెలుగు

మినుకు మినుకు మని నింగిని వెలుగు

మనిషి మనోగత పూర్ణ బింబాన్ని

సంధ్యా కెంజాయ రంగుల యవనికపై

ప్రతి బింబింపజేసే మనోదీపం

మృగ్యమైన మానవత్వ ధోరణులను

సద్య స్ఫూర్తితో వెలికితీసి

జీవప‌గమనాన్ని కృతకృత్యం చేసి

నవ్య భావావిష్కరణం చే‌సి

చిదాకాశంలో సదా వెలుగులను

విరజిమ్మే పరంజ్యోతి

హృదయపు కోవెలలో వెలిగే

ఆరని జ్యోతి ఆకాశ దీపం

""""""""""”"""""""""""""""""""""""""""""""""""

[19

శీర్షిక : దారిదీపం

************************

శిశిర సందర్బాలలో ఆశల చిగుళ్ళను

హరివిల్లు అనుభవాలను..ఎదచాలని అనుభూతుల నిచ్చి


గతుకులకు అతుకులేసుకుని..మైదానంలా పరుచుకుంటూ

ఎత్తు పల్లాలకు ప్రవహించే ప్రక్రియలను నేర్పారు వారు


ఎద గుమ్మాలకు వాళ్ళిచ్చిన ఉత్తేజపు పసుపు రాసి..అనుదినమూ సర్దుబాట్ల దీపాలను వెలిగించుకున్నాము


వారు మూటకట్టిచ్చిన ధైర్యాన్ని..తలా పిడికెడు పంచుకున్నాం


కొన్ని నవ్వులు గిల్లి కజ్జాలు కలల తాయిలాలను

తెచ్చి..మా నట్టింట్లో..వెదజల్లి పోయారు


మాకాళ్ళను కూడదీసుకుని దిక్కులు చూస్తున్నప్పుడు..వారు నక్షత్రాలై మినుక్కు మన్నారు


వారు వదిలిన మాటలు..మాకు బాటలను పరిచాయి

మా అడుగుల కోసం..వారు దారులను చెక్కారు  


ముసిరిన అజ్ఞాన చీకట్లను చెదరగొట్టేలా

ఏ మూలనున్నా సరే..శివకేశవుల పేరున

ఒక చిట్టి దీపం వెలిగించుకున్నాం


వారు నాటిన ఆప్యాయతా బీజమేనేమో

మా సమస్యల ఎడారులిపుడు..హరిత గీతాల నాలపిస్తున్నాయి

ఎన్నెన్నో ఆనందాల పూలు..

ఎద ముంగిట కురుస్తున్నాయి

జీవన దారుల్లో ఎగుడుదిగుడుల్లో

అభిమానాల కరువులిక బాధించవు


ఇపుడు ఆకాశందాకా అవశాలను పెంచుకున్నాం


వారి వళ్ళే..ఇపుడు ఈ పెదవుల గడపలో

చిరునవ్వుల దీపాలు వెలిగాయి

కళ్లనిండా..కలలు తొణికిస లాడుతున్నాయి


అవాంచనీయ అవాంతరాల అంధకారంలో..

ఆకాశ వీదుల్లో అడుగడుగునా

ఇక్కట్ల కారు మేఘాలు..అడ్డుపడుతాయని


వారి కోసం..కార్తీకం లో ఆకాశ దీపాలను వెలిగించాము

పితృదేవతలారా..మీ కిదే మా వినమ్ర ప్రణామం 


హామీ పత్రం

***********

 20

 అంశం :ఆకాశదీపం

 శీర్షిక :పవిత్ర పంచాక్షరినై….


 అడుగడుగునా

 తిమిర సమరాల ఓ పయనంలో

 ఆత్మ జ్ఞానాన్ని వెలిగించే

 ఓ చిన్న ప్రయాస..


 నాలోకి నేను

 తొంగి చూసుకున్న ప్రతిసారీ 

 జ్వలించే అహాన్ని చూసి

 రగిలే మొహాన్ని చూసి

 దేదీప్యమానం అనుకున్నాను!!


 నిరంతర అంతరాయాల గమనంలో

 పడి లేచిన ప్రతిసారి

 నన్ను నేను గెలిచాను అనుకున్నాను!!


 భావాల బావుటాలెత్తి

 అక్షర శిఖరాలపై నిలబడ్డప్పుడు

 అద్వితీయ ప్రతిభనాదని

 అబ్బురపడ్డాను..

 అపోహ పడ్డాను..


 విర్రవీగిన వెర్రిదారులన్నీ

 ఆత్మ తత్వాన్ని తేటపరచలేక

 నిస్సహాయగా నిలబెడితే...


 అప్పుడు వెలిగిన ఆత్మ జ్యోతిలో

 నేను సైతం పరంజ్యోతినై 

 మనోవికాస ఆకాశ దీపానికి

 అక్షర హారతి పడుతూ…


 అంతర్యామికి అంటిన

 భస్మపు భాష్యాన్నై కరిగిపోతాను..

 కాలగర్భంలో కలిసిపోయినా 

 పవిత్ర పంచాక్షరినై మిగిలిపోతాను..

 21.

శీర్షిక : సుజ్ఞాన దీపం


ప్రకృతిసిద్ధంగా నింగిలో వెలిగే అద్భుతదీపం

అనునిత్యం చల్లని వెన్నెలనొసగి

మానసికోల్లాసంతో పాటు జీవులకు జవసత్వాలను

అందించే ఆకాశదీపమే పున్నమి చంద్రబింబం!

దీపం చైతన్య స్వరూపం

చైతన్యమే ప్రగతికి మార్గం

సుప్రగతే నేటి ఆవశ్యకం

దీప ప్రజ్వలనమే భారతీయ సంప్రదాయం!

హృదయమనే ప్రమిదలో

భక్తియనే తైలం పోసి

కార్తీకదీపం వెలిగించి

పవిత్ర కార్తీకమాసం మొత్తం

ఉసిరిచెట్టు నీడలో

శివకేశవులను కీర్తిస్తూ

దీపారాధనతో దైవారాధన గావిస్తే

తొలగును సకల పాపములు

నెరవేరును కోరిన కోర్కెలు!

కార్యం ఏదైనా నిశ్చల మనస్సుతో

దీపారాధన గావిస్తే

అ కార్యం అవుతుంది శుభప్రదం

అదియే జగత్ కళ్యాణంకు సోపానం!

ఆ ఆకాశదీపంతో వెన్నెల వెలుగులు ప్రజ్వలనం

ఈ కార్తీకదీపంతో సుజ్ఞాన సునంద లోకం ఆవిషకృతం!

 22.

అంశము :-- ఆకాశ దీపం.


1.తే.గీ.

హరి హరులిరువురికిని నత్యంత ప్రియము

కార్తికము; నట్టి మాసమాకాశ దీప

ముఁ వెలిగించి ధ్వజస్తంభమునకు పైన

త్రాడుతో కట్టెదరు దేవళమ్ములందు.


2. తే.గీ.

కార్తికముఁ శుద్ధ పాడ్యమి నాటినుంచి

గగన తలమందు వారి లోకములకు 

పయనమున్ జేసెడు పితృదేవతలకా స

మయమున సరిగ కన్పించ మార్గము వెలి

గించు నాకాశ దీపమటంచు నుడివె

కార్తిక పురాణ మనియెడు గ్రంథమందు. 


3. తే.గీ.

అందజేయు దీపము హరిహరుల తేజ

మును జగతి యంత; యీ దీపముఁ వెలి

                                                   గింత్రు పలికి యాహ్వానము హరిహరులిరువురకు 

జగతికి శివకేశవుల తేజస్సు తోడ

వెలుగు నందించి యజ్ఞానమున్ తొలగజేయ

ప్రజ్వలించు నాధ్యాత్మికత్వంపు కాంతి.

*****************

: 23.

*శీర్షిక:ఆకాశ దీపమొక...*

 ***************

ఆది మధ్యాంత రహితుని తేజస్సు

జగన్నాటక సూత్రధారి ఓజస్సు

అమృతవాహిని రూపమై 

సకల జగత్తుకు వెలుగులు పంచే ఆకాశ దీపం 

మనో క్షేత్రంలో అజ్ఞానపు చీకట్లను 

పారద్రోలే దివ్య రోచిస్సు!


అంతరాత్మ ప్రమిదలో

ఆధ్యాత్మిక చింతన చమురు నింపుకుని 

ఆత్మ వత్తిగా వెలిగే వేళ 

పరమాత్మ దర్శనం కలిగించే 

మహిమాన్విత ఆకాశ దీపం! 


మనలో ప్రవహిస్తున్న జీవనదీ మూలాలు

నిశి నీడల్లో తారాడుతూ వెతుక్కుంటున్న దివ్యధామపు వీధుల దారుల్లో 

వెలిగించిన ఆకాశ దీపాలు

పితృ దేవతల సంతుష్టి కారకాలు!


నీలోనా నాలోనా జ్వలించే కాంతి 

ఉచ్ఛ్వాస నిశ్వాసాల లయల విక్రాంతి 

హరి హరుల కరుణామయ వాత్సల్య దీప్తి!


శివ కేశవుల శక్తితో 

దివ్యాకాశాన వెలిగే జ్ఞాన జ్యోతి

మానవ జన్మను సార్థకం చేసుకొమ్మని చెప్పే 

ఆకాశ దీపమొక సందేశ ప్రదీప్తి!


ఆశలను లయింపజేసి 

ఆశయాలను జ్వలింప జేస్తూ 

కల్పించే పుణ్య లోక ప్రాప్తి!

[24.


అంశం: ఆకాశ దీపం 

శీర్షిక: దీపోత్సవం

...

కార్తీక మాసంలో 

ఎటు చూసినా 

దీపాలమయమేగా 


గగనంలో ఆకాశదీపాలు 

వెలిగించినవాడే పరమేశ్వరుడు

సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు

ఆకాశదీపాలేగా 


కార్తీక మాసంలో 

ధ్వజస్తంభానికి తాడుకట్టి 

చిన్న పాత్రలో దీపం వెలిగించి 

భగవన్నామ స్మరణతో 

దీపాన్ని పైకెత్తే అపురూప దృశ్యం 

ధ్వజస్తంభంపై ఆకాశదీపం 

ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే దీపం 


కార్తీక పౌర్ణమి రోజు

గుత్తి దీపాలు వెలిగించే సంప్రదాయం

త్రయంబకమావాహయామి యని 

దీపాన్ని వెలిగిస్తే శ్రేష్టం 


అరుణగిరిపైన 

కృత్తికా నక్షత్రం నాడు 

కృత్తికా దీపోత్సవం 

తిలకించి పులకించేది 

లక్షలాది భక్తజనం 

పూర్వజన్మ సుకృతమేగా

...

హామీ పత్రం

...

ఈ కవిత నా స్వంత రచన

: 25.

దివి పై కెగిరే ఆ వెండి వెలుగుల

దీపపు కాంతి కోసం ఎన్ని

దీనపు చూపులు ఎదురు

చూస్తున్నాయి పై వాడి

దయ కోసం దీనాతి దీనంగా... 


శివ కేశవుల కోసం ఎగిసినా

ఎన్ని హృదయ గంటలు 

గణ గణ మన లేదూ

ఆకలి పొట్ట చేతబట్టి అవేదనగా.... 


యమ ధర్మ రాజును వెళ్లమని 

ఆశల చమురు పోసి దీపాన్ని వెలిగించినా

క్షణికావేశంలో ఎన్ని ప్రాణ దీపాలు

ఆర్పుతున్నారు నిరాశ, నిస్పృహ గా.... 


మింటి నంటే ఆకాశ దీపాలు 

సదా ఆశల జ్యోతి తో వెలగాలి

పేద హృదయాలలో కార్తీక కాంతులు కోటిదీపాల వలె నిత్యం వెలగాలి...!! 


హామీ... నమస్తే ఈ కవిత నా స్వీయ రచన అని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను

: 26

శీర్షిక:: ఆకాశంలో చందమామ


ఆకాశదీపము

చల్లని వెన్నెల రూపము

పండు వెన్నెలలో పయనము

ఎంతో మనోజ్ఞము కాంతివంతము

ప్రయాణ సౌకర్యాలు 

లేని రోజుల్లో

ఎడ్ల బండిలో కూర్చొని

చందమామ వెలుగు దారిలో

కుటుంబమంతా ప్రయాణము

అలుపు సోలుపు లేక తగ్గిపోవు

దూరము

అనిపించదు ఎంత దవ్వయిన భారము

ఒక ఊరి నుంచి ఇంకో వూరికి

పోయే లోపు

ఆ ఊరిలోని గుడి దగ్గరున్న

ధ్వజ స్తంభము పై నున్న

ఆకాశదీపము అగుపిస్తే

ఊరికి వచ్చినట్టే

అలసట0త తీసేసినట్టే

కాగల కార్యము నెరవేరినట్టే

బంధువులతో కలిసినట్టే

ఆకాశదీపము అటు జాబిల్లి

ఇటు ధ్వజ దీపము ఆహ్వాన

అనురాగవల్లి!!

           ఈ కవిత నా స్వీయ రచన అని హామీ

27.

అంశం : ఆకాశ దీపాలు::

శీర్షిక : మహా మహిమాన్వితాలు!!


ఆకాశ దీపాలు తొలగించును పాపాలు!

వెలిగించి చూడాలి ఆకాశ దీపాలంకరణలు!!


ఇంటింట వెలిగించు ఆకాశ దీపాలు!

సత్సంప్రదాయ భక్తి యుక్త సదవకాశాలు!!


కార్తీకమాసమంతా దీపాలంకరణ శోభలు!

జన్మరాహిత్యపు దారి చూపు దీపదానాలు!!


శుద్దేకాదశి,ద్వాదశి,చతుర్దశి పౌర్ణమి తిథులు!

విశేషంగా వెలిగించిన అనేక ప్రయోజనాలు!!


శివకేశవులు సంతసించి తీరుస్తారు కోరికలు!

కోరినకోర్కెలన్ని తీర్చి ప్రసాదిస్తారు సుఖాలు!!


ఆకాశ దీపాలు వెలిగిస్తారు దీక్షా తత్పరులు!

ఉత్తరజన్మలో అవి పుణ్యప్రాప్తికి సంకేతాలు!!


సద్భక్తితో వెలిగించు సలక్షణ ఆకాశ దీపాలు!

వెలిగించు అద్భుతసదవకాశ ఆకాశదీపాలు!!


కృత్తికానక్షత్రయుక్త కౌముదీమాస వెలుగులు!

శివవిష్ణు స్మరణలకు అనువైన జపతపాదులు


పాపములన్ని తొలిగి లభించును మోక్షాలు!

సర్వ సౌభాగ్య సంపత్కర ఆకాశ దీపాలు

మనందరికీ మహా మహా మహిమాన్వితాలు!!

28.

**************************

అంశం :ఆకాశదీపం

****************************

శీర్షిక: దీపం పరబ్రహ్మం

************************

కార్తీక మాసారంభం 

హరిహరులకు అత్యంత ప్రీతికరం

గంగ స్నానాలు, నిత్య దీపారాధన 

ఇస్తుంది మనస్సుకు ఎంతో ప్రశాంతత

కార్తీక మాసారంభంలో దేవాలయ ధ్వజస్తంభంపై 

ఇత్తడి పళ్లెంలో వెలుగులీనే ఆకాశదీపం

చూపుతుంది పితరులకు వెలుగు దివ్వె

దీప స్తంభాలు, జ్వాలాతోరణాలు 

పంచాక్షరితో తరించే కార్తీక మాసం


చన్నీటి స్నానాలు అరిషడ్వర్గాలను

 అణచే పవిత్ర కాలం

కళ కళలాడే దేవాలయాలు

ప్రతిధ్వనించే పంచాక్షరి మంత్రాలు 

దీపం జ్యోతి స్వరూపం పరబ్రహ్మ రూపం

కనులవిందైన లక్ష్మీ శ్రీ విష్ణువుల అద్భుత కళ్యాణం తులసీమాత కళ్యాణం కమనీయం

కార్తీక మాసాన వెలిగింది ఆకాశదీపం 

గుడిసెలోని వారికి వెలుగునిచ్చే బుడ్డి దీపం 

తిమిరంలోని బాటసారి కి వెలుగునిచ్చే నక్షత్ర దీపం బడుగులకు బతుకునిచ్చేఆశాదీపం 

ప్రమదలు ప్రమిదలు పెట్టి ,ప్రణతులర్పించే తులసి దీపం పితరులకు వారి లోకాలు నిర్దేశించి 

వెలుగు చూపే ఆకాశదీపం  


శివ కేశవులను ఆహ్వానించే మహిమాన్వయ దీపం 

అజ్ఞాన చీకట్లు తొలగించి ,విజ్ఞాన వెలుగునిచ్చే 

ఆధ్యాత్మిక దీపం

 అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం

***********************************************సమీక్షలు 

: కవితా గానం సమూహంలోని కవివరులందరూ

చాలా చక్కటి కవితలతో అలరించారు.


పవిత్ర కార్తీక ఆకాశ దీపాన్ని తమదైన శైలిలో విశ్లేషణాత్మకంగా ఆవిష్కరించారు.


ఆకాశ దీపాన్ని ఒక కొత్తకోణంలో  చూపారు.

అందరికీ అభినందనలు.

💐💐💐💐💐💐

సమూహ నిర్వాహకులు శ్రీ వీరా గుడిపల్లి గారు సాహితీ సేవాభిలాష తో నిర్విరామంగా,నిరాఘాటంగా కవితా గానం కార్యక్రమాన్ని

 కొనసాగిస్తూ,నగదు బహుమతులతో కవులను ప్రోత్సహించడం అభినందనీయం

💐💐

కవివరులందరి కవితలను  చదివే అదృష్టం,అవకాశం కలిగించినందుకుగాను

నిర్వాహకులకు(చెల్లికి, వీరా గుడిపల్లిగారికి )

ధన్యవాదాలు🙏🙏


............. శివునూరి సావిత్రి

"ఆకాశదీపం" కవితలో కవయిత్రి.....

*లలితాచండి గారు...*

భక్తి పారవశ్యాలతో పాటు శరత్కాల వెన్నెలమ్మ అందాలను మన కళ్ళ ముందు నిలిపారు.

'శరత్ జ్యోత్స్న నవ్వులు మంచు పొగలను మాయం చేసింది' అనే ప్రయోగం బాగుంది. తనతో పాటు వెన్నెలను వెంటబెట్టుకొని కలువలరేడు చంద్రుడు వెళ్తే అరుణాన్ని పులుముకొని భానుడు ప్రపంచానికి శుభోదయాన్ని పలికాడు అని రాయడంలో అతివలు వెలిగించిన ఆకాశ దీపాలు చీకటి అనే భావన రాకుండా రేయిని వెన్నెల వెలుగులతో నింపాయి అనే అర్థంలో చాలా బాగా రాశారు. మీకు అభినందనలు.

💐💐

[ 'పవిత్ర పంచాక్షరి నై'అను కవితలో తనలో ఉన్న అహాన్ని జయించి ఆత్మ జ్ఞాన దీపం వెలిగించుకోవడాన్ని

*కవయిత్రి రాజశేఖరుని శ్రీ శివలక్ష్మి గారు*

 చక్కగా వివరించారు. ఆత్మ పరిశీలనా క్రమంలో తన ప్రతిభను చూసి గర్వాన్ని పొందినప్పుడు (అహంకారం కలిగినప్పుడు) జీవనగమనంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడం తన ప్రతిభే అని అనుకోవడం తన భావాలకు అక్షర రూపాన్ని అద్దినప్పుడు అవి చూసి తన గొప్పతనంచూసిఆశ్చర్యపడ్డాను అనడం కవయిత్రి అంతః పరిశీలన దృష్టినిచూపుతుంది. చివరగా తన  పరిశీలనా క్రమంలో ఆత్మ తత్వాన్ని తెలుసుకోలేక నిస్సహాయ స్థితికి వెళ్ళినప్పుడు నిజమైన మనోవికాసం జరిగి, పరమాత్మ తత్వం బోధపడి ఆత్మజ్యోతి గా ఆకాశ దీపానికి అక్షర జ్యోతి పట్టడం అద్భుతం .పరమాత్మ తత్వంతో ఆత్మసాక్షాత్కారం పొంది తన ఉనికి లేకున్నా పంచాక్షరిగా మిగిలిపోతాను అనడం కవయిత్రి భగవద్భక్తికి నిదర్శనం.

మీకు అభినందనలు.

💐💐

: 'శశి జాడలు' అనే కవితలో ఆకాశ దీపాలు కష్టాలతో, కలతలతో ఇంట్లో దీపాలు కూడా వెలిగించుకోలేని పేదల చీకటి జీవితాలకు వెలుగును అందించాలని కోరుకుంటున్నాను అనడం *కవి బొప్పెన వెంకటేష్ గారి*

ఆశావహ దృక్పథానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అమావాస్య చీకటికి, ఈదురుగాలులకు నిలబడటం అంటే కష్టాలకు తట్టుకున్నప్పుడే జీవన ప్రయాణం వెలుగులీనుతుంది అని చెప్పడం బాగుంది. చీకటిలో (కష్టాలలో) ఉన్న వారిలో ఆశల దీపాలు వెలిగించి అవి ఆరకుండా ప్రేమ అనే దోసిలి పట్టాలి (వెలుగులు పంచే ప్రేమ ఆరని దోసిలి పట్టాలి )అనే వాక్యం ద్వారా తెలపడం చాలా బాగుంది ఆకాశ దీపాలు భూమిపైనున్న అందరి జీవితాల్లో మణికాంతుల వెన్నెలలు కోరుకుంటూ 'నిశినీడలు కరిగిపోయే శశి జాడలు వెలుగులీ నాలి 'అని తన ఆశావహ దృక్పథాన్ని తెలియజేయడం ముదావహం.

మీకు అభినందనలు.

******

'దారి దీపం' అను కవితలో

 *కవయిత్రి *దారలవిజయకుమారి గారు*

పితృదేవతలు అందించిన అనుభవాలను స్మృతి పదంలోకి తెచ్చుకుంటూ వారిచ్చిన భరోసాతో జీవితంలోని ఎత్తుపల్లాలను తట్టుకొని నిలబడ్డానని, వారిచ్చిన ఉత్తేజం జీవితంలో సర్దుబాట్లు నేర్పాయని తెల్పడం బాగుంది. ఏ దారి తోచనప్పుడు ,దిక్కులు చూసే వేళ నక్షత్రాల్లావారు దారి చూపారనడం చాలా బాగుంది. ఒకవైపు పితృదేవతలను సంస్మరిస్తూనే మరోవైపు శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకదీపం వెలిగించుకోవడం బాగుంది. తమ పెద్దలు చూపిన దారిలో నడుస్తూ తమ జీవితాల్లో చిరునవ్వుల దీపాలు వెలిగించుకుంటూ దివికేగిన తమ పితృదేవతలకి 'ఆకాశవీధిలో కారు మేఘాల చీకట్లు 'అడ్డుపడకుండా 'ఆకాశ దీపాలు 'దారి దీపాలుగా ఉంటాయనడం పితృదేవతల పట్ల వారి భక్తికి నిదర్శనం. కార్తీక ఆకాశ దీపాలని మరో కొత్త కోణంలో కవయిత్రి స్ప్రుశించడం ముదావహం. మీకు అభినందనలు.

💐💐

హామీ :ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నాను

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...