Skip to main content

Fathers day 2022


నిర్వహణ
 శివునూరి లలితాకృష్ణ
వీరా గుడిపల్లి
******************
కవివరుల జాబితా
1.గజవెళ్ళి శ్రీ నివాసాచారి గారు
2.ఆపరాజిత్ గారు
3.డా.తంగిరాల నాగ లక్ష్మి గారు
4.మేకల రామ స్వామి గారు 
5.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 
6.వింజమూరి సూర్య లక్ష్మి గారు 
7.విజయ లలిత టేకుమళ్ళ గారు 
8.ముద్దు వెంకట లక్ష్మి గారు 
9.సింహాద్రి వాణి గారు 
10.పిన్నక నాగేశ్వరరావు గారు 
11.కవిత వెంకటేశ్వర్లు గారు 
12.వేదాంతం సురేష్ బాబు గారు 
13.తాతపూడి గారు సోమ శేఖర శర్మ గారు 
14.తోట సులోచన గారు
15.అయ్యల సోమయాజులు ప్రసాద్ గారు 
16.సంగీతం సంతోష్ కుమార్ గారు
17.డా.బల్లూరి ఉమాదేవి గారు 
18.కేశరాజు వెంకట ప్రభాకర్ రావు గారు 
19.వనపర్తి గంగాధర్ గారు 
*******
1
గజవెళ్ళి శ్రీనివాసాచారి 
అంశం: ఫాదర్స్ డే సందర్భంగా 
ప్రత్యేక కవిత
శీర్షిక: నాన్న
...
అమ్మ జన్మనిస్తే
సంతానానికి ధైర్యం ప్రసాదించేది నాన్న
వేలు పట్టి నడిపిస్తాడు 
లోకాన్ని చూపిస్తాడు 
పిల్లల తప్పటడుగులు సరిదిద్ది 
బంగారు భవిష్యత్తునివ్వాలని 
నిరంతరం తపించే నిస్వార్ధ జీవి 

నాన్న మనసు నిండా పిల్లలే
పిల్లల సుఖంకోసం 
కష్టాలు అనుభవించే సుగుణం 
త్యాగాలకు చిరునామా 

సంతానం గెలిస్తే 
సంతోషపడే అల్పసంతోషి 
అడుగడుగునా అండగా నిలబడి 
ధైర్యం నూరిపోసేది నాన్న 
పైకి కాఠిన్యం ప్రదర్శించినా 
మనసు మాత్రం నవనీతమే 

నాన్నలకు వందనాలు
2.
ఆర్టిస్ట్ కృష్ణ!

మా ఊరు చిన్న పల్లెటూరు 
మా నాన్న ఊర్లో పోస్ట్ మాస్టరు 
పోస్ట్ కృష్ణారెడ్డి మారు పేరు!
ఆ రోజుల్లోనే ఎచ్ ఎస్ సి పాస్ 
చదువు ఆయన ఆరోప్రాణం 
లెక్కలేనన్ని చిత్రాలు గీసాడు 
సుమారు రెండు వందలకు పైగా చిత్రాలు 
అప్పుడున్న అన్ని పత్రికల్లో అచ్చయ్యాయ్!
సుమారు ఏబది కథలు,వ్యాసాలు 
అన్ని దిన,వార,పక్ష,మాస పత్రికల్లో అచ్చయ్యాయ్!
కవితల దృక్కోణంలో ప్రవేశించి 
శ్రీ శ్రీ నే విమర్శిస్తూ,,,,,,,,,,,,!
ఉద్యమ కవిత్వం వదిలి 
సినిమాలకు ప్రేమ గీతాలు రాస్తున్నారంటూ,,,,,,,,!
ఏభై పైగా కవితలు వ్యవసాయం చేస్తూ నే  రాసాడు!
మాటల్లో కాలక్షేపం చేస్తూనే 
చిన్న చిన్న పేపర్లపై నఖ చిత్రాలు గీసేవారు !
ఫ్లూటు వాయిద్యంలో దిట్ట 
సినిమా పాటలను ఫ్లూటుతో వాయించేవాడు!
పాటలు శ్రావ్యంగా పాడటంలో ఘంటసాలను అనుకరించి 
పాటలు పాడే తీరు అందరినీ ఆకర్షించే ది!
మా ఇంట్లో పుస్తకాలు దొంతరలు ఉండేవి 
నాకు చెల్లాయిలకు చదువే లోకం!
మేము వేసిన ప్రతి అడుగులో 
ఊతమిచ్చే మా నాన్న ఇప్పుడు లేరు 
ఆయన జ్ఙాపకాలు మా గుండెల్లోగూడు కట్టుకుని 
ముందుకు నడిపిస్తూనే ఉన్నాయ్!
కొందరు కళాకారులకు మరణం శరీరానికేనేమో!
హే కృష్ణా ముకుందా మురారి,,,,,,,,,,!

ఆపరాజిత్
3.
అంశం: మా నాన్న గారు
డా. తంగిరాల నాగలక్ష్మి
నాన్న ఆమాట వింటేనే  తలిస్తేనే గుర్తుకువస్తూనే
కళ్ళు చెమర్చుతు న్నాయి.
 నాకు జన్న నిచ్చిన తండ్రి
జన్మఎత్తుతూనే పితృ రుణం తో ఋణం మొదలవుతుంది మిగిలిన ఋణాలైన దేవఋణం  ఋషిఋణములతో పాటు
  
ఋణం ఉంటేనే ఏ బంధమైనా
నాన్న రుణం ఎలా తీర్చుకోగలను?
నా అనేవారు అంటే మొదట నాన్నే గుర్తుకు వస్తాడు
ఉదయం లేచిన దగ్గరనుండి
ముఖం కడిగి స్నానం చేయించడం
బట్టలు వేసి స్కూల్ కి పంపించడం
క్రొత్త పుస్తకాలు రాగానే అట్టలు వేసి నీట్ గా పేర్లు రాయటం
చిన్ననాటి నుండి తప్పటగులు వేస్తే
సరిగా నడిపించి పెంచి నా భవిష్యత్తుకు పూల బాట వేసాడు
నన్ను సన్మార్గంలో నడిపించిన మార్గదర్శి మా నాన్న
నేనునున్నానని ఎనలేని  ధైర్య మిచ్చినది నాన్న.
ఐదుగురు అన్నల తరువాత పుట్టిన ముద్దు బిడ్డను కదా మరి
అల్లారు ముద్దుగా పెంచాడు మా నాన్న
నన్ను 
ఏడు మల్లెల ఎత్తు పెంచుతున్నాడురా వాడు అనేది మా బామ్మ
అలా అని అన్నలకు అన్యాయం చేయలేదు అడుగడుగునా
వచ్చే కష్టాలకు ఆదు కున్నాడు 
పిల్ల లందరి విషయం లో
మానాన్న అడగకుండానే వరాలిచ్చే దైవం
ప్రేమ కి ప్రతిరూపం నాన్న
బందరు. మిఠాయి తొక్కుడు లడ్డు
కాకినాడ కాజా
నూజివీడు రసాలు బంగినపల్లి మామిడి పళ్లు ఇలా ఎన్నో స్పెషల్స్ తినిపించాడు

బరువు అనుకోకుండా భారాన్ని భుజస్కంధాలపై వేసుకుని
సంసార సాగరాన్ని ఈదాడు కడ దాకా

బడి నుండి రాగానే రామాలయం అరుగు మీద బఠానీ లు వలిచి పెట్టి తినిపించేవాడు ఓపికగా.
అన్నము ముద్దలుకలిపి మొదటి ముద్ద నాకు పెట్టి తరువాతనే తను తినేవాడు

నాన్న అంటే భయం అమ్మకు కూడా
అబద్ధాలాడాలన్నా సినిమా కి వెళతానని
అడగాలన్నా
భయ భక్తులతో ప్రేమ నింపిన జీవితం
ఇచ్చారు నాన్న నాకు
నాన్న  విశ్వవిద్యాలయం గుర్తించని
ఒక న్యాయవాది
బిరుదులేని ప్రతిభా శాలి
అన్న గార్లతో
పుత్ర పౌత్రాదు లతో  సహకుటుంబముతో
మెలిగిన భాగ్యశాలి
భార్యను పుణ్యస్త్రీ గా గౌరీ లోకానికి పంపిన పుణ్యశీలి
పైనుంచి రాతి గుండె గలవాడని అనిపించినా అది తెచ్చి పెట్టుకున్న
గంభీరమే అనే ఆలోచిస్తే మనసుకు తెలుసు

నాన్న అంటే నాకుమన్నన 
ప్రతివిషయాన్ని అవగాహనతో వివరించి   ఆచరణ యోగ్యంగా చేసే వాడు
మమ్ము సంస్కరించు కునేలా చేసాడు
నాన్న అంటే మక్కువ
ఎంత అంటే నేను నాన్నకే పుట్టాను అమ్మకు కాదంటే నిజమే అని నమ్మాను
నాన్న అంటే గొప్ప ఎందుకంటే
అవసరమైన వారికి  మంచి  సలహాలు ఇవ్వటంలో దిట్ట 
భాషణా పటిమ యున్న భారతీయుడు
ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్ర  జీవనం సాగించాడు
వృత్తి ధర్మం లో నిజాయితీ నిరిపించుకుని 
సెభాష్ అనిపించుకున్న వ్యక్తి నాన్న
నాన్న అంటే ఎక్కువే మరి 
కుటుంబ రథానికి విజయ సారధి
మాతృ దేవో భవ పితృదేవోభవ అన్నా
ఎవరి స్థానం వారిదే ఇద్దరు పూజనీయులే
నాన్న  ఈలోకం వదలి వెళ్లినా
నా తీపి జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలచి పోతాడు
నాన్నా నీగురుంచి ఎంత చెప్పినా తక్కువే
ఇంకా ఇంకా చెప్పాలి వంకలు పెట్ట లేని నీ జీవన యానం
ఆశీర్వదించు నన్ను దివినుండి నాన్నా

4.
[21/06, 8:03 pm] Mekala Ramaswamy Poet: అంశము
*"*""""""**
ఘనుడురా నాన్నా
****************
నాటికి నేటికి మరి యే
నాటికి నైనన్ మనింటి పునాదిగ యుండెన్
పాటికి, సాపాటుకు ప్రతి
పూటకు గాసమును దెచ్చు బూజ్యుడునాన్నా

పంటి బిగువునను బాధను
ఒంటరిగ భరించుచుండునోపిక తోడన్
కంటికి రెప్పల కాపా
డొంటరి సైనికుడుధీరుడోడని నాన్నా

ప్రేమను బయటికి జెప్పడు
ప్రేమను తన ఎదలనిండ పేర్చుకు నుండీ
ప్రేమగ పెంచు మనసుగల
ప్రేమించే సుగుణమూర్తి పెన్నిది నాన్నా

తన సంతానము కొరకై
తన ధన మనమ్ములన్ని దారగ బోయున్
తనకంటేగొప్పోళ్ళుగ
గనుటకు శ్రమసల్పుచుండు  ఘనుడుర నాన్నా
*******************
మేకలరామస్వామి చెన్నూర్
9912747214
5
[21/06, 8:03 pm] Aalla Nageshwar Rao Poet: కవితా సీజన్  
సందర్భం :  అంతర్జాతీయ నాన్నల దినోత్సవం 
పేరు :  ఆళ్ల నాగేశ్వరరావు
ఊరు :తెనాలి
జిల్లా :గుంటూరు
క్రమసంఖ్య :107
చరవాణి :7416638823
శీర్షిక :  కలియుగ అభిమన్యుడు
కవిత :

ఉవ్వెత్తున ఎగసిపడే అలల తాకిడిని తట్టుకుని
సాగరంలో పయనించే నావకు చుక్కాని లా
ఆటుపోటులను ఎదుర్కొని సంసార సాగరంలో
జీవనయానం సాగించే జీవితనౌకకు నాన్న అలా!
జగతికి సూర్యచంద్రుల్లా
జనులకు హృదయంలా
ప్రగతికి ఉషోదయం లా
దేశానికి రైతన్న లా
కుటుంబానికి నాన్న అలా!
పైకి మేకపోతు గాంభీర్యం
లోలోపల కరిగే వెన్నలాంటి మనస్సు
భయాన్ని ప్రదర్శించేలా లావైన మీసాలూ
ఇవన్నీ ఒకప్పటి నాన్నల ఆనవాళ్ళు!
జీవితాన్నిచ్చేది అమ్మ అయితే
జీవితాన్ని త్యాగం చేసేది నాన్న
నడకను నేర్పేది అమ్మ అయితే
నడవడికను నేర్పేది నాన్న!
భర్తగా, నాన్నగా, కొడుకుగా
కుటుంబమనే వేదిక పై
జీవితమనే నాటకంలో త్రిపాత్రాభినయనం చేస్తూ
సమస్యల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతూ
సంసారమనే పద్మవ్యూహంలో
నిత్య పోరాటం సల్పుతున్న
కలియుగ  అభిమన్యుడు నాన్న!

పై వచన కవిత నా స్వీయరచనే నని హామీ ఇస్తున్నాను.
6
[21/06, 8:07 pm] Vinjamoori Surya Laxmi Poetess: కవితాగానం ( సీజన్3 ) 21/6/2022/ మంగళవారము
" ఫాదర్స్ డే సందర్భంగా "
శీర్షిక: - " నాన్నగొప్పతనము "
                   1
సీ ! తండ్రిచూపుభవిత తనయులకెప్పుడు
తరతరాల వెలుగు తండ్రి బాట

తనయులకెప్పుడు తండ్రిధనముగాదె
నందనవనమును నాన్న జూపు

అడ్డంకులున్నను అనయము బిడ్డల
భవితకురానీడు బాధలేవి

ధనములేకున్నను తనయులపెంచును
తనబాధలేవియో తానుపడుచు

ఆ ! మార్గదర్శి నాన్న మనజీవితాలకు
తీర్చిదిద్దునాన్న తీరుగాను
దారితప్పినడువ దండించునాన్నయే
బిడ్డమేలుగోరి బిగువుచూపు !
                 2
సీ ! తప్పటడుగులేయు తనయులకందించు
చేయూతనెంతయో చెలువుమీర

బంగరుభవితకు బాటలువేయుచు
నిత్యసత్యాలను నీకుదెలుపు

తనకన్నమిన్నగ తనయులు పెరిగిన
సంతోషమంతయు సాగుచుండు

మహనీయుడనగాను మనలసాకగ
విడుచునుసుఖములు విధిగనతడు

ఆ ! బ్రతుకుబాటలోని బాధలువివరించి
మంచిచెడులలోని మర్మమెరుగ
నాన్నదెలిపినట్టి నడవడినెరిగిన
చింతలేకయుండు చివరి వరకు !
            తరణికంటి సూర్యలక్ష్మి.
                            ----------
7
[21/06, 8:08 pm] +91 85000 99051: ఎప్పటికీ నీవే నాన్నా
~~~~~~~~~~~~~~~~
నీవంటే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
గౌరవమే నాన్నా !
కాస్త ఊహ వచ్చేసరికి 
అమ్మ దగ్గరే ఉన్నాగా
అప్పుడప్పుడొచ్చే నీ గురించి
అప్పుడు తెలియదు గా
నే నీ ముద్దుల బిడ్డనే 
మరి కోట్ల మందికి
నీవు ఎలా ముద్దుబిడ్డ అయ్యావో
అప్పుడు తెలియదుగా
మాకు మాత్రమేనా
యావత్ దేశానికి 
నీ అండ అవసరమని
అప్పుడు తెలియదుగా
జై జవాన్ అనే
నినాదం నీ కోసమే
అని అప్పుడు తెలియదుగా.
స్ఫూర్తి, ప్రేరణ
మార్గనిర్దేశనం,
చైతన్య దీప్తి
అన్నీ నీనుండే నాన్న
నీవంటే ఎంతో ఇష్టం నాన్నా
నీ వెంటే ఎంత కష్టమైనా నాన్నా...
~~~~~~~~~~~~~~~~~~~
విజయలలిత టేకుమళ్ళ
ఉపాధ్యాయిని
8
8500099051
[21/06, 8:17 pm] Muddu Venkata Laxmi పిఠాపురం కవయిత్రి: కవితాగానం సీజన్ 3
21-06-2022
మంగళవారం 
అంశం :  ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కవితలు 

శీర్షిక :. ధర్మమూర్తికి...

'నాన్నగారు'  అన్న పదం మదిలో మెదలగానే అందమైన ఆంగ్ల దస్తూరీ కళ్ళ ముందు కదలాడుతుంది,
మస్తిష్కంలో తిష్ట వేసుకున్న
పొందికైన వాక్యనిర్మాణం స్మృతుల పొరల్లో ప్రత్యక్షమౌతుంది ;

సాహితీ గ్రంథాలను అందించి
నా సాహిత్యాభిలాషను ప్రోది చేసి
పెంపొందించిన సౌజన్యమూర్తి పట్ల 
కృతజ్ఞత మనస్సంతా నిండిపోతుంది ;

అర్ధరాత్రైనా అపరాత్రైనా
కేసుల్లో సంబంధిత వ్యక్తుల 
మరణ వాంగ్మూలం వ్రాయడానికి
సంసిద్ధులై పయనమయ్యే కర్తవ్యనిష్ఠాగరిష్టులైన న్యాయమూర్తి 
కళ్ళెదుట కనిపిస్తారు;

బ్రాహ్మీముహూర్తాన నన్ను మేల్కొల్పి తీర్పుల శ్రుతలేఖన కార్యమిచ్చి, భాషా నైపుణ్యాలను,
సామాజిక అవగాహనను అందించిన న్యాయాధీశునికి,

విశ్రాంత జీవనంలో సైతం న్యాయవాదిగా సమాజ సేవలందించిన ఉత్తమ వ్యక్తికి,

అష్ట కష్టాలెదురైనా 
నీతీనిజాయితీలకు నిలబడిన ధర్మమూర్తికి, దైవ స్వరూపానికి,
కీర్తిశేషులు శ్రీ ముద్దు రామచంద్ర సోమేశ్వర రావు గారికి మా *నాన్నగారికి* పాదాభివందనం.
🙏

పై కవిత నా సొంతమే.
ముద్దు వెంకటలక్ష్మి 
పిఠాపురం
చరవాణి : 9886824003
9
[21/06, 8:22 pm] Siimhadri Vani Poetess: కవితా గానం సీజన్--3
21--6--2022
మంగళవారం
పితృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కవితలు
అంశం:--నాన్న
రచన:-- సింహాద్రి వాణి
ఊరు:-- విజయవాడ
శీర్షిక:--గజయీతగాడు
చరవాణి:-- 7569820872

నాన్న విత్తునుండి నవ్య మొలకల కొరకు
అమ్మ గర్భమందు ఆయువును పొంది
తల్లిదండ్రి కంటి పాపలై ఇలకొచ్చి
పెరుగుచుందురు కడు ప్రేమతోడ

బరువు బాధ్యతలు మోసి బిడ్డల బంగారు భవితకై
క్షణక్షణము మిగుల కష్టపడుచు
అరచేతిలో నిలిపి అందలాలెక్కించ
నిద్రాహారాలములను  మరచు త్యాగి తండ్రి

కోరినవి కొన్నిచ్చి, కోరనివి కొనియిచ్చి
మొత్తంగ గుత్తంగ లోటేమి రానీక
ఉన్నదానిలోనె ఉన్నతంగా పెంచు
మూర్తీభవించిన ప్రేమే కదా తండ్రి !!

సంసార సాగరాన ఎగసిపడే కష్టాల తరంగాలకు ఎదురీదుతూ
సమస్యల మొసళ్ళనూ, ఎదురయ్యే సవాళ్ళనూ ఎదుర్కొంటూ
అలసిపోక, ఆగిపోక లక్ష్యం వైపు సాగిపోయే నేర్పరైన గజ యీతగాడే కదా తండ్రి

నాన్నంటే ఓ ధైర్యం
నాన్నంటే ఓ శౌర్యం
నాన్నంటే ఓ రక్ష
నాన్నంటే ఓ దీక్ష
నాన్నంటే త్యాగం
నాన్నంటే అనురాగం.

హామీ:-- ఇది నా స్వీయ రచన
సింహాద్రి వాణి
10
[21/06, 8:51 pm] పిన్నక నాగేశ్వరరావు గారు Poet: కవితా గానం(సీజన్ 3).        21--6--2022.
పిన్నక నాగేశ్వరరావు.
అంశము:-- నాన్న.
శీర్షిక :-- మార్గదర్శి.

1. తే.గీ.
జన్మ కారకుండగు వాడు జనకుడైన
తల్లి కని,పెంచి, పోషించ పిల్లలంత
నాన్న యడుగుల జాడలో నడచి వారు
పెరిగి పెద్దయై జనకుని పేరు నిలుపు.

2. తే.గీ.
బాల్యమందున వేయు తప్పటడుగులకు
మొదటి సారిగ తండ్రియె మురిసిపోవు
కాని,తప్పుటడుగు మనుగడను వేయ
బాధపడినను సరిచేయు బాధ్యతగను.

3. తే.గీ.
అష్టకష్టాల కోరిచి యహరహమ్ము
పాటుపడుచు ధనార్జన పరము గాను
పిల్లల భవితవ్యమునకె పెద్ద పీట
వేయు జనకుడు నీ పాలి వేల్పు గాదె!

4. తే.గీ.
మార్గ నిర్దేశమున్ జేసి మలచు నిన్ను
హితవు చెప్పుచు నుండు స్నేహితుని వోలె
యున్నతంబగు స్థానాన నిన్ను గాంచి
సంతసించెడు తొలి వ్యక్తి జనకుడౌను.

5. తే.గీ.
ఆశలీడేర్చు నందరి యాప్తుడతడు
మంచి విలువలు బోధించు మాన్య గురువు
దిశను సూచించు మార్గ నిర్దేశకుండు
బంధములను నిల్ప కుటుంబ బాధ్యతలను
సలుపు జనకుడెపుడు దైవ సముడె
                                                యగును.
************************************
11
[21/06, 8:54 pm] Kavita Venkateshwarlu Garu: కవితా గానం సీజన్ - 3
21.6.22...మంగళవారం
అంశం:: నాన్న
రచన:: కవిత వెంకటేశ్వర్లు
ఊరు:: కర్నూలు
సెల్:: 8309920625

నాన్న అనే మాట
ప్రేమతో వూరే ఊట
పరిమలించే పూదోట
కుటుంబానికి కంచుకోట
కష్టాల సుడిగుండములో చిక్కిన
ఇడుముల ఇక్కట్లలో వున్నా
సంసారము జరగక
చేతికి డబ్బు దొరకక
అగచాట్లనన్ని చిన్ని గుండెలో
పెట్టుకొని
పైకి నవ్వుతూ ఎవరికి ఏలోటు
రానీయక
అందరికి అన్ని అందించే నాన్న
నీ మనసు వెన్న కన్న మెత్తన
నీ చూపులో కనిపించు నెపుడు కరుణ
నీ వెప్పుడు మాకు ప్రేరణ

తీర్చుకోలేము నాన్న నీ ఋణము
అందించావు మాకు నీ గుణము
మళ్ళీ జన్మవుంటే నీ కడుపునే
పుడతాము
నీ శ్రమకు వెన్నెల గొడుగు పడతాము!!
               ఈ కవిత నా స్వీయ
అని హామీ
12
[21/06, 9:08 pm] +91 94236 90615: కవితా గానం 3
################
అంశం:- నాన్నంటే
"""'''''"""""""""""""""""""""""""""""
నాన్నంటే మన నడక
నాన్నంటే మన నడత
నాన్నంటే మన రక్షణ
నాన్నంటే మన శిక్షణ

చేయి పట్టి నడిపించి
చేయూత మన కిచ్చి
గమ్యం చేర్చుట కోసం
కష్టించే శ్రమజీవి

భుజాల పల్లకి మోసి
బుజ్జగించి లాలించి
సుద్దులు బుద్ధుల చెప్పే
సముద్దీప్తి బుద్ధిజీవి

గుండెలపై ఆడించి
గండాలను తొలగించి
అండగ మన తోడుండే
ఆత్మబంధు నాన్నంటే

మన కోర్కెలు తీర్చుటకై
తన కోర్కెలు చంపుకొని
స్వార్థం అంటే తెలియని
వెఱ్ఱి వాడు మన నాన్న

బరువు బాధ్యతలు మోస్తూ
బ్రతుకంతా సాగించి
హక్కులను మరచినట్టి
ఆత్మీయుడు కద నాన్న.
*************************
🖋️ వేదాంతం సురేశ్ బాబు.  
      చంద్రపూర్ (చెన్నూరు)
13
[21/06, 9:28 pm] Thathapudi Somashekara Sharma: కవితాగానం (సీజన్ 3)
అంశం.. నాన్న
పేరు.. తాతపూడి సోమశేఖర శర్మ
ఊరు.. యానాం
తేదీ..21.6.2022
ఫోన్ నెంబర్..8328079v336
శీర్షిక.. నా సర్వస్వం మా నాన్నే !


జన్మ నిచ్చావు 
జగాన్ని చూపించావు 
నడక నేర్పావు 
నడవడిని దిద్దించావు
ఎత్తుకున్నావు
ఎత్తుకు ఎదిగించావు 

నీ అందం నాకిచ్చావు 
నీ దయ నాకుపంచావు 
ప్రేమ... పాశం 
ఆలనా... పాలనా 
దండన... ఖండనా 
పాలనా... పరిపాలనా 
నీవే అయావు అన్నీ 
నీవనుకున్నావు.. అదే.. అదే 
నేనే నువ్వని 

కళ్ళలో నింపుకున్నావు నా సంతోషం 
గుండెల్లో దాచుకున్నావు నా కోపం 
నీవు నీదని ఏమీ అనుభవించకుండా 
నీవు నీ జీవితాసంపాదన అంతా 
అంటే నీ జీవన సర్వస్వం 
నాకే ఇచ్చావు కదా నాన్నా !
అందుకే...... 
నా జీవనాధారం నీవే నాన్నా !
నా సర్వస్వం నీవే నాన్నా !
నీవే నా సర్వస్వం నాన్నా !

హామీపత్రం.. 
ఈ కవిత నా స్వీయరచన అని హామీ ఇస్తున్నాను.  తాతపూడి సోమశేఖర శర్మ, యానాం,  8328079336
14.
[21/06, 9:52 pm] Lalita Sister: కవితా గానం  సీజన్  -3
ఫాదర్స్ డే సందర్బంగా
తోట సులోచన
నెల్లూరు
చరవాణి 9490173053
అంశం   నాన్న
శీర్షిక     ప్రేమ మూర్తి

కుటుంబ సౌధానికి పునాది నాన్న
ఫల పుష్పాల నిచ్చె వృక్షపు వేరే నాన్న
వీరజవానులా   నిరంతరం
స్వేదం చిందించే  శ్రామికుడు
సంసార రధానికి రధ చక్రాలై 
నాన్న భుజస్కంధాలు విలసిల్లు
సుడిగుండాలను గుండెలో దాచుకున్న
సాగరునిలా పైకి  కెరటాల కేరింతలతో
సంసారాన్ని ఆనంద సాగరంలో 
ఓలలాడించి  మురిపించి మురియు
అమ్మ యింటికి దీపమైతే
నాన్న వెలుగుకు కారణమైన  తైలమే
సంసారచేనుకు  కాపలాకాచే కంచే 
బిడ్డల భవితకు  నిత్యం తపించు
తన కోర్కెలను సమాధి చేసి
కుటుంబ క్షేమానికి పెద్ద పీట వేయు
సభ్యత, సంస్కార ప్రతినిధి  నాన్న
పరువు, ప్రతిష్టల  దర్పణమే నాన్న
కుటుంబ యజమానిగా బాధ్యతల
వలయంలో చిక్కుకున్నా  తోడునీడై
జీవనయానంలో  చిరునవ్వులతో
సాగి సంసార  కడలిని  తీరానికి
చేర్చి గుండెల నిండా యూపిరి
పీల్చుకుని  శాంతమూర్తిగా
ప్రేమమూర్తిగా  కొవ్వొత్తిలా  మిగులు

హామీ పత్రం
ఈ కవిత  నా సొంతమని హామీ ఇచ్చుచున్నాను.
15
[21/06, 9:52 pm] Lalita Sister: అంశం:- నాన్న
శీర్షిక:-
పరమేశ్వరుని ప్రతిరూపం
..................................బాల్యంలో మాకు నాన్న చండశాసనుడు.
అమ్మ మేము అల్లరిచేసినపుడు నాన్నతో చెపుతాను అంటే వద్దమ్మా చెప్పకు అనడం ఇప్పటికీ గుర్తు.
జ్ఞానం వచ్చిన తరువాత తెలిసింది తాను తినిన,తినకపోయిన అహర్నిశలు మా ఉన్నతికై కష్టపడ్డారని.....!!

నన్ను గుడికి తీసుకెళ్ళి తన భుజాలపై ఎక్కించుకొని ఆలయ గర్భంలో దేముని చూపించినపుడు తెలియలేదు నేనే దేముని భుజస్కంధాలపై ఉన్నానని
మాకు, అమ్మకు పండగకి క్రొత్తబట్టలుకొని, తాను చినిగిన పాత బట్టలతోనే సరిపెట్టుకున్నప్పుడు అనుకున్నాను పిసినారి వాడని
నేను బిడ్డలకి తండ్రిగా మారిన  తరుణాన తెలిసింది నిజంగా త్యాగానికి నిదర్శనం నాన్నని....!!

నైతికప్రవర్తన కలిగిన వ్యక్తులుగా సమాజంలో మారడానికి, మా అభివృద్ధికై, శ్రామికుడిగా, రక్షకుడిగా,విశ్రాంతి లేని జీవితాన్నిగడిపాడని,
మమ్మల్ని దెబ్బలాడిన ,నీతులు చెప్పిన విషయం 
తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సమయాన అవగతమైంది..!!

నాన్న కంటిలో నీరు నేనెప్పుడూ చూడలేదు
ఎనిమిది పదులవయస్సులో అమ్మ భగవంతుని దరి చేరిన సమయాన 
ఇద్దరి పిల్లలకి తండ్రినైన నాచేతిని తీసుకుని నీ బాధ్యత నాదిరా చిన్నా అని నాన్న అన్న క్షణాన
ఆర్ద్రత నిండిన హృదయంతో అనుకున్నా
సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపమే పితృదేవులని...!!
..............................
పేరు:-  
         సాహిత్యరత్న
అయ్యలసోమయాజుల ప్రసాద్
రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి
విశాఖపట్నం
చరవాణి:-9963265762
..................................
హామీపత్రం:-
  ఇది నా స్వీయకవిత. దేనికి అనువాదం కాదు
...................................
16.
[23/06, 9:02 am] Lalita Sister: అంశం:- నాన్న 
శీర్షిక:-త్యాగశీలి

______________________________

బుచ్చి బుచ్చి అడుగులు వేసే 
సమయంలో
ఒక్క గుర్రం వలె మరి  అతలదిస్తూ
గోరు ముద్దలు తెనిపిచించి
బుడి బుడి అడుగులు వేయుటలో బుజ్జి పాపాలాగా
తన భుజంపై  ఎత్తుకొనీ ఈ లోకాన్ని పరిచయం చేస్తూ
తప్పుటడుగులో నీడగా
 కష్టకాలంలోచేయుటన్నిస్తూ
అపజయనికి అండగా  ఉండేధీరుడు
చిన్ని చిన్ని ఆనందాలను
తన చిన్ని జ్ఞాపకాలను 
చూస్తూ ఆనందించే అల్ప
సంతోషి...
విజయ అడుగులకు మార్గదర్శి 
నీటికి నిజాయితీకి ప్రేమకు ప్రతి రూపమే నాన్న...
ఓర్పు కి,
రేపటి భవిష్యత్తుకి ప్రతి రూపమే "నాన్న".......
______________________________
కవి పేరు:- సింగీతం సంతోష్ కుమార్
ఊరు:-కామారెడ్డి
చరవాణి:-8897152205
17
[23/06, 8:25 pm] Lalita Sister: 23/6/22
కవితా గానం
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
 అంశం: మా నాన్నగారు
శీర్షిక: మార్గదర్శి

నాన్న ఓ నాన్నా నీగురించి
 ఎంత చెప్పినా తరగదు
పెంచిన తీరు తెలపాలన్న 
మన అనుబంధం వివరించాలన్నా
చాలవు కాగితాలు నాన్నా
వేలు పట్టి నడిపించినావు అదే
వేలు పట్టి అక్షరాలు దిద్దించావు
అనుబంధాలు ఆప్యాయతలు గురించి
 మదికి హత్తుకు పోయేలా తెలియజేశావు
బాల్యంలోనే పతిని కోల్పోయిన
మీ మేనత్తను  ఇంటి ఉంచుకుని
అనుబంధాలవిలువను తెలిపి 
అన్ని విధాల మార్గదర్శి వైనావు
మంచి సంబంధం అంటూ 
పిన్న వయసులోనే పెళ్లి చేసి
చదువుకు వయసు అడ్డుకాదని
 ప్రోత్సహించి నన్నుఎదిగేలా చేశావు
కలము  పట్టి కవితలు పద్యాలు వ్రాసే
వారసత్వాన్ని అందించావు
బతుకు గమనంలో పతి మరణంతో 
ఒంటరి నైన నాకు తోడుగా నిలిచి
ధైర్యం చెప్పిన ఓ నాన్నా 
నిన్ను మరవడం ఈ జన్మలో సాధ్యమా?
మరు జన్మంటూ ఉంటే
నీ కూతురు గానే పుట్టాలి నాన్నా
18.
అంశం.... నాన్న....  
శీర్షిక...... నాన్న 
స్వీయ రచన,...కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
****************************************.
బుడి బుడి అడుగులు వేస్తోంటే
ఎక్కడ పడిపోతానని చేయందించే నాన్న
చిటికెన వేలు అందించి వెంట తిప్పుతూ
లోకాన్ని పరిచయం చేసే నాన్న

జ్వరం వస్తే బుజాన వేసుకుని
డాక్టర్ దగ్గరికి పరుగులు తీసిన నాన్న
ఇంజెక్షన్ చూసి భయంతో వణికి పోతుంటే
ఊరడిస్తు గుండెకు హత్తుకుని ఇప్పించే నాన్న

బడికి పంపించి క్రమశిక్షణతో చదువులు నేర్పిస్తు
సక్రమంగా సాగుతున్నానా లేదా అని పర్యవేక్షించే నాన్న

ఆట పాటలతో అల్లారు ముద్దుగా పెంచుతు
అందలం ఎక్కించాలని ఆరాట పడే నాన్న 
రేపటి కోసం చూడక తన కోర్కెలను కట్టేసి
ఆర్జించిన అణా పైసలూ నా వృద్ధికే వెచ్చించు నాన్న 
కంటి పాపలు కరిగి వెలుగులు ఆరిపోయినా
నా బ్రతుకు బాటలో దివిటీలు వెలిగించే నాన్న
కండలు కరిగి ముడతలు పడి వేళ్ళాడుతున్నా
నేను తారా జువ్వనై నింగికి ఎగిరి మెరుస్తుంటే
కళ్ళారా వీక్షించాలని కాంక్షించే కనిపించే దైవం
నాన్న 

యెముకలు వంగి కీళ్లు అరిగి నరాలు సడలి కదల లేకున్నా 
కష్టించి ఎంతో కొంత సాయం చేయాలని తపించు నాన్నను 
మించిన మాధవుడు ఇలా తలంలో  ఉన్నాడా!!
ఉంటాడా!!?

స్వీయ రచన::: కేశరాజు వేంకట ప్రభాకర్ రావు.
19.
*కవితా గానం సీజన్ 3*
******************************
*పేరు:వనపర్తి గంగాధర్*
*ఊరు:హన్మకొండ*
*తేదీ:17.06.2022*
*చరవాని:9440146435*
*శీర్షిక:త్యాగధనుడు*

నవమాసాలు మోసేది అమ్మయితే
నవనీతంలా పెంచేది నాన్న
నీ ఆకలికి అమ్మ అవసరమైతే
నీ బతుకు బాటకు వారధి నాన్న

ఆ వదనము నల్లని మేఘమైనా
చల్లని ప్రేమామృతాన్ని వర్షిస్తాడు
వెన్నెల మార్గాన్ని నీకై పరుస్తాడు
నీ మోములో ఆనందానికై తపిస్తాడు

అర్ధం కాని గంభీర వదనమైనా
ఆ హృదయం నవనీత భరితం
ఆ మాటలు నీ ఉన్నతికి బాటలు
ఆ చూపులు నిను నడిపించే మార్గాలు

ఆ మది నిండా బాధలు,కష్టాల
గరళాలను కనిపించకుండా దాచుకొని
నీకు మాత్రం సంతోష సాగరాలను
ఆనంద నయాగారాలను పంచేవాడు

నీ అభివృద్ధిని చూసి మురిసేవాడు
తను ఆరిపోతు నిను వెలిగించే త్యాగధనుడు
నీవు ఎప్పటికీ తీర్చుకోలేని ఋణం
నాన్న అవనిపై నడయాడే దైవం

హామీపత్రం:ఈ కవిత నా స్వీయ రచన అనువాదం అనుసరణ కాదని హామీ ఇస్తున్నాను

Comments

Popular posts from this blog

ప్రత్యూషం 10/2020

 నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ singer and poetess ,author of vennela shilpam సహకారం మెరుగు మధు గారు ఐతగోని వెంకటేశ్వర్లు గారు అవధాని *****************-*** కవివరుల జాబితా **** 1.కోరాడ నరసింహారావు గారు 2.మన్నెపిన్నక లలిత . 3గుమ్మన్నగారి బాలసరస్వతి, 4.డా.బల్లూరి ఉమాదేవి. 5.వినీలమ్మ  6.స్వర్ణ సమత గారు 7.కందూరి సుజాతా రాణి గారు 8.భరద్వాజ రావినూతల🖍️(RB) 9.డి.ఉషారాణి గారు 10.శ్రీలక్ష్మి చివుకుల గారు 11.కె.సి నరసయ్య గారు 12.: కె.ఇ.నిలమంగై గారు 13.వురిమళ్ల సునంద ఖమ్మం గారు 14.పరుచూరి రామ్ సుందర్ గారు 15.సంధ్యా శర్మ గారు 16.కొలచన విజయ భారతి గారు 17.మర్రి జయశ్రీ గారు ****************" 1 కవితాగానం        * ప్రత్యూషం *           ********* కాషాయ కాంతుల బాల భానునికి...స్వాగతం పలుకుతూ ప్రత్యూష  పవనాలు....! మంచు ముత్యాల నద్దుకుని గరిక,గడ్డిపూల  అందాల లాస్యాలు ! ప్రత్యూష  పిల్లగాలి పలుకరించ...ఖగసమూహాల ప్రతి పలుకరింపుల  కిల కిలా రవములు ! ఆ పక్షుల సందడికి  ... ఎండిన పెరటి చెట్టు ఆక...

గోరింటాకు

నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ******************* కవివరుల జాబితా 1.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 2.దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 3.డా.బల్లూరి ఉమాదేవి గారు 4.కవిత వేంకటేశ్వర్లు గారు 5.ధనాశి ఉషారాణి గారు 6.మన్నె లలిత గారు 7.సునంద వురిమళ్ల గారు 8.గొర్రె పాటి శ్రీను గారు 9.తరణికంటి సూర్య లక్ష్మి గారు 10. సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 11.డా.సిహెచ్ ఆంజనేయులు గారు 12.తాతపూడి సోమశేఖర శర్మ గారు ౧౩.సునంద వురిమళ్ల గారు 14.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 15.గుండ్ల సౌజన్య గారు 16.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 17.పిన్నక నాగేశ్వరరావు గారు 18.అపరాజిత్ గారు 19.డా.పాండాల మహేశ్వర్ గారు 20.జంపని శ్రీ నివాస మూర్తి గారు 21.బేతి నాగ లక్ష్మి గారు 22.సునంద వురిమళ్ల గారు 23.గాజుల భారతీ శ్రీనివాస్ గారు 24.శివునూరి లలితా కృష్ణ గారు **************""*** [14/07, 7:18 pm] Lalita Sister: ❇️❇️❇️❇️❇️❇️ కవితాగానం  నేటి అంశం *గోరింట* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ❇️❇️❇️❇️❇️❇️ 1 కవితాగానం అంశం; గోరింట శీర్షిక:    ...

పతాకం

నిర్వహణ వీరా గుడిపల్లి The mathematics teacher and poet శివునూరి లలితాకృష్ణ మెరుగు మధు శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు ********** కవివరుల జాబితా 1.ఇంద్రవత్ రాహుల్ గారు 2.సానుబిల్లి తిరుమల తిరుపతి రావు గారు 3‌.కంచి రవికుమార్ గారు 4.కోరాడ నరసింహారావు గారు 5.దీపక్ న్యాతి గారు 6.దిడ్డి మారుతి గారు 7.పోలా కిషోర్ కుమార్ గారు 8. తిరు వేంకటాచార్యులు గారు 9.సత్య నీలిమ గారు 10.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు 11.గుండ్ల రాజు గారు 12. కందూరి సుజాత గారు 13.కొలచన విజయ భారతి గారు 14.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు 15.పాల్వంచ హరి కిషన్ గారు 16.అనుముల తేజస్విని గారు 17.స్వర్ణ సమత గారు 18. భూపతి గారు 19.వల్లాల విజయ లక్ష్మి గారు 20.డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు 21. తిరు వేంకటాచార్యులు గారు 22.సంధ్యా శర్మ గారు 23.సునంద వురి మిళ్ళ గారు 24.గుండ్ల రాజు గారు 25.శ్రీలక్ష్మి చివుకుల విజయ నగరం గారు 26.గుమ్మన్నగారి బాల సరస్వతి గారు 27.అయిత అనిత గారు 28.మర్రి జయశ్రీ గారు 29.కాల్వ రాజయ్య గారు ****************** [07/07, 8:00 PM] Indravat Rahul Poet Ks 11: *కవిత గానం* ✳️✳️✳️...